రచ్చకెక్కిన నందమూరి వారు

  తెలుగు జాతి ఆత్మ గౌరవం, తెలుగు కీర్తీ దశదిశలా వ్యాపింపజేసిన మహానుబావుడు స్వర్గీయ నందమురి తారక రామారావు. ఆయనని ఒక గొప్ప నటుడిగా కొందరు ప్రేమిస్తే, గొప్ప రాజకీయ నాయకుడిగా మరికొందరు గౌరవిస్తారు. ఆయనని నేటికీ శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా భావించి, పూజించేవారికి ఈ రాష్ట్రంలో కొదవలేదు. తెలుగు బాషాప్రియులకు ఆయనొక మూర్తీభవించిన తెలుగు బాషా స్వరూపం. అంతగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహనీయుడికి, నేడు అయన వారసులమని చెప్పుకొనేవారే ‘పార్లమెంటులో ఆయన విగ్రహం’ నెలకొల్పే విషయంలో ఒకరిమీద మరొకరు బురద జల్లుకొంటూ నీచరాజకీయాలు చేస్తూ ఘోరఅవమానం చేస్తున్నారు. తమ కుటుంబ గౌరవ ప్రతిష్టలే కాక, ఆ మహనీయుడి పరువుకూడా గంగలో కలుపుతున్నందుకు తెలుగు ప్రజలు ఎంత బాధ పడుతున్నారో, వారెవరికి పట్టకపోవడం విచిత్రం.   నందమూరి కుటుంబంలో ఎన్ని లుకలుకలు ఉన్నాయో ఈ ఒక్క ఉదంతంతో బయట పడుతున్నాయి. కుటుంబసభ్యులే వారిలోవారు ముటాలు కట్టుకొని ఒకరి మీద మరొకరు బురద జల్లుకొంటూ బహిరంగ లేఖలంటూ బజారుకకెక్కుతుంటే చూసిన వారు ముక్కున వేలేసుకోవలసివస్తోంది. అటువంటి గొప్ప మనిషి కడుపున పుట్టిన వారందరూ, ఆయన విగ్రహం నెలకొల్పకపోయినా ఎవరూ వేలెత్తి చూపరు. గానీ, ఇలాగ ఆయన పరువు, తమ కుటుంబ పరువు బజారుకీడ్చకుంటే అంతే చాలనుకొంటున్నారు.   నందమూరివారి కుమార్తె పురంద్రేస్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, బాలకృష్ణ, శ్రీమతి లక్ష్మీ పార్వతి మొదలుకొని తెలుగు దేశం నేతల వరకు ప్రతీ ఒక్కరు ఈ విషయంలో అనవసరమయిన రబస చేస్తూనే ఉన్నారు. ఇంతజరిగినా ఎవరిలోకూడా బాధ, పశ్చాతాపం వంటివి కానరాలేదు. ఇప్పటికయినా, ఎవరో ఒకరు వెనక్కితగ్గి కుటుంబ పరువు, ప్రతిష్టలు నిలుపుకొందామని ఎవరు అనుకున్నట్లు కనబడలేదు. అందరికీ ఆ మహనీయుడి విగ్రహం అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుకోవడానికే ఆసక్తి తప్ప, ఆ ప్రయత్నంలో ప్రజలముందు తామెంత చులకన అవుతామో ఎవరు ఆలోచించినట్లు లేదు.   ప్రజలు వారిని కోరేదేమిదేమిటంటే అయనకి బంగారు విగ్రహం పెట్టనవసరం లేదు. ఏ భారతరత్నో మరోటో తమ పలుకుబడి ఉపయోగించి ఆయనకీ ఇప్పించనవసరం లేదు. ప్రపంచ తెలుగు మహా సభలు జరగనున్నఈ తరుణంలో తెలుగు బాషా ప్రియుడిగా, తెలుగు ప్రజల అభిమాన నటుడిగా, వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన అయన పరువు తీయకుండా ఉంటె అంతే చాలు. ప్రజలో గుండెల్లో ఉన్న మహానీయులెవరికీ ఇటువంటి విగ్రహాలు, పురస్కారాలు అవసరం ఉండవు అని వారు తెలుసుకోవాలి.

జగన్ బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా

                  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్టాట్యూటరీ బెయిల్ పిటీషన్ ఫై విచారణను రాష్ట్ర హై కోర్టు ఈ నెల 13 కు వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన జగన్ ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   రెగ్యులర్, స్టాట్యూటరీ బెయిల్ పిటీషన్లు రెండింటి ఫైన ఆ రోజునే కోర్టు వాదనలను వింటుంది.   నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి అవ్వని పక్షంలో చట్టబద్దంగా బెయిల్ పొందే అవకాశం ఉంటుందని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ కోర్టును అభ్యర్ధించారు. తనను అరెస్టు చేసి 90 రోజులు దాటిపోయిన విషయాన్ని కూడా జగన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జగన్ ఇటీవలే, స్టాట్యూటరీ పిటీషన్ తో పాటు, సాధారణ పిటీషన్ ను కూడా కోర్టు లో దాఖలు చేశారు.

