భారీ బడ్జెట్ సరే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు సంగతేంటి?!

భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ మురిసి పోతున్న ఏపీ సీఎం జగన్ మునిసిపల్ ఉద్యోగాల వేతనాల పెంపు గురించి ఎందుకు పట్టించుకోరని కార్మికులు నిలదీస్తున్నారు.  విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కర్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో  సీఐటీయూ నేతలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  కాంట్రాక్ట్ కార్మికుల  రెగ్యులరైజేషన్ పై ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాలు తొలగించారని విమర్శించారు.   భారీ అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టి మునిసిపల్ కార్మికుల వేతనాల పెంపునకు సొమ్ము లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమానపనికి సమాన వేతనం అంటూ కోర్టు తీర్పులు ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ నామమాత్రపు వేతనాలిస్తున్నారని ఆరోపించారు.   ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన.. మోడీ, అమిదత్ షాలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ముగిసింది. ఆయన అక్కడ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. తన ఒక రోజు ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు.  వీరిరువురితో రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించారని చెబుతున్నారు.  విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి, హోంమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు.  కాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ హడావుడిగా హస్తిన వెళ్లి ప్రధాని, హోంమంత్రులతో భేటీ కావడానికి కారణాలేమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ పొడగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండగా ఈడీ ఆయనను కోర్టులో హాజరు పరిచింది. కస్టడీ పొడిగించాల్సిందిగా కోరింది. కోర్టు ఆయనను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టు కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఈడీని ఆదేశించింది. మద్యం కుంభకోణంలో సిసోడియాను ఈడీ ఈ నెల 9న ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా ఇదే కేసులో సీబీఐ మనీష్ సిసోడియాను గత నెల 26న అరెస్టు చేసింది.  అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.  ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో, మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  

బండి సంజయ్ దీక్ష భగ్నం

టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసనను పోలీసులు భగ్నం చేశారు.  టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయింపు కార్యక్రమం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్లను అక్కడ నుంచి తొలగించే సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి సృహతప్పి పడిపోయాడు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు భూతద్దంలో భవిష్యత్ చిత్రం!

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఫలితం ముఖ్యమంత్రి జగన్ కు భవిష్యత్ చిత్రాన్ని భూతద్దంలో చూపించేసిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంత కాలం ఒక్క ఉత్తరాంధ్రలోనే వైసీపీకి అదీ మంత్రులకు ఎదురుగాలి వీస్తోందన్న అభిప్రాయం ఉండేది. కానీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే.. ఒక్క ఉత్తరాంధ్ర అనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వైసీపీ ఎదురీదుతోందని పక్కాగా అర్థమైపోయిందని చెబుతున్నారు.   రాయలసీమ, కోస్తా, పల్నాడు ప్రాంతాలు ఏవైనా అధికార వైసీపీ ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడికక్కడ జగన్ పార్టీకి ఎదురీతే గతి అని తేటతెల్లమైపోయిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరి  గుండెల్లోనూ ఓటమి భయాన్ని పరుగులు తీయిస్తోంది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వై నాట్ 175’ అని ఒక వైపు డాంబికంగా చెబుతుంటే.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి కళ్లకు కడుతోంది.  సర్కార్ వారి ఐప్యాక్ సహా ఒకటికి మూడు సర్వేలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉందన్న నివేదికలు ఇచ్చేశాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ నివేదికలు అక్షర సత్యాలన్న సంగతిని నిర్ద్వంద్వంగా తేటతెల్లం చేసేశాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఫలితాల సరళిని బట్టి అవగతమౌతోంది. మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో హడావుడి చేసినా..  చివరికి కానుకలు పందేరం చేసినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్తరాంధ్ర లో  టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి హవాను నిలువరించలేకపోయారు. రౌండు రౌండుకూ ఆయన ఆధిక్యత పెరుగుతూ వస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆయన దరిదాపులకు కూడా రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రలోభాల పర్వానికి తెరతీసిన వైసీపీ..  పెద్ద ఎత్తున నేతల్ని మోహరించింది. విశాఖే రాజధాని, అక్కడి నుంచే పాలన అంటూ ఊరూవాడా ఏకం చేసింది. అయితే అక్కడి ప్రజలు మాత్రం స్పష్టతతో ఉన్నారు.   అక్కడ తెలుగుదేశం అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి అధికార వైసీపీకి కచ్చితంగా ఇబ్బందికరమే.  అదే విధంగా తూర్పు రాలయసీమలోనూ వైసీపీకి శృంగభంగం తప్పని పరిస్థితే కనిపిస్తోంది. అక్కడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి పరాజయం దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ విజయం కోసం దొంగనోట్లపై ఆధారపడి.. సకల విలువలకూ తిలోదకాలిచ్చేసినా వైసీపీకి గడ్డు పరిస్థితే ఎదురు కావడం రాష్ట్రంలో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా ప్రజలలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక  పశ్చిమ రాయలసీమలో కూడా తెలుగుదేశం గట్టిపోటీ ఇస్తోంది. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైసీపీ గెలుపు సునాయాసమన్న అంచనాలు తొలి నుంచీ ఉన్నాయి. వైసీపీకి పెట్టని కోటలాంటి ఈ ప్రాంతంలో కూడా పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో జరుగుతుండటం చూస్తే వైసీపీ కోటలు బీటలు వారిపోతున్న దృశ్యమే ఆవిష్కృతమౌతోంది.  ఈ ఎన్నికలతో సంబంధం లేకుండానే జగన్ ఇప్పటికే చేయించుకున్న సర్వేలు రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని స్పష్టం చేసేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే.. వైసీపీకి మళ్లీ అధికారం అన్న మాటే లేదని తేటతెల్లం చేసేశాయని పరిశీలకులు అంటున్నారు.  మంత్రుల విజయావకాశాలపై ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ పాష, నారాయణ స్వామి, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా మినహా మిగిలిన ఎవరికీ విజయావకాశాలు లేవని తేలింది. వాస్తవానికి విజయావకాశాలు ఉన్నాయని సర్వే లో పేర్కొన్న మంత్రులు కూడా కచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం లేదన్నదే ఆ సర్వే సారాంశం. అయితే మిగిలిన మంత్రుల కంటే వీరి పరిస్థితి ఓ రవ్వ మెరుగ్గా ఉందని సర్వే పేర్కొంది. అయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ఫలితాలను బట్టి చూస్తే.. వీరి పరిస్థితీ దయనీయంగానే ఉందని తేటతెల్లమైపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   అదలా ఉంచితే.. ఉత్తరాంధ్ర మంత్రులలో ఒకరు కూడా గెలిచే అవకాశమే లేదని ఐప్యాక్ సర్వే ఇప్పటికే పేర్కొనగా, తాజాగా ఉత్తరాంధ్రపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం.. ఆ సర్వే నే బలపరిచింది. పరాజయం ఖరారు అని సర్వే పేర్కొన్న మంత్రులలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు వంటివారు కూడా ఉన్నారు.  ఇక సిదిరి అప్పలరాజు భూ కబ్జాలు, అక్రమాలపై ప్రజాగ్రహం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో మరింత ప్రస్ఫుటమైంది. ఓటర్లు అవినీతిపై స్లిప్పుల రూపంలో ఓటుతో  పాటు బ్యాలెట్ బాక్కులో వేశారు. సిదిరి అప్పలరాజు అవినీతి పరుడు ఆయన మాకు వద్దు అంటూ ఆ స్లిప్లుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినా అధికారులు దీనిని రహస్యంగా ఉంచేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

