సీఎంకి స్కూల్‌ స్టూడెంట్ లెట‌ర్‌.. వెంట‌నే ఫోన్ చేసిన ముఖ్య‌మంత్రి.. అస‌లేం జ‌రిగిందంటే..

క‌రోనాతో స్కూల్స్ మూతప‌డ్డాయి. మ‌ళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలీటం లేదు. చ‌దువుల‌న్నీ అట‌కెక్కాయి. తాము చ‌దువుతున్న‌ది ఏ క్లాసో కూడా తెలీడం లేదు కొంద‌రు విద్యార్థుల‌కు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. త‌మిళ‌నాడులో మాత్రం ఇంకా పాఠ‌శాల‌లు తెరుచుకోలేదు. దీంతో.. ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థినికి చిర్రెత్తుకొచ్చింది. బ‌డులు ఎప్పుడు తెరుస్తారో చెప్పాలంటూ ఏకంగా ముఖ్య‌మంత్రి స్టాలిన్‌కే లేఖ రాసింది ఆ చిన్నారి. లెట‌ర్ అయితే రాసింది స‌రే.. మ‌రి, ఇలాంటి లేఖ‌ను.. నిత్యం బిజీగా ఉండే సీఎం చ‌దువుతారా? త‌న లెట‌ర్‌కు రిప్లై వ‌స్తుందా? ఇవేవీ ఆలోచించ‌లేదు ఆ అమ్మాయి. స్కూల్స్ రీఓపెన్ గురించి తెలుసుకోవాల‌నుకుంది.. ఎవ‌రిని అడిగినా స‌రైన ఆన్స‌ర్ రావ‌ట్లేద‌ని.. నేరుగా చీఫ్ మినిస్ట‌ర్‌నే అడుగుతూ లెట‌ర్ రాయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. అంత‌కంటే అనూహ్య ప‌రిణామం చోటుచేసుకుంది. ఆ చిన్నారి రాసిన లేఖ‌ను సీఎం స్టాలిన్ చ‌దివారు. జ‌స్ట్‌.. చ‌ద‌వి ఊరుకోకుండా.. తిరిగి ప్ర‌త్యుత్త‌రం రాయ‌కుండా.. నేరుగా ఆ విద్యార్థినికే ఫోన్ చేసి.. ఆమె ప్ర‌శ్న‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారింది. స్టాలిన్ ప‌ని తీరు మ‌రోసారి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.  తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరులోని టైటన్ టౌన్‌షిప్‌కు చెందిన ఆరవ తరగతి చదువుతున్న ప్రజ్ఞ అనే విద్యార్థిని ముఖ్యమంత్రి స్టాలిన్ కు లేఖ రాసింది. త‌న‌ స్కూల్‌ ఎప్పుడు పునర్ ప్రారంభం అవుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నానని సీఎంకు రాసిన లేఖలో కోరింది. లేఖలో తన ఫోన్ నంబరు కూడా ఇచ్చింది. బాలిక లేఖ చదివిన సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. ప్రజ్ఞకు ఫోన్ చేసి మాట్లాడారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు 1 నుంచి పాఠశాలలు తెరవబోతున్నట్టు ముఖ్య‌మంత్రి చెప్పారు.  ‘‘నీవు చింతించవద్దు, కొవిడ్ భద్రతా ప్రోటోకాల్ ల ప్రకారం మీ టీచరు చేసే సూచనలు పాటిస్తూ మాస్కు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలకు రావాలి’’ అని ప్ర‌జ్ఞ‌కు సీఎం స్టాలిన్ ఫోన్‌లో సూచన‌లు చేశారు. తాను రాసిన లేఖ చ‌దివి.. ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న‌కు ఫోన్ చేసి మాట్లాడటం ఆశ్చ‌ర్యంగా ఉందంటోంది చిన్నారి ప్ర‌జ్ఞ‌.   

ఆర్కే అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు.. ఇవిగో ఫోటోలు..

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అంత్యక్రియల ఫోటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు జరిగాయి. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్లు మావోయిస్టు పార్టీ వెల్లడించింది. మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు భారీగా హాజరయ్యారు మావోయిస్టులు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించారు మావోయిస్టులు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో గురువారం ఉదయం చనిపోయారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కెగా పని చేశారు. విప్లవోద్యమంలో ఆర్కేది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

అయోధ్య రామ మందిరం రెడీ.. భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఎప్పుడంటే..

అదిగ‌దిగో రామ‌మందిరం. మెజార్టీ హిందువుల చిర‌కాల స్వ‌ప్నం. రాముడు పుట్టిన చోట రామాల‌యం ఉండాలి కానీ, మ‌సీదు ఉండ‌ట‌మేంట‌నేది వివాదంగా మారి.. ద‌శాబ్దాలుగా ఉద్రిక్త‌త నెల‌కొని.. సుప్రీంకోర్టు తీర్పుతో క‌థ సుఖాంతమైంది. అప్ప‌టి నుంచి అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం వేగంగా సాగుతోంది. తీర్పు రాక‌ముందునుంచే.. గుడి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేసింది ఆల‌య క‌మిటీ. శిల‌లు, శిల్పాలు అయోధ్య‌లో రెడీగా ఉన్నాయి. ఇలా సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌గానే.. అలా గుడి నిర్మాణం మొద‌లైపోయింది. ప్ర‌స్తుతం ఓ కొలిక్కి వ‌చ్చింది. జై శ్రీ రాం.. నినాదాల‌తో అయోధ్య పుల‌కించే రోజుకు ముహూర్తం ఖ‌రారైంది. ఆ మేర‌కు విజయదశమి పర్వదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  ‘‘శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు నవంబరు చివరి నాటికి ముగుస్తాయి. డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తాం. అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నాం’’ అని రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.   గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించారు. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలు చేప‌ట్టింది. అయోధ్య భవ్య రామ మందిరం.. 2.77 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలతో నిర్మిస్తున్నారు. గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తుతో అల‌రార‌నుంది.   

జగన్ లానే కేటీఆర్ కు చెల్లెలితో వైరమా? షర్మిల బాటలోనే కవిత పార్టీ పెడతారా? 

