ఏపీ ప్రభుత్వానికి జగన్ కౌంటర్‌..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి కౌంటర్‌ ఇవ్వడానికి సిద్దపడినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే రోజాపై హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో జగన్ కూడా రివర్స్ లో వారికి పంచ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ స్థితిలో సభా హక్కులను ఉల్లంఘించారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్‌లపై వైసిపి ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను, ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులను దూషించారని ఆరోపిస్తూ వారు ఆ నోటీసు ఇచ్చారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మేడమ్‌ టుస్సాడ్స్‌లో కపిల్‌ శర్మ బొమ్మ

  అచ్చు మనిషిని పోలిని మైనపు బొమ్మలను రూపొందించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం గురించి విననివారు ఉండరు. లండన్‌లో ఉన్న టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు బొమ్మకి చోటు దక్కడాన్ని మహామహులు సైతం, గొప్ప గౌరవంగా భావిస్తారు. ఆ మ్యూజియంలో మన ప్రధాని మోదీ బొమ్మ కూడా చేరనుందన్న సమాచారం నిన్నే తెలిసింది. తాజాగా, మరో భారతీయ సెలబ్రిటీకి కూడా ఈ మ్యూజియంలో చోటు దక్కనుందన్న వార్త వినిపిస్తోంది. ‘కామెడీ నైట్స్ విత్‌ కపిల్‌’ పేరుతో దేశానికి కితకితలు పెట్టిన హాస్యనటుడు కపిల్‌ శర్మ కొలతలు కూడా మేడమ్‌ టుస్సాడ్స్‌ సిబ్బంది తీసుకున్నారట. కేవలం ఒకే ఒక్క షో ద్వారా దేశవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్న కపిల్‌,  ఇప్పుడు ‘ద కపిల్ శర్మ షో’ పేరుతో సోనీ టీవీలో మరో కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడు. భారతీయ టెలివిజన్‌ రంగానికి చెందిన ఒక వ్యక్తి ప్రతిమ, మేడమ్‌ టుస్సాడ్స్‌లో చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.

భారత్‌ మీదే ఒత్తిడి ఎక్కువ- పాకిస్తాన్‌ కోచ్‌

టి-20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో భంగపడిన భారత్‌కు, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. కానీ తదుపరి మ్యాచ్ గురించి ఆలోచన, భారత్‌ జట్టు మీద మరింత ఒత్తిడి పెంచేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, చిరకాల శత్రువు పాకిస్తాన్‌తో, భారత్‌ రెండో మ్యాచ్‌ను ఆడవలసి ఉంది. రేపు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందుగానే, ఇరుజట్ల మధ్యా మాటల పోటీ మొదలైపోయింది. భారత్‌-పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ అంటే సరిహద్దు మధ్య తగాదాగా చూస్తారని, భారతీయ స్పిన్నర్ అశ్విన్‌ పేర్కొన్నాడు. కానీ పాకిస్తాన్ కోచ్‌ వకార్‌ యూనస్‌ మాత్రం అశ్విన్‌ మాటలను కొట్టిపారేస్తున్నాడు. స్పర్ధ క్రీడకు మాత్రమే పరిమితం కావాలని సూచించాడు వకార్. అంతర్జాతీయ పోటీలలో తరచూ పాకిస్తాన్‌ మీద భారత్‌దే పై చేయిగా ఉంటున్నప్పటికీ, ఈసారి ఆ చరిత్రను తిరగరాస్తామని ప్రకటించాడు. టోర్నీలో నిలిచేందుకు భారత్‌కు ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో, వారి మీదే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. వకార్‌ మాటల్ని మరీ కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే టోర్నమెంటులోని తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి భారంతో నిలిస్తే, పాకిస్తాన్‌ మాత్రం బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి విజయోత్సాహంతో ఉంది. మరి చరిత్ర మారుతుందా లేకపోతే పునరావృతమవుతుందా తేలేందుకు ఒక్క రోజు ఓపిక పడితే సరిపోతుంది.

శక్తిమాన్ పై విరాట్ కోహ్లి.. అది పిరికి చర్య

  బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి శక్తిమాన్ అనే గుర్రం కాలు విరగొట్టారన్న ఆరోపణలు మోస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలుగు, తమిళ నటి త్రిష స్పందించి నువ్వు నరకానికి వెళ్లాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఘటనపై టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి కూడా స్పందించాడు. ప్రాణం లేని జీవులపై దాడి చేయడంతో నిర్ఘాంతపోయానని..  గుర్రం శక్తిమాన్‌పై దాడి పిరికి చర్య అని.. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. శక్తిమాన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయాలని సూచించారు.

