భారత్ లో మొట్టమొదటి జపాన్ వాహన తయారీ సంస్థ

  భారత్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరుజిల్లాలో జపాన్ తన మొట్టమొదటి వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ స్థాపించనుంది చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ఆర్థిక మండలిలో రూ.1500 కోట్లతో తేలికరకం వాణిజ్య వాహనాలు ట్రక్కులు, వ్యాన్ల వంటి తయారీ పరిశ్రమను స్థాపించనుంది.  శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు అవగాహనా ఒప్పందం (ఎం.వో.యూ)కుదుర్చుకుంది. ఇసుజు మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు షిగేరు వకబయాషి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి జపాన్ రాయబారి తోకేషి యాగీ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీసిటీ ప్రతినిథులు రవి సన్నారెడ్డి, శ్రీనిరాజు హాజరయ్యారు.శ్రీసిటీలో 110 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పరిశ్రమకోసం విద్యుత్తు, వ్యాట్ తో బాటు ఇతర రాయితీలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం తన సంసిద్ధతను తెలియజేసింది.

గేట్ ఫలితాలు విడుదల ... రాష్ట్ర విద్యార్థుల హవా

ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 10న దేశవ్యాప్తంగా నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ (గేట్) ప్రవేశ పరీక్షనిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 10 లక్షలమంది హాజరయ్యారు.  గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ - 2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఆలిండియా స్థాయిలో జరిగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ (గేట్)లో రాష్ట్ర విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈసీఈలో మొదటి ర్యాంక్ తో పాటు 3,4,5,6,7,8,10 ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాసి పోతుల శివహర్ష మొదటి ర్యాంక్ ను సాధించాడు. ఐఎన్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ తో పాటు ఐదవ ర్యాంక్ సాధించారు. ఈసీఈలో మొదటి ర్యాంక్, ఈఈఈలో అన్నందేవుల రవితేజ 2వ ర్యాంక్ తో పాటు 6, 8  ర్యాంక్ లను, సీఎస్ఈలో 4,6,9, ర్యాంకులను సాధించి జాతీయస్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు.

అతికష్టం మీద వీగిపోయిన అవిశ్వాసం

  టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ విడివిడిగా స్పీకర్ కు సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానానికి టి.డి.పి. తటస్థంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అతి కష్టంగా 142-58 తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ రెబల్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ వంశీకృష్ణ శ్రీనివాస్, పేర్ని నాని, సుజయ్ కృష్ణ రంగారావు, ముద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జోగి రమేష్, గొట్టిపాటి రవి, టి.డి.పి. రెబల్స్  కొడాలి నాని, వై.బాలనాగిరెడ్డి, ఎం. అమరనాథ్ రెడ్డి, పిరియా సాయిరాజ్, ఎ.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 295మంది సభ్యులు కాగా 264 మాత్రమే హాజరయ్యారు. మొదటినుండి చెపుతున్నట్టుగానే ఎం.ఐ.ఎం. అవిశ్వాస తీర్మానానికి దూరంగా వుంది. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఇండిపెండెంట్ సభ్యుడు నాగం జనార్థన రెడ్డి, టిడిపికి చెందిన చిన్నం రాంకోటయ్య, వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనలేదు.

మాది తెనాలి, మీది తెనాలి అంటున్న తెలంగాణా నేత

  ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి తన చిత్తూరు జిల్లాకే చెందినవారు కావడంతో చంద్రబాబు నాయుడు ‘మీది తెనాలి మాది తెనాలి’ అన్న రీతిలో ‘మీది చిత్తూరు మాది చిత్తూరు’ అనే సెంటిమెంటుతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని హేళన చేసారు. ‘కిరణ్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయిందని నిత్యం తిట్టిపోసే చంద్రబాబు నాయుడు స్వయంగా అవిశ్వాసం పెట్టకపోగా, మేము పెడుతున్న అవిశ్వాసానికి కూడా మద్దతునీయకపోవడం ద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకొన్నట్లు కనిపిస్తున్నారు’ అని ఎద్దేవా చేసారు.   ఇక్కడ ఈ తెరాస నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని మనస్పూర్తిగా ప్రయత్నిస్తున్నామని చెపుతుంటే, మరో వైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని కలిపెసేందుకు నేటికీ సిద్దంగా ఉన్నామని ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్ధ ప్రభుత్వమని ఒకవైపు అవిస్వాసం పెడుతూనే, మళ్ళీ అదే పార్టీలో కలిసిపోవాలని ఎందుకు ఉవ్విళ్ళు ఊరుతున్నారో తెరాస నేతలే చెప్పాలి.