రాజకీయాలు రక్త సంబంధాలను కూడా దూరం  చేస్తాయా  అంటే.. చేస్తాయి అనేందుకు చరిత్రలో చాలా ఉదాహణలే కన్పిస్తాయి. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆయన భార్య మేనకా గాంధీని ఇందిరా గాంధీ అర్థ రాత్రి ఇంటి నుంచి  బయటకు పంపేశారు. నిజానిజాలు ఎలా ఉన్నా, ఇందిరా గాంధీ చిన్నకోడలు మేనకా గాంధీని బయటకు పంపడానికి,పెద్ద కోడలు రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కారణమని అప్పట్లో అనేక కథల కథనాలు వచ్చాయి. అదెలా ఉన్నా, అలా అర్థరాత్రి ఒంటరిగా బయటకు వచ్చిన మేనకా గాంధీ, మళ్ళీ ఇంతవకు ఆ ఇంటివైపు కన్నెత్తి చూడలేదు.అంతే కాదు, రాజకీయంగానూ ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని బీజీపీలో చేరారు, ఇప్పటి వరకు అమె,ఆమె  కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీలో కొనసాగుతున్నారు.రాహుల్, ప్రియాంకా వాద్రాలు కూడా వరుణ్ గాంధీతో అదే దూరం పాటిస్తున్నారు. అలాగే, గ్వాలియర్ రాజ మాత విజయ రాజే సింధియా,(బీజేపీ) ఆమె  కుమారుడు మాధవ రావు సింధియా (కాంగ్రెస్) ల మధ్య రాజకీయ విభేదాల అడ్డుగోడలు ఆమె ఉన్నత కాలం ఆలాగే ఉన్నాయి. పార్లమెంట్’లో ఒకరికొకరు ఎదురైనా పలకరించుకో లేనంత దూరం పెంచాయి.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో అలాంటి అంటే ... టోటల్’గా అలాగే కాకపోవచ్చును కానీ, కొంచెం అటూ ఇటుగా సిమిలర్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల మధ్య రాజకీయాలు ఎంత పెద్ద అగాధాన్ని సృష్టించాయో వేరే చెప్పనక్కర్లేదు. అఫ్కోర్స్, ఆ ఇద్దరి  మధ్య దూరం అంతలా పెరగడానికి ఇంకా వేరే కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ విభేదాలు, ఆకాంక్షలు అసలు కారణం అనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేం అక్కరలేదు.‘జగనన్న వదిలిన బాణం అంటూ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, జైలులో ఉన్న జగన్ రెడ్డ్డి రాజకీయ భవిష్యత్’ను బతికించిన షర్మిల పుట్టింట పరాయి పిల్ల అయిపోయింది.అన్న చెల్లి మధ్య విభేదాలు, తండ్రి సమాధి వద్ద కూడా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోలేని స్థితికి చేర్చాయి. చివరకు ఆమె, తన రాజకీయ ఆకాంక్ష తీర్చుకునేందుకు మేట్టినిట్ట సొంత పార్టీ పెట్టుకున్నారు.   ఇక అసలు విషయానికి వస్తే విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్’లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.ఇది పత్రికలలో వచ్చిన వార్త.  ఇది ఈ సంవత్సరమే కాదు, గత ఐదారేళ్లుగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఆ ఫోటులు చూస్తూనే ఉన్నాం ... కానీ,  గతానికి  ఇప్పటికీ మధ్య గొప్ప వ్యత్యాసం కనిపిస్తోంది. ఈపూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు కె. తారక రామారావు, వారి సతీమణి  శైలిమ, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారని పత్రికలు వార్తను ప్రచురించాయి. పొటోలు కూడ ప్రచురించాయి. కానీ, ఈవార్తలో, ఈ ఫోటోలలో ముఖ్యమంత్రి బిడ్డ కవితమ్మ ఎక్కడా కనిపించలేదు.   నిజానికి ఇలా కుటుంబ వేడుకలలో కవిత కనిపించకుండా పోవడం ఇదే తొలిసారి కాదు.  అంతకు ముందు ఏమో తెలియదు కానీ, రాఖీ పండగ నుంచి ముఖ్యమంత్రి కుటుంబ వేడుకల్లో, ఫ్యామిలీ ఫోటోస్’లో కవిత కనిపించడంలేదు. చివరకు ప్రగతి భవన్’లో జరిగిన బతుకమ్మ వేడుకల్లోనూ ... ఆమె లేరు. గతంలో ప్రగతి భవన్ లో ఏ పండగ  జరిగినా  సెంటర్ అఫ్ ది అట్రాక్షన్... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కవిత, తెలంగాణ పెద్ద పండగకు కూడా పుట్టింటికిరాక పోవడం కుటుంబ, బంధు వర్గాలు ముక్కున వేసేఉకునేలా చేసింది. అంతే  కాదు రాజకీయ వర్గాల్లో కూడా సంచలన వార్తగా ఈ వార్త  చక్కర్లు కొడుతోంది. అయితే,ఇలా అన్నా చెల్లీ మధ్య దూరం పెరగడానికి, కుటుంబ కలహలకు పదవుల పోరాటమే కారణం అని అందరి నోట వినవస్తోంది. మరో వంక ఇలా ఇటు కుటుంబంలో అటు పార్టీలో అలాంటి  అనూహ్య పరినామాలు అన్నిటికీ ఒకేఒక్కడు కారణమని అంటున్నారు.పార్టీ అధ్యక్ష పదవి కానీ, ముఖ్యమంత్రి పదవి కానీ, వారసత్వంగా కేటీఆర్’కే వస్తుంది. అయితే, ఆయన సరైన సమయం వచ్చే వరకు ఆగి ఉంటే అదోలా ఉండేదని, అలా కాకుండా కేటీఆర్  పట్టాభిషేకానికి వత్తిడి చేయడంవల్లనే ఫామిలీలో, ప్రతిలో విభేదాలు ముదిరి పాకాన  పడ్డాయని అంటున్నారు. ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ... ఇంకెంత దూరంపోతాయో .. చూడవలసిందే అంటున్నారు. అయితే, షర్మిల తీసుకున్న డ్రాస్టిక్ స్టెప్ కవిత తీసుకోరని మాత్రం చెప్పవచ్చును అంటున్నారు. ఏమైనా రాజకీయం రాజకీయమే ... అందుకే కావచ్చు ‘డెవిల్ దై నేమ్ ఈజ్ పాలిటిక్స్ .... రాక్షసీ నీపేరు రాజకీయమా ..అంటారు.

వారెవా రుతురాజ్‌.. ఐపీఎల్ కింగ్‌.. ఆరెంజ్ క్యాప్‌.. ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్..

ఐపీఎల్ 2021 ఎప్ప‌టిలానే అద‌ర‌గొట్టింది. చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌రోసారి క‌ప్పు కొట్టింది. సూప‌ర్ కెప్టెన్‌గా ధోనీ ఇమేజ్ మ‌రింత పెరిగింది. చెన్నై విక్ట‌రీలో కీరోల్ మాత్రం యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్‌దే. ఈసారి ఐపీఎల్ హీరో కూడా అత‌నే. రుతురాజ్‌.. ఇప్పుడు ఐపీఎల్‌-రాజ్‌. రుతురాజ్ ఈ సీజన్‌లోనే అత్యధిక పరుగులు-635 చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఐపీఎల్ హిస్ట‌రీలోనే ఆరెంజ్ క్యాప్ అందుకొన్న అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌గా’ ఎంపికై వారెవా అనిపించాడు. అందుకే, క్రికెట్ ఫ్యాన్స్ అంతా రుతురాజ్ ఫుల్ డిటైల్స్ కోసం గూగుల్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో రుతురాజ్ ఇప్పుడో స్టార్ క్రికెట‌ర్‌.  ఈ ఐపీఎల్‌లో రుతురాజ్‌ 635 ర‌న్స్ చేస్తే.. ఇందులో ఒక సెంచ‌రీ, నాలుగు హాఫ్ సెంచ‌ల‌రీలు ఉన్నాయి. లీగ్‌ దశలో రాజస్థాన్‌ రాయల్స్‌పై 60 బంతుల్లో.. 9x4, 5x6.. 101 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి స‌త్తా చాటాడు. అయితే, ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా రుతురాజ్ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. కోల్‌కతాపై 64 పరుగులు, బెంగళూరుపై 33, సన్‌రైజర్స్‌పై 75, ముంబయిపై 88 ర‌న్స్‌తో మెరుగైన బ్యాటింగ్ చేశాడు.  పుణెకు చెందిన రుతురాజ్ గైక్వాడ్‌ 1997 జనవరి 31న జన్మించాడు. 2016-17 రంజీ ట్రోఫీతో కెరీర్‌ ప్రారంభించాడు. 2018లో ఇండియా-బి జట్టుకు, అదే ఏడాది ఏసీసీ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. 2019లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జ‌త‌క‌ట్టాడు. తొలి సీజన్‌లో డగౌట్‌కే పరిమితమ‌య్యాడు. గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్ స్టార్టింగ్‌లోనే కరోనా బారినపడి కోలుకున్నాడు. లాస్ట్ ఇయ‌ర్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి.. మూడు హాఫ్ సెంచ‌రీల‌తో మొత్తం 204 ర‌న్స్ చేశాడు. ఇక ఈ సీజన్‌లో చెలరేగిపోయాడు. రుతురాజ్ చేసిన ర‌న్స్‌.. 5, 5, 10, 64, 33, 75, 4, 88, 38, 40, 45, 101, 13, 12, 70, 32. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ సైతం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బాలీవుడ్‌ నటి సాయాలీ సంజీవ్‌తో లవ్‌ ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో గాసిప్స్ వ‌స్తుంటాయి. కానీ, అవ‌న్నీ ఫేక్ అంటాడు రుత‌రాజ్‌. కేవ‌లం బౌలర్లు మాత్రమే తనని క్లీన్‌ బౌల్డ్ చేయ‌గ‌ల‌ర‌ని ఓసారి ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.  ఖాళీ సమయాల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘నార్కోస్‌’ షో అత‌ని ఫేవ‌రేట్‌. సెల్ఫీ తీసుకోవ‌డ‌మంటే క్రేజ్‌. ఫిట్‌నెస్‌కు టాప్ ప్ర‌యారిటీ ఇస్తాడు. క్రికెట్ కాకుండా.. టెన్నిస్‌, వాలీబాల్ ఆడ‌తాడు. 

టీ @ ₹1,000.. హైదరాబాద్‌లో ఇస్పెష‌ల్ కాస్ట్లీ చాయ్‌..