తెలంగాణాపై తేల్చనున్న తెలుగుదేశం

    ‘అఖిలానికి’ ఎంతమందిని పంపుకొంటారో మీ ఇష్టం అని అతితెలివి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ పార్టీలను, ముఖ్యంగా తన ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని ఇరుకున బెట్టాలని చూస్తే, ఇంతవరకు తెలంగాణా సమస్యని ‘రెండు కళ్ళతో పరాకుగా చూస్తున్న’ చంద్రబాబు ఇకపై ఒకేకంటితో తీక్షణంగాచూసి తాడోపేడో తేల్చి పారేస్తానంటూ చెప్పడంతో,కాంగ్రెస్ గొంతులో పచ్చివెలక్కాయ ఇరుకొన్నంత పనయింది. ఇంతవరకు, తెలుగుదేశంపై నిందవేస్తూ తెలివిగా తప్పించుకొంటున్న కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు కూడా అదేప్రయత్నం చేయాలనీచూస్తే అది ఎదురు దెబ్బ తగిలేట్లు ఉంది.   నిన్నతెలుగుదేశంపార్టీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, సండ్ర వెంకటవీరయ్య తదితరులు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలుగుదేశంపార్టీ తరపున ఒకే ఒక్క సభ్యుడిని పంపుతామని తెలియ జేయడమే గాకుండా, అఖిల పక్ష సమావేశంలో తెలంగాణాపై తమపార్టీ అభిప్రాయాన్ని ఈసారి ‘ఖచ్చితంగా’ తెలియజేస్తామని చెప్పారు. మొదట కాంగ్రేసు పార్టీ తెలంగాణా పై తన అభిప్రాయం తెలియజేయాలని వారు డిమాండ్ చేసారు. చంద్రబాబు అనుమతి ఉండబట్టే పార్టీ కార్యాలయంలో ఇటువంటి కీలక అంశంపై తెలుగుదేశం నేతలు తమ అభిప్రాయం ప్రకటించారని భావించవచ్చు, గనుక ఇక ఇప్పుడు నిర్ణయించుకోవలసింది కాంగ్రేసు పార్టీనే.

చంద్రబాబుకు నామా నాగేశ్వర రావు నివేదిక

          ఎఫ్ డి ఐ ల ఫై పార్లమెంట్లో ఓటింగ్ జరిగిన సమయంలో సభకు దూరంగా ఉండిపోయిన ముగ్గురు తెలుగు దేశం సభ్యులఫై ఆ పార్టీ నేత, ఎంపి నామా నాగేశ్వర రావు చంద్ర బాబు నాయుడు కు నివేదిక సమర్పించారు.   ఎఫ్ డి ఐ లను తాము మొదటి నుండి వ్యతిరేకిస్తున్నామని, ఉభయ సభల్లో తాము చేసిన ప్రసంగాల్లో ఇదే విషయాన్ని నొక్కి చెప్పామని నామా అన్నారు. ముగ్గురు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్లే ఓటింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఈ విషయంతో పార్టీకి సంభందం లేదని ఆయన అన్నారు. తమ పార్టీకి పార్లమెంట్ లో పెద్దగా సంఖ్యా బలం లేనందున ప్రత్యేకంగా విప్ జారీ చేయలేదని ఆయన అన్నారు.   తమ పార్టీ అధినేత కు తెలియకుండా ఓటింగ్ కు దూరంగా ఉండడమే కాకుండా, రాజీనామా చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడినే దిక్కరించేలా మాట్లాడడం ఎంతవరకు సబబో పార్టీ నేతలకే తెలియాలి.   నామా నివేదిక విషయం అలా ఉంచితే, ఈ విషయం ఇక మరుగునపడుతోందని తెలుస్తోంది. ఇది చిన్న విషయమేనని, తమ ముగ్గురు ఎంపిలు కావాలని ఓటింగ్ కు దూరంగా లేరని పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంఫై ఇతర పార్టీ నేతలు రాద్దాంతం చేయడం మానుకోవాలని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అసలు విషయానికి వస్తే, ఈ విషయంలో ఎక్కువ రాద్దాంతం చేస్తోంది సొంత పార్టీ నేతలే. అంటే, యనమల సలహా ఇచ్చింది తన పార్టీ వాళ్లకేనని అనుకోవాలా?

