గుంటూరుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరలింపు

  వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు  అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ‘ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ అనే నిందితుడిని  ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్‌ వాహనాన్ని అనుసరిస్తూ, వారి కస్టడీలో ఉన్న నిందితుడిపై మాజీ ఎంపీ మాధవ్‌ దాడి చేశారు.  పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో గోరంట్ల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈనెల 10వ తేదీ నుండి గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురు రిమాండ్‌లో ఉన్నారు. వీరందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. గుంటూరు పోలీసులకు అప్పగించారు. తిరిగి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకుని వెళ్లనున్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం గురువారం సాయంత్రం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుండి తిరిగి గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు తరలించనున్నారు.  

ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా

    జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి హోం శాఖ మంత్రి  భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.   కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుగు పయనంలో ఆయన విమానం పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించి భారత్ కు చేరుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్‌ మార్చినట్లు సమాచారం. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ లతో భేటీయై ఉగ్రదాడిపై చర్చించారు. భద్రతా చర్యలపై ఆరాతీశారు. మరోవైపు, ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ కూడా నేడు భేటీ కానుంది.ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) సభ్యులే పహల్గామ్‌లోని బైసారన్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన‌ట్లు పేర్కొన్నాయి. కనీసం 5 నుంచి ఆరుగురు ఉగ్రవాదులు కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి ఏకే-47 లతో కాల్పులు జరిపిన‌ట్లు నిర్ధారించాయి. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూ సర్కార్.

ఏ దేశ మేగినా ఎందు కాలిడినా..