పొత్తులొద్దు, ఒంటరిపోరే బెస్ట్: చంద్రబాబు

  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం, రాబోయే ఎన్నికలకు 6 నెలలు ముందుగానే, పార్టీ అభ్యర్ధులను నిర్ణయిస్తామని ప్రకటించారు. మళ్ళీ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఎవరితోనూ ఎన్నికల పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని మరో సంచలన ప్రకటన చేసారు.   ఇంతవరకు ఇతరపార్టీలతో పెట్టుకొన్న ఎన్నికల పొత్తుల వలన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువొచ్చిందని ఆయన అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరుకు పార్టీలో అందరూ సిద్దం కావాలని కోరారు. కార్యకర్తలందరూ ఇప్పటి నుండే పార్టీ తరపున తమ తమ గ్రామాలలో ప్రచారం మొదలుపెట్టి, ఎన్నికల నాటికి ప్రజలందరూ పార్టీకే ఓటు వేసేలా చూడాలని ఆయన కార్యకర్తలను కోరారు. కొంత మంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల అచంచల విశ్వాసం చూపుతూ పార్టీ కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నేతలు వెళ్ళిపోయినా పార్టీ చెక్కు చెదరక పోవడానికి కారణం పార్టీ కార్యకర్తల అండదండలే అని ఆయన అన్నారు.   బహుశః గత ఎన్నికలలో తెరాసతో పెట్టుకొన్న ఎన్నికల పొత్తులు పెట్టుకొన్న తెలుగు దేశం పార్టీ గెలవకపోగా, తదనంతర కాలంలో అదే తెరాసతో చాలా ఇబ్బందులు పడింది. బహుశః చంద్రబాబు యొక్క ఈ అకాల వైరాగ్యానికి అదీ ఒక కారణం అయి ఉండవచ్చును. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల పొత్తులు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం అని చంద్రబాబుకి తెలిసినప్పటికీ, ఆయన ఈ రకమయిన ప్రకటనచేయ సాహసించారంటే బహుశః తన పాదయాత్రలో పల్లె పల్లెకు తిరిగిన ఆయన తన పార్టీ యదార్ధ పరిస్థితిని, బలాబలాలను పూర్తిగా అంచనా వేసుకొన్నందునే బహుశః ఆయన ఈనిర్ణయం తీసుకొని ఉండవచ్చును.   ఏది ఏమయినప్పటికీ, తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అనివార్యం కావచ్చును. అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో కటిఫ్ చేసుకొన్న మజ్లిస్ పార్టీ జగన్ పంచన గనుక జేరకపోతే, తప్పనిసరిగా తెదేపాతోనే పొత్తుల కోసం ప్రయత్నించవచ్చును. ఇక కేంద్రంలో యుపీయే కు ప్రత్యామ్నాయమయిన బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న యెన్డీయే కూటమిలో భాగస్వామి అయిన తెదేపా రాష్ట్రంలో బీజేపీతో ఎంతో కొంత సర్దుబాట్లు అనివార్యం కావచ్చును.   అందువల్ల పొత్తుల విషయంలో చంద్రబాబు ఇప్పుడే ఒక స్పష్టమయిన ప్రకటన చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి తన నిర్ణయం మార్చుకోక తప్పదు.

రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి కన్నుమూత

        భారతీయ ఔషద పరిశ్రమలో ప్రఖ్యాత ఖ్యాతిపొందిన ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డీ ల్యాబ్స్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న అంజిరెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.   1943లో గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్‌ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

చంద్రబాబును వెనకేసుకు వచ్చిన కిరణ్, బోత్సల అంతర్యం ఏమిటో?