ఎమ్మెల్యేలకు మైక్రోఓవెన్లు గిఫ్ట్... రాద్దాంతం చేయోద్దు..

  బీహార్ ఎమ్మెల్యేలకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా  మైక్రోఓవెన్లు గిఫ్టుగా రానున్నాయి. ఎమ్మెల్యేలు ఈ గిఫ్టులేంటి అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. బీహార్లో అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రతి శాఖ ఎమ్మెల్యేలకు కానుకలు ఇస్తుంటారు. అయితే ఈసారి విధ్యాశాఖ అసెంబ్లీలోని మొత్తం  243 మంది ఎమ్మెల్యేలకు  మైక్రోఓవెన్లను గిఫ్టులుగా అందజేయనుంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరీ మాట్లాడుతూ..  ఒక్కొక్క ఓవెన్ ధర 11,125 రూపాయలు.. మొత్తం అయిన ఖర్చు..  రూ. 30 లక్షలు మాత్రమే అని దీనిని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అతను చెప్పినట్టే ఈ  విషయంపై పెద్దగా ఎవరూ కూడా అభ్యంతరం తెలుపలేదు. అయితే డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పారు. బీహార్ పేద రాష్ట్రం, ఇక్కడ ఎన్నికైన నేతలు కోటీశ్వరులు కాదు, వాళ్లు పేదవాళ్లే, అలాంటి నేతలకు గిఫ్ట్‌లు ఇవ్వడం తప్పా ? దీన్ని రాద్దాంతం చేయవద్దన్నారు.

అసదుద్దీన్ కు షాక్.. మీరట్ ముస్లింల వ్యతిరేకత

పీక మీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను చేసిన వ్యాఖ్యలకు కొంతమంది ముస్లీంల నుండి అనుకూలంగా స్పందనలు వచ్చినా.. కొంతమంది ముస్లింలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరట్ ముస్లింలు అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ ముస్లిం నాయకుడు మహ్మద్ ఇమామ్ నాయకత్వంలో మీరట్ లోని బచ్ఛా పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే అసదుద్దీన్ ఆ వ్యాఖ్యలు చేశారని .. ఒవైసీ మాటలు పూర్తిగా దేశ వ్యతిరేకం అనీ వాటిని తాము సమర్ధించడం లేదనీ వ్యాఖ్యానించారు. అంతేకాదు..తమ రక్తంతో భారత పటంపై రక్తంతో భారత మాతాకి జై అని రాసి తమ దేశ భక్తిని చాటుకున్నారు.

తెలంగాణకు మళ్లీ చుక్కెదురు.. రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సిందే.. సుప్రీం

రాష్ట్రం విడిపోయిన దగ్గర నుండి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో విషయాల్లో ఇరు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి కూడా. అలా కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ తెలంగాణకు దాదాపు మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. తాజాగా ఉన్నత విద్యామండలి విషయంలో కూడా తెలంగాణ సర్కారుకు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అప్పీళ్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తులు తమకే చెందుతాయన్న తెలంగాణ రాష్ట్ర వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర విభజన అనంతరం.. ఆస్తులు, అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని సూచించింది. అంతేకాదు సెక్షన్ 75 ప్రకారం ఆస్తులు తమకే చెందుతాయన్న వాదన సరికాదని.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పంపకాలు తప్పనిసరి అని.. ఈ విషయంపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. విభజనకు ముందు ఉన్న ఆస్తులను 52:48 ప్రకారం పంచుకోవాలని చెప్పింది. విభజన తర్వాత ఆస్తులు, అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని ఆదేశించింది.

క్రిస్ గేల్‌ కు అమితాబ్ క్షమాపణ..

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో అప్పుడే వెస్టిండీస్ స్టార్ బ్యాట్సుమన్ క్రిస్ గేల్‌ అప్పుడే రికార్డుల జాబితాను మొదలుపెట్టారు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 48 బంతుల్లోనే 100 పరుగులు తీసి రికార్డ్ సాధించాడు. ఈ విద్వంసరకర బ్యాట్స్ మ్యాన్ వీర బాదుడు ఓవరాల్ గా మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డులకెక్కింది. అయితే ఇప్పుడు దీనిపై బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ క్రిస్ గేల్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అంతేకాదు ముంబైలో నిన్ను కలుసుకోలేకపోయినందుకు క్షమాపణ చెబుతున్నానని కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి స్పందించిన గేల్.. మనం తప్పకుండా కలుద్దాం అని చెప్పాడు.