మళ్ళీ ‘హ్యాండ్’ ఇచ్చిన ‘హస్తం’ పార్టీ

    తే.రా.స., బిజే.పి.లు మొత్తుకొంటున్నట్లే అయింది చివరికి. కాంగ్రేసుని నమ్మడానికి వీలేదని, అది అఖిలపక్షం పేరుతొ మరో కొత్తనాటకం మొదలు పెట్టిందని బల్లగుద్ది మరీ చెప్పారు. పాపం! వారి మాటకి విలువ లేకుండా చేయడం ఎందుకని కాంగ్రేసు అనుకుందో ఏమో, మహోదయ మంత్రివర్యుల నోట మళ్ళీ ‘ఆ...జాదూ’ చిలకపలుకులే మళ్ళీ పలికించి, మరోరసవత్తరమయిన నాటకానికి తెర లేపింది కాంగ్రేసు పార్టీ. అయితే, ఈసారి ఆ నాటకానికి సుషీల్ కుమార్ షిండే అనే కొత్త దర్శకుడు వచ్చేడు.   ఇదివరకు జరిగిన సమైక్యాంద్రా, తెలంగాణా ఎపిసోడ్లన్నీ తానూ చూడలేదు గనుక, మళ్ళీ మొదటి నుండీ మొదలుపెట్టడమే మంచిదని భావిస్తున్నట్లు ఆ.. జాదూగారు ఈమద్యనే శలవిచ్చేరు. అందుకే, ఆయన అడుగు జాడలలో నడవడమే మేలనుకొన్నషిండేసారూ కూడా నిన్న మధ్యాహ్నమే తన మనసులో మాటని మీడియా కాకితో కబురంపించేరు..తమని లొంగ దీశామని వీరతాళ్ళు వేసుకు తిరుగుతున్న తెలంగాణా కాంగ్రేసు యమ్పీలకి!   అయన జెప్పిన దానిని బట్టి అర్ధమయిన దేమిటంటే “నేనేమి అఖిల పక్షం పెట్టాలని అనుకోలేదు. పాపం 19 మంది ఎంపీలు వచ్చి అడిగితె వాళ్ళని కాదని బాధ పెట్టడం ఎందుకనే ఒప్పుకొన్నాను. అయినా, ఇదేమి ఒక్క రోజుతో తేలిపోయే విషయమూ కాదు, ఇది మొదట మీటింగో ఆఖరి మీటింగో అంతకంటే కాదు. తెలంగాణా సమస్య కోసం ఇటువంటి మీటింగులు ‘అనేకం’ పెట్టుకొని, నిరంతర చర్చలు జరుపుతూ దానికి ఒక సరయిన పరిష్కారం కనీపెట్టాలి. ఆ ప్రయత్నంలోనే వేసిన తొలి అడుగే ఇది. అది ఇక్కడితో ఆగిపోదు. పోకూడదు. సమస్య పరిష్కారం అయ్యేవరకు అలా సాగుతూ......నే ఉండాలి. అందుకే నేను రాష్ట్రంలో అన్నిపార్టీలకు లేఖలు వ్రాయబోతున్నాను. అందరిని నా ఈ మొట్టమొదటి ప్రదర్శనకి (ఈ అఖిలపక్ష సమవేశానికి) తప్పక హాజరు కావాలని కోరుతున్నాను. వీలయితే ఒక్కరు, తప్పదంటే యెంత మందయినా పరువలేదు గాని తప్పక ఈ మీటింగుకి హాజరు కావాలని వ్రాయబోతున్నాను. ఎవరు యెంత మందిని పంపించుకొంటారో మరి వాళ్ళిష్టం. తెలంగాణా మీద చర్చలు జరుగుతుండటమే ఇక్కడ ప్రధానం తప్ప ‘మరోటి’ కాదు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పీ.సి.సి. అధ్యక్షులు కూడా నా మీటింగు తేధిని మార్చమని సూచించేరు. కానీ, నా మొదటి ‘షో’కే ఇలాగ అడ్డుతగిలితే కుదరదని ఖరాఖండిగా చెప్పేసెను. అయినా, అన్నిపార్టీలు వాళ్ళు కోరితే మరి ‘షో’ వాయిదా వేసుకోక తప్పుతుందా? అని శలవిచ్చేరు.   కాంగ్రేసు పార్టీ ‘హస్తం’ గుర్తునే కోరుండీ ఎందుకు ఎంచుకొందో ఇప్పుడు చూచాయగా అర్ధమవుతుండగా తెలంగాణా కాంగ్రేసు యంపీలు ‘కిం కర్తవ్యమ్?’ అని తమలో తాము  గోణుకొంటూ  మళ్ళీ కేశవరావు ఇంటి వైపు పరుగులు తీసారు.   (కాంగ్రేసు బుర్రలో ఏమాలోచనలు ఉండి ఉంటాయో మొన్న ‘కాంగ్రేసుకి అఖిలమే సకలమూ’ అనే శీర్షికన చర్చించడం జరిగింది. బహుశః, ఇప్పుడు అదే చేసి చూపించ బోతోందేమో ‘హస్తం’ గుర్తున్న మన కాంగ్రేసు పార్టీ.)

కైకలూరు ఎంఎల్ఏ రమణ పయనం ఎటు ?

        ప్రస్తుత రాజకీయ నాయకులు కృష్ణా జిల్లాలోని కైకలూరు శాసనసభ్యుడు జయ మంగళ వెంకట రమణ నుండి చాలా నేర్చుకోవాల్సిఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న అవకాశవాద రాజకీయాల్లో నెగ్గుకురావడమెలాగో తెలుసుకోవాలంటే మాత్రం గత కొంత కాలంగా ఆయన చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులను కొంచెం లోతుగా పరిశీలిస్తే సరిపోతుంది.   ఆయన నడుపుతున్న రాజకీయాలు కొంత మందికి ఎబ్బెట్టుగా ఉన్నా, ఆయన మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. తన రాజకీయ జీవితం తనకు ముఖ్యం, తన గురించి ఎవరూ ఎలా అనుకుంటేనేం అని మాత్రం ఆయన భావిస్తున్నారు.   2009 ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుండి తెలుగు దేశం టికెట్ ఫై పోటీ చేసి గెలుపొందిన రమణ ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ ఫై చాలా తెలివిగా, పావులు కదుపుతున్నారు. స్వార్ధపూరిత రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచి ఆయన తన రాజకీయ జీవితానికి బాటలు వేసుకుంటున్నారు.     రమణ ప్రస్తుతం తెలుగు దేశం నుండి బయటకు రావాలనే ఆలోచనలో ఉన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీర్ఘకాలం ఆ పార్టీలో ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన ప్రస్తుతం శాసనసభ కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయమహామహులంతా జగన్ పార్టీ వైపు చూస్తుండడంతో పాపం రమణకు వారి జాబితాలో చేరాలనిపించింది. అయితే, తన రాజకీయ జీవితంఫై కూడా కాస్త ఎక్కువ మక్కువ ఉండడంతో తనకు వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ టికెట్ ఇస్తానంటేనే మీ పార్టీలో చేరతానంటూ జగన్ పార్టీ అధిష్టానానికి మెలిక పెట్టారు. అయితే, మొదట తమ పార్టీలో చేరు, ఆ తర్వాత టికెట్ విషయం చూద్దామంటూ ఆ పార్టీ నుండి సమాధానం వచ్చింది. అంతే, తన రాజకీయ జీవితానికి గారంటీ ఇవ్వలేని పార్టీ ఎందుకంటూ ఏ మాత్రం ఆలోచించకుండా రమణ ఆ పార్టీలో చేరే ఆలోచనను వెంటనే విరమించుకున్నారు.     తాను జగన్ పార్టీలో చేరాలనుకున్న విషయం తన పార్టీ నేత చంద్ర బాబుకు తెలిసినప్పటికీ రమణ ఆ విషయాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, ఆ విషయాన్ని ఖండిస్తూ, ఇక రాష్ట్రంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన తన దృష్టిని సారించారు.   వాస్తవానికి కృష్ణా జిల్లాలోని నూజివీడు, గుడివాడ శాసనసభ్యులు పార్టీ వదలిన సమయంలోనే రమణఫై అనేక మందికి సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు తో ఓ కార్యక్రమంలో పాల్గొని కొల్లేరు సమస్య విషయంలో తాను చెప్పినట్లు చేస్తే, కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ ప్రకటించారు. ఇక్కడ ప్రత్యేకట ఏమిటంటే, ఓ సమస్య పరిష్కరిస్తే చాలు, ఏకంగా పార్టీనే మారేస్తానంటూ చాలా ఓపెన్ గా ప్రకటన చేయడమే.   తన ఘన కార్యాలకు రమణ ఇచ్చిన వివరణ ఎలా ఉన్నా, తనను గెలిపించిన ప్రజలు, పార్టీ మాత్రం ఆయన రాజకీయ జిమ్మిక్కులతో విస్మయం చెందుతున్న మాట మాత్రం వాస్తవం. ఈ విషయంలో రమణ వివరణ ఇస్తూ, ఇలాంటి అవకాశవాద రాజకీయాలు నడుపుతోంది తానొక్కడినే కాదనీ, అలా చేసిన వ్యక్తుల్లో తాను మొదటి వాడిని కూడా కాదంటూ ఓ ప్రకటనే ఇచ్చేసారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే, కాంగ్రెస్ లో విలీనం అవుతామంటూ కే సి ఆర్ అనలేదా అనేది ఆయన వివరణ. కే సి ఆర్ నుండి తాను నేర్చుకున్నాననీ , మిగిలిన వారు తనను చూసి నేర్చుకోవాలనేది ఆయన అర్ధమేమో ?   మరోవైపు కాంగ్రెస్ లో చేరినా, అక్కడ నుండి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లభించే విషయంలో ఆయనకు కాస్త ఎక్కువ సందేహాలే ఉన్నాయి. ఎందుకంటే కైకలూరు కాంగ్రెస్ నియోజక వర్గంలో ఇప్పటికే బలమైన కాంగ్రెస్ నేతలే అక్కడ ఉన్నారు. ఎర్నేని రాజబాబు, కమ్మిలి విట్టల్, కామినేని శ్రీనివాస్ వంటి వారు ఇప్పటికే ఆ పార్టీలో ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరాలని చూస్తుండడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు టికెట్ లభించదని ఆయన భావిస్తే, ఇక ఆయన పయనం ఎటో మాత్రం అంతుబట్టడం లేదు. ఆయనకు ఎలాగు చంద్ర బాబు వద్ద ఇప్పటికే చెడ్డ పేరు వచ్చిఉండడం ఆ ఊహాగానాలకు కారణం. ఇక ప్రస్తుతం ఆయన రాజకీయ జిమ్మిక్కులు ఎలా ఉంటాయో మాత్రం వేచిచూడాల్సిందే.  