సీపీఎస్ రద్దు అంటే ఇదా జగన్ రెడ్డీ!

వైసీపీ అధిపూత జగన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉండగా చేసిన పాదయాత్రలో  సీపీఎస్ రద్దు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అదీ కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన జస్ట్ వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకొంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ  ఘన విజయం సాధించింది. దీంతో   జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  నాటి నుంచి నేటి వరకు.. అంటే  ఈ నాలుగేళ్లలో.. సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి  జగన్ స్పందించ లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం నెలకొంది. ఆ క్రమంలో ఉద్యోగులు.. నిరసనలు, ఆందోళనలతో రోడ్డు ఎక్కడమే కాదు.. ఉద్యమాలు సైతం చేపట్టారు. అలాగే నిరసన దీక్షలూ చేశారు.   అలాంటి వేళ.. ఈ అంశంపై జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీపీఎస్ రద్దు చేయలేమని ప్రకటించారు.   సీపీఎస్ రద్దు విషయంలో సీఎం వైయస్ జగన్ అవగాహన లేకుండా హామీ ఇచ్చారని కుండబద్దలు కొట్టేశారు. ఓ వేళ  సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటే...   రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాత్రం నాన్చుడు బేరం లేకుండా లెక్క తేల్చేశారు.   దీంతో సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ వైఖరి ఏమిటో ఉద్యోగులకు అర్థమైపోయింది. అయితే తాజాగా సీపీఎస్ రద్దు అంటే..  కొత్త అర్ధాన్ని.. పరమార్ధాన్ని వివరిస్తూ..  ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో సీ అంటే క్యాపిటల్... (రాజధాని అమరావతి)... పీ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్..  ఎస్ అంటే స్పెషల్ స్టేటస్.. (ప్రత్యేక హోదా) రద్దు చేస్తానని నాటి పాదయత్రలో వైయస్ జగన్ చెప్పారని.. కానీ తామే అర్థం చేసుకోలేకపోయామని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. ఏ యే పథకాలు ఎలా అమలు చేస్తామో వివరిస్తూ.. నాటి ప్రతిపక్ష నేతజగన్..  తన పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెడితే.. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని..  అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని..  అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అభివృద్ధికి బాటలు   వేస్తామని ఆయన ప్రకటించారు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కూడా నిర్మించిన్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు.   ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అటు ప్రభుత్వ ఉద్యోగులు.. ఇటు అన్ని వర్గాల ప్రజలు గంపగుత్తగా జగన్ కు జై కొట్టారు. వైసీపీకి   ఓట్లు గుద్దేశారు. దాంతో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గద్దెనెక్కారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదు సరికదా...  రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్ట పోయిన.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కూడా లేదు..  ప్యాకేజీ ఇస్తామని అప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో...  అలాగే ఓకే అంటూ సీఎం జగన్ మరో మాట మాట్లాడడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.   ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి కాదని.. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రిగా  జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు కొత్త పల్లవి అందుకోవడంతో.. రాజధానికి భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతులు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారు.  మరోవైపు రాజధాని అమరావతికి ఇచ్చిన భూములు నిరూపయోగంగా మారిపోయాయి. అలాంటి వేళ.. తాను అధికారంలోకి వస్తే..  సీపీఎస్ రద్దు చేస్తానంటే..  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంతా అనుకున్నామని...  కానీ అది కాదని.. సీపీఎస్ రద్దు అంటే కేపిటల్, పోలవరం, స్పెషల్ స్టేటస్ రద్దుఅని తెలుసుకోలేకపోయామనీ  నెటిజన్లు  అంటున్నారు. అందుకు సంబంధించిన  ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరీంనగర్ లో తెలుగుదేశం ఆవిర్బావ సభ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29వ తేదీ. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. తెలంగాణలోని కరీంనగర్‌లో నిర్వహించాలని తెలుగుదేశం   ఆధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంతోపాటు ఆంబేద్కర్ మైదానాన్ని సైతం పార్టీ నేతలు ఇప్పటికే పరిశీలించి... వాటిలో ఒకటి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు  బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు దూసుకుపోతున్నారు. ఇంకో వైపు తెలంగాణలో ఎలాగైనా గద్దెనెక్కి.. గులాబీ బాస్ కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు...  మోదీ, అమిత్ షా ద్వయం సారథ్యంలో తెలంగాణలో  బీజేపీ నేతలకు స్పష్టమైన సూచనలు.. సలహాలు అందిస్తూ ముందుకు సాగుతోంది. అలాంటి పరిస్థితుల నడుమ రాష్ట్రంలో సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఆ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ను చంద్రబాబు నియమించారు. అనంతరం గత ఏడాది ఖమ్మం నగరంలో తెలంగాణ నిర్వహించిన శంఖారావ సభ సూపర్... డూపర్...  సక్సెస్ అయ్యింది. దీంతో పసుపు పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అలాగే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని   పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ   హయాంలో తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలతోపాటు శాంతి భద్రతలు, హైదరాబాద్ నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను సైతం ప్రజల్లోకి పార్టీ నేతలు చాలా బలంగా తీసుకు వెళ్తున్నారు.        అసలు అయితే ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు... సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని పార్టీ ముందుగా నిర్ణయించింది. కానీ కంటోన్మెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చిలో విడుదల కానుందని..  ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్‌ వేదికగా జరపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.   కరీంనగర్ సభ తర్వాత ఇటువంటి సభలు మరిన్ని సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి ప్రణాళికలు  సిద్ధం చేసే పనిలో తెలుగుదేశం అగ్రనాయకత్వం నిమగ్నమైనట్లు చెబుతున్నారు.  