విజయ్ మాల్యాకు మరోసారి ఈడీ నోటీసులు..

  కింగ్ పిషర్ సంస్థ యాజమాని విజయ్ మాల్యాకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) గతంలో నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 18 లోపు తమ ముందు హాజరయ్యి.. విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే అప్పటికే విజయ్ మాల్యా లండన్ పారిపోయాడు. తొలిసారి ఈడీ నోటీసులపై స్పందించిన విజయ్ మాల్యా తనకు ఏప్రిల్ వరకూ గడువుకావాలని కోరుతూ ఈడీకి లెటర్ రాశారు. ఈ నేపథ్యంలో ఈడీ విజయ్‌మాల్యాకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌ 2న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకు రుణం ఎగవేత కేసులోనూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా విజయ్ మాల్యా రూ..9వేల కోట్లు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని వాటికి ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.

ఓ చెల్లిగా అడుగుతున్నా.. రోజా నోటిని అదుపులో పెట్టకపోతే..

  వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఎంట్రీ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్బంగా టిడిపి ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత జగన్ పై, రోజాపై నిప్పులు చెరిగారు.  రోజాను దారిలో పెట్టాలని లేదంటే ప్రతిపక్ష హోదాను కోల్పోతారని జగన్‌ను హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని కనీసం ప్రతిపక్షనేతగా అయిన ఎన్నుకున్నారు.. రోజాలాంటి వారు మీ పక్కన ఉంటే ఆ స్థానం కూడా ఉండదని.. రోజా నోటిని అదుపులో పెట్టకపోతే సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు.  మీడియా సందర్భంగా .. ఓ చెల్లిగా అడుగుతున్నానని, జగనన్నా అన్యాయం ఎవరికి జరిగిందని ప్రశ్నించారు. రోజాకు అన్యాయం జరిగిందా, తనకు అన్యాయం జరిగిందా చెప్పాలన్నారు. నాకు జరిగిన అన్యాయంపై జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రోజాను వెంటనే మీ పార్టీ నుంచి తప్పించాలని హితవు పలికారు. అసభ్య హావభావాలను ప్రదర్శిస్తూ, సాటి మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ఆమెను వెనకేసుకు రావడం ఎంత మాత్రం సమంజసమని జగన్‌ను, వైసిపిని అనిత ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో వున్నామా? రాజరికంలో వున్నామా?.. జగన్

వైసీపీ ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అసెంబ్లీలోకి అనుమతించని సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.  మనం ప్రజాస్వామ్యంలో వున్నామా? లేదా రాజరికంలో వున్నామా అంటూ ప్రశ్నించారు. అధికారం తమ చేతుల్లో వుందనే అహంకారంతో ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. అవినీతి సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రోజాను సస్పెండ్ చేసి.. హైకోర్టు నిర్ణయాన్ని ఖాతరు చేయకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు..సీఎంతో కలిసి స్పీకర్ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు.

టోపీ,శర్వాణీ లపై అసదుద్దీన్ కు జావెద్ కౌంటర్..

భారత్ మాతాకి జై అనను అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. చిలికి చిలికి వాన తుఫాన్ అయినట్టు.. ఈ వ్యాఖ్యల ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తన పాటికి తాను అనేసి సైలెంట్ గా కూర్చున్నా.. మిగిలిన వారి మీది ఈ ప్రభావం బాగానే పడినట్టు ఉంది. దీనికి మహారాష్ట్ర ఎమ్మెల్యే పఠానే నిదర్శనం. అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం ప్రతిపక్షాలు కూడా అతనిపై బాగానే విమర్శలు చేస్తున్నారు. వీరిలో కాస్త ముందుంది అంటే మాత్రం బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ అని చెప్పొచ్చు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు జావేద్ అక్తర్ అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు.. భారత్ మాతాకి జై అనే నినాదం రాజ్యాంగంలో రాసుందా అని అసదుద్దీన్ వేసిన ప్రశ్నకు అతను స్పందిస్తూ..  శర్వాణీ, టోపీ పెట్టుకోవాలి అని రాజ్యాంగం చెప్పిందా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.   అయితే దీనికి అసదుద్దీన్ అభ్యంతరం చేస్తూ అవి ముస్లింల పద్దతి అని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు దెబ్బతీయవద్దని అన్నారు. మరి జావేద్ అక్తర్ సైలెంట్ గా ఉంటారా..మళ్లీ ఒక కౌంటర్ ఇచ్చారు. టోపీ-శర్వాణీ గురించి మాట్లాడితేనే అసదుద్దీన్‌కు అంత కోపం వస్తే.. వందల కోట్ల భారతీయులు గౌరవించే విషయాల మీద అసదుద్దీన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే వారు కూడా ఫీల్ కారా అంటూ ప్రశ్నించారు.   మరోవైపు జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ ట్విట్టర్లో స్పందించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ స్పీచ్ అదిరిందని.. అసదుద్దీన్ వ్యాఖ్యల్ని ఆమె తప్పుబట్టింది. అంతేకాకుండా భారత్ మాతాకీ జై అంటూ తన ట్వీట్ సందేశాన్ని ముగించింది. మరి తమ పద్దతుల గురించి ప్రస్తావించినప్పుడు తమ మనోభావాలు దెబ్బతీయవద్దని చెప్పిన అసదుద్దీన్ కు తను దేశానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మాత్రం దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తీంటాయని తెలియదా..?  