ఎంపిల డుమ్మా : చర్యలు తీవ్రంగా ఉంటాయంటున్న బాబు

              ఎఫ్ డి ఐ లఫై పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ కు దూరంగా ఉన్న ముగ్గురు తెలుగు దేశం సభ్యుల వివరణ సరిగా లేకపోతె వారి ఫై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ప్రకటించారు.   ‘ప్రజా సమస్య కోసం నేను సుదీర్ఘ పాద యాత్ర చేస్తున్న సమయంలో జరిగిన ఈ చర్య నన్ను తీవ్రంగా కలిచివేసింది. అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని దేవేంద్ర గౌడ్ ముందుగానే నాకు తెలియచేసారు. సుజన, సుధా రాణిలు నాకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. వారిది ద్రోహమని తేలితే వారిఫై చర్యలు తీవ్రంగా ఉంటాయి. అదే సమయంలో పొరపాటు అని తేలితే, తీవ్రమైన చర్యలు తీసుకోవడం సరికాదు’, అని బాబు అన్నారు.   జైల్లో ఉంది కూడా రాష్త్రపతి ఎన్నికల్లో ప్రణబ్ కు ఓటు వేసిన వారు, రాష్ట్రాన్ని దోచుకొన్న వారు మమ్మల్ని విమర్శించే పరిస్తితి వచ్చారని బాబు అన్నారు. ఒక ఎంపి నో, ఒక ఎం ఎల్ ఏ నో పోయినా పరవాలేదని, విలువలతో కూడిన రాజకీయాలతో కూడిన రాజకీయాలు ముఖ్యమని బాబు వ్యాఖ్యానించారు.   ఈ ఎం పి లఫై తీవ్ర చర్యలు ఉంటాయనే విధంగా బాబు వ్యాఖ్యలున్నాయి. అయితే, వారిఫై తీవ్ర చర్యలు నిజంగా ఉంటాయా అని పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అంశం ఫై ఇతర పార్టీ నాయకుల కన్నా తెలుగు దేశం నాయకులే ఎక్కువ రాద్ధాంతం చేశారు. ఈ పరిస్తుతుల్లో ఈ విషయాన్ని మరింతగా సాగదీయడం వల్ల ఎంతకాదనుకున్న పార్టీకి నష్టమే కాబట్టి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.  