కడప ఎంపీకి దారులు మూసుకుపోయాయా?

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి దారులు మూసుకు పోయాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అరెస్టు ఇక అనివార్యం అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వివేకానందరెడ్డికి తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది.  సీబీఐ విచారణకు సంబంధించి ఆయన హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ మేరకు సీబీఐను ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనీ, విచారణపై స్టే ఇవ్వాలనీ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే ఆ రెండు అంశాలలోనూ కూడా కోర్టులో అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. విచారణ సందర్భంగా న్యాయవాది హాజరుకు అనుమతించినా, విచారణలో ఎటువంటి జోక్యం కలుగ జేసుకోకూడదని స్పష్టంగా కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో అరెస్టు కాకుండా అవినాష్ రెడ్డికి ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.   దీంతో ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఐదోసారి కూడా విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరైన ప్రతి సారీ ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైన నేపథ్యంలో ఆయన అరెస్టుకు ఇక ఎలాంటి అడ్డంకులూ లేవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  

వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యం ఎవరికి లాభం? జనంలో చర్చ!

వివేకా హత్య కేసు దర్యాప్తు జగుతున్న తీరు..చేరుకుంటున్న ముగింపు దిశ చూస్తే.. ఈ కేసులో సూత్ర ధారులు, పాత్రధారుల పాత్ర అతి తొందరలోనే వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఎవరైనా భావిస్తారు. ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా.. వారిపై అనుమానాలు వెల్లువెత్తడం ఖాయం. సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా  సాధ్యమైనంత వరకూ జాప్యం జరిగేలా చూడటమే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలు అటువంటి అనుమానాలకే ఆస్కారం కలిగిస్తున్నాయి. అలా ప్రయత్నిస్తున్నవారే ఈ కేసులో దోషులు అన్న నిర్ధారణకు జనం వచ్చేందుకు ఆ ప్రయత్నాలే ఆస్కారం కలిగిస్తున్నాయి. టెక్నికల్ గా కేసులు, పిటిషన్లతో దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటూ.. జనం దృష్టిలో పలుచన అవ్వడమే కాకుండా..  నేరం చేసినట్లుగా ప్రజలు నమ్మడానికి వారి ప్రయత్నాలు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు చాలవా అన్నట్లు.. హతుడు వైఎస్ వివేకా వద్ద పిఏగా పని చేసిన కృష్ణారెడ్డి కూడా హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్ లో వైఎస్ వివేకా హత్య ఆస్తుల కోసమే జరిగి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యూహమే జగన్ అక్రమాస్తుల కేసు విషయంలోనూ అసుసరించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ కేసు దర్యాప్తు, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.    

జనసేనాని కుండ బద్దలు కొట్టేశారు.. జగన్ కు ఇక చుక్కలే!