అరే చిన్నా.. ఏక్ ఛాయ్‌.. అని ఆర్డ‌ర్ వేసి.. పొగ‌లు క‌క్కే వేడివేడి హైద‌రాబాదీ ఇరానీ ధ‌మ్ చాయ్ తాగుతుంటే ఆ మ‌జానే వేరు.. పాణం గాల్లో తేలిన‌ట్టుంటుంది. ఆంధ్ర‌లో డికాష‌న్ టీ ఎలా ఫేమ‌స్సో.. హైద‌రాబాద్‌లో ధ‌మ్ చాయ్ ఫుల్ పాపుల‌ర్‌. ఇరానీ కేఫ్‌లో అయితే క‌ప్పు టీ రూ.20 ఉంటుంది. రోడ్డు ప‌క్క‌న బండ్ల మీదైతే.. రూ.10-15కు అమ్ముతుంటారు. ధ‌ర కాస్త అటూఇటూ ఉన్నా.. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అందుకే, హైద‌రాబాద్‌లో ప‌నిమీద బ‌య‌ట తిరిగే వారు.. రోజంతా చాయ్ తాగుతూ రిఫ్రెష్ అవుతుంటారు. సిప్పు సిప్పుకూ ఉత్తేజం పొందుతుంటారు. ఇదంతా కామ‌న్ చాయ్ గురించి. కానీ, హైద‌రాబాద్‌లోని ఓ కేఫ్‌లో లేటెస్ట్‌గా ఓ ఇస్పెష‌ల్ చాయ్ వ‌చ్చింది. ఆ టీ.. అలాంటి ఇలాంటి టీ కాదు మ‌రి. ఇండియాలోనే వెరీ వెరీ స్పెష‌ల్‌. అందుకే, ఆ అదురైన‌ చాయ్‌కి రుచితో పాటు ధ‌ర కూడా అదిరిపోతోంది. రేటెంతో తెలుసా.. క‌ప్పు టీ.. వెయ్యి రూపాయ‌లు. ట్యాక్స్‌లు అద‌నం.  నీలోఫర్‌ కేఫ్.. హైదరాబాద్‌లో వెరీ పాపుల‌ర్‌. అనేక రకాల టీలు, బిస్కెట్స్‌ను అమ్ముతుంటారు. తాజాగా, బంజారాహిల్స్‌లోని నీలోఫ‌ర్‌ కేఫ్‌ బ్రాంచ్‌లో ప్రత్యేకమైన, ఖరీదైన టీని పరిచయం చేస్తున్నారు. ఈ టీని గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్‌తో తయారు చేస్తారట. అందుకే ఆ చాయ్ టేస్ట్ అద్భుతః అనిపిస్తుంద‌ని చెబుతున్నారు.  ఆ ప్ర‌త్యేక‌మైన‌ టీ పౌడర్‌ను కేఫ్‌ యాజమాన్యం వేలంలో గెలుచుకుంది. అసోంలో నిర్వహించిన వేలంలో కేజీ రూ.75వేలకు కొనుగోలు చేశారు. అందుకే, ఆ టీ పౌడ‌ర్‌తో చేసే టీకి అంత ఖ‌రీదు. ప్రస్తుతం నీలోఫ‌ర్ కేఫ్‌లో కేవ‌లం కేజీన్నర గోల్డెన్‌ టిప్స్‌ బ్లాక్‌ టీ పౌడర్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. ఆ టీ పౌడ‌ర్ అయిపోయే వ‌ర‌కే ఈ అవ‌కాశం. అందుకే, ఓ వెయ్యి రూపాయ‌లు మ‌న‌వి కావ‌నుకుంటే.. ఆ అద్భుత‌మైన రుచుండే.. క‌ప్పు టీ తాగేసి.. ఓ సెల్ఫీ దిగేసుకోండి. క‌ల‌కాలం గుర్తుండి పోతుంది ఆ మెమోరీ.. దానితో పాటు చాయ్ రుచీ. ఆ టీ తాగి.. వాహ్‌వా ఏమి రుచి.. అన‌రా మైమ‌ర‌చి...  

సజ్జల ఎవరు?.. కర్రలతో చితక్కొట్టుడు.. ముస్లింలు తగ్గారా?.. టాప్ న్యూస్@ 1PM

వైఎస్ జగన్ పాలనపై సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడనేలేదని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను లాక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ప్రతి విషయంలో పెత్తనం చేయడానికి అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? అని డీఎల్ ప్రశ్నించారు. --------- ప్రతి ఈ సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా దేవరగట్టులో హింస చోటు చేసుకుంది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో రింగులు తొడిగిన కర్రలతో భక్తులు బీభత్సంగా కొట్టుకున్నారు. సుమారుగా ఈ హింసలో 50 మందికిపైగా భక్తులు తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరగట్టులో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు. ----- నాలుగు రోజుల పసికందు మాయమైన ఘటన జీజీహెచ్‎లో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన మహిళ ప్రియాంక బాబుకు జన్మనిచ్చింది. తల్లి పడుకుందని..బాబుని వార్డ్ బయటకు నాయనమ్మ తీసుకుని వచ్చింది. అమ్మమ్మ పసికందును పక్కన పెట్టి నిద్రపోయింది. దుండగులు బాబుని ఎత్తుకుని పారిపోయారు. నిద్రమత్తులో ఉన్న వారు ఒక్కసారిగా నిద్రలేచి చూసేసరికి బాబు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  --------- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారు.మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్ధాలు, సగం సత్యాలతో నిండి ఉందని ఒవైసీ ఆరోపించారు.జనాభా విధానం, ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ వ్యాఖ్యలను ఒవైసీ విమర్శించారు.ముస్లిములు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని పునరావృతం చేశారని, కాని ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు. ------ హైదరాబాద్ నగరంలో మరో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.  --- మావోయిస్టు పార్టీలో అగ్ర నాయకుడుగా ఉన్న ఆర్కే ఆలియాస్ రామకృష్ణ మృతి చెందడం బాధాకరమని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 2004 లో మావోయిస్టులు - ప్రభుత్వం మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఆర్కే చాలా కీలక పాత్ర పోషించాడన్నారు. మావోల డిమాండ్‌లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేలా ఆర్కే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడన్నారు హరగోపాల్.  --------- దేశంలోని ఏపీ, తెలంగాణాలతో పాటు పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది.తూర్పు మధ్య, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. కేరళలోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు.  ----- శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ప్లో 81,022 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,22,374 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ------ తన కుటుంబంలో ఆడపిల్ల జన్మించిన సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ పంపు యజమాని తన కస్టమర్లకు ఉచితంగా పెట్రోల్ పోశారు. బేతుల్ లో పెట్రోల్ పంపు యజమాని అయిన రాజేంద్ర సైనాని మేనకోడలికి ఆడపిల్ల పుట్టింది. తన మేనకోడలికి ఆడపిల్ల పుట్టిన సంతోషంలో పెట్రోల్ పంపు యజమాని అయిన రాజేంద్ర సైనాని తన కస్టమర్లకు అక్టోబరు 13వతేదీ నుంచి అక్టోబరు 15వతేదీ వరకు మూడు రోజుల పాటు అదనంగా ఉచితంగా పెట్రోలు పోశారు.  ----- బ్రిటన్​ కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్​ అమెస్‌పై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తూర్పు ఇంగ్లాండ్​లోని ఓ చర్చ్​లో నియోజకవర్గం ప్రజలతో అమెస్​ భేటీ అయిన సమయంలోనే ఆయనపై ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని దుండగులు అమెస్‌ను పలుమార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు

ప్రత్యేక కోటాలో రోజాకు మంత్రి పదవి? దేవుడమ్మ చెప్పేసిందట? 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏ ఇద్దరు వైసీపీ నాయకులు కలిసినా, మంత్రివర్గ విస్త్రరణపైనే  మాట్లాడుకుంటున్నారు.నిజానికి మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? మొత్తంగా పక్షాలన చేస్తారా? మార్పులు చేర్పులతో సరిపెడతారా? ఉన్న వాళ్ళలో ఎవరుంటారు? ఎవరు పోతారు? కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది? అదృష్టం ఎవరిని వరిస్తుంది? నష్ట జాతకులు ఎవరు?ఇలా మంత్రివర్గం చుట్టూనే, ‘రాజకీయ ముచ్చట్లు’ సాగుతున్నాయి. మరో వంక మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.    ప్రతిపక్షాల విమర్శలు, పత్రికలు, మీడియాలో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, కథనాలను తిప్పికొట్టడంలో ప్రస్తుత మంత్రుల వాయిస్’ సరిపోవడం లేదని ముఖ్యమంత్రి ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఒకటి రెండు మంత్రివర్గ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి ఇదే విషయంగా మంత్రులకు క్లాసు తీసుకున్నారని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు కనీసం తమ శాఖకు సంబంధించి వచ్చిన విమర్శలపై కూడా స్పందించడం లేదని ముఖ్యమంత్రి గట్టిగా మంలించారని, కొదరిని అయితే, తట్టాబుట్టా సర్దుకోమని ముఖం మీదనే చీవాట్లు పెట్టారని సమాచారం. ఇలా మంత్రులు చేతకాని వాళ్ళు కావడం వల్లనే, ఏ శాఖకు సమబందించిన విషయం అయినా ప్రభుత్వ సలహాదారు హోదాల సజ్జల రామ కృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వవలసి వస్తోంది. అయితే, ఇలా ‘సర్వం సజ్జల మయం’ కావడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, దెప్పి పొడిచేందుకు ముల్లుకర్రతో ఎప్పుడూ సిద్దంగా  ఉండే, వైసీపీ రెబెల్ ఏపీ రఘురామ కృష్ణంరాజు సజ్జలఫై ఇప్పటికే సెటైర్లు పేల్చారు..రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో సజ్జల దూరిపోతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా.. సకల విషయాలు చూస్తారా? అంటూ ర‌ఘురామ తమదైన స్టైల్’లో చురకలు వేశారు. వాతలూ పెట్టారు.  ఈ నేపధ్యంలోనే, ఈసారి మంత్రి వర్గంలో నోరున్న నేతలకు ప్రత్యేక కోటా తప్పక ఉంటుందని అంటున్నారు.నోరున్న ఎమ్మెల్యేలు అంటే, ముందుగా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరే వినిపిస్తుంది. ప్రతిపక్షాలను ‘జబర్దస్త్’గా ఎదుర్కోవడంలోనూ ఆమె స్థానం ప్రత్యేకం. ఈ నేపధ్యంలో, గతంలో సామాజికవర్గ సమీకరణాల వల్ల మంత్రి పదవి దక్కని రోజాకు ఈసారి మంత్రి పదవి గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అయితే, అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రైట్ హ్యండ్ మ్యాన్’గా చెప్పుకునే  పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రోజాకు అవకాశం దక్కకుండా చేసే అవకాశాన్ని కొట్టివేయలేమని అంటున్నారు.  రోజా ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఆమె ముఖ్యమంత్రిని సన్నం చేసుకోవడంతో పాటుగా ‘హస్త రేఖ’లను కూడా పరీక్షించుకుంటున్నారని సమాచారం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని తిరుపతి వచ్చిన సందర్భంగా కలిసి, ‘ఒక్క ఛాన్స్’ కోసం వేడుకున్నారని. ఆమె అనుచరుల సమాచారం. ముఖ్యమంత్రి ఆమెకు ఏమి చెప్పారో, ఏమో కానీ, ఆమె అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి, వెంకన్న దేవుని వద్ద కూడా ఒక రిక్వెస్ట్  పెట్టి వచ్చారు. అంతటితోనూ ఆగకుండా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహ పార్టీ నాయకుల ఆస్థాన జ్యోతిష్యురాలు దేముడమ్మను కలిశారు. తిరుపతి నుంచి నేరుగా  విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలసలోని దేముడమ్మ ఆశ్రమానికి వెళ్లి  జ్యోతిష్యురాలిని కలిశారు. తన రాజకీయ భవిష్యత్ గురించి తెలుసుకునేందుకే ఎమ్మెల్యే రోజా దేముడమ్మను కలిసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హాస్త రేఖల్లో మంత్రి రేఖలు ఉన్నాయా ? లేవా? మంత్రి అయ్యే యోగం ఉందా? లేదా? అనే విషయంలోనే రోజా, జ్యోతిష్యురాలు దేవుడమ్మను కలిసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సారన్నా ఆమె కల ఫలిస్తుందా?లేక ఎమ్మెల్యే రోజా, జబర్దస్త్ రోజాగానే మిగిలి పోతారా అన్నది మరి కొద్ది రోజుల్లోనే తెలిసి పోతుంది.. అంతవరకు ఇంతే సంగతులు. 

కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై సోనియా క్లారిటీ.. రేవంత్‌రెడ్డిపై ఆస‌క్తి!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు ఎవ‌రు? అంటే, వెంట‌నే ఆన్స‌ర్ చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతానికి శ్రీమ‌తి సోనియాగాంధీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఉద్ద‌రిస్తార‌నుకున్న రాహుల్‌గాంధీ త‌న‌కింకా టైమ్ కావాలంటున్నారు. రాహుల్ రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉన్నా.. నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు వెన‌క‌డుగు వేస్తున్నారు. భ‌య‌మో, బ‌రువనుకున్నారో కార‌ణం ఏదైనా.. రాహుల్‌గాంధీ మాత్రం ఇప్ప‌ట్లో కాంగ్రెస్ ప‌గ్గాలు స్వీక‌రించే ప‌రిస్థితి లేద‌ని తేలిపోయింది. ఆ మేర‌కు సోనియాగాంధీ స్ప‌ష్ట‌మైన మెసేజ్ ఇచ్చేశారు.   కాంగ్రెస్‌పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీబ్ల్యూసీ) సమావేశమైంది. ప్రారంభ ఉపన్యాసంలో సోనియాగాంధీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ను ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాలంటూ కొంత‌కాలంగా ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్లు బ‌హిరంగంగానే నిన‌దిస్తున్నారు. ఆ అసమ్మతి కూట‌మికి జీ-23 లీడ‌ర్స్ అని పేరు పెట్టారు. వారంతా పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుడిని అధ్య‌క్షునిగా నియ‌మించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వేరే సీనియ‌ర్‌ని కాక‌పోయినా.. క‌నీసం రాహుల్‌గాంధీనైనా కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా చేయాల‌ని సూచిస్తున్నారు. కానీ, టార్చ్‌బేర‌ర్‌గా నిలిచేందుకు రాహుల్ స‌సేమిరా అంటున్నారు. నాయ‌కులంతా క‌లిసి పార్టీని పైకి తీసుకురావాలి కానీ, భార‌మంతా త‌న ఒక్క‌డిపైనే మోప‌డం స‌రికాద‌నేది గాంధీ వాద‌న‌. కానీ, రాహుల్ పిలుపున‌కు ఏ ఒక్క నాయ‌కుడూ ముందుకు రావ‌డం లేదు. రాహులే పార్టీని ముందుకు తీసుకురావాల‌ని కోరుతున్నారు. ఆయ‌న మాత్రం స‌మిష్టి బాధ్య‌త‌ను గుర్తు చేస్తున్నారు. ఇలా కొంత‌కాలంగా గ‌ళం విప్పుతున్న జీ-23 నాయ‌కుల విమర్శలకు తాజాగా సోనియాగాంధీ త‌న ప్ర‌క‌ట‌న‌తో చెక్ పెట్టారు. తానే కాంగ్రెస్‌కు తాత్కాలిక అధ్య‌క్షురాలిని కాద‌ని.. పూర్తిస్థాయి ప్రెసిడెంట్‌నంటూ.. పార్టీకి సుప్రీం లీడ‌ర్ అని తేల్చి చెప్పేశారు సోనియ‌మ్మ‌.  ఓవైపు సీనియ‌ర్లు పార్టీ నాయ‌క‌త్వంపై అసంతృత్తి వ్య‌క్తం చేస్తుంటే.. ఇటీవ‌లే టీపీసీసీ చీఫ్ అయిన రేవంత్‌రెడ్డి మాత్రం తొలిరోజు నుంచే సోనియ‌మ్మ‌కి జై కొడుతున్నారు. మాట మాట‌కు సోనియ‌మ్మ నాయ‌క‌త్వం.. అంటూ సోనియా జ‌పం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ అధ్య‌క్షురాలిపై త‌న‌కున్న న‌మ్మ‌కం, నిబద్ద‌త‌ను త‌న మాట‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు రేవంత్‌రెడ్డి. క‌నీసం రేవంత్‌రెడ్డికి ఉన్నంత క‌మిట్‌మెంట్ కూడా సో కాల్డ్ సీనియ‌ర్స్ జీ-23 లీడ‌ర్స్‌కు లేక‌పోవ‌డం వ‌ల్లే కాంగ్రెస్‌కి ఈ దుస్థితి దాపురించిందనేది విశ్లేష‌కుల మాట‌.   

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. బీఅల‌ర్ట్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న‌ట్టుండి మ‌బ్బేసింది..మ‌స‌కేసింది. ద‌స‌రా రోజే అక్క‌డ‌క్క‌డా చినుకులు. శ‌నివారం సైతం ప‌లుచోట్ల వాన‌లు. ఇవేమీ సడెన్‌గా ఊడిప‌డిన‌ వ‌ర్షాలు కావు. వాతావ‌ర‌ణ శాఖ ముందే చెప్పింది. శుక్ర‌-శ‌ని-ఆదివారాల్లో ఏపీ, తెలంగాణ‌లో ప‌లుచోట్ల వాన‌లు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. అన్న‌ట్టుగానే.. వెద‌ర్ రిపోర్ట్‌కు త‌గ్గ‌ట్టే తెలుగు స్టేట్స్‌లో వ‌ర్షాలు ప‌డుతున్నాయి.  ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్ల‌డించింది. తెలంగాణ‌లోనూ వాన‌లు ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   ఉత్తర కోస్తాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గాలుల కారణంగా సముద్రంలో అలలు ఎగసి పడనున్నాయ‌ని.. మత్స్యకారులు ఆదివారం వ‌ర‌కూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు.   

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్‌.. క‌మాన్ ఇండియా..

అండ‌ర్ 19లో జాతిర‌త్నాల‌ను సాన‌బ‌ట్టాడు. దేశ‌న‌లుమూల‌ల ఉన్న ఆట‌గాళ్ల‌ను ఆవిష్క‌రించాడు. టీమిండియాకు అనేక మంది యువ క్రికెట‌ర్ల‌ను అందించాడు. అలాంటి రాహుల్ ద్ర‌విడ్‌.. త్వ‌ర‌లోనే ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా సేవ‌లందించ‌నున్నారు. ఆ మేర‌కు బీసీసీఐ ప్ర‌తినిధి మీడియాకు తెలిపారు. రాహుల్ రాక‌.. టీమిండియాకు కేక‌.  దుబాయ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జై షా.. ద్రవిడ్‌ని కలిసి చ‌ర్చించారు. రాహుల్‌ను టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా ఉండేందుకు ఒప్పించారు. 2023 వరకు రెండేళ్ల పాటు కోచ్‌గా ఉండటానికి అంగీకరించారు. ప్రస్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ హెడ్‌గా ద్ర‌విడ్‌ కొనసాగుతున్నారు. జంట ప‌ద‌వుల ప్రాబ్ల‌మ్ రాకుండా త్వ‌ర‌లోనే ఎన్‌సీఏ బాధ్యతల నుంచి తప్పుకొనున్నారు.  రాహుల్ ద్ర‌విడ్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉంటే.. బౌలింగ్‌ కోచ్‌గా పరాస్ మాంబ్రేను తీసుకోనున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్‌ను కొన‌సాగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫీల్డింగ్ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.  టీ20 ప్రపంచకప్‌ తర్వాత ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగియ‌నుండ‌టంతో.. త‌ర్వాతి కోచ్ ఎవ‌ర‌నే దానిపై ఎప్ప‌టినుంచో ఆస‌క్తి నెల‌కొంది. ద్ర‌విడ్‌నే కోచ్‌ను చేస్తార‌ని అంతా అనుకున్నారు. అనుకున్న‌ట్టే.. మాజీ టీమిండియా కెప్టెన్‌.. ది వాల్‌.. రాహుల్ ద్ర‌విడ్ ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్ కానున్నారు. త‌న శిక్ష‌ణ‌తో ఎందరో యువ ఆట‌గాళ్ల‌కు జ‌ట్టుకు అందించిన ద్ర‌విడ్‌.. ఇక‌పై హెడ్ కోచ్‌గా ఇంకెన్ని మిరాకిల్స్ చేస్తారో చూడాలి.. టీమిండియా దూకుడుకు.. మిస్ట‌ర్ కూల్ ద్ర‌విడ్ వ్యూహాలు తోడైతే.. ఇక వాల్డ్ క్రికెట్‌లో భార‌త్‌కు తిరుగే ఉండ‌దు...

