4వేల కోట్ల కుంభకోణం!.. కొడాలి నానిపై ఆరోప‌ణ‌లు.. జ‌గ‌న్ వాటా ఎంతంటే..!

ఏపీ మంత్రి కొడాలి నానిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు. ఏకంగా 4వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ విమ‌ర్శ‌లు. పేద‌ల క‌డుపు కొట్టి.. ప్ర‌భుత్వ ఖ‌జానాను కొల్ల‌గొట్టి.. వేల కోట్లు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ‌లు. ఇందులో సీఎం జ‌గ‌న్‌కూ భారీగానే ముడుపులు అందుతున్నాయ‌నే అనుమానాలు. ఇలా ఏపీలో 4వేల కోట్ల బియ్యం కుంభ‌కోణం జ‌రిగిందంటూ.. అయినా ద‌ర్యాప్తు జ‌ర‌గ‌డం లేదంటూ.. టీడీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు ఎంఎస్ రాజు వైసీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న చేసిన కామెంట్లు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి. సీఎం జగన్ ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి నాసిరకం బియ్యం ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలకిచ్చే బియ్యం నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌లు కాసులు పిండుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆ బియ్యంస్కాం ఎలా జ‌రుగుతోందో స‌వివ‌రంగా విడ‌మ‌రిచి చెప్పారు టీడీపీ నేత‌ ఎంఎస్ రాజు.  రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి వచ్చే నాణ్యమైన బియ్యాన్ని పేదలకివ్వాల్సి ఉంటుంది. కానీ, మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాధరాజు, కార్పొరేషన్ ఛైర్మన్ ద్వారంపూడి భాస్కర్‌రెడ్డిలు ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకొని 4 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మళ్లీ అదే బియ్యాన్ని నాసిరకం బియ్యంగా రీసైక్లింగ్ చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం అన్యాయమని మండిప‌డ్డారు ఎంఎస్‌ రాజు.  మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని మైలవరంలోనే ఈ దారునం బయటపడిందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 60 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇందులో జగన్ వాటా ఎంతో బ‌య‌ట‌పెట్టాలని డిమాండ్ చేశారు.  ధరల స్థిరీకరణ నిధి నుంచి 3 వేల కోట్లు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన నాణ్యమైన ధాన్యాన్ని కేజీ రూ.40కి బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ అవినీతికి పాల్పడుతున్న మంత్రులను, కార్పొరేషన్ ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని రాజు డిమాండ్ చేశారు.   

జగన్ ను ఎదుర్కొనే బెస్ట్ ఆప్షన్ కిరణేనా? పీకే డెరైక్షన్ లో కాంగ్రెస్ బలపడేనా? 

ఏపీలో పాత పేర్లు కొత్తగా తెరమీదికొస్తున్నాయి. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని కలలు కన్న జగన్ ను ఇంటిదారి పట్టించేందుకు కాంగ్రెస్ అనూహ్యమైన ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఉమ్మడి ఏపీ ఆఖరు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ మరణం తరువాత రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. హైకమాండ్ అడ్డు చెప్పింది. అయినా.. జగన్ ప్రజల్లోకి వెళ్లారు. అప్పటికే జగన్ మనసులోని మర్మాన్ని అర్దం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.... ఢిల్లీకి పూర్తిగా విధేయుడైన కిరణ్ కు సీఎంగా బాధ్యతలు అప్పగించింది. జగన్ ను ఓ చూపు చూడాలని పురమాయించింది. ఆ పాత రికార్డే ఇప్పుడు కిరణ్ కు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  జగన్ పార్టీని చీలుస్తారనే భయంతో రాయలసీమకే చెందిన కిరణ్ ను అప్పట్లో అధిష్టానం బాగా వాడుకుంది. కిరణ్ ను సీఎం చేసి జగన్ బాబాయ్ వివేకాను కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో.. తమ కుటుంబంలోనే విభేదాలు తీసుకురావటం జగన్ కు నచ్చలేదు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి.. కొత్త పార్టీ పెట్టారు. కడప ఎంపీగా జగన్.. పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేసి గెలిచారు. ఆ టైంలో సీఎంగా ఉన్న కిరణ్ తో ఎలాగైనా జగన్ ను కంట్రోల్ చేయాలని.. పార్టీకి నష్టం జరగకుండా చూడాలని హైకమాండ్ ఆదేశించింది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో కిరణ్ అన్ని పావులూ సక్సెస్ ఫుల్ గా వాడేశారు. కిరణ్ హయాంలోనే జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ మొదలైంది. జగన్ అరెస్టు కూడా జరిగింది. అందువల్లే జగన్ పెట్టిన పార్టీకి భవిష్యత్ ఉండదని కాంగ్రెస్ సహా.. కిరణ్ సైతం భావించారు. అయితే అనూహ్యంగా విజయమ్మ, షర్మిల కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. అప్పుడు కిరణ్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ కూడా నిర్ణయించిన విషయం గమనించాలి. కిరణ్ సర్కారు గట్టెక్కి... బలం నిరూపించుకున్నాక 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పొందడం వేరే విషయం. హైకమాండ్ ఆదేశాలను అడుగడుగునా తు.చ. తప్పకుండా అమలు చేసిన వ్యక్తిగా కిరణ్ ఢిల్లీలో గుడ్ బుక్స్ లో ఉన్నారు.   రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-పవన్-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ను వీడిన కిరణ్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ తో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో తాజా రాజకీయాలపై, సామాజికవర్గాల సమీకరణలపై కూలంకషంగా చర్చించారు. జగన్ వైపు వెళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంకును వెనక్కి రప్పించే అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కిరణ్ రాహుల్ కు ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. పార్టీ నుంచి వెళ్లినవారిని తిరిగి తీసుకొస్తానంటూ కిరణ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ వైఫల్యాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువ ఉన్నాయని, తనకున్న క్లీన్ ఇమేజ్ తో పాత కేడర్ ను కచ్చితంగా పార్టీవైపు మళ్లిస్తానని కిరణ్ హామీ ఇచ్చినట్టు ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి.  తెలంగాణలో రేవంత్ తరహాలో ఏపీలో కొత్తగా పీసీసీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాంటి క్వాలిటీస్ గానీ, ఇమేజ్ గానీ కిరణ్ కే ఉన్నాయని హైకమాడ్ డిసైడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ పేరు ఫైనల్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో చీఫ్ విప్ గా ఉన్న కిరణ్ కు.... జగన్ కు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉందని, జగన్ లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా సరైన నిర్ణయాలు తీసుకోగలడని అంటున్నారు. నాడు పరిటాల రవి హత్య కేసులో జగన్ మీద టీడీపీ నేతలు పెద్దఎత్తులో విమర్శలు చేసినప్పుడు... జగన్ ను వెనకేసుకొచ్చింది కిరణే కావడం విశేషం. ఇలా కీలకమైన అన్ని అంశాల్లోనూ జగన్ లోతులు తెలిసిన వ్యక్తి కిరణేనని అధిష్టానం భావిస్తోంది. ఆ నమ్మకంతోనే కిరణ్ ను కీలకమైన పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్టు చెబుతున్నారు.

పెళ్లిపీట‌ల‌పై శివాలెత్తిన వ‌ధువు.. పెళ్లికొడుకు చెంప చెళ్లు.. ఎందుకంటే...