వచ్చే ఎన్నికలలో అధికార పార్టీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు నేరుగా కాకపోయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అక్కడితో ఆగలేదు.. ఆయన బీజేపీని కూడా కలుపుకు పోవడానికే తన ప్రయత్నం అని కూడా బిట్వీన్ ది లైన్స్ సంకేతాలు ఇచ్చారు. తన అసంతృప్తి అంతా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపైనే కానీ ఆ పార్టీ హై కమాండ్ మీద కాదని విస్పష్టంగా తేల్చేశారు. తనకు బీజేపీ జాతీయ నాయకులతోనూ, కేంద్రం పెద్దలతోనూ సత్సంబంధాలూ, సఖ్యతా ఉన్నాయని ఆయన చెప్పారు. అంటే తనకు ఉన్న పేచీ అంతా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతోనేనని తేటతెల్లం చేశారు.   ఏపీకి  ఏకైక రాజధాని అమరావతేనని  కేంద్ర పెద్దలను, బీజేపీ నాయకులను ఒప్పించినప్పటికీ.. అమరావతే రాజధాని అంటూ ర్యాలీ చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎందుకో సుముఖంగా లేరని పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధుడైన నాయకుడని పవన్ కళ్యాణ్ కితాబు నివ్వడం, వైసీపీ పార్టీని ఓడిస్తాం, ఆ పార్టీ నాయకుల కోటలు బద్దలు కొడతాం అంటూ పవన్ క ల్యాణ్ పార్టీ వార్షికోత్సవ సభ వేదికగా చేసిన ప్రకటనే రాష్ట్రంలో పొత్తుల విషయాన్ని ఖరారు చేసినట్లేనని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ ప్రసంగంపై తనదైన శైలిలో భాష్యం చెప్పారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.   గతంలో కంటే పవన్ కల్యాణ్ బందర్ సభలో ఎంతో పరిణితితో మాట్లాడారనీ, రాష్ట్రంలో జనసేన బలోపేతం ఒక్కటే లక్ష్యం కాదనీ, దానితో పాటు రాష్ట్రంలో దుర్మార్గ పాలన అంతం కూడా తన ధ్యేయమనీ చెప్పారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పునరుద్ఘాటించారు. వైసీపీ ఎంతగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసినా పవన్ కల్యాణ్ సంయమనం కోల్పోకపోవడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రత్యేకంగా ప్రస్తావించి.. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయడం ఖాయమన్న భావన వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం ముందు ముందు బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో జట్టు కట్టక తప్పదని రఘురామరాజు విశ్లేషించారు. 

మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తోంది!

చచ్చింది అనుకున్న. కొవిడ్ 19 (కరోనా) మహమ్మారి మళ్ళీ బతికొచ్చింది. రెండు సంవత్సరాలకు పైగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న, కరోనా భూతం తిరిగొచ్చింది. అది సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ఆర్థిక వ్యవస్థపై మరోమారు దండయాత్రకు మహమ్మారి సిద్దమవుతోంది.   అవును ఎక్కడో కొవిడ్ పుట్టిల్లు చైనాలో కాదు, మన దేశంలోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది.  తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు   అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ జాబితాలో తెలంగాణ పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉన్నాయి. వీటితో పాటు తమిళనాడు, కేరళ, గుజరాత్‌కూ గురువారం(మార్చి 16)కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా కేసులు  అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయో దృష్టిసారించాలని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక వ్యాప్తి ద్వారా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటిచోట ముప్పు అంచనాతో ముందు జాగ్రత్త, కట్టడి కీలకం.నియంత్రణ చర్యల్లో ప్రస్తుత పరిస్థితిని కొనసాగించడం అత్యవసరం. ఎక్కడైనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంటే నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోండి. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించండి  అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు.  కాగా, తెలంగాణలో చాలారోజుల తర్వాత బుధవారం పాజిటివ్‌ రేటు రెండంకెల గీత దాటింది.  ఒకే రోజున 54 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత ఏడాది నవంబరు 12న దేశవ్యాప్తంగా 734 కేసులు వచ్చాయి. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ గురువారం కేసుల సంఖ్య 700 దాటింది.  బుధవారం( మార్చి 15) ఉదయం నుంచి గురువారం (మార్చి 16) ఉదయం వరకు 24 గంటల  వ్యవధిలో  దేశంలో 754 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో తర్వాత కేసులు ఈ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కరోనా మహమ్మారితో కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి చేరింది.  దేశవ్యాప్తంగా 220.64 కోట్ల వాక్సిన్ డోస్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఇలా ఒక్క సారిగా కేసులు పెరగటానికి  దేశంలో టెస్టులు గణనీయంగా తగ్గడం కూడా కారణం కావచ్చని, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు/యూటీలను అప్రమత్తం చేస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుదలపై హెచ్చరిక చేశారు. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని.. ఇన్ఫెక్షన్‌ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రాష్ట్రాలు తప్పనిసరిగా జిల్లాల వారీగా పరిస్థితిపై సమీక్షించాలని, కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్ ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్ అనుసరించాలని కేంద్రం కోరింది. అయితే, కరోనా గురించి ఇప్పడు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలతో కరోనాను జయించ వచ్చని అంటున్నారు. అయితే, అదే సమయంలో, నిర్లక్ష్యం చేస్తే, మరో మారు మహమ్మారి విజృంభించే ప్రమాదం లేకపోలేదని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేపర్ లీకేజీ బాధ్యుడు కేటీఆర్.. బండి సంజయ్