ఎఫ్డీఐ చిచ్చు : ఎంపీ సుజనా చౌదరీ రాజీనామా

రాజ్యసభలో యఫ్.డి.ఐ. ఓటింగుకి గైర్హాజరయిన తెలుగుదేశం సభ్యులు ముగ్గురుమీద, బయట పార్టీల వారేకాక స్వంతపార్టీ వారు సైతం మీడియాకేక్కి మరీ తీవ్రవిమర్శలు చేస్తుండటంతో, మనస్తాపం చెందిన సుజనచౌదరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖని పార్టీ అద్యక్షుడు చంద్రబాబుకి నేడు పంపారు. తనవల్ల జరిగిన పొరపాటుకి పశ్చాతాపం వ్యక్తం చేసినాకూడా తమ స్వంతపార్టీ సభ్యులే తనపై ఈ విదంగా దాడిచేయడం సహించలేకనే రాజీనామా చేస్తున్నట్లు సుజనాచౌదరి తనలేఖలో చంద్రబాబుకి తన ఆవేదన వ్యక్తంచేస్తూ వ్రాసారు. మిగిలిన ఇద్దరు సభ్యులు దేవేందర్ గౌడ్ మరియు గుండు సుధారాణి కూడా రాజీనామాలకు సిద్దమేనని చంద్రబాబుకి తెలియజేసినట్లు సమాచారం. వారు నిజంగా కాంగ్రేసు ఒత్తిళ్ళకి లొంగి ఓటింగుకి గైర్హాజరయారా లేక వారు చెపుతున్నట్లు, ఓటింగుని తేలికగా తీసుకొని సభకు రాలేదా అనే విషయాన్నీ పక్కన బెడితే, తెలుగు తమ్ముళ్ళు వారికి తమపార్టీ అద్యక్షుడు రాజ్యసభ టికెట్లు ఇవ్వడంపై ఎంతరగిలి పోతున్నారో ఈ సంఘటనతో బయట పడింది.

తెలుగుదేశంలో రచ్చ!రచ్చ!

  నివురు గప్పిన నిప్పులావున్న తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు అవకాశం దొరికినప్పుడల్లా బగ్గుమని బయటపడుతుంటాయి. మొన్నరాజ్యసభ యఫ్.డి.ఐ. వోటింగులో పాల్గొనని ముగ్గురు తెలుగుదేశం యంపీలవల్ల అన్నివైపులనుండీ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతుంటే, పార్టీలోపల ఉన్ననాయకులూ దానిని సమర్ధంగా త్రిప్పికొట్టే బదులు వారుకూడా బయట పార్టీలతో కలిసి కోరస్ పాడుతూ, తమ నేతల మీద తామే దండెత్తుతున్నారు. ఇంతకాలం తెలంగాణాలో తానూ చెమటోడ్చి సాదించిన ఫలితాన్ని ముగ్గురు యంపీలు చిటికలో బూడిదపాలు జేసారని చంద్రబాబు తీవ్రఆవేదన జెందరు. ఆ ముగ్గురినీ రేపు ఆదిలాబాదులో తన పాదయాత్ర జరుపుతున్న ప్రాంతానికి వచ్చి కలవమని ఆదేశించారు. పార్టీ నాయకుడు చంద్రబాబు ఈ వయసులో అనారోగ్యాన్ని సైతం లెక్క జేయకుండా ఎండనక,చలనకా పాదయాత్రలు చేస్తూ తెలుగుదేశంపార్టీకి ఎలాగయినా పునర్వ్హైభవం తేవాలని కష్ట పడుతుంటే, మరో వైపు పార్టీ నేతలే పార్టీ పరువుని బజారు కీడుస్తున్నారు. తెలుగుదేశంపార్టీలో వివిధ కారణాలతో అసంతృప్తితో ఉన్నతెలంగాణానేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వంటివారు ఆ ముగ్గురు ఎంపీలు దేవేందర్‌గౌడ్, సుజన చౌదరి, గుండాసుధారాణిలను తీవ్రంగా విమర్శించారు. కీలక సమయంలో సీనియర్ నాయకులమని చెప్పుకు తిరిగే ఆ నేతలకి సభకి వెళ్ళడం యెంత అవసరమో తెలియదా? అని ప్రశ్నించేరు. ఆ పదవికి వారు అనర్హులయినప్పటికీ చంద్రబాబు దయతలచి వార్కి ఆ పదవులు ఇస్తే వారు అందుకు ప్రతిగా ఆయనకే ‘హ్యాండ్’ ఇచ్చేరని ఎద్దేవా చేశారు. అయితే, ఇదంతా వారు ఎంతగా రగిలిపోతున్నారో తెలియజేస్తోంది. టీడీపీ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి వారిని వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. దీనినిబట్టి చూస్తే ‘దేశం చాల క్లిష్ట పరిస్తితుల్లో ఉన్నట్లు అర్ధమవుతోంది.’ ఒకవైపు బాబు చమటోడుస్తుంటే, తెలుగు తమ్ముళ్ళు తమలో తాము కీచులాడుకొంటూ పార్టీ ఉనికికే ముప్పు తెచ్చేలా ఉన్నారు. చంద్రబాబు ముందుగా పార్టీని చక్కదిద్దుకొని ఆ తరువాత యాత్రలకి బయల్దేరి ఉంటటే బాగుండేదేమో కదా!

‘వై ఎస్ ను మార్కెట్ చేస్తున్న విజయమ్మ, షర్మిలా’

        అధికారం కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయమ్మ, షర్మిలా దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి పేరును మార్కెట్ చేసుకొంటున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యానారాయణ విమర్శించారు.   కాంగ్రెస్ లో క్రమశిక్షణ కల్గిన నేతగా వై ఎస్ పని చేసేవారని, అలాంటి నేతకు చెడ్డ పేరు వచ్చేలా వీరు కార్యకలాపాలు సాగిస్తున్నారని మంత్రి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న మంత్రి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలఫై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆ పార్టీని దొంగల పార్టీగా అభివర్ణించారు.   జగన్ పార్టీకి ప్రత్యెక అజెండా అంటూ ఏమీ లేదని, అది దిక్కుమాలిన పార్టీ అని మంత్రి అన్నారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ ప్లాన్ విషయంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ తో కుమ్మక్కు అయిందని ఇంత కంటే నీతిమాలిన విషయం ఏముంటుందని మంత్రి వ్యాఖ్యానించారు.