  నిన్న జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఇద్దరూ కూడా మొట్టమొదటిసారిగా తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కొంచెం మెచ్చుకొంటూ మాట్లాడటం విశేషం. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తెరాస మరియు వైకాపాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు తెదేపా మద్దతు ఈయని కారణంగానే వారు ఆశించని, ఊహించని ఆ మర్యాదలు ఒలకబోస్తున్నారని అందరూ భావిస్తున్నారు.   అయితే, వాటి వెనుక ఇంకా బలమయిన కారణాలే ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్తిబాబులు ఇద్దరూ కూడబలుకొన్నట్లుగా చంద్రబాబుకి, తేదేపాకు అనుకూలంగా మాట్లాడటం ద్వారా, ఇప్పటికే తెర వెనుక నుండి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారిగా రహస్య ఒప్పందం చేసుకొని తమ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు పలుకకుండా, కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోకుండా కాపడుతున్నాడని చంద్రబాబు మీద విరుచుకు పడుతున్న తెరాస మరియు వైకాపాలకు మరింత అనుమానం కలిగేలా మాట్లాడి తద్వారా వారికి మరో కొత్త ఆయుధం అందించి వారిరువురినీ చంద్రబాబుపైకి ఉసిగొల్పడమే ప్రధాన లక్ష్యంగా కిరణ్, బోత్సలు మాట్లాడారు.   తద్వారా, మూడు ప్రధాన ప్రతిపక్షాల మద్య మరింత చిచ్చు రగిలించి వారిని ఒకరికొకరిని దూరంగా ఉంచగలిగితే, అది తమ పార్టీకి మేలు చేస్తుందనే దూరాలోచనతోనో లేక ‘దురాలోచానతో’నో వారిరువురూ ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా తన శత్రువుని పొరపాటున కూడా మెచ్చుకొనే అవకాశం లేదు. అటువంటి సమయంలో 2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చిత్ర పటం నుండి మాయమయిపోతుందని ఒకనాడు నొక్కి చెప్పిన ముఖ్యమంత్రే స్వయంగా ఈ రోజు తెలుగు దేశం పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని, తెరాస, వైకాపా వంటి ప్రాంతీయ పార్టీలతో పోటీ పడవలసిన అవసరం లేదని పలకడం చూసినట్లయితే, ఆ మూడు పార్టీల మద్య తమ మాటలతో ఇప్పటికే ఉన్న పెద్ద అగాదాన్ని మరింత పెద్దది చేస్తే రాబోయే ఎన్నికలలో తమ పార్టీ నల్లేరు మీద నావలా సాగిపోవచ్చునని వారు ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును.   తద్వారా ఇప్పటికకే తోక పార్టీలు, లోపాయికారీ పార్టీలు అంటూ కీచులాడుకొంటున్న ప్రతిపక్షాలకి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, అంటూ కొత్తగా కొట్టుకు చచ్చే సౌలభ్యం కూడా వారికి కల్పించవచ్చునని వారిరువురీ ఆలోచన కావచ్చును.   తెలుగు దేశం పార్టీ పెద్ద పార్టీ అని, మిగిలిన రెండూ ప్రాంతీయ పార్టీలని వాటిమధ్య పోలిక పెట్టడం వెనుక ఉద్దేశ్యం కూడా అదే. రేపటి నుండి ఇదే విషయంపై ఆ మూడు పార్టీలు కత్తులు దూసుకొంటున్నపుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ చప్పట్లు కొడుతూ వెనక నుండి ప్రోత్సహించడం కూడా మనం చూడవచ్చును.

టిడిపి నేత కవిత కుమార్తె ప్రేమ పెళ్ళి..వరుడు అరెస్ట్

  ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ నేత కవిత కుమార్తె మాధురి తమ డ్రైవర్ రాజ్ కుమార్ ను పెద్దపల్లి వెంకటేశ్వరాలయంలో పెళ్లి చేసుకుంది. మాధురి తల్లిదండ్రులు పంజగుట్ట స్టేషన్ లో రాజ్ కుమార్ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. వీరు పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో పెద్దపల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మాధురితో రెండు గంటలు మాట్లాడి ఆమెను హైదరాబాద్ కు పంపించారు. రాజ్ కుమార్ ను మాత్రం తమ అదుపులో పెట్టుకున్నారు. పోలీసులు మాధురి తల్లిదండ్రులు చెప్పినట్లు వింటున్నారని, రాజ్ కుమార్ కు అన్యాయం జరిగితే ఊరుకోమని బంధువులు హెచ్చరించారు.