మంట‌పంలో పెళ్లి జ‌రుగుతోంది. పీట‌ల‌పై పెళ్లికొడుకు పెళ్లికూతురు కూర్చున్నారు. పంతులు పెళ్లి మంత్రాలు చ‌దువుతున్నారు. అంత‌లోనే అనూహ్య ఘ‌ట‌న‌. పెళ్లికూతురికి పిచ్చి కోపం వ‌చ్చింది. ముందు మంత్రాలు చ‌దువుతున్న‌ పంతులు చెంప చెళ్లుమ‌నిపించింది. ఆ త‌ర్వాత పెళ్లికొడుకు చెంప వాయించింది. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో పెళ్లికొచ్చిన వారంతా అవాక్క‌య్యారు. అస‌లేం జ‌రిగిందో తెలుసుకొని అంతా ఆమెకే స‌పోర్ట్ చేశారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో.. ఆ పెళ్లికూతురుకు మ‌రింత మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఇంత‌కీ పెళ్లివేదిక‌పై ఆ పంతులు, పెళ్లికొడుకు చేసిన త‌ప్పేంటి? ఆ వ‌ధువుకు అంత కోపం ఎందుకొచ్చింది? ఆ ఇద్ద‌రి చెంప‌లు ఎందుకు చెళ్లుమ‌నిపించింది? పెళ్లిమండపంలో వధూవరులు పక్కపక్కన కూర్చొని ఉన్నారు. వారిచుట్టూ బంధువులు ఉన్నారు. పంతులు మంత్రాలు చ‌దువుతున్నారు. ఈ తంతు జ‌రుగుతుంటే వ‌ధువుకు ఏదో ఘాటైన‌ వాస‌న వ‌చ్చింది. ఏంటా అని కాస్త ఫోక‌స్ చేస్తే.. పంతులు గారు పొగాకు న‌ములుతున్నార‌ని గుర్తించింది. అంతే. ఆమె కోపం న‌షాళానికి పాకింది. ఫ‌ట్ మ‌నీ పంతులు చెంప వాయించింది. పెళ్లి చేయాల్సినోడివి ఇలా పొగాకు తిన‌డ‌మేంటంటూ ఇంకో రెండు గ‌ట్టిగా త‌గిలించ‌బోయింది. అంత‌లోనే ఆ పంతులు తేరుకున్నారు. నేనొక్క‌డినే గుల్కా తిన‌డం లేదు.. పెళ్లికొడుకు కూడా తింటున్నాడంటూ అత‌ని వైపు చూపించాడు. ఇంకేముంది. పెళ్లికొడుకు ప‌ని ఫ‌స‌క్‌. పంతులు గుట్కా తింటేనే ఒళ్లు మండిన ఆమెకు.. ఇక త‌న‌కు కాబోయే మొగుడు పెళ్లిపీట‌ల‌పైనే గుట్కా తింటున్నాడంటే ఊరుకుంటుందా? మ‌రింత ఆవేశంతో ఊగిపోయింది. ప‌క్క‌నున్న పెళ్లికొడుకును.. గుట్కా తింటావా అంటూ ట‌పీ ట‌పీ మ‌ని చెంప‌పై కొట్టింది. గుట్కా ఊంచేయ‌మంటూ గ‌ట్టిగా అదిరించింది. దెబ్బ‌కు ద‌డుసుకున్నాడు ఆ వ‌రుడు. భ‌యం భ‌యంగా పైకి లేచి.. తుప్ తుప్ మ‌ని గుట్కాను ఊంచేశాడు. ఆ వ‌రుడు భ‌యంతో వ‌ణికిపోవ‌డం చూసి చుట్టూ ఉన్న వారంతా తెగ న‌వ్వేశారు. పెళ్లికూతురు మాత్రం పీట‌ల‌పై కూర్చొని అంతే కోపంతో.. క‌ర్రెళ్ల చేస్తూ ఉండిపోయింది. ఆ తతంగం అంతా అక్క‌డున్న‌వారు వీడియో తీయ‌గా.. అది సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు పెడుతున్నారు. పెళ్లికూతురు చేసిన ప‌నికి అంతా ప్ర‌శంసిస్తున్నారు. పెళ్లిపీట‌ల‌పైనే గుల్కా తింటున్న పెళ్లికొడుకును కామెంట్ల‌తో కుమ్మేస్తున్నారు.   

రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధి.. జ‌గ‌న‌న్న పాల‌న‌లో అధికారులదే రాజ్యం!

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చారు. వ‌చ్చాక ఇక అర‌చ‌క‌మంటే ఏంటో చూపిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ప‌ప్పుబెల్లాలు పంచుతూ.. త‌న మ‌నుషుల‌కు మైన్లు, ఇసుక‌రీచులు దోచిపెడుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌ను విజ‌య‌సాయిరెడ్డికి రాసిచ్చేశారు. ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్తే.. కేసులు, అరెస్టుల‌తో నిర్బంధిస్తున్నారు. గుప్పెడు మ‌నుషుల‌ను సెలెక్ట్ చేసుకొని.. స‌ర్వం వారికే క‌ట్ట‌బెడుతున్నారు. అందుకే, అధికారులు సైతం ఎవ‌రినీ లెక్క చేయ‌కుండా ఆ కొంద‌రు చెప్పిన‌ట్టే న‌డుచుకుంటున్నారు. ఉత్త‌రాంధ్ర రీజియ‌న్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. విజ‌య‌సాయి చెబితేనే  ఏ ప‌నైనా చేస్తున్నార‌ట‌. ఇక సీమ‌లో మంత్రి పెద్దారెడ్డిదే రాజ్యం. అందుకే దిగువ స్థాయి వైసీపీ నాయ‌కులూ జ‌గ‌న‌న్న పాల‌న‌కు బ‌లిప‌శువులు అవుతున్నారు. అధికార పార్టీ అనే పేరే కానీ.. అధికారులు సైతం త‌మ మాట వినక‌పోయేస‌రికి ప‌రువు పోయి అన్నీమూసుకొని ప‌డుంటున్నార‌ని అంటున్నారు.  తాజాగా, గుంటూరు కార్పొరేష‌న్ అధికారుల తీరుపై వైసీపీ కార్పొరేటర్ ఆచారి నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆక్రమణల పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొందరినే టార్గెట్ చేస్తూ పని చేస్తున్నారని మండిప‌డ్డారు. అధికారుల తీరుతో పలువురు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ప్ర‌త్య‌ర్థులే టార్గెట్‌గా కూల్చివేత‌ల హంగామా ఇన్నాళ్లూ విశాఖ‌లోనే చూశాం. ఎంపీ విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో జీవీఎమ్‌సీ అధికారులు టీడీపీ నేత‌ల ఆస్తుల‌ను అర్థ‌రాత్రి కూల్చేసిన ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇప్పుడా క‌ల్చ‌ర్ గుంటూరుకు సైతం పాకిన‌ట్టుంది. ప్ర‌తిప‌క్షాల‌నే కాదు స్వ‌ప‌క్షం ప్ర‌త్య‌ర్థుల‌నూ టార్గెట్ చేస్తూ అధికారుల అండ‌తో కూల్చివేత‌ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డం ఆస‌క్తిక‌రం. 

వాలంటీర్లా.. బానిసలా? జగనన్న గొప్పలు చెప్పుకునేది ఇందుకేనా?

ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ  వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాలంటరీ వ్యవస్థతో బాపూజీ కలలను సాకారం చేశామంటూ  కోట్లాది రూపాయలు కుమ్మరించి దేశమంతా ప్రచారం చేసుకున్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధి.. స‌మాజ సేవ‌కులుగా ప‌నిచేయాల‌న్న మ‌హోన్న‌త లక్ష్యంతో వ‌లంటీర్ వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. అంతేకాదు త‌మ వేత‌నాల‌ను పెంచాల‌న్న వాలంటీర్ల డిమాండ్ తో వారంద‌రికీ లేఖ‌లు రాసిన జ‌గ‌న్‌.. వారి సేవ‌ల‌ను ఆకాశానికెత్తారు. వారిది కేవ‌లం సేవేన‌ని, వారికి ఇచ్చేది గౌర‌వ వేత‌నమేన‌ని ప్ర‌క‌టించి వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఉన్న‌తిని మ‌రింత‌గా పెంచారు.  సీఎం జగన్ తీరు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో అసలు సంగతి మరోలా ఉంది. ఏపీలో వాలంటీర్లపై అధికార పార్టీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు.  తమకు సెల్యూట్ కొట్టలేదని కొందరు, తాము చెప్పినట్లు చేయడం లేదని మరికొందరు వాలంటీర్లపై ప్రతాపం చూపిస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఊస్టింగ్ అంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాల‌కు వేగ‌లేక చాలా మంది  వాలంటీర్లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. ఇది భరించలేక కొందరు ఉద్యోగం మానేశారు కూడా. కర్నూల్ జిల్లాలో ఓ వాలంటీర్ లేఖ రాసి మరీ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ప్రజా ప్రతినిధులను చూస్తూ తాము ఏం తక్కువ అనుకున్నారో ఏమో ఉన్నతాధికారులు కూడా వాలంటీర్లపై ఓ రేంజిలో విరుచుకుప‌డుతున్నారు.  ఇటీవలే  అనంత‌పురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే వాలంటీర్ల అవినీతిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తే.. తాజాగా గుంటూరు జిల్లాలో మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ లేడీ వాలంటీర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట మునిసిపాలిటీలో వార్డు వాలంటీర్ గా ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌పై అక్క‌డి మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ రామ‌చంద్రారెడ్డి చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అంతేకాకుండా మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఐదు నిమిషాలు లోప‌లేసి ఉతికిస్తానంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్యలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌ర‌స‌రావుపేట‌లోని నిమ్మ‌తోట ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం మ‌హిళ వాలంటీర్ గా ప‌నిచేస్తోంది. విధి నిర్వ‌హ‌ణ‌లో మంచి ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్న తొలి న‌లుగురు వ‌లంటీర్ల‌లోనూ ఆమె స్థానం సంపాదించింది. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కార‌ణంగా ఆమె ఇటీవ‌ల కొన్ని రోజుల పాటు సెల‌వు పెట్టిందట‌. ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ.. వార్డు స‌చివాలయంలోని అడ్మిన్ ఆమెపై ప‌గ‌బ‌ట్టేశారు. విధులు స‌రిగా నిర్వ‌ర్తించ‌డం లేద‌ని నిత్యం నిందిస్తూనే ఉన్నాడు. అయినా ఆ వేధింపుల‌ను భ‌రిస్తూనే ప‌నిచేస్తున్న ఆమెకు.. ఓ మ‌ధ్యాహ్నం క‌మిష‌న‌ర్ రామ‌చంద్రారెడ్డి నుంచి ఫోన్ వ‌చ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంట‌నే క‌మిష‌న‌ర్ ఆమెను బెదిరింపుల‌పై బెదిరింపుల‌కు దిగుతూ ఎక్క‌డున్నావ్‌? ఏం చేస్తున్నావ్‌? ప‌నిచేస్తున్నావా?.. ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మ‌ధ్యాహ్నం స‌మ‌యం క‌దా.. ఇంటిలో ఉన్న త‌న పిల్ల‌ల‌కు భోజ‌నం పెడ‌దామ‌ని ఇంటికొచ్చాను సార్ అంటూ ఆమె స‌మాధానం చెప్పినా.. ఆయ‌న‌గారు శాంతించ‌లేదు. ఉన్న‌ప‌ళంగా వార్డులోకి రావాలంటూ హుకుం జారీ చేశారు. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వార్డులోకి వెళ్లిన ఆమెకు క‌మిష‌న‌ర్ క‌నిపించ‌లేదు. సార్ వార్డులోకి వ‌చ్చాను అంటూ ఆమె కాల్ చేస్తే.. క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి రావాలంటూ చెప్పారు. ఆమె ప‌రుగు ప‌రుగున కార్యాల‌యానికి వెళ్ల‌గా.. అక్క‌డా క‌మిష‌న‌ర్ లేర‌ట‌. ఆమె అక్క‌డికి చేరుకున్న అర‌గంట‌కు అక్క‌డికి వ‌చ్చిన క‌మిష‌న‌క‌ర్‌.. ఆమెపై త‌న‌దైన దురహంకారంతో విరుచుకుప‌డ్డారు. ఎక్క‌డున్నావ్‌? ఇలా చేస్తే 5 నిమిషాల్లో లోప‌లేయించి ఉతికిస్తా.. అంటూ చిందులు తొక్కారు. తానేం చేశానంటూ ఆ లేడీ వ‌లంటీర్ వివ‌ర‌ణ ఇచ్చే యత్నం చేయ‌గా.. ముఖానికి ఉన్న మాస్కును విసురుగా తీస్తూ ఆమెపైకి దాడికి వ‌చ్చేలా ఉరుమిఉరిమి చూసి గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తూ.. ఇక్క‌డ అవ‌స‌రం లేదు అంటూ వెళ్లిపోయారు. ఈ మొత్తం దృశ్యాల‌ను ఆమె ప‌క్కనే ఉన్న ఓ వ్య‌క్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి  సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. బాధితురాలు కూడా త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏక‌రువు పెడుతూ మ‌రో వీడియోను విడుద‌ల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి. వాలంటీర్లపై అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటున్నది ఇందుకేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాలంటీర్లను బానిసలుగా చూడటమే గొప్పతనమా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వారిది కేవ‌లం సేవేన‌ని, వారికి ఇచ్చేది గౌర‌వ వేత‌నమేన‌ని ప్రకటించిన ముఖ్యమంత్రి.. వాళ్లను వేధిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఎంందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు.

సురేఖ సై అంటే రేవంత్ స్కెచ్ పారినట్టే.. గులాబీ బాస్ కు గుబులే? 

పీసీసీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి... హుజూరాబాద్ లో సైతం దిమ్మతిరిగిపోయే భారీ స్కెచ్ కు రూపకల్పన చేశారు. కులాల ఈక్వేషన్లతో గెలుపును ఖాయం చేసుకునే సులభమైన మార్గంలో పయనిస్తున్న కేసీఆర్ కు.. రేవంత్ కూడా అదే దారిలో పయనించి బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. ఫలితంగా... ఇప్పటివరకూ ఈటల గెలుపు ఖాయం అన్న అభిప్రాయాలు స్థానికంగా చెలామణిలో ఉండగా... కొండా సురేఖ రూపంలో రేవంత్ వేసే ఎత్తుతో టీఆర్ఎస్ కు మరింత భారీ గండి పడటం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఒప్పిస్తే రెండు బలమైన బీసీ సామాజికవర్గాల ఓట్లు కచ్చితంగా వన్ సైడ్ అవుతాయన్న అంచనాలున్నాయి. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి సామాజికవర్గం కాగా... ఆమె భ‌ర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజికర్గానికి చెందిన నాయకుడు. ఇవి రెండూ కూడా బీసీల్లో బలమైనవే కావడం గమనించాల్సిన అంశం. ఈ రెండు సామాజికవ‌ర్గాలకు కలిపి హుజూరాబాద్ లో యాబై వేల‌ పైచిలుకు ఓట‌ర్లు ఉండ‌టంతో ఆ రెండు వర్గాల ప్రజలనూ ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని రేవంత్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. స‌హ‌జంగా కాంగ్రెస్ పార్టీకి ఉండే దూకుడు, కొండా దంపతుల‌కు ఉండే ఆర్ధిక వ‌నరులు, టీఆర్ఎస్ నుంచి కొండా దంప‌తులు అవ‌మాన భారంతో బ‌య‌టికి వ‌చ్చారనే సెంటిమెంట్... ఇలా అనేకమైన కీలకాంశాలు కాంగ్రెస్ గెలుపుకు తప్పకుండా దోహదడతాయని రేవంత్ భావిస్తున్నారు.  అటు కేసీఆర్... దాదాపు 45 వేల ఎస్సీ ఓట్లను టార్గెట్ చేసి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు కలిపి మొత్తం 1500 కోట్లు విడుదల కూడా చేశారు. పలువురు లబ్ధిదారులను గుర్తించి వారికి చెక్కులు పంపిణీ చేశారు. దీంతో ఎస్సీల ఓట్లు కచ్చితంగా పడతాయని, గెలుపుకు మినిమమ్ గ్యారెంటీ ఎస్సీల ఓట్లేనని కేసీఆర్ అండ్ కో ధీమాగా ఉంది. అయితే రేవంత్ వేసే స్కెచ్ కు కొండా ఒప్పుకుంటే పద్మశాలి, మున్నూరుకాపు ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశాలుంటాయని ఆశిస్తున్నారు. దళితబంధుకు సమాంతరంగా బీసీ బంధు, ప్రజాబంధు, వివిధ కులాలవారీగా బంధు పథకాలకోసం డిమాండ్ ఊపందుకుంటున్న తరుణంలో రేవంత్ వ్యూహం కచ్చితంగా ఎంతోకొంత వర్కవుట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   కౌశిక్ రెడ్డి నమ్మించి కాంగ్రెస్ ను నట్టేట ముంచే ప్రయత్నం చేశాడు కాబట్టి... ఆయన్ని జాయిన్ చేసుకున్న కేసీఆర్ కు అంతకుమించిన నష్టం చేసి చూపించాలని రేవంత్ కసిగా ఉన్నారు. అందుకే ఫైర్ బ్రాండ్ గా పేరున్న సురేఖతో పోటీ కోసం మంతనాలు సాగిస్తున్నారని, ఆమె కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నా కూడా... కేసీఆర్ కు తగిన గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతో పోటీకి మొగ్గు చూపే అవకాశం ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొండా మురళి దంపతులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే రాజకీయంగా ఎంతో బలంగా ఎదిగారు. సురేఖ గతంలో శాయంపేట, ప‌ర‌కాల నియోజకవర్గం నుంచి, వ‌రంగ‌ల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా హుజూరాబాద్ తో క‌లిసే ఉండడం విశేషం. 2008లో హ‌న్మ‌కొండ పార్ల‌మెంట్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన అనుభ‌వం కొండా సురేఖ‌కు ఉంది. అప్పుడు క‌మ‌లాపూర్ అసెంబ్లీ హ‌న్మ‌కొండ పార్లమెంట్ ప‌రిధిలోనే ఉండేది. ఇక పాత వ‌రంగ‌ల్ లోనూ చుట్టు ప‌క్క‌ల కూడా కొండా దంప‌తుల‌కు సొంతంగా అభిమానులు, బలమైన క్యాడ‌ర్ కూడా ఉంది.  అయితే ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌డం ద్వారా ఇటు ప‌ర‌కాల‌, అటు వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని కొండా దంప‌తులు ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. 2014లో వ‌రంగ‌ల్ లో పోటీ చేసి గెలిచినా కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల క్యాడ‌ర్ పూర్తిగా చెల్లాచెదుర‌ై మ‌ళ్లీ కొండా ప‌ర‌కాల రాదనే ప్ర‌చారం వ‌ల్ల ప‌ట్టు కోల్పాయ‌మని కొండా దంపతులు భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ కోసం హుజూరాబాద్ లో పోటీ చేస్తే ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ నియోజ‌వ‌ర్గాల్లో కూడా త‌మ క్యాడ‌ర్ ను కోల్పోవాల్సి వస్తుందేమో అనే ఆలోచ‌న‌ కూడా చేస్తున్నట్టు సమాచారం. కానీ హుజూరాబాద్ లో పోటీ చేస్తే ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పు, హుజూరాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ల‌తో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌డానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్న‌ట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇంత‌క‌న్నా బంప‌ర్ ఆఫ‌ర్ కాంగ్రెస్ నుంచి ఇంకేముంటుంద‌ని రేవంత్ చెప్ప‌డంతో హుజూరాబాద్ లో పోటీ చేసే విష‌యంపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారు పోటీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. రెడ్ సిగ్నల్ వేస్తారా అన్నది తేలాలంటే ఇంకాస్త టైమ్ పడుతుందంటున్నారు.  ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర‌లు, స‌భ‌ల ద్వారా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతుండటం, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ను అభ్య‌ర్ధిగా నిర్ణ‌యించి ప్ర‌చారం చేస్తుండంతో వెంట‌నే కాంగ్రెస్ కూడా అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించాల్సిన అవసరం ఏర్ప‌డింది. మ‌రి రేవంత్ కొండా దంపతుల్ని ఒప్పిస్తారా... సురేఖ ధైర్యం చేస్తారా అనేది చూడాలి.