కర్రలతో చితక్కొట్టుకున్నారు.. దేవరగట్టు బన్ని ఉత్సవంలో 50 మందికి గాయాలు 

దసరా పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కర్నూల్ జిల్లా హెలగుంద దేవరగట్టు. దసరా రోజున అక్కడ జరిగే బన్ని ఉత్సవం. కళ్లలో భక్తి.. కర్రల్లో పౌరుషం.. వెరసి రక్తాభిషేకం.. అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం. కర్రలతో దొరికిన వాళ్ళని దొరికినట్లు చితగ్గొడితే దేవుడు కరుణిస్తాడు. ఇదే ఇక్కడి సంప్రదాయం.. ఆనవాయితీ కూడా. ప్రతి ఏటా బన్ని ఉత్సవంపై పోలీసులు ఆంక్షలు పెట్టడం, కర్రలతో కొట్టుకోకుండా చూస్తామని ప్రకటనలు చేయడం... కాని పండుగ రోజున ఎప్పటిలానే కర్రల సమరం జరగడం.. రక్తమోడడం జరుగుతూనే  ఉంటుంది.  కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం ఈ ఏడాది కూడా అంతే భక్తితో అంతే విశ్వాసంతో అంతే హింసతో నిర్వహించారు. ప్రతి ఈ సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా దేవరగట్టులో హింస చోటు చేసుకుంది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో రింగులు తొడిగిన కర్రలతో భక్తులు బీభత్సంగా కొట్టుకున్నారు. సుమారుగా ఈ హింసలో 50 మందికిపైగా భక్తులు తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరగట్టులో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు. బన్ని ఉత్సవంలో కర్రలను అరికడతామన్న పోలీసులు చివరికి ప్రేక్షక పాత్ర వహించారు. ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల ఎంతో మందికి తీవ్రగాయాలై మరణించిన ఘటనలూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. ప్రతీ ఏడాదీ ఈ పండుగ నాడు కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. అధికారులు, ప్రభుత్వం కళ్ళెదుటే హింస జరుగుతుంటే.. పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నలు కురిపించింది.అయినా ఈసారి కూడా కర్రల సమరం జరిగింది. 

రాజకీయాల్లో డీఎల్ మళ్లీ యాక్టివ్.. జగన్ రెడ్డే టార్గెట్టా? 

డీఎల్ రవీంద్రారెడ్డి... కడప జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. మైదుకూరు నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో  ఓ వెలుగు వెలిగారు. కడప జిల్లాకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. వైఎస్సార్ తో విభేదాలున్నా కడప జిల్లాలో తనదైన పట్టు సాధించారు.  వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ను ఎదుర్కోవడంలో డీఎల్ నుంచి ముందుంచి అప్పటి కాంగ్రెస్ హైకమాండ్.  రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న డీఎల్.. రాష్ట్ర విభజన తర్వాత యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. జిల్లా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే సడెన్ గా యాక్టివ్ అయ్యారు డీఎల్ రవీంద్రారెడ్డి. తాను 2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో చెబుతానన్నారు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరుతారా లేక టీడీపీ నుంచి పోటీ చేస్తారా.. లేక ఆదినారాయణ రెడ్డి లాగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జై కొడతారా... జనసేనతో కలిసి పోతారా అన్నది చర్చగా మారింది.  2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో DL Ravindra reddy వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఆయన వైఎస్ జగన్ ను కూడ కలిశారు.ఆ ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో ఆయన ycpకి కూడా దూరంగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన డీఎల్.. ఏపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందన్నారు.  రైతును పట్టించుకునే వారే లేరన్నారు. తన సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు.పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎల్ వ్యాఖ్యలను బట్టి ఆయన వైసీపీలో చేరడం కుదరదని తెలుస్తోంది. ఏపీలో దురదృష్ణకరమైన పాలన సాగుతుందని చెప్పారంటే.. ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు డీఎల్ రవీంద్రారెడ్డి. మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడానికి రవీంద్రా రెడ్డి ఆసక్తిని చూపారు. కానీ ఈ స్థానంలో సుధాకర్ యాదవ్ ను టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దింపింది.  కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేసే విషయమై టీడీపీ తేల్చలేదు.ఈ స్థానం నుండి పోటీకి ఆయన దూరంగా ఉన్నారు.తాజాగా ఆయన మళ్లీ యాక్టివ్ కావడం, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో టీడీపీ వైపు మొగ్గు చూపవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

కుటుంబ పార్టీలలో కొడుకులే వారసులు.. రాహుల్ నుంచి కేటీఆర్ వరకు అదే తీరు?