హరీష్‌రావు, సీఎం కిరణ్‌ మధ్య మాటల యుద్ధం

    అవిశ్వాసంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత హరీష్‌రావు మధ్య వాగ్వాదం నెలకొంది. ''నాలుగు జిల్లాలున్న రాయలసీమలో నాలుగు జేఎన్టీయూలు ఉంటే పది జిల్లాలున్న తెలంగాణకు ఎనిమిది జిల్లాలు అక్కర్లేదా ? ” అని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి చిత్తూరుకే తరలిస్తున్నారు అని ఆరోపించారు. కాలర్ పట్టుకుని అడిగాం కాబట్టే నిజామాబాద్ కు కళాశాల ఒకటి ఇచ్చారని హరీష్ రావు అన్నారు. హరీష్ ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకున్న సీఎం మీ దయాదాక్షిణ్యాల వల్ల మేము పదవులు పొందలేమని, కాంగ్రెస్ పార్టీ వల్ల, తమ సభ్యుల వల్లే పదవులు పొందామన్నారు. మా దయాదాక్షిణ్యాలతో మీరు గతంలో మంత్రులయ్యారని సీఎం అన్నారు. తెలంగాణ వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని సీఎం కిరణ్ తెలిపారు. దీనిపై హరీష్ మాట్లాడుతూ ప్రధానిగా చేసిన పీవీ సమాధికి గజం స్థలం కూడా ఇవ్వలేదని, ప్రధానిగా చేసిన వారందరికీ ఢిల్లీలో ఘాట్ ఇచ్చారని, పీవీని మాత్రం పట్టించుకోలేదు..ఇదేనా మీరిచ్చే గౌరవమని సీఎంను హరీష్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు జీవం పోసింది టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. టీడీపీ చేతిలో రెండు సార్లు ఓడిన సమయంలో తెలంగాణ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ గెలిచిందని హరీష్‌రావు పేర్కొన్నారు. దేశానికి ప్రధానికి గా చేసిన పీవీని సభలో అవమానించారని, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని సీఎం అన్నారు.

టీఆర్ఎస్ అవిశ్వాసానికి స్పీకర్ అనుమతి

        కాంగ్రెస్ ప్రభుత్వం పై టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్యను స్పీకర్ లెక్కించారు. 45మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. సంఖ్యాబలం ఉండటంతో అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. టిడిపి సభ్యుడు హరీశ్వర్ రెడ్డి విప్ దిక్కరించి నోటీసుకు మద్దతు ప్రకటించారు.   కాంగ్రెస్‌పార్టీ శాసన సభా పక్షం పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సీఎల్పీ జారీ చేసిన విప్‌లో ఆదేశించింది. అవిశ్వాసంపై ఇవాళ రేపు చర్చ జరిగి ఏ క్షణమైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ సభ్యులంతా సభలో అందుబాటులో ఉండాలని సీఎల్పీ జారీచేసిన విప్ లో పేర్కొంది.  

మరో యువతిపై అత్యాచారం

  కేంద్ర క్యాబినెట్ గురువారం లైంగిక వేధింపుల నిరోధక సవరణ బిల్లుకు ఆమోదం పొందకముందే గురువారం తెల్లవారు ఝామున ముంబాయిలో ఒక యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ముంబాయివంటి మహానగరంలో విల్ పార్లీ సబర్బన్ కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలిని బుధవారం రాత్రి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయం గమనించిన నలుగురు యువకులు రాజేష్ వర్మ, మహేష్ కేవత్, రామచంద్ర హంబే, కృష్ణ కేవత్ టాక్సీ డ్రైవర్ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి, అడ్డువచ్చిన అతన్ని కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

తెదేపా ఎమ్మెల్యేలకు విప్ జారీ

  రాష్ట్ర శాసనసభలో టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ విడివిడిగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తెదేపా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానంపై ప్రతిస్పందిస్తూ వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతిస్పందిస్తూ "ఈ తీర్మానం నెగ్గాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలి, ప్రజాస్వామ్యాన్ని కొనాలి, ఆ పని నేను చేయలేను. తతంలో తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. సూట్ కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి ఎమ్మెల్యేలు అమ్ముడయ్యారు. గతంలో తాను చేసిన తప్పు మరలా పునరావృత్తం చేయనని'' అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన టి.ఆర్.ఎస్. పై మండిపడుతూ "ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారు. అలాంటివాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే మేం సమర్థించాలా'' అని అన్నారు.