రాజ్‌భవన్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు.. నరసింహన్ కు ఫిర్యాదు

వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఎంట్రీపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఒకవైపు మార్షల్స్ రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుపడుతుంటే మరోపక్క.. జగన్, రోజా వైసీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ తో వాగ్వాదానికి దిగారు. అయినా లోపలికి వెళ్లనివ్వకపోవడంతో విషయంపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేస్తూ వెళ్లారు. అయితే ముందుగా గవర్నర్ తో ఫోన్లో మాట్లాడిన జగన్ ఆయన అందుబాటులో లేకపోవడంతో వినతిపత్రాన్ని గవర్నరు ఆఫీసులో ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది.   మరోవైపు రోజా సస్పెన్షపై హైకోర్టు డివిజన్ బెంచ్ పై పిటిషన్ దాఖలు చేసిన అసెంబ్లీ కార్యదర్శి. సోమవారానికి ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

లేచిన గుర్రం శక్తిమాన్.. ఎమ్మెల్యే గణేష్ జోషీ అరెస్ట్

  బీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా గణేష్ జోషీ అశ్వక దళానికి చెందిన శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో శక్తిమాన్ బాగా గాయపడగా దాని కాలు విరిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆ కాలును తొలగించి నడవడానికి వీలుగా ఉండే మరో ప్లాస్టిక్ కాలును పెట్టారు. అయితే ఇకనుండి అది పరిగెత్తలేదని.. నడవడం వరకే కుదురుతుందని వైద్యులు చెప్పారు. కాగా చికిత్స అనంతరం రెండు రోజులు లేవని శక్తిమాన్ ఈ రోజు లేచి నిల్చున్నట్టు తెలుస్తోంది.   మరోవైపు ఎమ్మెల్యే గణేష్ జోషీ మాత్రం తాను గుర్రంపై ఎలాంటి దాడి చేయలేదని చెబుతున్నా.. గుర్రంపై దాడి చేసి గాయపరిచిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషీని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.

ప్రేమను నిరాకరించిందని... ఐదుగురిపై యాసిడ్ దాడి

పంజాబ్ రాష్ట్రంలో ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించిందని.. ఓ బాలుడు తను ప్రేమించిన అమ్మాయితో పాటు తన స్నేహితురాళ్లపైన కూడా యాసిడ్ దాడి చేశాడు. వివరాల ప్రకారం..  పంజాబ్ దేశంలో గురుదాస్ పూర్ పట్టణంలోని డేరా బాబా నానక్ ప్రాంతంలో ఓ బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే తను అదే పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాడు. కానీ బాలిక మాత్రం తన ప్రేమను నిరాకరించిది. దీంతో ఆ బాలుడు పాఠశాల నుండి సాయంత్రం ఆ బాలికలు ఇళ్లకు బయలుదేరి వెళ్లే సమయంలో తన స్నేహితుడి బైక్ పై ఫాలో అయి ఆ బాలికతో పాటు పక్కన ఉన్న ఆమె స్నేహితురాళ్లపైన కూడా యాసిడ్ పోసి  పారిపోయాడు. యాసిడ్ దాడికి బాలికలు బాధతో పెద్దగా అరవగా.. ఇరుగుపొరుగున ఉన్న వారు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈదాడిలో బాలిక పరిస్థితి మాత్రం విషమంగా ఉందనే వైద్యులు చెబుతున్నారు. మిగిలిన వారికి స్వల్పంగా గాయాలైనట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.