అటు మల్లారెడ్డి.. ఇటు మోత్కుపల్లి! రేవంత్ పైకి పాత మిత్రులను ఉసిగొల్పుతున్నారా? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ గా టీఆర్ఎస్ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. గతంలో తమపై రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసినా గులాబీ లీడర్లు స్పందించేవారు కాదు. కాని తాజాగా సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా వరుసగా టీఆర్ఎస్ నేతలు బయటికి వస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అనేలా ఇద్దరు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మరోసారి  రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు  మంత్రి మల్లారెడ్డి. తాను ఎంపీగా ఉన్నప్పటినుంచి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు.  తెలుగు దేశం పార్టీ మల్కాజ్‌గిరి సీటు రేవంత్‌కు కాకుండా తనకు ఇచ్చినందుకు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్నారని చెప్పారు. అప్పటి నుంచి  రేవంత్‌ రెడ్డి తనను ఇబ్బంది పెడుతూనే ఉన్నారని మల్లారెడ్డి ఆరోపించారు.   తనపై రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపైనా స్పందించారు మల్లారెడ్డి. 2012లో మెడికల్ కాలేజీని ప్రారంభించినట్లు చెప్పారు. బాలికల కోసం ప్రత్యేకంగా మహిళా కళాశాలను స్థాపించినట్లుతెలిపారు. తన కాలేజీ హాస్టల్స్ లో దాదాపు 7వేల మంది విద్యార్థినులు ఉంటున్నారన్నారు మల్లారెడ్డి. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దొంగ పత్రాలు చూపెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులుకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. పార్లమెంటులో కూడా మల్లారెడ్డి విద్యా సంస్థల గురించి రేవంత్ రెడ్డి ప్రశ్నలు వేశారని.. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పిందని మల్లారెడ్డి చెప్పారు.  మరోవైపు రేవంత్ రెడ్డికి పోటీగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఒక రోజు దీక్షను చేపట్టబోతున్నారు నర్సింహులు. కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీలో ఉన్న మోత్కుపల్లి ఇటీవలే ఆ పార్టీకి రిజైన్ చేశారు. కేసీఆర్ కొత్తగా తీసుకువచ్చిన దళిత బంధును స్వాగతిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ను పొగుడుతున్నారు. దీంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టార్గెట్ గా నర్సింహులు దీక్షకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా రేవంత్ తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మోత్కుపల్లి అన్నారు. దళితుల సాధికారత కోసం సభలు, సమావేశాలను నిర్వహించడం, గిరిజన ఆత్మగౌరవ దీక్షలను నిర్వహించడం వంటివి చేస్తుండటం తనకు విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు.  పుట్టుకతోనే దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి.. ఆయన స్వగ్రామంలో దళితుల మధ్య భోజనాలు, నిద్రలు చేయగలరా? అని మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ చెప్పగలరా? అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం చాలా గొప్పదని... అలాంటి పథకానికి తూట్లు పొడిచేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మోత్కుపల్లి విమర్శించారు. దళితులను ముందు వరుసలో నిలుచోబెట్టి రాజకీయాలు చేయడం, దళితుల మీద ప్రేమను ఒలకబోస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. రేవంత్ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రోజున బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్షను చేపట్టనున్నానని చెప్పారు. ఉదయం లిబర్టీ చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాకు నివాళి అర్పించి, ఆ తర్వాత ఇంటికి వెళ్లి దీక్షలో కూర్చుంటానని తెలిపారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు అందరూ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన వారే. అందుకే తమకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిపైకి పాత టీడీపీ నేతలను సీఎం కేసీఆర్ ఉసిగొల్పుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. 

చిక్కులో ఏపీ హోంమంత్రి! పదవి ఊస్టింగేనా? 

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత చిక్కుల్లో పడ్డారు. షెడ్యూల్డ్‌ కులాల హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆమెపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లో విచారణ జరపాలని గుంటూరు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ను ఆదేశించింది. జాతీయ కమిషన్ ఆదేశాలతో జరుగుతున్న విచారణలో సుచరితకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఆమె పదవికి ఎసరు వచ్చినట్లే. గతంలో ఇలాంటి కేసుల్లో చాలా మంది తమ పదవులు కోల్పోయారు. అందుకే హోంమంత్రి మేకతోటి సుచరితపై విచారణకు ఆదేశించడంతో వైసీపీలో కలవరం మొదలైందని చెబుతున్నారు.  కేసు  వివరాల్లోకి వెళితే ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మేకతోటి సుచరిత.. తాను జీసస్ ను ప్రార్ధిస్తానని చెప్పారు. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ జాతీయ ఎస్సీ కమీషన్ కు ఫిర్యాదుచేసింది. సుచరిత మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను జతచేసి జూన్‌లో ఫిర్యాదు చేసింది. సుచరిత ఎస్సీ కాదని ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నట్లు ఫోరం ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదుపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్.. మేకతోటి సుచరితపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతం వాళ్ళు క్రిష్టియానిటి లోకి మారినా వెంటనే వాళ్ళు బీసీ క్యాటరిగిలోకి మారిపోతారు. రిజర్వుడు క్యాటగిరిలోని వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటే అప్పటివరకు ఉన్న తమ మతాన్ని వదులుకోవాల్సిందే. క్రిస్తియానిటిలోకి మారిన తర్వాత కూడా అంతకుముందున్న రిజర్వేషన్ ఫలాలను  ఇంకా అందుకుంటుంటే అది తప్పవుతుంది. ఈ విషయంలోనే సుచరితపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. మాజీ కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై సివిల్‌ సర్వీసెస్‌ కమిషన్‌కు ఈ సంస్థ ఫిర్యాదు చేసింది. మరోవైపు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులధ్రువీకరణ విషయంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.  గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి వివాదమే జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డులో పాయకరావుపేట ఎస్సీ ఎంఎల్ఏ  వంగలపూడి అనితను చంద్రబాబునాయుడు మెంబర్ గా నియమించారు. ఆమె నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆమె క్రిస్తియన్ అనే ఆరోపణలు అప్పటికే ఉన్నాయి. తాను ఎప్పుడూ జీసస్ నే ప్రారధిస్తుంటానని A ఇంటర్వ్యూల్లో అనిత చెప్పున్నారు. చెప్పటమే కాదు తన బ్యాగులో నుండి బైబిల్ ను తీసి ఇంటర్వ్యూలో చూపించారు.  ఆ విడియోను వైరల్ చేశారు. జీసస్ ను ప్రార్థించే వ్యక్తిని టీటీడీ ట్రస్టు బోర్డులో చంద్రబాబు మెంబర్ గా ఎలా నియమిస్తారని హిందూ సంఘాలు ప్రశ్నించాయి. దీంతో వంగలపూడి అనిత టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా తప్పించారు అప్పటి సీఎం చంద్రబాబు.  అనిత విషయంలో గోల చేసిన హిందూ సంఘాలు మేకతోటి సుచరిత విషయంలోనూ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. జాతీయ ఎస్సీ కమిషన్ కు ఆధారాలు సమర్పించబోతున్నాయి. దీంతోహోంమంత్రి మేకతోటి సుచరిత పదవికి గండం వచ్చిందనే చర్చ జరుగుతోంది.  

ప్రజా సంగ్రామ యాత్ర షురూ.. కేసీఆర్‌పై సంగ్రామానికి బండి సంజయ్ అడుగులు..