భారత రాజకీయలలో వారసత్వం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వారసత్వ, కుటుంబ రాజకీయాలనే నమ్ముకుంది. నెహ్రూ గాంధీ కుటుంబ  వారసత్వం  పునాదిగానే  కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తోంది మధ్యమధ్యలో ఒకటి రెండు చిన్న బ్రేకులున్నా, కాంగ్రెస్ పార్టీ, నెహ్రు గాంధీ ఫ్యామిలీ పార్టీ అనే ముద్ర అలానే ఉండి పోయింది. నిజానికి, గాంధీ ఫ్యామిలీ  లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు, ఉండదు అనే అభిప్రాయం పార్టీలో నాటుకు పోయింది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బలమైనా బలహీనత అయినా నెహ్రూ గాంధీ కుటుంబమే అనే సూత్రీకరణ జరిగి పోయింది. అదొక రాజకీయ  నానుడిగానూ  స్థిరపడిపోయింది.  ఇప్పుడు వారసత్వ రాజకీయాలు సర్వ సాధారణం అయి పోయాయి. ప్రాంతీయ పార్టీలన్నీ, కుటుంబ పార్టీలే, కుటుంబ పార్టీలన్నీ,వారసత్వ రాజకీయాలను కాదనలేని పార్టీలే. సో... ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పేటెంట్’ హక్కుగా ఉన్న వారసత్వ, కుటుంబ రాజకీయాలు ఇప్పుడు అందిరి హక్కుగా మారిపోయింది. కాంగ్రెస్, తెరాస పార్టీలలో వారసుల పట్టాభిషేకం గురించిన చర్చ జరుగుతోంది. సుమారు 20 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియాగాంధి వయసు దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుకుంటున్నారు. ఆలాగే, తెలంగాణలో20 ఏళ్లుగా అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న తెరాస వ్యవస్థాపక అధ్యక్షడు కేసీఆర్’ కు ఇక విశ్రాంతి ఇవ్వలని కోడు కేటీఆర్ తొందరపడుతున్నారని అంటున్నారు.ఈ నేపధ్యంలో తెరాస అద్యక్ష పదవి కేటీఆర్ కు వారసత్వ హక్కుగా దక్క పోతోందనే మాట వినవస్తోంది.  కాంగ్రెస్ పార్టీలోనూ అక్టోబర్ 16న జరిగే వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో సోనియా గాంధీ అధ్యక్ష పదవినుంచి తప్పుకుని, రాహుల్ గాంధీకి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. నిజానికి, సోనియా గాంధీ 2019 ఎన్నికలకు ముందే కుమారుడు రాహుల్ గాంధీకి వారసత్వ అధికారాన్నిఅప్పగించారు. అంతకు  ముందు కొన్ని సంవత్సరాల పాటు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవిలో కుర్చోపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.కుమార్తె  ప్రియాంకా వాద్రా బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నా, సోనియా గాంధీ పుత్ర వాత్సల్యంతో వారసత్వ అధికారం కుమారుడికే దక్కాలనే బలమైన ఆకాంక్షతో ప్రియాంకకు అవకాశం ఇవ్వలేదు. చివరకు, 2019 లోక్ సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఎలగోలా రాహుల్ గాంధీని అధ్యక్షుని చేసి ఒక తల్లిగా సోనియా చాలా ..చాలా మురిసి పోయారు. అయితే, ఆమె ఆనందం అట్టే కాలం నిలవలేదు.     ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. అధికారం మాట దేవుడెరుగు ప్రతిపక్ష హోదాకు కూడా దిక్కులేకుండా పోయింది. ఆ భయంకర ఓటమిని తట్టుకోలేకనో ఏమో రాహుల్ గాంధీ తొమ్మిది నెలలు అయినా నిండకుండానే  పార్టీ అధ్యక్ష పదివికి రాజీనామా చేశారు. కాడి దించేసి పలాయనం చిత్త గించారు. ఎవరు ఎంతగా బతిమాలినా, బామాలినా రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అనేశారు.చివరకు, మరో మార్గం లేక పార్టీ పగ్గాలు కుటుంబం చేతిలోంచి మరొకరి చేతిలో వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ ఆ భారాన్నిసోనియా గాంధీనే తాత్కాలికంగా తలకెత్తుకున్నారు. అప్పటినుంచి, ఇప్పటి వరకు కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా, భరించారే కానీ, బాధ్యతలు స్వీక రించేందుకు సిద్దంగా ఉన్న ప్రియాంకా వాద్రాకు లేదా మరోకరికో  ఇవ్వలేదు.      నిజానికి భారతీయ సమాజంలో, వారసత్వ హక్కులు కొడుకులకే కానీ, కుమార్తెలకు దక్కకపోవడం ఆచారంగా వస్తోంది. ఇద్దరూ సమానమే, ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి అంటూ చట్టాలు చేసినా వాస్తవంలో, ‘కొడుకు కూతురూ ఇద్దరూ సమానమే, కొండుకులు కొంచెం ఎక్కువ సమానం’ అనే థియరీనే చలామణి అవుతోంది. ఇందుకు కుటుంబ పార్టీలు మినహాయింపు కాదు. నిజానికి  ఒక్క కాంగ్రెస్, ఒక్క సోనియా గాంధీ మాత్రమే, కాదు, వారసత్వ కుటుంబ పార్టీలో అన్నిటిలో, కొడుకులు కొంచెం ఎక్కువ సమానం ఆచారమే కొనసాగుతోంది.   తెరాస విషయాన్నే తీసుకుంటే, ఉద్యమ పార్టీ కుటుంబ పార్టీగా రూపాంతరం చెందే క్రమంలో,మొదలైనా కుటుంబ వారసత్వ హక్కుల పోరాటం, ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కుమార్తె ఎమ్మెల్సీ కవిత మధ్య వారసత్వ వార్ ... చాలా కాలంగా సాగుతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరకు అన్నా చెల్లి ముఖాముఖలు చూసుకోలేని స్థాయికి చేరిందని, తజా ఉదంతాలు ద్రువీకరిస్తున్నాయి అంటున్నారు. కేసీఆర్, ఎప్పుడూ బయటకు  కొడుకు కొంచెం ఎక్కువ సమానం, అని అనలేదు కానీ, ఎందుకనో కారణాలు ఏమిటో, ఎ వత్తిళ్ళు అయన మీద పనిచేస్తున్నాయో తెలియదు కానీ,  చేతల్లో మాత్రం, ఆ పక్షపాతం కనిపిస్తోంది.  నిజానికి కేసీఆర్ కొడుకూ కూతురు ఇద్దరు ఒకే సారి, అమెరికా ఫ్లైట్ దిగారు, ఒకేసారి  రాజకీయ అరంగేట్రం చేశారు. అంతే కాదు ఉద్యమ సమయంలో కేటీఆర్ కంటే కవితే.. కొంచెం ఎక్కువ క్రియాశీలంగా వ్యవహరించారు. తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ బతుకమ్మను, ప్రపంచ బతుకమ్మను చేశారు. తెలంగాణ ఉద్యమానికి వివిధ దేశాల్లోని ప్రవాస తెలంగాణ భారతీయుల మద్దతు కూడగట్టారు.ముఖ్యంగా ఉద్యమానికి, రాజకీయ కార్యకలాపాలకు అవసరమైన నిధులను సమకూర్చడంలో కవిత క్రియాశీల పాత్రను పోషించారు.  అయినా కేసీఆర్ కొడుకును ఎమ్మెల్యే, మంత్రిని చేశారు. బిడ్డను ఎంపీని చేసి అత్తారింటికి తోలినట్లు ఢిల్లీకి తోలారు. ఎంపీగా ఓడిన తర్వాత గుడ్డి గుర్రం పళ్ళు తోమేందుకు తప్ప ఇంకెందుకూ పనికి రాని ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారు. మరో వంక కుమారుడు కేటీఆర్’ను మంత్రిని  చేశారు, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుని చేశారు. రేపో మాపో అధ్యక్షుని ..ఆ తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దమవుతున్నారు. అంటే రాజకీయ వారసత్వానికి కొడుకులే కాని, కూతుర్లు పనికి రారని కేసీఆర్ కూడా రుజువు చేస్తున్నారనే అనుకోవచ్చును.  అలాగే ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో వైఎస్సార్ , పొరుగు రాష్ట్రం తమిళనాడులో కరుణానిధి, బీహార్లో లాలూ, యూపీలో ములాయం అందరూ  కూడా వారసత్వ రాజకీయ అధికారాన్ని కొడుకులకే అప్పగించారు. ఆడ పిల్లలను దూరంగానే  ఉంచారు. ఈ విషయంలో ఇంకెవరైనా ఉన్నారేమో తెలియదు కానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీడీపీ అధినేత చంద్రబాబు అదృష్ట వంతులు.. ఆయనకు ఒకరే కుమార్తె, ఈయనకు ఒకరే కుమారుడు ... పోటీ లేదు ... ఎక్కువ తక్కువ విమర్శ అసలే లేదు.  ఈ ఇద్దరి కంటే ఒరిస్శా సీఎం నవీన్ పట్నాయక్, బగల్ సీఎం మమతా బెనర్జీ, బీస్పీపీ అధినేత్రి మాయావతి... మరింత అదృష్ట వంతులు...పెళ్ళీ లేదు ..పిల్లలు లేరు ... ఏక్ నిరంజన్ ..ప్రధాని మోడీ కూడా అంతే కానీ, బీజేపీలో ఇంకా వారసత్వ రాజకీయ సుగుణం మాత్రం ఇంకా రాలేదు. 

బద్వేల్ బరిలో తేలేదేమిటి ? కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీనా? 

హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటుగా తెలంగాణ పొరుగు రాష్రం ఆంధ్ర ప్రదేశ్ లోని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా, కడపలోని బద్వేల్ శాసన సభ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడా, ఇక్కడ కూడా ఒకే రోజు అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. రెండు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు ఒకే రోజు నవంబర్ 3న జరుగుతుంది. అయినా  రెండు రాష్ట్రాలలోని రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు జరుగతున్న ఉపఎన్నికల మధ్య ఇంతకు మించిన  పోలిక లేదు. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. అధికార తెరాసలో వచ్చిన అంతర్గత కుమ్ములాటలు, కుటుంబ కలహాల కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది.  కానీ, బద్వేల్ నియోజక వర్గం ఉప ఎన్నికకు రాజకీయాలు కారణం కాదు. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.కాగా, వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది.ఈ నేపధ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయి, వారి కుటుంబ సభ్యులు పోటీ చేసిన సందర్భంలో, ప్రత్యర్ధులు ఎవరు పోటీ చేయరాదని, ఉమ్మడి రాష్టం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం,జనసేన పోటీ చేయరాదని నిర్ణయించుకున్నాయి. అయితే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, అనవసరమే అయినా, ఫలితం ముందుగానే తెలిసి పోయినా ఎన్నిక క్రతువు అనివార్యంగా జరుగుతోంది. బీజేపీ యువ నేత పనతల సురేశ్ బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్ల్యే కమలమ్మ పోటీ చేస్తన్నారు. అయినా ఉపన్నికల్లో గెలిచేది ఎవరో వేరే చెప్ప నక్కర లేదు, నామినేషన్’కు ముందే వైసీపే అభ్యర్ధి గెలిచారు. ముందుగా పోటీకి సిద్ధమై అబ్యార్ధిని ప్రకటించిన తెలుగు దేశం పార్టీ పోటీలో కొనసాగి ఉంటే, లెక్క మరోలా ఉండేది. కానీ, జనసేన  పోటీ నుంచి తప్పుకున్న తర్వాత టీడీపీ కూడా స్నుభుతి వైపు మొగ్గు చూపింది. ఇలా, గత ఎన్నికలలో 70 వేలకు పైగా ఓట్లు వచ్చిన టీడీపీ పోటీ నుంచి తప్పుకుని, ఆటలో అరటి పండు లాంటి బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పోటిలో ఉండడంతో  బద్వేల్ ఉప ఎన్నిక చప్పగా మారింది. నిజానికి ఏపీలో జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ రెంటికీ ఓటు బ్యాంకే కాదు ఉనికే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో, బద్వేల్’లో బీజీపీకి అక్షరాల 3,125వస్తే కాంగ్రెస్ పార్టీకి 2,148 ఓట్లు వచ్చాయి . అంటే జాతీయ పార్టీలురెంటికీ కలిపి కూడా ఐదు వేలకు మించి ఓట్లు పడలేదు. కాంగ్రెస్’కు నోటా కంటే వెయ్యికి పైచిలుకు ఓట్లు తక్కువ ఓట్లు పోలైతే, బీజేపీకి నోటా కంటే ఆరు ఓట్లు తక్కువ పోలయ్యాయి. నోటాకు  3 వేల 31 ఓట్లు పోలయ్యాయి. జనసేనకు కూడా గొప్పగా ఏమీ ఓట్లు రాలలేదు, ఆపార్టీకి  4వేల 283 ఓట్లు మాత్రమే వచ్చాయి.గెలిచిన వైసీపీకి 84వేల 955 ఓట్లు వస్తే… టీడీపీ 76 వేల 603 ఓట్లు సాధించింది. ఈ లెక్కన చూస్తే, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు  వ్రతం చెడ్డా  ఫలితం దక్కదని తెలిసిపోయింది.  అయినా జాతీయ పార్టీలు ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయి అనేది, రాజకీయ పండితులకు కూడా పజిల్ గానే కనిపిస్తోంది.   అయితే ఇదే ఓ రకంగా తిక్కే అయినా ఈ తిక్కకూ ఓ లెక్కుందని అంటున్నారు బీజేపే, కాంగ్రెస్ నాయకులు. “ఈఎన్నికల్లో ఓడిపోతామన్న విషయం మాకూ తెలుసు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రజల్లో ఎవరికీ ఎక్కవ ఆదరణ వుంది ..,, ముఖ్యంగా పోటీలో లేని తెలుగు దేశం పార్టీకి ఉన్న, 76 వేల పై చిలుకు ఓటర్లు, ఎటు వైపు మొగ్గు చూపుతారు ఉప ఎన్నిక ఫలితాలతో తేలిపోతుంది”.. అందుకే అ లెక్కేదో తేల్చుకునేందుకే పోటీకి దిగుతున్నామని జాతీయ పార్టీల నాయకులు చెప్పు కొస్తున్నారు.ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీకి ఉండే లెక్కలు ఆ పార్టీకి ఉన్నాయని అంటున్నారు. వైసీపే వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎటు మొగ్గు చూపుతారో తెలుసుకుని, భవిష్యత్ వ్యూహం రచించుకోవచ్చని, ఎన్నికల పొత్తులు నిర్నయిన్చుకోవచ్చని తెలుగు దేశం పార్టీ చూస్తోందన అంటున్నారు. అందుకే గెలుపు ఓటముల విషయంలో ఎలాంటి ఆసక్తి లేక పోయినా, జాతీయ పార్టీలలో జీరో ..ఎవరు ..హీరో ఎవరు తేల్చే ఎన్నికలుగా రాజకీయ వర్గాలు ఆసక్తి చూపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