తోక పార్టీల కీచులాటలు

  కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రెండు ప్రధాన ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినందున, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలుగు దేశం పార్టీ తన సభ్యులకు నిన్న విప్ జారీ చేసింది.   తమని తోక పార్టీలని గేలిచేసిన చంద్రబాబుపై మండిపోతున్న తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆ పార్టీ విప్ కూడా జారీ చేయడంతో మరింత మండిపడుతూ, “ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు ఇప్పుడు విప్ కూడా జారీ చేసారు. మమల్ని తోక పార్టీలని గేలిచేసిన చంద్రబాబు ఇప్పుడు విప్ జారీ చేయడం ద్వారా తానే కిరణ్ కుమార్ రెడ్డికి తోకనని నిరూపించుకొన్నారు ” అంటూ దుయ్యబట్టాయి.   "ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్దుడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్ధ ప్రభుత్వమని నిత్యం నిందించే చంద్రబాబు మరిప్పుడు అదే ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ఇంత తాపత్రయ పడుతున్నారు?" అని తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిలదీస్తే, దానికి జవాబుగా తెలుగు దేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “మీరు ఇద్దరూ చేతులు కలిపి కిరణ్ సర్కారును కూలదోస్తామని ప్రతిజ్ఞలు చేసి, ఇప్పుడు ఇద్దరూ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు పెట్టి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నికాపడట్లేదా?” అని ఎదురు ప్రశ్న వేసారు.   మొత్తం మీద మూడు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్నితమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతగా నిందించినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకూడదని కోరుకొంటున్నాయని తమ మాటలతో, తమ (అ)విశ్వాస తీర్మానాలతో స్పష్టం చేసాయి.

అవిశ్వాస రాజకీయాలు

  రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అంతటా అవిశ్వాసం నెలకొంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులో, ఎవరు ప్రజలకు ఒరగబెట్టేవారో, ఎవరు అధికారం కోసం ప్రాకులాడుతున్నారో తెలియనంతగా మన రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక మన రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయో లేక ఒకదానితో మరొకటి విభేదిస్తూ పనిచేస్తున్నాయో కూడా ప్రజలకి అర్ధం కాని పరిస్థితి.   తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతామంటున్న తెరాసా అదే కాంగ్రెస్ పార్టీ మీద తనకు నమ్మకం లేదని అవిశ్వాసం పెడుతుంది.   నా కొడుకును సోనియా గాంధీయే జైల్లో తోయించి సీబీఐ మరియు యెన్ఫోర్స్ మెంటు వారిని అడ్డం పెట్టుకొని నానా బాధలు పెడుతోంది, అని వాపోతున్న విజయమ్మ అదే నోటితో అదే సమయంలో అవసరమయితే 2014 సం. ఎన్నికల తరువాత సోనియమ్మ నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని అంటారు. కేంద్రంలో మద్దతు ఇస్తామంటే దాని అర్ధం రాష్ట్రంలో అవిశ్వాసం పెట్టమని కాదు అంటూ మళ్ళీ ఆ మరునాడే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెడతారు.   తెరాసతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి సమాధి కట్టేస్తామని మంగమ్మ శపదాలు చేసిన విజయమ్మ, మీ అవిశ్వాసం మీది, మా అవిశ్వాసం మాదే అంటారు. అవిశ్వాసం+అవిశ్వాసం=విశ్వాసం అనే కొత్త సూత్రంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండు అవిశ్వాసాలు పెట్టి ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షాలే కాపాడుకొంటున్నాయి.   బహుశః రాష్ట్ర చరిత్రలో మరే ముఖ్యమంత్రికి ఇటువంటి మహద్భాగ్యం దక్కదు. ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసే ప్రతిపక్షాలను మనం చూసాము గానీ, (అవిశ్వాసం పెట్టి కూడా) ప్రభుత్వాన్ని కాపాడుకొనే ప్రతిపక్షాలను ఎన్నడూ చూడలేదు.   ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ఉనంత కాలం మీ బ్రతుకులింతే! అంటూ (కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొన్న ప్రజలను) కాంగ్రెస్ పార్టీని శపిస్తూ రివ్వుమని దూసుకువచ్చిన జగన్నన్నవదిలిన బాణం ప్రజల గుండెల్లో బాగానే గుచ్చుకొంది. రాజన్నరాజ్యం కావాలనుకొంటే కాంగ్రెస్ పార్టీని కూలదోయక తప్పదు అని షర్మిల అంటుంటే, కేంద్రంలో వేరే ప్రత్యామ్నాయం లేదు గనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఈయక తప్పదు అని, విజయమ్మ ముక్తాయింపు.   కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రభుత్వాన్ని దమ్ముంటే కూల్చమని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు గనుక అవిశ్వాసం పెడితే పెట్టవచ్చును. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఈయమని కనీసం విజ్ఞప్తి కూడా చేయక మునుపే, విజయమ్మగారు సోనియమ్మ హస్తం అందుకునే ప్రయత్నం చేశారు.   ఇక, ఏ పార్టీ తోక పట్టుకొని 2009 ఎన్నికల గోదారి ఈదారో మరిచిపోయిన నాయుడుగారు, ఇప్పుడు ఆ తోక పట్టుకోవడానికే నామోషీగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్ల మన రాష్ట్రానికి ఎంత తీవ్ర నష్టం వాటిల్లుతోందో ప్రజలకు వివరించేందుకు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రేయనక, పగలనకా, ఎండనకా, వాననకా ఊరూరు తిరుగుతూ చాలా శ్రమిస్తున్నారు.   ఆయన పాదయాత్రలో ఎవరో పామరులు కొందరు ‘అటువంటప్పుడు మీరే స్వయంగా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేయొచ్చును కదా?’ అని అడిగితే ‘తగిన సమయంలో తగిన నిర్ణయం’ అంటూ ఒక పడికట్టు మంత్రం ఉపదేశించి చంద్రబాబు ముందుకు సాగిపోతారు. ఎవరి నిస్సహాయతలు వారివి.   ఎవరి లెక్కలు వారివి. తమ ఈ అవిశ్వాసవిశ్వాసాల డ్రామాలు, పొత్తులూ, కుమ్మక్కులూ, పార్టీ ఫిరాయింపుల వెనుక కారణాలు ఏవీ కూడా సామాన్య ప్రజలకు అర్ధం కావనే భ్రమలో ఉన్న మన మహా మేదావులయిన రాజకీయ నాయకులు ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నంలో చాలా చమటోడుస్తున్నారు. మరి ప్రజలు వారి కష్టాన్ని గుర్తించి వచ్చే ఎన్నికలలో సరయిన తీర్పునిస్తే బాగుంటుంది.