తెలంగాణ‌లో రాజ‌కీయ మార్పున‌కు ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో శ్రీకారం. ప్ర‌జ‌ల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర. ఎంఐఎం ఆగ‌డాల‌ను బ‌రించ‌లేక పాతబస్తీని వదిలి వెళ్లిన హిందువులంతా తిరిగి రావాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ పిలుపునిచ్చారు. చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి సాక్షిగా ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు బండి సంజ‌య్‌. ఈ సందర్భంగా చార్మినార్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు.  ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోంది. సీఎం కేసీఆర్‌ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను మోసగించారు. ఏడెనిమిది ఏళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదు. ఒక్కో నిరుద్యోగికి లక్ష చొప్పున కేసీఆర్‌ ప్రభుత్వం బాకీ ఉంది. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణంగా మార్చారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీని సీఎం కేసీఆర్‌ అటకెక్కించారు. ‘దళిత బంధు’ పేరుతో దళితులను.. గొర్రెలు, బర్రెలంటూ బీసీలను వంచిస్తున్నారు’’ అని బండి సంజయ్ మండిప‌డ్డారు. ఎస్టీలకు 12 శాతం రిజిస్ట్రేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.  ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో పాల్గొన్న కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి సైతం కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘తెలంగాణలో నిజాంలాంటి పాలన అంతం కావాలి. అక్రమాలు, అవినీతి, అప్పుల పాలన పోవాలి. కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాలి. టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే ఉద్యమం ఈ ప్రజా సంగ్రామ యాత్ర. కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలపై పాలన సాగిస్తోంది. అవినీతి పాలనపోయి.. నీతివంతమైన పాలన రావాలంటే కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోంది’’ అని కిషన్‌ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కలిగించాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ చుగ్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారని విమర్శించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్రతో పెనుమార్పులు సంభవించబోతున్నాయని కె.లక్ష్మణ్‌ అన్నారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. కారు, కాంగ్రెస్‌ రెండూ ఒకటేనని ల‌క్ష్మ‌న్ ఆరోపించారు.     

బండి సంజ‌య్ స‌భ‌తో ఉద్రిక్త‌త‌.. బీజేపీ వ‌ర్సెస్ పోలీస్‌..

చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం నుంచి ప్ర‌జా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. అమ్మ‌వారికి పూజ‌లు చేసి, ఆశీర్వాదం తీసుకొని పాద‌యాత్ర ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌. యాత్ర ఆరంభం సంద‌ర్భంగా చార్మినార్ ద‌గ్గ‌ర నిర్వ‌హించిన స‌భ‌లో ఉద్రిక్త‌త త‌లెత్తింది. చార్మినార్ ద‌గ్గ‌ర హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. బీజేపీ సభను చిత్రీకరిస్తోన్న డ్రోన్ కెమెరాను పోలీసులు అడ్డుకున్నారు. డ్రోన్ కెమెరాల‌కు ప‌ర్మిష‌న్ లేదంటూ అడ్డుకోవ‌డంతో వివాదం త‌లెత్తింది. డ్రోన్ కెమెరాను తీసుకెళుతున్న‌ పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కేడ‌ర్‌, పోలీసుల మ‌ధ్య తీవ్ర‌ వాగ్వాదం చోటు చేసుకుంది.  ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జ‌రగ‌డంతో.. బండి సంజయ్ పోలీసుల‌కు ప‌లుమార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఉప‌యోగం లేకుండా పోయింది. పోలీసులు డ్రోన్ కెమెరాను స్టేష‌న్‌కు త‌ర‌లించడంతో బీజేపీ నాయ‌కులు ఖాకీల‌తో మంత‌నాలు ప్రారంభించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో బీజేపీ నేత మంత్రి శ్రీనివాసులు మాట్లాడారు. చార్మినార్ పీఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీగా గుమికూడ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది.   

హిట్ల‌ర్, ఇందిర బాట‌లో జ‌గ‌న్‌..! నియంతల‌కు మించి ఉక్కుపాదం!

ఆంధ్ర ప్రదేశ్’లో పత్రికా స్వేచ్చ ఉన్నట్లే ఉంటుంది కానీ, ఉండదు. అదొక ఎండమావి.  ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పత్రికా స్వేచ్చ అన్న మాట వినడం కూడా ఇష్టం ఉండదో ఏమో, ఆయన ఏకంగా  మీడియాపై యుద్దమే ప్రకటించారు. యుద్దానికి సిద్దం కండని అధికారాలకు పిలుపు నిచ్చారు. జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్కటై పత్రికల మీద యుద్ధం చేయాలని కల్లెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. “ మీరు యుద్దం చేయవలసింది రాజకీయ పార్టీలు , నాయకు మీద కాదు, పత్రికల మీద, కత్తులు తీయండి” అంటూ పిలుపు నిచ్చారు. ముఖ్యంగా జిల్లా కల్లెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా మీడియాపై యుద్దానికి సిద్ధంకావాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పిలుపు నిచ్చారు.  ఆలస్యంగా వెలుగు చూసిన కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్’లో ఆయన ప్రసంగం వీడియో వింటే, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు పత్రికలు, మీడియా అది కూడా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కారణమనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారనిపిస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏ విధంగా అయితే, అయిన దానికి కాని దానికి, ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశారో, ఆయన అడుగు జాడల్లో, అదే అరాచక మార్గంలో నడుస్తున్న అయన కుమారుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా అవే పలుకులు పలుకుతున్నారు. అయితే, వైఎస్ ఎప్పుడు ఇలా బొమికలు మెడలో వేసుకోలేదు. మీడియా మీద యుద్దానికి అధికారులను ఉసిగొల్పలేదు. అయితే, జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే, ఆయన తండ్రిని మించి పోయారు అనిపిస్తుంది. నియంతలకే నియంత స్థాయికి ఎదిగారా, అన్న అనుమానం కూడా కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.   కల్లెక్టర్ల కాన్ఫరెన్స్’లో ఆయన చేసిన ప్రసంగంలో, రాష్ట్రంలో పెరిగిపోతున్ననేరాలు ఘోరాలు, ముఖ్యంగా  మహిళలు, కాలేజీ అమ్మాయిలు, వృద్దులు ఒకరని కాదు, పసి కందుల మొదలు పండు ముసలి వారి వరకు అందరిపైనా సాగుతున్న లైంగిక నేరాలు, అరాచకాలు, అకృత్యాల గురింఛి మాట్లాడారు. అయితే అవన్నీ, ‘దురదృష్టకర’ సంఘటనలు అన్న చిన్నా మాటతో తేల్చేసారు. ఒక విధంగా ఎలాంటి ఘటనల పట్ల ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎలాంటి చింతా లేదన్నట్లుగా మాట్లాడారు. బహుశా ముఖ్యమంత్రి దృష్టిలో ఇవేవీ నేరాలు కాదో ఏమో, అందుకే ఆయన నేరాలాను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం. అమ్మాయిలతో నడి రోడ్డు మీద అసభ్యంగా ప్రవర్తించడం ఈవ్ టీజింగ్, నేరం కాదనే చక్కని సందేశాన్ని కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. మరో వంక నేరస్తులను వదిలేసి, జరుగుతున్న వాస్తవాలను జనంలోకి తీసుకుపోతున్న మీడియాపై మండిపడుతున్నారు.  కల్లెక్టర్ల కాన్ఫరెన్స్’లో ముఖ్యమంత్రి, “రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎంతగా అప్రమత్తంగా ఉన్నా, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి, అధికార, పోలీసు యంత్రాంగం మంచిగా స్పందిస్తోంది, అయినా స్వార్ధపర శక్తులు వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాయి. బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆడపిల్లల కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక ఈవ్ టీజింగ్ లాంటి కేసులో, పోలీసు కానిస్టేబుల్’ను సస్పెండ్ చేసినా, సోషల్ మీడియా, పత్రికలు, టీవీలలో ఆ కుటుంబ గౌరవాన్ని బజారున పడేసే విధంగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి, మనం ముఖ్యంగా కల్లెక్టర్లు, ఎస్పీలు జిల్లాలో జరుగతున్న సంఘటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవల్సినవసరం వుంది” అంటూ చక్కటి సందేశం ఇచ్చారు. అయినా, అందులో అపశ్రుతులు, అసత్యాలు ఉన్నా, అధికారులను అప్రమత్తం చేయడం వరకు కొంత బాగుందని అనుకావచ్చును. ఆ తర్వాత అయన నోటి నుంచి జాలువారిన అక్షర ముత్యాలు  నియంత నిజరూపాన్ని చూపించింది. హిట్లరు నుంచి ఇందిరా గాంధీ వరకు నియంతలు ఎవరికీ  పత్రికా స్వేచ్చ అంటే అసలు రుచించదు. ఇప్పడు ఆ జాబితాలో జగన్ రెడ్డి కూడా చేరారు.   పత్రికా స్వేచ్చ పట్ల  ఆయనకు అంతటి వ్యతిరేకత ఎందుకో ఏమో కానీ, ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా కల్లెక్టర్లు, ఎస్పీలు మీడియా మీద యుద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. “మీరు యుద్ధం చేయవలసింది, రాజకీయ పార్టీలు, నాయకుల మీద కాదు, తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేందుకు అన్నిటికీ తెగించిన మీడియాలోని  ఒక వర్గం మీద, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 మీద యుద్దం చేయండి” అని పిలుపు  నిచ్చారు.  అయితే, జగన్ రెడ్డి గమనించవలసిన విషయం ఏమంటే, పత్రికా స్వేచ్ఛను చంపే ప్రయత్నం చేసిన, మహా నాయకులు, మహా నియంతలే మట్టి కరిచి పోయారు. పత్రికా స్వేచ్ఛను హతమార్చడం ఎవరికీ అయ్యే పనికాదని చరిత్ర చెపుతోంది. అందుకు జగన్ రెడ్డి మినహాయింపు కాదు. నిజానికి, జగన్ రెడ్డి పాలనలో  వైట్ కాలర్ (ఆర్థిక)  నేరాలు మొదలు, మర్డర్లు, మాన భంగాల వరకు అన్నీ రకాల నేరాలు పెరిగి పోయాయి. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ మర్దరై పోయారు. ఏళ్ళు గడుస్తున్నాయి కానీ, హంతకులు ఎవరో తేలడం లేదు. సో.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం యుద్ధం చేయవలసింది, మీడియా మీద కాదు, అధికార పార్టీ అండ చూసుకుని చెలరేగిపోతున్న నేరస్థుల మీద..అంటున్నారు సామాన్యులు. వింటున్నారా ..  