ద‌స‌రా రోజు జ‌మ్మి చెట్టుకు పూజ చేస్తే ఏం జరుగుతుంది?

విజయదశమి.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్పూర్తి తో, చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారు. విజయదశమికి సంబంధించి చాలా కథలు ఉన్నాయి. అలాగే దసరా రోదున జమ్మి చెట్టు ప్రత్యేకం. విజ‌య ద‌శ‌మి రోజు జ‌మ్మి చెట్టును పూజించ‌డం చిన్న‌త‌నం నుంచి చూస్తూనే ఉన్నాం. శమీ పూజ చేసి జ‌మ్మి ఆకుల‌ను పెద్ద‌ల‌కు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఎన్నో ఏండ్లుగా ఆన‌వాయితీగా వ‌స్తూనే ఉంది. ఇలా దసరా రోజు జ‌మ్మి ఆకులను బంగారంలా పంచుకుంటార‌ు. అయితే జ‌మ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? శ‌మీ పూజ త‌ర్వాత జ‌మ్మి ఆకుల‌ను ఎందుకు పంచుకుంటార‌నే కార‌ణం మాత్రం తెలియ‌దు. కానీ దీని వెనుక పురాణ గాథ‌లు చాలా  ఉన్నాయి.    పురాణాలు ఏం చెబుతున్నాయి? రుగ్వేద కాలం నుంచి జ‌మ్మి ప్ర‌స్తావ‌న ఉంది. జ‌మ్మి చెట్టును సంస్కృతంలో శ‌మీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవ దాన‌వులు పాల స‌ముద్రాన్ని చిలికిన‌ప్పుడు దేవ‌తా వృక్షాలు ఉద్భ‌వించాయ‌ట‌. అందులో శ‌మీ వృక్షం కూడా ఒక‌టి. అప్ప‌ట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉప‌యోగించేవారు. అందుకే దీన్ని అర‌ణి అని కూడా పిలుస్తారు. త్రేతా యుగంలో లంక‌కు వెళ్లే ముందు శ్రీ రాముడు శ‌మీ పూజ చేసి వెళ్లాడంట‌. అందుకే రావ‌ణుడి మీద విజ‌యం సాధించ‌డానికి రామాయ‌ణ గాథ చెప్తోంది. అలాగే మ‌హా భార‌తంలో పాండ‌వులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు త‌మ ఆయుధాల‌ను ఒక మూట‌లో కట్టి శ‌మీ వృక్షంపై ఉంచారు. త‌మ అజ్ఞాత వాసం పూర్త‌య్యే వ‌ర‌కు తమ ఆయుధాల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడ‌మని శ‌మీ వృక్షాన్ని కోరి న‌మ‌స్క‌రించి వెళ్లారంట‌. అజ్ఞాత వాసం పూర్త‌యిన త‌ర్వాత జ‌మ్మి చెట్టు వ‌ద్ద‌కు వ‌చ్చిన పాండవులు శ‌మీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాల‌ను తీసుకున్నారు. అనంత‌రం కౌర‌వుల‌తో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్ప‌ట్నుంచి విజ‌య ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షాన్ని పూజిస్తే అప‌జ‌యం ఉండ‌ద‌ని ఒక న‌మ్మ‌కంగా మారింది. దసరా రోజు సాయంత్రం స‌మ‌యంలో జ‌మ్మి చెట్టు వ‌ద్ద అప‌రాజితా దేవిని పూజించి.. శ‌మీ శ‌మ‌య‌తే పాపం శ‌మీ శ‌త్రు వినాశినీ.. అర్జున‌స్య ధ‌నుర్ధారీ రామ‌స్య ప్రియ ద‌ర్శ‌నం.. .. అని శ్లోకం చ‌దివి జ‌మ్మి చెట్టు చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసిన త‌ర్వాత ఆ చెట్టు ఆకుల‌ను తుంచుకుని వాటిని బంగారంలా ఇంటికి తీసుకెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకుల‌ను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జ‌మ్మి ఆకుల‌కు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్య‌త రీత్యా వాటిని బంగారంతో స‌మానంగా భావిస్తారు. జమ్మిని పూజించ‌డం అంటే జీవితంలో స‌కల విజ‌యాలు సాధించాల‌ని కోరుకోవ‌డ‌మ‌నే అంద‌రూ న‌మ్ముతారు. జ‌మ్మి చెట్టు ప్ర‌త్యేకత ఏంటి..   జ‌మ్మి చెట్టు ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా స‌రే సులువుగా పెరుగుతుంది. నీటి ల‌భ్య‌త లేకున్నా  ఎక్కువ‌కాలం బ‌తుకుతుంది. ఈ జ‌మ్మి చెట్టు రాలే ఆకులు రాలుతుంటే కొత్త ఆకులు వ‌స్తూ ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయిన‌ట్లు ఎప్పుడూ క‌నిపించ‌దు. ఇప్ప‌టి యువ‌త‌కు, న‌గ‌ర‌వాసుల‌కు ఈ చెట్టు ఉప‌యోగాల గురించి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. గ్రామీణ జీవితంలో జ‌మ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్లు భూసారాన్ని పెంచుతాయి. జ‌మ్మి చెట్టులోని ప్ర‌తి భాగం నాటు వైద్యంలో ఔష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటార‌ని న‌మ్ముతారు. అందుకే శ‌మీ వృక్షం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల‌ని చెబుతుంటారు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి కాబ‌ట్టే దసరా నాడు రైతులు కూడా త‌మ ప‌శుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జ‌మ్మి చెట్టును పూజిస్తారు..

కాంగ్రెస్‌లోకి డీఎస్‌!.. అర్వింద్ కూడా? రేవంత్ వ్యూహం అదుర్స్‌..