టీఎస్పీసీ పేపర్ల లీకేజీ వెనుక ఉన్నది ఐటీ మంత్రి కేటీఆరే అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సమయమంతా ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బిడ్డ కవితను, టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ వ్యవహారం నుంచి కొడుకు కేటీఆర్ ను కాపాడుకేనేందుకే వెచ్చిస్తున్నారన్నారు.  టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే అయినందున పేపర్ల లీకేజీకి బాధ్యుడు కేటీఆరే అవుతారని తెలంగాణ   బండి సంజయ్ ఆరోపించారు. ఆయనను వెంటనే కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.   తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని కేసీఆర్ గతంలో అసెంబ్లీ లో చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలన్నారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా జరిగిన ఆందోళనలో అరెస్టై  చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను పరామర్శించిన బండి సంజయ్ ఆ తరువాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసిందన్నారు. ఈ లీకేజీకి నిరసనగా  ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి… జైలుకు పంపడం దుర్మార్గమన్నారు.   లీకేజీపై ప్రశ్నించిన వారిని జైళ్లకు పంపి,    లీకేజీ నేరస్తులకు రాచ మర్యాదలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.   అసలు  టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు తెలియకుండా ఎట్లా లీకైందో తెలియాలనీ, ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలని బండి సంజయ్ అన్నారు. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారని ఆరోపించారు. మియా పూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్ లు ఏమయ్యాయి? సిట్ పరిస్థితి కేసీఆర్ సిట్ అంటే సిట్…. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుతా తయారైందని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.    .

హమ్మయ్య ఓ పనైపోయింది

 ఓ పనై పోయింది. ఒక క్రతువు ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  2023- 24 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేశారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు మండలి ముందు ఉంచారు.  అంతకు ముందు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం  2023 - 24 వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. అలాగే 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. అంతుకుముందు 2023 - 24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బయల్దేరి వెళ్లారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి బుగ్గన సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ...పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రస్తుత పధకాలను బలపరిచేలా మరింత మందికి లబ్ది చేకురేలా  బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.నిజానికి, కేటాయింపుల విషయంలో ఆర్థిక మంత్రి ఎక్కడా  చిన్న చూపు చూడలేదు. చేతికి ఎముక లేదన్న విధంగా, కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా సంక్షేమం పేరిట గత మూడు సంవత్సరాలుగా సాగిస్తున్న పందారాం కార్యక్రమం కొనసాగించేందుకు ఆయా శాఖలకు నిధులు దాడిగానే కేటాయించారు. అయితే, ఇందు కు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి.. అనే ప్రశ్నకు విత్త మంత్రి   సమాధానం ఇవ్వలేదు, ఇటు ప్రతిపక్ష పార్టీలు, అటు ఆర్థిక రంగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు.     

ఇవేం ఎన్నికలు మాజీ ఐఎఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ధర్మాగ్రహం!

ఆంధ్ర ప్రదేశ్ లో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   పాలనలో  పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికలు ఎంత ‘చక్క’గా, జరుగుతాయో వేరే చెప్పనక్కరలేదు. గడచిన మూడున్నర సంవత్సరాలలో తిరుపతి లోక్ సభ, రెండు మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత సుందర ముదనష్టంగా జరిగాయో  గుర్తు చేసుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయనే విశ్వాసం సన్నగిల్లడం కాదు, చచ్చి పోతుంది అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. అదే విధంగా 2020లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎన్నికల కమిషనర్ (నిమ్మగడ్డ రమేష్ కుమార్ )తో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తుచేసుకుంటే  వైసేపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అధికార దుర్వినియోగం జరగని ఎన్నికలు ఆశించను కూడా ఆశించలేమంటే అతిశయోక్తి కాదని కూడా అంటున్నారు. తాజాగా జరిగిన పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  మేథావులు, ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలు, రాష్ట్రంలో  ప్రజాస్వామ్య విలువలు దిగజారుతున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పడు  పెద్దల సభ ఎన్నికలు కూడా, అంతే చక్కగా అదే, ‘అ’క్రమ పద్దతిలో జరిగాయి. ఎన్నికలో గెలవడమే ముఖ్యం,  ఎలా .. అన్నది అప్రధానం. అవును రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలవడం అవసరమే, అలాగే  విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు అడ్డదారులు తొక్కడం, కొంతవరకు గీత దాటడం కొత్తేమీ కాదు. కానీ  జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి పార్టీ పాత రికార్డులు అన్నిటినీ బద్దలు కొట్టేసింది.  ఈ మాట రాజకీయ విశ్లేషకులే కాదు, మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఆరోపిస్తున్నారు.   సహజంగా రాజకీయాలకు దూరంగా ఉండే  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం  రాష్ట్రంలో  ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాలలో పోలింగ్ జరిగిన తీరు, మొత్తం ఎన్నికల ప్రక్రియ పై తీవ్రంగా స్పందించారు. ఇవేమి ఎన్నికలంటూ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. దీనిపై టీవీ ఛానళ్లల్లో కథనాలు కూడా ప్రసారం అయ్యాయని గుర్తు చేశారు. అంతకు ముందే మరో మాజీ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైకృష్ణా రావు కూడా, వైసేపీ పాలనలో ఎన్నికల తీరుపై ఇదే విధంగా వ్యాఖ్యానించారు.   కాగా, రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం (మార్చి16) .జరుగుతోంది.  పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు ఓటర్లు. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  పోలింగ్ సందర్భంగా తిరుపతిలో భారీగా బోగస్‌ ఓట్లు నమోదయ్యాయంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో పోల్ అయ్యాయంటూ తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు, వామపక్ష నేతలు.. విమర్శించారు. కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ   డిమాండ్ చేశారు.  క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు బోగస్ ఓటర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపించారు. తిరుపతి నెహ్రూ నగర్‌ లోని వైసీపీ కార్యాలయ అడ్రస్ మీద 30 మంది నకిలీ గ్రాడ్యుయేట్‌ ఓటర్లు ఓటు వేశారంటూ విమర్శించారు. ఖాళీ స్థలాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు నివసిస్తున్నట్లు నకిలీ అడ్రస్ లను వైసీపీ నాయకులు సృష్టించారని మండిపడ్డారు. అనంతపురంలో ఇదే పరిస్థితి తలెత్తినట్లు విమర్శించారు.  దీని పైనే ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎల్వీ సుభ్రమణ్యం స్పందించారు. ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గాల పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని విమర్శించారు. 10వ తరగతి కూడా చదవని వారిని పట్టభద్ర ఓటర్లుగా ఓటు హక్కు కల్పించిన విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ.. అలాంటి చోట రీపోలింగ్ కు ఆదేశించకపోవడం  తనను ఆశ్చర్యాన్యికి గురి చేసిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు రీపోలింగ్ కు డిమాండ్ చేసినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం సరికాదని అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు.  ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఒక ప్రహసనంగా ముగిసిందంటూ ఎల్వీ సుబ్రహ్మణ్యం విమర్శించారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   అయితే  అధికారమే పరమావధిగా, పరుగులు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం మంచి మాటలు వింటుందా?