అఫ్గ‌న్‌పై అమెరికా డ్రోన్ అటాక్‌.. ప్ర‌తీకార దాడిలో ఐసిస్ కీల‌క నేత హ‌తం!

సూసైడ్ అటాక్‌తో 13 మంది అమెరికా సైనికుల‌ను చంపేశారు ముష్క‌ర మూక‌లు. అఫ్గ‌న్‌లో అగ్ర‌రాజ్యానికి గ‌ట్టి స‌వాల్ విసిరారు ఐసిస్ ఉగ్ర‌వాదులు. తాలిబ‌న్ల ముసుగులో అమెరికాపై ఈ విధంగా ప్ర‌తీకారం తీర్చుకున్నారు. త‌మ సైనికుల‌ను కోల్పోయిన అమెరికా.. దెబ్బ తిన్న పులిలా తిరిగి అటాక్ చేసింది. ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని అధ్య‌క్షుడు బైడెన్ హెచ్చ‌రించిన కొన్ని గంట‌ల్లోనే ఐసిస్ టార్గెట్‌గా అఫ్గ‌నిస్తాన్‌లో డ్రోన్ దాడులు జ‌రిపింది. ఈ అటాక్‌తో ఐసిస్‌కు చెందిన కీల‌క నాయ‌కుడిని హ‌త‌మార్చిన‌ట్టు తెలుస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర జ‌రిగిన బాంబుదాడి సూత్ర‌ధారి అత‌నేన‌ని తెలుస్తోంది. ప‌క్కా నిఘా, శాటిలైట్ స‌మాచారం మేర‌కు.. ఆ పెద్ద త‌ల‌కాయ‌పై నేరుగా డ్రోన్ అటాక్ చేసింది అమెరికా.  మ‌రోవైపు, అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా పౌరులు సహా ఇతరుల తరలింపు కార్యక్రమం తుది దశకు చేరుకుంది. అయితే, మ‌రిన్ని ఉగ్రదాడులు జ‌రిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ డ్రోన్ దాడులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంట‌నే అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ కూడా ఆమోదించడంతో వేగంగా యాక్ష‌న్‌లోకి దిగాయి అమెరికా బ‌ల‌గాలు.   గురువారం కాబుల్‌ విమానాశ్రయం బ‌య‌ట‌ జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 200 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసన్‌ ప్రకటించింది. పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వెంటాడి, వేటాడుతామంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు. పేలుళ్లకు తెగబడిన ఐసిస్ మూక‌ల‌పై దాడులు చేయాల్సిందిగా ఆదేశించారు. బైడెన్ ఆదేశించిన 24 గంట‌ల్లోనే అమెరికా డ్రోన్ అటాక్‌తో ఐసిస్ కీల‌క నేత‌ను హ‌త‌మార్చ‌డం యూఎస్ ఆర్మీ స‌త్తాకు నిద‌ర్శ‌నం.   

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు 14 రోజుల‌ రిమాండ్‌.. చంచ‌ల‌గూడ జైలుకు త‌ర‌లింపు..

అర్థ‌రాత్రి అరెస్ట్ అయిన తీన్మార్ మ‌ల్ల‌న్నను కోర్టులో హాజ‌రుప‌రిచారు పోలీసులు. మ‌ల్ల‌న్న‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది ఉమేశ్ చంద్ర‌ అభ్యంతరం తెలిపారు. పిర్యాదుదారుడు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ విష‌యం పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. చిలకలగూడా పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరారు. ప్ర‌స్తుతం మ‌ల్ల‌న్న‌ను చంచల్ గూడ జైల్‌కి తరలించారు. డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాన‌ని త‌న‌ను బెదిరించాడంటూ కొద్దిరోజుల క్రితం ఓ వ్య‌క్తి చిల‌క‌ల‌గూడ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైట్‌పై గ‌తంలోనే కేసు న‌మోదు చేయ‌గా.. ప‌లుమార్లు స్టేష‌న్‌కి పిలిపించి విచారించారు. తాజాగా ఆయ‌నకు చెందిన క్యూ న్యూస్ కార్యాల‌యంతో పాట మ‌ల్ల‌న్న‌ ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వ‌హించారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి మ‌ల‌న్న‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.  తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌పై సైబ‌ర్‌క్రైమ్ స్టేష‌న్‌లో రెండు కేసులు, చిక్క‌డ‌ప‌ల్లి, జూబ్లీహిల్స్ పీఎస్‌ల‌లో ఒక్కో కేసు న‌మోదై ఉంది. ప‌లు కేసుల్లో ప‌దే ప‌దే  ఆయ‌న్ను పోలీస్ స్టేష‌న్ల‌కు పిలిపిస్తూ విచారించ‌డంపై ఆయ‌న ఇటీవ‌ల హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. త‌న‌ను పోలీసులు విచార‌ణ పేరుతో వేధిస్తున్నారంటూ జాతీయ బీసీ క‌మిష‌న్‌కు కూడా కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉండ‌గా.. శుక్ర‌వారం అర్థ‌రాత్రి పోలీసులు ఆయ‌న్ను స‌డెన్‌గా అరెస్ట్ చేసి శ‌నివారం కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.   

జ‌గ‌న్ స‌ర్కారుపై పెట్రోల్ బాంబ్.. మ‌హాధ‌ర్నాతో ప్ర‌జాగ్ర‌హం..

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీనేన‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. వైసీపీ ప్ర‌భుత్వం వెంట‌నే లీట‌ర్‌కు 30 రూపాయ‌లు ధ‌ర త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. విజయవాడ ధర్నా చౌక్ ద‌గ్గ‌ర‌ మహాధర్నా నిర్వహించారు. వైసీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త వ‌ల్లే పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ దాటింద‌ని బొండా ఉమ, గద్దె రామ్మోహన్ త‌దిత‌రులు విమ‌ర్శించారు. జ‌గ‌న్ స‌ర్కారు పన్నులు, రోడ్డు సెస్సులు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు పెట్రోల్‌ పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ర్యాలీకి పిలుపిచ్చిన బీటెక్‌ రవిని పోలీసులు ఇంటి ద‌గ్గ‌రే అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ బైక్‌ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి నిరాకరించారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు త‌దిత‌రులు కోటబొమ్మాళి రైతు బజార్‌ వరకు కాలి నడకన ర్యాలీ నిర్వ‌హించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో క్లాక్‌ టవర్ ద‌గ్గ‌ర టీడీపీ నాయకులు ధర్నా చేశారు. నరసరావుపేటలో ప్ర‌తిప‌క్ష‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నరసరావు పేట రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ముందు ముందు పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్ట‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది.   