బ్రదర్ అనిల్ కుమార్ కి కోర్టులో భంగపాటు

  స్వర్గీయ వై.యస్.రాజశేకర్రెడ్డి అల్లుడూ, వై.యస్.జగన్మోహన్ రెడ్డి  బావగారయిన బ్రదర్ అనిల్ కుమార్ ఖమ్మం కోర్టులో వేసిన ఒక పిటిషన్నికూడా కోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. క్రీస్టియన్ మత భోదకుడిగా ప్రసిద్దుడయిన బ్రదర్ అనిల్ కుమార్, గత సాధారణ ఎన్నికల సమయంలో అంటే 2009లో ఖమ్మంలోగల కరుణగిరిచర్చిలో అతని మతభోదనలు వినడానికి వచ్చిన క్రీస్టియన్ భక్తులకు మత భోదతోపాటు, రాజకీయ ఉపదేశం కూడా చేసినట్లు తెలిసి, అది ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘనగా భావించిన రిటర్నింగ్ ఆఫీసరు దర్యాప్తుకై పోలీసులని ఆదేశించారు. వారు, బ్రదర్ అనిల్ కుమార్ తో సహా మరో ముగ్గురుపై కేసు నమోదు చేసి విచారణ చేసినప్పుడు, బ్రదర్ అనిల్ కుమార్ మినహా మిగిలిన ముగ్గురూ కోర్టు వాయిదాలకు హాజరవుతూ వస్తున్నారు. పోలీసులు, బ్రదర్ అనిల్ కుమార్ ఆచూకి కనిపెట్టకపోయినట్లు కోర్టుకి నివేదించగా, ఆతను అదే కోర్టులో తనపై అన్యాయంగా కేసు వేయబడినదని, కేసుని పునర్ విచారించావలసిందిగా పోలీసులని ఆదేశించమని కోర్టుని కోరుతూ ఒక పిటిషన్ వేయడమే గాకుండా, పోలీసులు ఎవరెవరు సాక్షులను విచారించాలో తెలుపుతూ ఒకలిస్టును కూడా కోర్టుకి సమర్పించారు. అందుకు కోర్టు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, విచారణని ఎదుర్కొంటున్న ఒక ముద్దాయి తమని ఈ విదంగా కోరడం తప్పు అని చెప్పడమే కాకుండా అతని పిటిషన్ని కూడా కొట్టి వేసింది.

ఓటింగ్ కు టిడిపి ఎంపిల డుమ్మా: చంద్రబాబు టార్గెట్

      ఎఫ్ డి ఐ లఫై రాజ్య సభ లో జరిగిన ఓటింగ్ లో యూపిఏ ప్రభుత్వం గట్టెక్కేలా ఓటింగ్ కు ముగ్గురు తెలుగు దేశం పార్టీ ఎంపి లు దూరంగా ఉన్న సంఘటన సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.  అసలు ఈ విషయం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు కు తెలియదనే కధనాలు కూడా మీడియాలో వస్తున్నాయి.   డాక్టర్ అపాయింట్మెంట్ ఉండనే కారణంతో దేవందర్ గౌడ్, తన బంధువులకు ఆరోగ్యం బాగా లేదని గుండు సుధా రాణి, జలుబుకు మందు తీసుకోవాల్సిన కారణంగా సుజన చౌదరి ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్న దానికి కారణంగా చెప్పినట్లు తెలుస్తోంది. తమ అధినేత కు ఈ ముగ్గురు నాయకులు ఈ విధమైన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.  పార్టీ పరువు తీసిన ఈ ముగ్గురు నేతలఫై బాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు తనకు ఈ విషయంలో స్వయంగా వివరణ ఇవ్వాలని బాబు వారిని ఆదేశించినట్లు తెలుస్తోంది.     విశ్వసనీయ సమాచారం ప్రకారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తమకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా ఈ ముగ్గురు ఎంపి లఫై వత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.     తెలుగు దేశం పార్టీ నేతలు సైతం ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు పార్టీ చంద్ర బాబు చేతిలో ఉందాఅని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో సైతం పార్టీ కి వ్యతిరేక కధనాలు రావడంతో పార్టీ తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

శేరిలింగంపల్లి నుండి నారా లోకేష్ ?

    తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు కుమారుడు లోకేష్ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేయడానికి సిద్దపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మీడియాలో కధనాలు కూడా వచ్చాయి.   ఈ నియోజక వర్గ ప్రాంతంలోనే హై టెక్ సిటీ ఉండటం, కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. అనేక ఇతర కారణాల వల్ల లోకేష్ ను ఇక్కడ నుండి బరిలోకి దింపటం మంచిదని పార్టీ నేతలు నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి బాబుకు సూచించినట్లు సమాచారం.   కూకట్ పల్లి, చందా నగర్, కొత్త గూడ లు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసిన తెలుగు దేశం అభ్యర్ధి కేవలం వెయ్యి ఓట్ల తేడాతోనే ఓడిపోవడంతో ఇక్కడపోటీ చేసే పార్టీ అభ్యర్ధికి ప్రస్తుతం విజయావకాశాలు ఉంటాయనేది పార్టీ నేతల విశ్లేషణ. ఇక్కడ నుండి పోటీ చేస్తే, తెలంగాణా నుండి పోటీ చేసినట్లు గా కూడా ఉంటుందని పార్టీ నేతలు విశ్లేషించినట్లు ఆ కధనం వెల్లడించింది.   లోక్ సభకు కాకుండా, అసెంబ్లీ కే తన కుమారుడిని పంపించడానికి బాబు ఆసక్తి చూపిస్తున్నాడని బాబు సన్నిహితులు అంటున్నారు. ఇక్కడ నుండి పోటీ చేయడంతోనే లోకేష్ తన రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సన్నిహితులు ఈ నియోజక వర్గం ఫై ప్రత్యెక పర్యవేక్షణ చేస్తుండడమే ఈ ఊహాగానాలకు కారణం.  