కమలంలో ‘కవిత’ కలకలం ?

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ( బీజీపీ) అంటే, అదొక విభిన్న పార్టీ  కానీ, ఇప్పడు కాదు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ, అతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నకలుగా తయారైంది. ఈ మాట ఎవరో బయటి వారు అంటున్న మాటే కాదు.. బీజేపీలోని  సీనియర్ నాయకులు,   సీనియర్ కార్యకర్తలూ అంటున్నారు. సరే  ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీకి ఉన్నదీ లేదు పోయేది లేదు కనుక అక్కడ ఎలా ఉన్నా ఎన్ని గ్రూపు తగవులు ఉన్నా పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణపై చాలానే ఆశలున్నాయి. అధికారం లక్ష్యగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చినా రాకున్నా పశ్చిమ బెంగాల్  లో లాగా, ఒక బలమైన శక్తిగా ఎదిగే  అవకాశం ఉందని  పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిన్న గాక మొన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర్ర హోం మంత్రి, పార్టీ స్ట్రాటజిస్ట్ (వ్యూహకర్త) అమిత్ షా  పార్టీ నాయకులు విబేధాలు మరిచి కలిసి పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అదే మాట  ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. త్రిపురలో గెలిచిన బీజీపీ తెలంగాణలో ఎందుకు గెలవదని ప్రశ్నిస్తున్నారు. అయితే  అందరూకలిసి పని చేయాలని చెప్పి  అమిత్ షా అలా వెళ్ళారో లేదో, ఇలా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో రుసరుసలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమల దళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తప్పు పట్టారు. అలాగే ఆర్వింద్‌ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీనియర్‌ నేత శేఖర్జీ  ( పేరాల శేఖర్‌ రావు) సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ నేతల్లో మరింత కలకలానికి కారణమయ్యాయి.  అరవింద్ అంటే, కాంగ్రెస్ కల్చర్ లో పుట్టి పెరిగిన నాయకుడు. ఆయన పార్టీ ఎంపీ అయినా, భావజాల పునాదుల పరంగా బీజేపీకి బయటి వ్యక్తి. కానీ  శేఖర్జీ ఆలా కాదు. ఆయన పుట్టి పెరిగింది, బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో, సంఘ్ ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త)గా, అనేక మందికి ఆదర్శంగా నిలిచిన  నాయకుడు.. అయన కూడా క్రమ శిక్షణ ఉల్లంఘించి, సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్  మీద విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి, బండి సంజయ్  పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు అయితే, శేఖర్జీ చేసిన విమర్శలు మరింత డ్యామేజింగ్  గా ఉన్నాయని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.     కవిత పై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై, బీఆర్ఎస్  ఎంతగా రాద్ధాంతం చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి బీఆర్ఎస్ కూడా బండి వ్యాఖ్యలను ముందు లైట్ గానే తీసుకుంది, కానీ  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపించడంతో  ఇష్యూని డైవెర్ట్ చేసేందుకో ఏమో  ఢిల్లీ నుంచి గల్లీ వరకు ... బండికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చి బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను మరిచి పోయారు. బీజేపీ నాయకులు మాత్రం బండికి అటూ ఇటుగా విడిపోయారు. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌జీ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్‌ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్‌ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్‌ సెంటర్‌ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్జీ మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. నిజానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతుందా? కేంద్ర పార్టీ ఎలా స్పదిస్తుంది .. చూడాల్సింది చాలా వుంది .. చెప్పాల్సింది మిగిలే వుంది..అంటున్నారు.

ఏపీ అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్.. కేటాయింపులు ఇవే!