యూపీ సీఎం యోగిపై పోటీ చేస్తాన‌న్న మాజీ ఐపీఎస్ అరెస్ట్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి  యోగి ఆదిత్య‌నాథ్‌పై పోటీ చేస్తాన‌ని మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ అమితాబ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. అత్యాచార బాధితురాలికి వ్యతిరేకంగా నిందితుడికి సాయం చేశారన్న ఆరోపణలపై అమితాబ్ ఠాకూర్‌ను యూపీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అమితాబ్ ఠాకూర్‌కు లక్నో కోర్టు వచ్చే నెల 9 వరకు జుడీషియల్ కస్టడీకి పంపింది. బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ త‌న‌పై అత్యాచారం చేశాడంటూ.. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఆగస్టు 16న 24 ఏండ్ల యువ‌తి త‌న స్నేహితుడితో క‌లిసి సుప్రీంకోర్టు గేటు ఎదుట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. యువతీ యువకులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. సమీపంలోనే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాధితులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు .24 ఏళ్ల బాధిత యువతి మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. వారి వేధింపులు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.హిస్టరీ షీటర్ (నేర చరిత కలిగిన వ్యక్తి) అయిన ఓ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్‌రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. గత నెల 9న తాను కోర్టుకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అందులో పేర్కొన్న వారితో పోలీసులు కుమ్మక్కై తనపైనే తిరిగి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆరోపించింది.  ఆత్మహత్యయత్నం చేసిన యువతి ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 24న క‌న్నుమూశారు. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. బాధితురాలిపై అపవాదు మోపి, ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పడంలో అమితాబ్ ఠాకూర్ పాత్ర ఉందని తేల్చింది. సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు అమితాబ్‌ ఠాకూర్‌ను అరెస్ట్ చేశారు. అమితాబ్ ఠాకూర్ త‌న‌ విధుల ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేయ‌డం లేద‌ని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయ‌న‌ను తొల‌గించింది. అనంత‌రం తాను 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యోగిపై పోటీ చేస్తాన‌ని అమితాబ్ ఠాకూర్ ప్ర‌క‌టించారు. దీంతో ఠాకూర్‌తో కేంద్రం ఇటీవల నిర్బంధ పదవీ విరమణ చేయించింది.  తానో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు అమితాబ్ ఠాకూర్ శుక్రవారం ఉదయమే ప్రకటించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అరెస్టు యూపీలో సంచ‌ల‌నంగా మారింది.  

మంత్రి మల్లారెడ్డి భూ అక్రమణలు ఇవే? నిరూపించడానికి సిద్ధమన్న రేవంత్ 

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. పీసీసీ నేతలు మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను రాజీనామా చేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన సవాల్ పై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మరోసారి మంత్రి అక్రమాలను బయటపెట్టారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. మంత్రి యూనివర్సిటీ భూములు ఎక్కడి నుంచి వచ్చాయ్.. సీఎంఆర్ హాస్పిట్సల్ భూమి ఎక్కడిదనే విషయాలను బయటపెట్టారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం 1965 నాటికి గుండ్లపోచంపల్లి సర్వే నంబర్ 650లో మొత్తం 22 ఎకరాల 8 గుంటల భూమి ఉందని రేవంత్ తెలిపారు. 2001 నాటికి కూడా అదే 22 ఎకరాల భూమి ఉంది. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మాత్రం 33 ఎకరాల 26 కుంటలకి పెరిగింది.  సర్వే నంబర్‌లో 22 ఎకరాలున్న భూమి అమాంతం 33 ఎకరాలకు ఎలా పెరిగిందని.. అదేమైనా కేసీఆర్ ముక్కా రోజూ కొంత పెరగడానికంటూ  ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 650 సర్వే నంబర్ లో 33 ఎకరాల్లో 16 ఎకరాలు మల్లా రెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉంది. దాన్ని ఆయన మల్లా రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడ్‌ ఇచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి. బావమరిదికి ఆస్తులుంటే నాకేం సంబంధమని చెప్పిన మల్లా రెడ్డికి గిఫ్ట్ డీడ్‌ కింద ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. బావ కళ్లలో ఆనందం కోసం బావమరిది ఇచ్చిండా అంటూ ఎద్దేవా చేశారు.  జవహర్ నగర్‌లోని సర్వే నంబర్ 488లో 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ క్రయవిక్రయాలు నిషేధించింది. ఇందుకు సంబంధించి అధికారులు పెట్టిన బోర్డుల ఫొటోలను కూడా రిలీజ్ చేశారు రేవంత్. ఇప్పుడదే భూమి రిజిస్ట్రేషన్లు జరిగి మల్లా రెడ్డి కోడలు షాలినీ రెడ్డి కొనుగోలు చేసినట్లు చూపుతున్నారని రేవంత్ చెప్పారు. అందులో సీఎంఆర్ హాస్పిటల్స్ కట్టారని తెలిపారు. మల్లా రెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి షాలినీ రెడ్డి  పేరు మీదకు జవహర్‌నగర్ వైస్‌ చైర్మన్ పేరుతో ఉన్న భూమి  ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో పదవులు ఇచ్చినందుకు లంచంగా ఆ భూమిని మింగేశారని రేవంత్ ఆరోపించారు. అసలు నిషేధిత భూమిగా అధికారులు పేర్కొన్న అదే భూమికి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయా చెప్పాలన్నారు .ఇంజనీరింగ్ కాలేజీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పుడు పత్రాలు సమర్పించారంటూ ఐదేళ్ల నిషేధం విధించిందని రేవంత్ చెప్పారు. మరి అలాంటి కళాశాలని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఎలా అనుమతులు ఇచ్చారని సీఎం కేసీఆర్‌ను రేవంత్ నిలదీశారు. మేడ్చల్ పరిధిలో 50 ఎకరాల వెంచర్ వేసిన వ్యాపారులను మామూళ్ల కోసం బెదిరించిన ఆడియో టేపులు బయటికి వచ్చాయని.. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని కూడా మంత్రి మల్లా రెడ్డిపై ఆరోపణలు వచ్చాయని రేవంత్ అన్నారు. తన మంత్రివర్గంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేంది లేదని.. చివరికి తన కొడుకు, కూతురైనా ఊరుకునేది లేదని కేసీఆర్ అసెంబ్లీలో గొప్పగా చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి రాజయ్యని పీకేసి.. భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని ఈటల రాజేందర్‌ను బయటికి పంపించిన కేసీఆర్‌కి మల్లా రెడ్డి అవినీతి ఎందుకు కనపడడం లేదని రేవంత్ ప్రశ్నించారు. దొంగగా ఉన్న మల్లా రెడ్డిని గజదొంగని చేసి పక్కన పెట్టుకున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.  

ప్రైవేట్ చేతుల్లోకి పీఎస్ఎల్వీ తయారీ! ఇస్రోపైనా కార్పొరేట్ల కన్ను? 

దేశంలో ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశమే కీలకలంగా మారింది. నరేంద్ర మోడీ సర్కార్ కొన్ని రోజులుగా ప్రైవేట్ జపం చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తోంది. బ్యాంకులను విలీనం చేసింది. దేశానికే తలమానికమైన ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ లోనూ  ప్రైవేట్ సంస్థలు ప్రవేశించాయి. ప్రపంచలోనే రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్లోలోకి వ్యాపార సంస్థలు ఎంటర్యయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి దిగ్గజ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. వచ్చే నాలుగేండ్లలో ప్రైవేటీకరించనున్న సంస్థల జాబితాను ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ప్రైవేటీకరణ జాబితాలో ఉందని తెలుస్తోంది.  ఇస్రో తలపెట్టిన అంతరిక్ష ప్రయోగాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మొట్టమొదట వినిపించే పేరు .. పీఎస్ఎల్వీ . తిరుగులేని అంతరిక్ష వాహకనౌక . ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన శాటిలైట్లను తీసుకుని నింగి వైపు దూసుకెళ్లే వాహక నౌక ఇది . ఇన్ని సంవత్సరాల పాటు ఇస్రో సొంతంగా దీన్ని తయారు చేస్తూ వచ్చింది . ఇప్పుడు ఆ అధికారం ఇస్రో చేతుల్లో నుంచి జారిపోనుంది. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలతో.. పీఎస్ఎల్వీ తయారీ పనులు ఇక కార్పొరేట్ పరం కానుంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పీఎస్ఎల్వీల తయారీ కాంట్రాక్ట్ ను పొందడానికి బడా కార్పొరేట్ కంపెనీలు పోటీ పడుతోన్నాయి . పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ ను పొందడానికి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ , ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియాలు రేసులో నిల్చాయి, ఈ రెండు కన్సార్టియాలతో పాటు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ( బీహెచ్ఈఎల్ ) సింగిల్ కంపెనీగా బిజ్ను దాఖలు చేశాయి. గుజరాత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానికి చెందిన కంపెనీ అదాని గ్రూప్. దీని సారథ్యంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ , భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఎల్ అండ్ టీ సారథ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది . ఈ రెండింటితో పాటు బీహెచ్ఈఎల్ సింగిల్ కంపెనీగా బిడ్స్ దాఖలు చేసింది. గత నెల 30 వ తేదీ వరకు అదాని గ్రూప్ , ఎల్ అండ్ టీ , బీహెచ్ఈఎల్ నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ దాఖలయ్యాయి. ఎవాల్యూషన్ పూర్తయిన తరువాత .. అర్హత సాధించిన కన్సార్టియాన్ని ఎంపిక చేస్తామని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ డీ తెలిపారు. పీఎస్ఎల్వీ తయారీ కాంట్రాక్ట్ పనులను దానికి అప్పగిస్తామని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎస్ఎల్వీ తయారీ ప్రక్రియ మొత్తం ఎండ్  టు  ఎండ్ ప్రైవేటు పరం కాబోతోండటం ఇదే తొలిసారి.  అదాని వంటి బడా పారిశ్రామికవేత్త ఇక అంతరిక్ష పరిశోధనల సెక్టార్ లో కూడా అడుగు పెట్టినట్టవుతుందనే అభిప్రాయాలు సర్వాత్రా వినిపిస్తోన్నాయి . కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న పెట్టుబడుల ఉపసంహరణ విధానం పరిధిలోకి ఇస్రోను కూడా చేర్చడానికి దీన్ని తొలి అడుగుగా భావించే వారు కూడా ఉన్నారు. క్రమంగా ఇస్రో సైతం ప్రైవేటీకరణ దిశగా సాగుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్టు ఆహ్వానించడంతో తొలిదశలో కీలకమైన పీఎస్ఎల్వీ ప్రైవేటీకరణ పూర్తి అయినట్టేనని అంటున్నారు. 