లైంగిక వేధింపుల నిరోధక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

కేంద్ర క్యాబినెట్ గురువారం అత్యాచారం, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, యాసిడ్ దాడులు వాటిని మహిళలపై లైంగిక నేరాలుగా బిల్లులో పేర్కొంటూ లైంగిక వేధింపుల నిరోధక సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లైంగిక దాడులకు పాల్పడి మహిళలలను హత్యచేసిన కేసుల్లో సంబంధిత నిందుతులకు మరణశిక్ష విధించే అధికారం, లైంగిక నేరాలకు పాల్పడే వారికి కనీసం ఇరవై సంవత్సరాలనుంచి జీవించి ఉన్నంత కాలం జైలుశిక్ష పడేలా ఈ బిల్లులో పొందుపరిచారు. మహిళలలను ఉద్దేశపూర్వకంగా తాకటం, వేధించటం వంటి చర్యలకు బెయిల్ కూడా ఇవ్వ వీలులేని నేరంగా పరిగణిస్తారు. కేంద్రమంత్రులు రెండు గ్రూపులుగా ఏర్పడి బుధవారం లైంగిక వేధింపుల నిరోధక బిల్లుపై కూలంకుషంగా చర్చించింది. మంత్రుల బృదం బిల్లు డ్రాఫ్ట్ ను ఫిబ్రవరి 3న జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఆమోదం తెలిపింది.దేశంలో మహిళలపై జరుగుతున్నా లైంగిక దాడులను నివారించేందుకు చట్టాలలో తీసుకురావలసిన మార్పులపై జస్టీస్ వర్మ కమీషన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కమీషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. అలాగే పరస్పర లైంగిక అనుమతి చట్టబద్ధతకు ఇప్పటివరకూ ఉన్న 18 సంవత్సరాల వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనకు క్యాబినెట్ సుముఖత వ్యక్తం చేసింది.