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి  గురువారం(మార్చి 16) ఉదయం అసెంబ్లీలో వార్షిక బడ్జెట  ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని  ప్రారంభించిన బుగ్గన బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు.అంతకు ముందు జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ బడ్జెట్ ను ఆమమోదించింది.  తన బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బుగ్గన బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి.  ఆర్థిక శాఖకు  రూ.72,424 కోట్లు  వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు పర్యావరణానికి రూ.685 కోట్లు జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు సివిల్ సప్లై - రూ. 3725 కోట్లు,  జీఏడీకి రూ.1,148 కోట్లు పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు,  ప్రణాళిక 809 కోట్లు రెవెన్యూ రూ.5380 కోట్లు,  రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు కాపు నేస్తం రూ.550 కోట్లు జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు వాహనమిత్ర రూ.275 కోట్లు నేతన్న నేస్తం రూ.200 కోట్లు మత్స్యకార భరోసా రూ.125 కోట్లు మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు అమ్మఒడి రూ.6500 కోట్లు సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు,  ఆర్ అండ్ బికి రూ.9119 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు యూత్, టూరిజం రూ.291 కోట్లు డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు   పెన్షన్లు రూ.21,434 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు   నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు   రైతు భరోసాకు రూ.4020 కోట్లు జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు వసతి దీవెనకు రూ.2200 కోట్లు వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు   కార్మిక శాఖకు రూ.796 కోట్లు, ఐటీ శాఖకు రూ.215 కోట్లు న్యాయశాఖకు రూ.1058 కోట్లు  అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు 

విచారణకు రాలేను.. కవిత.. వచ్చి తీరాల్సిందే..ఈడీ!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మరోసారి కవిత ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా తాను హాజరు కాలేనని కవిత ఈడీకి సమాచారమిచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఈడీ షెడ్యూలు ఫిక్స్ చేసింది. అయితే తాజాగా కవిత తన ప్రతినిధి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ద్వారా తాను హాజరు కాలేనన వర్తమానం పంపిన కవిత ఈడీ అడిగిన సమాచారాన్ని ఆయన ద్వారా పంపారు. అయితే సోమ భరత్ ను ఈడీ కార్యాలయంలోనికి అనుమతించలేదు. విచారణకు రాలేనని కవిత చెప్పడాన్ని ఈడీ అభ్యంతరం చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో కవిత  న్యాయనిపుణులతో కవిత భేటీ అయ్యారు. ఈడీ విచారణకు కవిత హాజరు అంశం తీవ్ర ఉత్కంఠ రేపిన నేపథ్యంలో కవిత అనూహ్యంగా తన ప్రతినిధిని పంపడంతో ఏం జరగబోతోందోనన్న ఆసక్తి నెలకొంది. మరో వైపు ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 11 మందిని ఈడీ అరెస్టు చేయడంతో కవిత అరెస్టు కూడా అనివార్యం అన్న భావనతోనే విచారణకు హాజరు కాలేనని వర్తమానం పంపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే   సుప్రీంకోర్టులో తన పిటిషన్  పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో పాటు సుప్రీంలో   తన పిటిషన్ పెండింగ్ అంశాన్ని కూడా కవిత ఈడీకి పంపినట్లు చెబుతున్నారు.   అయితే ఈడీ అధికారులు కవిత విజ్ఞప్తిని అంగీకరించలేదు. 

పంచమర్తి అనురాధకు జగన్ స్కెచ్

ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచమర్తి అనురాధను.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు బరిలో నిలిపారు. అయితే ఆ ఒక్క స్థానం కూడా సైకిల్ పార్టీ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో... ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే గెలవాలని.. అందుకోసం కృషి చేయాలంటూ.. మార్చి 14న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం వైయస్ జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలిస్తే మాత్రం పలువురు మంత్రులు ఇంటికి వెళ్లడం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సైతం వారికి ఈ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  అంతేకాదు.. పార్టీ ఉంటేనే పదవులు వస్తాయి.. పదవులు దక్కాలంటే ప్రతి ఒక్కరు శ్రమించాలి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుపొందేందుకు శ్రమిస్తున్నాం.. ఆ లక్ష్య సాధనలో ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కావాలి..  అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని.. లేని పక్షంలో మరోవిధంగా ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇక మంత్రుల పనితీరు సైతం గమనిస్తున్నానని ఈ సందర్భంగా వారితో ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.  మరోవైపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ మహిళ పంచుమర్తి అనురాధను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపారు. రాష్ట్రంలో ఏ సమస్యపై స్పందించాలన్నా.. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పోకడలపై ప్రెస్‌మీట్ పెట్టి.. తనదైన శైలిలో ఎండగడుతోందీ అనురాధ. అలాంటి మహిళ శాసనమండలిలో ఉంటే.. వాయిస్ బలంగా వినిపిస్తుందని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ ఎమ్మెల్సీ గెలవాలంటే.. 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు వేయాల్సి ఉంటుంది.  అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు  ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్.. జగన్ పార్టీలో చేరారు. కానీ వీరిని అధికారికంగా.. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ స్పీకర్ పరిగణించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికి సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలుగానే అధికారికంగా కొనసాగుతోండమే కాకుండా... ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానే జీతభత్యాలు సైతం అందుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత చంద్రబాబు వీప్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వీప్‌ను ఈ నలుగురు పట్టించుకునే పరిస్థితి అయితే లేదనే తాజాగా జరిగిన కేబినెట్‌ భేటీలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.   మరోవైపు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓటు ఎవరి ఖాతాలో పడనుందో అనే ఓ చర్చ సైతం జోరందుకొంది. వీరిద్దరు త్వరలో పసుపు కండువా కప్పుకొని.. సైకిల్ పార్టీలో సవారీ చేయనున్నారనే ఊహగానాలు సైతం కొన..సాగుతోన్నాయి. అలాంటి వేళ... వీరు పంచుమర్తి అనురాధకు ఓటు వేసినా.. ఆమె గెలుపునకు మరో రెండు మూడు ఓట్లు అవసరమ్యే అవకాశం ఉందని.. ఇంకోవైపు జగన్ పార్టీలోని పలువురు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారని .. వారు సైతం సైకిల్ పార్టీ బరిలో దింపిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసినా .. అందులో ఆశ్చర్యం ఏమి లేదని ఓ వాడి వేడి చర్చ అయితే హల్ చల్ చేస్తోంది.   ఇక ఇప్పటికే ఏపీలో ఇటీవల గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. హైస్కూల్ స్థాయిని దాటని వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొనేందుకు బరిలో నిలబడడం.. అలాగే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు ఓటర్లకు నగదు పంచుతూ అడ్డంగా ప్రతిపక్ష టీడీపీ శ్రేణులకు దొరికిపోవడం.. ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి.. ఈ అంశంపై ఫిర్యాదు చేసినా వారు సరైన రీతిలో స్పందించక పోవడం.. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత కేంద్ర ఎన్నికల సంఘానికి సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. కానీ ఈ పిర్యాదుపై నేటికి స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ఏడు స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడినా సందేహమే లేదని... ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలగంటున్న 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఏమంత కష్టం కాదని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో కొన.. సాగుతోంది.