కాంగ్రెస్ తన గోతిలో తానే పడిందా?

  అఖిలపక్ష సమావేశం పెట్టి చంద్రబాబును ఇరుకున బెట్టేమని చంకలు కొట్టుకొంటున్న కాంగ్రేసుకి నిన్న ఆయన ఆదిలాబాద్ జిల్లాలోచెప్పిన జవాబుతో కంగుతినే పరిస్తితి వచ్చింది. చంద్రబాబు ఏమన్నారంటే “నేను ఎప్పుడూ, ఇప్పుడూ కూడా తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడలేదు. అసలు, తెలంగాణాపై అఖిల పక్ష సమావేశం నిర్వహించమని నేనే స్వయంగా కాంగ్రేసుకి లేఖ వ్రాసాను. కానీ ఇంతకాలం తాత్సారంచేసి దానిని ఒక అస్త్రంగా చేసుకొని తమ తెలంగాణా యమ్పీలను లొంగదీసుకోవడమేగాకుండా, ఇప్పుడు వారేదో స్వయంగా ఆలోచించి అఖిలపక్ష నిర్ణయం తీసుకొన్నట్లు గొప్పగా చెప్పుకొంటున్నారు. మేము అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా పై మాపార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్తాము. అప్పుడు, తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది ఎవరో వాళనే నిర్నయించుకోమనండి చూద్దాము.”   ఇంకా అఖిల పక్షానికి రెండు వారాలు పైగా గడువుండగానే ఇలాగ చెప్పిన చంద్రబాబు, బంతిని కాంగ్రేసు కోర్టులోకి నేట్టేరు. అఖిలపక్ష సమావేశానికి, కాంగ్రేసు పార్టీ ఒక్కోపార్టీ నుండి ఎంతమందిని ఆహ్వానిస్తుందనేది, తెలంగాణా విషయంలో కాంగ్రేసు యొక్క చిత్తశుద్ధిని బయటపెట్టబోతోంది. ఒక వేళ, అది గనుక పార్టీకి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది చొప్పున పంపించమని కోరినట్లయితే, తద్వారా తెలంగాణా విషయమై పార్టీలు బిన్నభి ప్రాయలు వ్యక్తం చేశాయని వంక చూపించి తెలంగాణాపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా కాలయాపనచేసే ఆలోచనలో ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతుంది.   అందువల్ల తప్పనిసరిగా, తెలంగాణా నేతలు కోరుతున్నట్లు ఒక్కో పార్టీ నుంచి ఒక్కొకరినే ఆహ్వానించవలసి ఉంటుంది. అప్పుడు, అన్నిపార్టీలు తెలంగాణా విషయమై తమతమ అభిప్రాయాలు ఖరాఖండీగా ప్రకటించవలసివస్తుంది. చంద్రబాబు దూకుడు చూస్తుంటే అఖిలపక్ష సమావేశంలోనే ‘జై తెలంగాణా!’ అనబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంతవరకూ, తే.దే.పా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ లపై నిందవేసి తెలివిగా తప్పించుకొంటున్న కాంగ్రేసుకి అప్పుడు ఆదారి మూసుకుపోవడమేగాక, వెంటనే తెలంగాణా విషయం పై ఏదో ఒక ప్రకటన చేయక తప్పని పరిస్తితి వస్తుంది. పైగా తెలంగాణా నేతలనుండి ఒత్తిడి కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది. అప్పుడు, కాంగ్రెస్ తెలంగాణా విషయంలో కాలపయనచేసే ప్రతిఒక్కరోజూ కూడా తెలంగాణాలో దాని ఉనికికి ప్రశ్నార్ధంగా మార్చబోతుంది. అసలుకే మోసం వచ్చే పరిస్తితులు చేజేతులా తెచ్చుకోవాలో లేక ఎదో ఒక సానుకూల ప్రకటన చేసేసి వెంటనే ఎన్నికలకి వెళ్లిపోవడమో చేయాల్సి ఉంటుంది కాంగ్రేసుకి. కాంగ్రేసుకి ఇది ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ లాగ తయారవుతుంది. ఇంకా చెప్పాలంటే తే.దే.పా.కోసం తవ్విన గోతిలో తనేపడేట్లు ఉందిప్పుడు కాంగ్రెస్ పరిస్తితి.

తెలంగాణా ఫై జగన్ దారెటు ?

  ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయం ఫై అంతటా ఉత్కంట నెలకొని ఉంది. తెలంగాణా ఫై ఏదో ఒక నిర్ణయం తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీకి తలెత్తింది. తమ పార్టీ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుందని, ప్రత్యెక రాష్ట్రాన్ని అడ్డుకోదని, ఆ పార్టీ నేతలు ఇంత కాలం చెపుతూ వచ్చారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కూడా వారన్నారు. అయితే, తమ పార్టీకి తెలంగాణా విషయంలో ఓ స్పష్టమైన వైఖరి ఉందని ఈ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు అంటున్నారు. సీమంధ్ర నేతలు మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఓ ప్రకటన చేయలేకపోతున్నారు. అఖిల పక్ష భేటీలో తమ పార్టీ ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని, ఆ పార్టీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పాల్సిన పని లేదని కూడా ఆయన అన్నారు. కేంద్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను ఇచ్చేదీ, తెచ్చేదీ కాదని ఆయన అన్నారు. ఈ రోజు జరగనున్న పార్టీ సమావేశంలో ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

టి.అఖిలపక్షంతో ఇబ్బందుల్లో చంద్రబాబు ?