వీర జవాన్ లారా! లాఠీలతోనే దేశాన్ని కాపాడేయండి

  నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ లో సీఆర్పీయఫ్ దళాలపై పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాడిలో 5మంది జవాన్లు మరణించగా, మరో 8మంది తీవ్ర గాయపడ్డారు. వారి చేతుల్లో ఆయుధాలుకు బదులు కేవలం లాఠీలు మాత్రమే ఉండటంవల్లనే వారందరూ ఉగ్రవాదుల చేతుల్లో మరణించారని స్వయంగా అక్కడి జవాన్లే మీడియాకి వెల్లడించడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది.   అందుకు కారణం, ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కేంద్రహోం శాఖ వారిని లాఠీలతో సరిబెట్టుకోమని ఆదేశించింది. తత్ఫలితంగా 5మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మన పొరుగునున్న పాకిస్తాన్ నిత్యం మన దేశంలోకి ఎగుమతి చేస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు నియమింపబడిన మన జవాన్లకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వకపోగా, ఉన్న ఆయుధాలను కూడా తీసేసుకొన్న ప్రభుత్వం పరోక్షంగా వారి చావుకి కారణం అయింది.   ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, 5మంది జవాన్లు మరణించినా స్థానికంగానే ఉండే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కనీసం తమ సహచరుల మరణానికి సానుభూతిగా నాలుగు మాటలు కూడా పలుకలేకపోయాడని, దేశం కోసం పోరాడుతూ మరణిస్తున్న తమ ప్రాణాలకు అసలు విలువ, గౌరవం లేకుండా పోయాయని అక్కడి జవాన్లు మీడియాతో అన్నతరువాతనే ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.   జవాన్లు పలికిన ఈ మాటలు రాజధాని వరకు పాకిన తరువాతనే పార్లమెంటు కూడా వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం మన రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు మన జవాన్లపట్ల ఎంత గౌరవం ఉందో తెలియజేస్తోంది. ఉగ్రవాదులు మన దేశం పై దాడి చేస్తే దానిపై రాజకీయ రగడ చేయడమే తప్ప, కనీసం మరణించిన వారికి సానుభూతి తెలపాలని మన రాజకీయ నేతలకి ఆలోచన కలుగకపోవడం నిజంగా దురదృష్టం.   ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే, కాశ్మీరులో నెలకొన్న సున్నితమయిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే జవాన్లకు ఆయుధాలు చేత బట్టుకొని తిరిగేందుకు అనుమతినీయలేదని అన్నారు. ఈ నిర్ణయం వలన 5 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే గాకుండా, ఆ జవాన్ల కుటుంబాలకు జీవితకాల శోకం మిగిలింది. దేశాన్ని రక్షించాలని కోరిన సైనికులను తగిన ఆయుధాలు కూడా ఇచ్చేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో.

కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి టిడిపియే

    వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి టిడిపియేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టే ఘన విజయం సాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ తమ పార్టీకి దూరమైనా మైనారిటీలు తమవైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం సిట్టింగ్‌లో ఉన్న వారికి కొందరికి సీట్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. అవసరమైతే కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశమిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించిన వారికే సీట్లు దక్కుతాయని, లేకుంటే లేదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలకు ముందే ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఆయన వివరించారు.

నాగం, మోత్కుపల్లి చమత్కారం వేడెక్కి౦ది

      తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఒకరినొకరు దూషించుకునే దాకా పరిస్థితి వెళ్లింది. అసెంబ్లీలో ఎదురుపడ్డ మోత్కుపల్లితో నాగం తెలంగాణ ద్రోహులతో తాను మాట్లాడనని, బాబు కాళ్లవద్ద పడి ఉన్నారని అన్నారు. తొమ్మిదేళ్లు మంత్రి పదవిని బాబు కాళ్ల వద్ద ఉండే అనుభవించావని మోత్కుపల్లి ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాగంకు ఇంకా దొరతనం పోలేదని అన్నారు. తెలంగాణ అంశం మీద చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు. తొమ్మిదేళ్లు బాబుతో ఉండి అలా అంటావా అని మోత్కుపల్లి అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. మొదట చమత్కారంగా ఆరంభమైన మాటల పర్వం క్రమేపి వేడెక్కి ఒకరినొకరు దూషించుకునే వరకు వెళ్లింది.