వైయస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఎక్కడ..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మార్చి 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీలోని ఈడీ అధికారులు నోటిసులు జారీ చేశారు. అంతే ఆ రోజుకు ఒక రోజు ముందు.. కేసీఆర్ కేబినెట్‌లోని సగానికి సగం మంది మంత్రులు.. దేశ రాజధాని హస్తినకు క్యూ కట్టేశారు. మరోవైపు కల్వకుంట్ల కవితతోపాటు ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్‌, అలాగే కేసీఆర్ మేనల్లుళ్లైన మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారులు సైతం ఢిల్లీకి తరలి వెళ్లారు. ఓ వేళ నిన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినా.. నీకు అండగా మేమంతా ఉన్నాం.. నీ వెనుక తెలంగాణ సమాజం ఉందంటూ ఎమ్మెల్సీ కవితకు ఓ విధమైన భరోసా కల్పించారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో బాగానే నడిచింది.. నడుస్తోంది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి ఈ తరహా మద్దతు.. భరోసాలు కల్పించే ప్రయత్నాలు అయితే జరగలేదనే ఓ చర్చ అయితే సదరు పోలిటికల్ సర్కిల్ జోరుగా... ఊపందుకొంది. అంతేకాదు వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతు కరువైందంటూ సదరు సర్కిల్‌లో విశ్లేషణలు సైతం మొదలైనాయి.  వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆతని తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలపై సీబీఐ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోందని.... ఆ క్రమంలో వైయస్ అవినాష్ రెడ్డి.. ఒకటికి నాలుగు సార్లు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లారని... అయితే తొలిసారి ఆయన ఈ హత్య కేసులో విచారణకు హాజరైనప్పుడు కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు అదే జిల్లాకు చెందిన పలువురు జిల్లా నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారని.. కానీ ఆ తర్వాత వరుసగా జరిగిన విచారణలకు మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి వెంట ఎవరూ రాలేదని.... మరోవైపు ఆతడికి మద్దతుగా వైయస్ ఫ్యామిలీలోని సభ్యులు కానీ... ఆ పార్టీలోని కీలక నేతలు కానీ కార్యకర్తలు కానీ, చివరకు జగన్ కేబినెట్‌లోని మంత్రులు కానీ వచ్చిందీ లేదు.. మీడియా ముందుకు వచ్చి వైయస్ అవినాష్‌కు మద్దతు పలికిందీ లేదని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ మాత్రం జోరందుకొంది.   మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆయన సోదరుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. వారి పార్టీనే అధికారంలో ఉన్నా.. వైయస్ అవినాష్‌కు అండ.. దండ కరువైందనే విషయం స్పష్టమవుతోందని టాక్ సైతం పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది. కొద్దిగా కాకపోయినా.. కనీసం వైయస్ ఫ్యామిలీలోని వారు అయినా.. నీకు మేమున్నామంటూ వైయస్ అవినాష్‌కు ఓ విధమైన భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఏమైందనే ప్రశ్న సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.  ఇంకోవైపు వైయస్ వివేకా హత్య కేసులో తనపై సీబీఐ అధికారులు తీవ్ర చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ వైయస్ ఆవినాష్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. రిట్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత.. ఇంప్లీడ్ పిటిషన్ వేయడం.. చకచకా జరిగిపోయాయి. అంతేకాదు తన ఇంప్లీడ్ పిటిషన్‌లో వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను వైయస్ సునీత ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వైయస్ అవినాష్‌కు అటు వైయస్ ఫ్యామిలీ నుంచి కానీ.. ఇటు పార్టీ నుంచి కానీ కనీస మద్దతు కరువై ఉంటుందనే ఓ అభిప్రాయం పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.