    తెలంగాణా ఫై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్రంలో ప్రతి పక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఇబ్బందుల్లో పడింది. తెలంగాణ ఫై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయని, అందు వల్ల కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోదని ఇంత కాలం భావిస్తూ వచ్చిన చంద్ర బాబు, ఇప్పుడు అదే జరగడంతో ఈ విషయంలో తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. టిడిపి తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం తమ నేత తెలంగాణా కు అనుగుణంగా నిర్ణయం తీసుకొంటారని చెబుతున్నారు. తమ పార్టీలోని మూడు ప్రాంతాల నేతలు సమావేశం అయి ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ పార్టీ నేతలంతా,తమ ప్రాంతాలకు తగినట్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణం లో మూడు ప్రాంతాల నేతలు ఒక్క చోట కూర్చుంటే ఏకాభిప్రాయం ఎలా సాధ్యపడుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒక వేళ ఈ సమావేశానికి ఒక్కరినే పంపించాల్సి వస్తే, బాబు ఆంధ్ర నాయకున్ని పంపిస్తారా లేక తెలంగాణా నేతను పంపిస్తారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం గానే మారింది. చాలా కాలం సమైఖ్య వాణిని వినిపించిన తెలుగు దేశం ప్రస్తుతం తీసుకొనే నిర్ణయం ఫై అంతటా సస్పెన్స్ నెలకొని ఉంది. ఏది ఏమైనా, చంద్ర బాబు నాయుడు కు కీలక సమయం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. 

పురందేశ్వరి ఫై షర్మిలా పోటీ ?

    వచ్చే ఎన్నికల్లో ఎన్ టి ఆర్ కుమార్తె, కేంద్ర మంత్రి పురందేశ్వరి ఫై పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జగన్ సోదరి షర్మిలా బలంగా భావిస్తోన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కడప నుండి పోటీ చేయాలని షర్మిలా భావించినప్పటికీ, ఆ స్థానం నుండి అవినాష్ రెడ్డిని పోటీకి దింపాలని జగన్ మోహన్ రెడ్డి దాదాపు తుది నిర్ణయం తీసుకోవడంతో షర్మిలా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుండి మంత్రి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తిరిగి ఇక్కడ నుండే పోటీకి దిగే పక్షంలో ఆమెఫై పోటీకి దిగాలని షర్మిలా భావించారు. అయితే, అక్కడ నుండి పోటీ చేయాలని టి.సుబ్బరామి రెడ్డి కూడా పార్టీ అధిష్టానంఫై వత్తిడి తెస్తుండడంతో పురందేశ్వరి స్థానం ఒంగోలుకు మారే అవకాశం ఉంది. ఒక వేళ పురందేశ్వరి ఒంగోలు నుండి పోటీ చేయడం ఖరారు అయితే, షర్మిలా కూడా తన స్థానాన్ని ఒంగోలుకే మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుండి ఈ ఇద్దరు మహిళా నేతలు పోటీకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

గాలికి ఈడి షాక్: 884 కోట్ల ఆస్తుల జప్తు

    అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కి ఈ డి గట్టి షాక్ ఇచ్చింది. 884 కోట్ల రూపాయల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాడని తీర్మానించిన ఈ డి దానికి సమానమైన ఆస్తులను బ్రహ్మణీ స్టీల్స్ నుండి జప్తు చేసింది. సిబిఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్ ఆధారంగా ఈ డి ఈ జప్తులను చేసింది. అక్రమ మైనింగ్ తో పాటు, ఫెమా నిభందనలు ఉల్లంఘించడం కూడా ఈ డి తీసుకొన్న ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. బ్రహ్మణీ స్టీల్స్ కు చెందిన 88 కోట్ల 41 లక్షల 30 వేల షేర్లు, హెలికాప్టర్ జప్తు చేయబడిన వాటిలో ఉన్నాయి. ఈ ప్లాంటుకు చెందిన భూములు, అనేక రకాల యంత్ర సామగ్రి అమ్మడం, వేరొక చోటకు తరలించడం, లీజుకు ఇవ్వడం చేయరాదని ఈ డి ఆదేశించింది. ఓబులాపురం కేసులో బెంగుళూరు జోనల్ యూనిట్ ఈ డి అధికారులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. కేసు విచారణ అంచలంచలుగా కొనసాగుతుందని ఈ డి అధికారులు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ కి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఆస్తుల జప్తుతో గాలి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఒక సమయంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి ప్రస్తుత సంక్షోభం నుండి ఎలా గట్టేక్కుతాడో వేచి చూడాల్సిందే.   

‘అఖిలపక్షం’ ఫై గాలి ఆసక్తికర వ్యాఖ్యలు

    డిసెంబర్ 28 న తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించడం అందరికీ సంతోషమే. అయితే, ఈ అంశం ఫై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ఎఫ్ డి ఐ లఫై ఓటింగ్ లో ఓడిపోతామన్న భయంతోనే ఈ తేదీని ప్రకటించారనీ, ఈ నిర్ణయం వల్ల ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఎలాంటి ముందడుగు ఉందనేది ఆయన మాటల్లోని సారాంశం. శ్రీ కృష్ణ కమిటి వేసి హడావుడి చేసినట్లే, ప్రస్తుత తేది ఉందనీ ఆయన అన్నారు. ఒక్క సారి గతాన్ని పరిశీలిస్తే, ముద్దు కృష్ణమ నాయుడు మాటల్లో ఎంతో నిజం ఉందని అర్ధమవుతుంది. తెలంగాణా ఫై రాష్ట్రపతి ప్రసంగంలో చోటు, శ్రీ కృష్ణ కమిటి వేసి చివరకు దానిని కూడా పక్కన పెట్టడం, ఇంకా ఒకటీ, అరా ప్రయత్నాలు కూడా చేసి చివరకు ఏకాభిప్రాయమే శరణ్యం అనడం వంటివి చూస్తుంటే, నాయుడు మాటల్లో ఎంతో నిజం ఉందని అనిపిస్తోంది. ఏది ఏమైనా గాలి మాటలు నిజం కాకూడదని, ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఓ స్పష్టత వస్తుందని ఆశిద్దాం.