బిగ్ బ్రేకింగ్‌.. అర్థ‌రాత్రి తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్ట్‌.. ప్ర‌శ్నిస్తే మూసేస్తారా?

బిగ్ బ్రేకింగ్ న్యూస్‌. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ‌బ్బుల కోసం బెదిరిస్తున్నార‌ని మ‌ల్ల‌న్న‌పై ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు అనంత‌రం తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను చిల‌క‌ల‌గూడ పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.  గురువారం క్యూ న్యూస్ ఆఫీసు, మ‌ల్ల‌న్న ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు. ప‌లు కంప్యూట‌ర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం శుక్ర‌వారం అర్థ‌రాత్రి మ‌ల్ల‌న్న‌ను అరెస్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు పోలీసులు.  తీన్మార్ మ‌ల్ల‌న్న అరెస్ట్‌పై ప్ర‌జాస్వామ్య‌వాదులు మండిప‌డుతున్నారు. క్యూ న్యూస్ వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నందుకే ఆయ‌న్ను అరెస్ట్ చేశారంటూ విమ‌ర్శిస్తున్నారు. మీడియాకు సంకెళ్లు వేయ‌డం స‌రికాదంటూ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.  తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై రివేంజ్ తీర్చుకోవాల‌ని కేసీఆర్ స‌ర్కారు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో ఓ యువ‌తి ఫిర్యాదు మేర‌కు క్యూ న్యూస్‌పై దాడి చేసి నానా హంగామా సృష్టించారు పోలీసులు. తాజాగా ఓ వ్య‌క్తిని డ‌బ్బులు డిమాండ్ చేశార‌నే ఫిర్యాదుతో మ‌ల్ల‌న్న‌ను అరెస్ట్ చేయ‌డం క‌క్ష్య సాధింపు చ‌ర్య‌నే అంటున్నారు.  త‌న‌పై న‌మోద‌వుతున్న వ‌రుస పోలీస్ కేసుల‌పై ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించారు చింత‌పండు న‌వీన్‌. జాతీయ బీసీ క‌మిష‌న్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ప్ర‌భుత్వం నుంచి,, పోలీసుల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా.. క్యూ న్యూస్‌లో స‌ర్కారుపై విమర్శ‌లు మాత్రం ఆప‌లేదు మ‌ల్ల‌న్న‌. ధైర్యంగా ప్ర‌భుత్వ దుర్నీతిని నిత్యం ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. అందుకు ప్ర‌తీకారంగానే అన్న‌ట్టు.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను ఓ కేసులో అరెస్ట్ చేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దొంగ‌ల్లా అర్థ‌రాత్రి మ‌ల్ల‌న్నను అరెస్టు చేయ‌డంపై ప్ర‌జాస్వామ్య‌వాదులు, జ‌ర్న‌లిస్టులు మండిప‌డుతున్నారు. స‌ర్కారు క‌క్ష్య‌సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.  

డ్రగ్స్ కేసులో రానా, రకుల్ కు నోటీసులు? కేటీఆర్ ఆందోళనగా ఉన్నారన్న రేవంత్.. 

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఆందోళనగా ఉన్నారా? ఆయన సన్నిహితులు కొందరు ప్రమాదంలో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఫైర్ బ్రాండ్ లీడర్, టీపీసీసీ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి. తన సన్నిహితులు ఇబ్బందుల్లో పడటంతో కేటీఆర్ కలవరపడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. గత నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్​ ఆందోళనగా ఉన్నారని, ఆయన స్నేహితులకు డ్రగ్స్​ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఆయన సన్నిహితులకు నోటీసులు రావడంతో కేటీఆర్​ భయపడుతున్నారన్నారు. గతంలో కేటీఆర్​ గోవాకు వెళ్లి వచ్చారని, ఈ గోవా పర్యటన అధికారికమా.. అనధికారికమా అని రేవంత్ ప్రశ్నించారు.  డ్రగ్స్ కేసులో  తాను కూడా  హైకోర్టులో ఈడీ, సీబీఐలను సవాల్​ చేస్తూ పిల్​ వేశానని, ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని ఈడీ కౌంటర్​ దాఖలు చేసిందని రేవంత్​రెడ్డి వెల్లడించారు. మంత్రిగా కేటీఆర్​ గోవా పర్యటనను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్​ కేసులో విచారణ చేస్తామని ఈడీ, సీబీఐ అంటుంటే ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కష్టాల్లో పడిన కేటీఆర్ సన్నిహితులు ఎవరూ అన్నదానిపై చర్చ జోరుగా సాగుతోంది.  నాలుగేండ్ల క్రితం తెలుగు రాష్ట్రాలతో పాటు సిని ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో తాజాగా ఈడీ దూకుడు పెంచడంతో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. ప్రముఖ సినీనటులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు తెరపైకి రావడం సంచలనంగా మారింది. నాలుగేండ్ల కిందట తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన విచారణలో దగ్గుబాటి, రకుల్ పేర్లు లేవు. రానా ఇంతవరకు విచారణకు కూడా హాజరు కాలేదు. మాదకద్రవ్యాల క్రయవిక్రయాల్లో హవాలా ద్వారా భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్ల జాబితాలో ఈ ఇద్దరిపేరు ఉన్నాయని తెలుస్తోంది.డ్రగ్స్ కేసులో  అనుమానితుల జాబితాలోనూ లేని వీళ్లకు ఈడీ సమన్లు జారీ చేసింది? అనేది మిస్టరీగా మారింది. కావాలనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఇంతకాలం వారి పేర్లను దాచి పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను 2017 జూలైలో ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్  అధికారులు పట్టుకున్నారు. ముఠా సభ్యులు ఇచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా దాదాపు 60 మందిని విచారించారు. అందులో సుమారు10 మందికి పైగా సినీ ప్రముఖులున్నారు. ఈ కేసు నెల రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించింది. తెలుగు సినీరంగాన్ని కుదిపేసింది. సినీ రంగ ప్రముఖులతో పాటు డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు వచ్చిన మరి కొంతమంది రక్తం నమూనాలు, గోళ్లు, జుట్టు నమూనాలను కూడా తీసుకొని పరీక్షలకు పంపారు. ఆ తర్వాత  ప్రభుత్వం కేసును పక్కన పెట్టింది. కేసులో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్‌ను బదిలీ చేసింది. డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాపై 12 కేసులు నమోదు చేసి 11 చార్జిషీట్లను దాఖలు చేసి చేతులు దులుపుకున్నది. డ్రగ్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం తొక్కి పెట్టిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. వాస్తవాలను వెలుగులోకి తెచ్చి న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది రేవతి హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు.  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తోపాటు సీబీఐ, ఎన్సీబీ, డీఆర్ఐల జోక్యాన్ని కోరారు. ఇదే అంశంపై రాష్ట్రపతికి కూడా రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టు నుంచి వివరాలను వెల్లడించాలని ఆదేశాలు వచ్చినా రాష్ట్ర అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈడీ బాలీవుడ్​, శాండిల్​వుడ్​తోపాటు టాలీవుడ్​పైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులు, చార్జిషీట్లు, అనుబంధ పత్రాలను పరిశీలించింది. అందులో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఉన్నాయా? లేదా? అనేది అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దక్షిణాఫ్రికాకు చెందిన  రాఫెల్ ఎలెక్స్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమన్లు జారీ చేసినట్టు తెలుస్తున్నది.