సీమంధ్ర ప్రజలను మభ్యపెడుతూ విభజన ప్రక్రియ పూర్తి
వచ్చేనెల 5నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల కంటే ముందుగానే, రాష్ట్ర విభజన కోసం ఏర్పడిన కేంద్రమంత్రుల బృందం తన నివేదికను సమర్పిస్తుందని కేంద్ర హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాకు తెలియజేసారు. ఇక దిగ్విజయ్ సింగ్ కూడా మరో ముఖ్యమయిన విషయం తెలియజేసారు. వచ్చేనెల 15లోగా తెలంగాణా ముసాయిదా తీర్మానం సిద్దం అవుతుందని, వచ్చే జనవరి లోగానే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడుతాయని మీడియాకు తెలిపారు.
రాష్ట్ర విభజనలో ఇమిడి ఉన్న అనేక సంక్లిష్ట అంశాలను పూర్తిగా పరిష్కరించకుండానే, దానినొక మొక్కుబడి తంతుగా పూర్తి చేసేందుకే కేంద్రమంత్రుల బృందం ఏర్పరచబడిందని దీని ద్వారా అర్ధం అవుతోంది. కేంద్రమంత్రుల బృందం తమ పని పూర్తి చేసి, నివేదిక సమర్పించేందుకు ముందు విదించిన ఆరు వారాల కాల పరిమితిని ఉద్దేశ్య పూర్వకంగానే తొలగించామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ, సరిగ్గా అంతే కాలపరిమితిలోనే మంత్రుల బృందం తన పని పూర్తిచేయడం గమనిస్తే, సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ఆవిధంగా ప్రకటించారని అర్ధం అవుతోంది. ఇక అదేవిధంగా ముందు ప్రకటించినట్లుగానే నాలుగు నెలలలోనే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిఅవుతోందని దిగ్విజయ్ తాజా ప్రకటన స్పష్టం జేస్తోంది.
సామరస్య వాతావరణంలో సాంకేతికంగా జరుగవలసిన రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఇంత హడావుడిగా, గోప్యంగా, ప్రజలను మభ్యపెడుతూ చేయడం చూస్తే, కేవలం తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే విభజన చేస్తోందని స్పష్టం అవుతోంది. తన ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనలో కీలకమయిన అనేక అంశాలని విస్మరించి ముందుకు సాగడం ద్వారా విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు, గొడవలు శాశ్వితంగా నిలిచిపోవడం ఖాయం.
మోడీ ప్రభంజనం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ, బహుశః ఇక మళ్ళీ ఇంత త్వరలో తాము అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తున్నందునే ఈవిధంగా వ్యవహరిస్తోందని అనుమానం కలుగుతోంది. ఏమయినప్పటికీ కాంగ్రెస్ తొందరపాటు నిర్ణయం, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అసమర్దత, వారి స్వార్ధ రాజకీయాలు, ప్రతిపక్షాల మధ్య అనైక్యత వలన కాంగ్రెస్ అధిష్టానం తెలుగు ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చును. కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం ప్రస్తుతం తెలంగాణా నేతలకి, ప్రజలకి చాలా ఆనందం కలిగించవచ్చును. కానీ మున్ముందు తరచు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగిననాడు తప్పక కాంగ్రెస్ పార్టీని నిందించక మానరు.
రాష్ట్ర విభజన విషయంలో ప్రజలను చివరి దాక మభ్యపుచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చును. అయితే వారందరూ తమ తమ వ్యక్తిగత పలుకుబడి, కుల సమీకరణాలు, అంగ బలం, ఆర్ధిక బలంతో రానున్నఎన్నికలలో గెలువగలమని దృడంగా నమ్ముతున్నారు.