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను క‌లిశారు. మామూలుగా అయితే ఇదేమంత ఆస‌క్తిక‌ర విష‌యం కాక‌పోవ‌చ్చు. కానీ, ఆ మాజీ పీసీసీ చీప్ ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. అందులోనూ కేసీఆర్‌తో తేడాలొచ్చి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక డీఎస్ త‌న‌యుడు అర్వింద్‌.. బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ ఎంపీ. మ‌రో త‌న‌యుడు సంజ‌య్ ఇటీవ‌లే రేవంత్‌ను క‌లిసి కాంగ్రెస్‌కు జై కొట్టారు. అలాంటి డి.శ్రీనివాస్‌ను ఇంటికెళ్లి మ‌రీ క‌లిసొచ్చారు రేవంత్‌రెడ్డి.  ఇటీవ‌ల‌ డీఎస్‌ కిందపడిపోగా చెయ్యి విరిగింది. ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు వెళ్లారు రేవంత్‌రెడ్డి. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని, డి.శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వెళ్లిన‌ట్టు రేవంత్‌రెడ్డి చెప్పారు. పైపైన చూస్తే.. ఇదే మామూలు ప‌రామ‌ర్శ‌లానే అనిపించినా.. ఈ ప‌రిణామం రేవంత్‌రెడ్డి రాజ‌కీయ చాతుర్యానికి నిద‌ర్శ‌నం అంటున్నారు.  వైఎస్‌-డీఎస్ కాంబినేష‌న్ ఉమ్మ‌డి రాష్ట్రంలో బంప‌ర్ హిట్‌. రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు వారిద్ద‌రు. అలాంటి ఉద్దండుడైన డి.శ్రీనివాస్‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ప్రాభ‌వం కోల్పోవ‌డంతో టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సైతం ఆయ‌న‌కు మంచి ప్రాధాన్య‌మే ఇచ్చారు. రాజ్య‌స‌భ‌కు పంపించారు. కానీ, ఆ త‌ర్వాత డీఎస్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. కేసీఆర్ తీరు న‌చ్చ‌క అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్నా.. త‌న‌యుడు అర్వింద్ మాత్రం బీజేపీలో యాక్టివ్‌గా కొన‌సాగుతున్నారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్ గెల‌వ‌డంతో డీఎస్ స‌హ‌కారం ఉందంటారు. ఇక మ‌రో త‌న‌యుడు సంజ‌య్ మాత్రం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వం మెచ్చి ఇటీవ‌లే కాంగ్రెస్ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. సంజ‌య్ కాంగ్రెస్ వైపు చూట్టానికి డి.శ్రీనివాసే కార‌ణ‌మ‌ని చెబుతారు. దీంతో.. రేవంత్‌రెడ్డి మ‌రో అడుగు ముందుకేశారు. ప‌రామ‌ర్శ‌క‌ని డీఎస్ ఇంటికెళ్లి ఆయ‌న్ను తిరిగి కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ మాదిరి కాకుండా.. కాంగ్రెస్‌లో డీఎస్‌కు స‌ముచిత స్థానం, ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ప‌నిలో ప‌నిగా బీజేపీ ఎంపీ అర్వింద్‌కు సైతం న‌చ్చ‌జెప్పి పార్టీలో చేర్పించాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.  నిజామాబాద్‌కు ప‌సుపు బోర్డు తీసుకొస్తానంటూ వాగ్ధానం చేసి.. కేసీఆర్ కూతురు క‌విత‌ను ఓడించి.. ఎంపీగా గెలిచారు ధ‌ర్మ‌పురి అర్వింద్‌. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయ‌న బీజేపీ ఎంపీ అయినా.. నిజామాబాద్‌కు మాత్రం ప‌సుపు బోర్డు తీసుకురాలేక‌పోయారు. ఆ విష‌యంలో నిజామాబాద్ రైతులు అర్వింద్‌పై-బీజేపీపై ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈసారి బీజేపీకి గుణ‌పాఠం చెప్పడం ఖాయం అంటున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టిన రేవంత్‌రెడ్డి.. అర్వింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తే గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని.. అందుకే కాంగ్రెస్‌లో చేరితే బెట‌ర‌ని.. రైతుల కోపం బీజేపీ మీద‌నే కానీ, అర్వింద్ మీద కాద‌ని.. డీఎస్‌కు వివ‌రించి చెప్పారట‌. ఆ మేర‌కు అర్వింద్‌ను ఒప్పించి కాంగ్రెస్‌లో చేరేలా చూడాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. ఇలా.. ఇటు డీఎస్‌ను, అటు అర్వింద్‌ను ఒకేసారి పార్టీలో చేరేలా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. సంజ‌య్ ద్వారా ఆ మేర‌కు ధ‌ర్మ‌పురి ఫ్యామిలీతో రాజ‌కీయం న‌డిపిస్తున్న రేవంత్‌రెడ్డి ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి..

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి! 

మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కెగా పని చేశారు. విప్లవోద్యమంలో ఆర్కేది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు.  2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది.  సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకున్నారు. అయితే ఆర్కే మృతిపై సమాచారం లేదని విరసం నేత కల్యాణరావు తెలిపారు. 

కేటీఆర్ వర్సెస్ కవిత? టీఆర్ఎస్ లో ఏమి జరుగుతోంది.. పెనుమార్పులు తప్పవా? 

తెలంగాణ రాజకీయాలు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఆసక్తికర చర్చకు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఎన్నిక షెద్యూలు వచ్చే వరకు, ముఖ్యమంత్రి మొదలు, (కేటీఆర్ మినహా) పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఫోకస్ మొత్తం హుజూరాబాద్ మీదనే పెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ ఉండగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలైంది.  ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, కారణాలు ఏవైనా హుజూరాబాద్  ఉప ఎన్నిక మీద ముందున్న శ్రద్ద ఆసక్తి ఫోకస్ ఇప్పుడు లేవేమో అనిపించేలా ఆయన కార్యక్రమాలలో మార్పు కనిపిస్తోంది. చినజీయర్ స్వామి,  యాదాద్రి ఆలయ అభివృద్ధి, ప్రారంభోత్సవం వంటి ఇతర అంశాల మీద ముఖ్యమంత్రి దృష్టిని మరల్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పొలిటికల్ ఫోకస్ ను ఎందుకు హుజూరాబాద్ నుంచి  పక్కకు తప్పించారో ఏమో కానీ,అదే సమయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షడు, మంత్రి కేటీఆర్ పార్టీ సంస్థాగత ఎన్నికలు, ద్వి దశాబ్ది  ఉత్సవాల ప్రకటనతో హుజూరాబాద్ ఉప ఎన్నిక, నాట్ సో ఇంపార్టెంట్,  అంత ముఖ్యమైన విషయం కాదు అన్న సంకేతాలను పంపారు. దీంతో, హుజూరాబాద్’నుంచి ముఖ్యమంత్రి వెనకడుగు వేయడం కూడా ఆ వ్యూహంలో భాగమే అనే, అనుమానాలు బలపడుతున్నాయి.  తెరాస సంస్థాగ‌త ఎన్నిక‌ల్లో భాగంగా ఇప్ప‌టికే గ్రామ‌, మండ‌ల, జిల్లా స్థాయిల్లో కార్య‌వ‌ర్గాల నియామకాలు పూర్తయ్యాయి. ఈ ప్ర‌క్రియ‌లో ప్రధాన ఘట్టం పార్టీ అధ్యక్షుని ఎన్నిక అక్టోబ‌ర్ 25న జరుగుతుందని, తెరాస అధ్యక్షునిగా పోటీ చేయాలనుకునే వారు అక్టోబ‌ర్ 17 నుంచి నామినేష‌న్ల‌ను వేయవచ్చని కేటీఆర్ ప్రకటించారు. అయితే, పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆరే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రతి సారీ ఏకగ్రీవంగానే ఆయన ఎన్నికవుతున్నారు. అయితే ఈ సారి, ఆ ఆనవాయితీ మారుతుందా? తెరాసకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? అంటే, పార్టీలో అవుననే మాటే ఎక్కువగా వినవస్తోంది.  ఈ సారి కేసీర్ తప్పుకుని, కేటీఆర్ కు అవకాశం ఇస్తారని, అందుకోసమే, ఎవరూ అడ్డుకునే అవకాశం లేకుండా షెడ్యూలు ఫిక్స్ చేశారని పార్టీ వర్గాల సమాచారం.కీటీఅర్ కు పార్టీ, ప్రభుత్వ ఉత్తరాదికారి బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భావిస్తున్నారని అందుకే, ఈటల పై వేటు మొదలు వ్యూహాత్మకంగా  ఒక్కొక అడుగు వేసుకుంటూ వస్తున్నారని అంటున్నారు. ఇప్పుడే కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ,అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో. ఆయన త‌న‌కు కావాల్సిన వారికి టికెట్లు ఇచ్చి, భ‌విష్య‌త్తుల్లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అడ్డు లేకుండా, ఏ స‌మ‌స్యా రాకుండా చేసుకోవ‌డానికి వీలు ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని అంటున్నారు.  నిజానికి కేటీఅర్ కు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో పదోన్నతి కలిపించే విషయంగా, కుటుంబంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలు,విభేదాల కారణంగానే, కవిత పుట్టింటికి (ప్రగతి భవన్)కు దూరంగా ఉంటున్నారని, ఈ విషయంలో కేటీఆర్, కవిత మధ్య దూరం బాగా పెరిగిందనే వార్తలు చాలా కాలంగా వినవస్తున్నాయి. రాఖీ పండగకు కవిత అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేదు. సరే,అప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు కాబట్టి రాలేక  పోయారు అనుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మకు ప్రాచుర్యం కలిపించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  పుట్టిల్లు, ప్రగతి భవన్’ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనక పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. అదెలా ఉన్నా,  హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే తెరాసలో పెను మార్పులు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.. సందేహలు బలపడుతున్నాయి.