రాహుల్ అమెరికా పర్యటన పై  దుమారం  ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.  ఇప్పడు దేశంలో ఆహుల్ గాంధీ అమెరిక పర్యటనలో చేసిన ఆరోపణలు  వివాదాస్పదంగా మారాయి. వివరాల లోకి వెళితే .. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ దేశం వెళ్ళినా.. భారత దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారా? అసలు అందుకోసమే ఆయన తరచూ విదేశాల్లో పర్యటిస్తారా?  అంటే  అవునని, అనుకోవాల్సిన విధంగానే ఆయన నడక, నడత, మాటా ఉంటున్నాయని  విశ్లేషకులు అంటున్నారు. నిజానికి రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యు లలోనూ ఇదే  అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇదనే కాదు.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించి చాల చాలా సందేహాలున్న మాట నిజం. గతంలో ఆయన చివరకు  కాంగ్రెస్ పార్టీకి అయినా  సరైన  సమాచారం లేకుండా సాగించిన విదేశీ పర్యటనలు వివాదాస్పదం అయ్యాయి. అలాగే, రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా.. ఇక్కడ మన దేశంలో ఎక్కడో అక్కడ  నిన్నటి ‘పహల్గాం’ ఉగ్రదాడి,వంటి అవాంఛిత సంఘటనలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు  పహల్గాం  ఉగ్రదాడి, వంటి సంఘటనలు సంబంధం వుందో లేదో కానీ, అనుమానాలు అయితే ఉన్నాయి.  ఇతర ఆరోపణలు  ఎలా ఉన్న.. రాహుల్ గాంధీ విదేశాల్లో చేస్తున్న, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శల పట్ల రాజకీయ ప్రత్యర్దులే కాదు, స్వపక్షీయులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ..  ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబ అభిమాన పాత్రికేయులు, సైతం రాహుల్ గాంధీ  విదేశాల్లో భారత దేశంపై విమర్శలు చేయడం మంచిది కాదని హిత బోధ చేశారు. అంటే.. రాహుల్ ప్రవర్త దేశానికే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి కూడా తలవంపులు తెచ్చేలా ఉందని  అంటున్నారు.  అవును  గతంలో రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ లో పర్యటించిన సందర్భంలో, బారతీయ ములాలున్న సీనియర్ జర్నలిస్ట్  ఒకరు, నెహ్రూ,ఇందిరా గాంధీలు విదేశీ గడ్డపై ఏనాడూ భారత దేశానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడ లేదని విలేకరుల సమావేశంలోనే గుర్తు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో, ఇంగ్లాండ్ లో పర్యటించిన   ఇందిరాగాంధీని పాత్రికేయులు ఆమెను  జైలు  జీవితం గురించి ప్రశ్నించారు. అయితే, ఆమె, ‘నాదేశం గురించి నేను పరాయి దేశంలో తప్పుగా మాట్లాడను. అది నా సంస్కారం కాదు  అని జవాబిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి మరీ రాహుల్ గాంధీకి, ఇది పద్దతి కాదని హిత బోధ చేశారు. అయినా  ఆయన మారలేదు.  నిజానికి  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ  చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భాగంగా బోస్టన్‌ లో జరిగినన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిందని ఆరోపించారు. నిజానికి ఇది ఇప్పడు కొత్తగా చేసిన ఆరోపణ కాదు. గతంలోనూ. ముంబైలో ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియ సూలే, శివసేన(యుబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తో కలిసి ఇవే ఆరోపణలు చేశారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వివిరణ ఇచ్చింది. నిజానికి  రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పట్లోనే మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  సవాల్ విసిరారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం కోర్టులో కేసు వేసే సాహసం చేయలేదు.  నిజానికి, రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శించడం తప్పు కాదు, కానీ, విదేశాలకు వెళ్లి.. అక్కడ భారత రాజ్యాంగ వ్యవస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం తప్పు మాత్రమే కాదు నేరం కూడా అవుతుందని అంటున్నారు. అయితే.. రాహుల్ గాంధీ, దేశంలో అయినా విదేశాల్లో అయినా ఆరోపణలు చేయడమే కానీ వాటిని నిరూపించే ప్రయత్నం ఏనాడు చేయలేదు.  నిజానికి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  భారత ఎన్నికల వ్యవస్థను ఎంతగానో మెచ్చుకున్నారు. గోల్డ్ స్టాండర్డ్,    సర్వోత్తమం అని అభివర్ణించారు. డోనాల్డ్ ట్రంప్ మాటల్లోనే చెప్పుకోవాలంటే,’ Indian election system is most transparent, secure and most efficient system in the world, it is time we learn from it’ అన్నారు. అయితే.. అదే అమెరికాలో, ప్రతిపక్ష నేత హోదాలో ఆ దేశంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థపై చాల తీవ్రమైన ఆరోపణలు చేశారు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయసున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు.  పోలింగ్ రోజు చివరి రెండు గంటల్లో 65 లక్షల మంది ఓటు వేసారని..  అది అసాధ్యమని.. గంటలు,  నిముషాల లెక్కలు చెప్పారు. ఎన్నికల సంఘం తన బాధ్యతల  నిర్వహణలో రాజీ పడిపోయిందని, అంతే కాక వ్యవస్థలోనే ఏదో లోపముందని కూడా తెలుస్తోందని అమెరికాలో ఆరోపించారు. నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు 6.40 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సగటున గంటకు 58 లక్షల మంది ఓటు వేశారు. ఈ సరళి ప్రకారం చూస్తే చివరి రెండు గంటలల్లో సుమారుగా 1.16 కోట్ల మంది ఓటు వేసి ఉండాలి. కానీ ఈ  రెండు గంటల్లో, రాహుల్ గాంధీనే  65 లక్షల మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారని, అంటే సగటు ఓటింగ్ సరళి కంటే చివరి రెండు గంటల్లో పోలింగ్ తగ్గిందని  ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.   అయినా సరే.. రాహుల్ గాంధీకి ఎన్నిక సంఘం పై విశ్వాసం లేక పొతే, దేశంలో కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. ఆయన నిత్యం చేతిలో పట్టుకు తిరగే రాజ్యాంగం వుంది. కానీ, ఇవేవీ కాదని అమెరికాలో భారత రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేయడం ఏమిటి? ఎవరి కోసం.. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా, మన దేశానికీ వ్యతిరేకంగా. అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న అంతర్జాతీయ కుట్ర దారు జార్జ్ సోరోస్  కోసమా ?  లేక మెడకు చుట్టుకుంటున్ననేషనల్ హెరాల్డ్ ఉచ్చు నుంచి దృష్టి మరల్చేందు కోసమా ? ఎందుకు?

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనా మాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచా రం జరుగుతోంది. దాంతో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మొత్తం లెక్కే మారిపోయిందంటున్నారు. తాజాగా ఏపీలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే.. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీతో పాటు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దాంతో.. ఖాళీ అయిన 3 స్థానాల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. మోపిదేవి స్థానాన్ని సానా సతీశ్‌తో భర్తీ చేయగా, ఆర్.కృష్ణయ్యను బీజేపీ తరఫున రాజ్యసభకు పంపారు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న ప్రచారంతో.. ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు ఏపీ బీజేపీలోనూ రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే అదృష్టవంతుడు ఎవరనే దానిపై హాట్ డిబేట్ మొదలైంది. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు.. ఏపీ బీజేపీ నేతలు పలువురు తహతహలాడుతున్నారట. ముఖ్యంగా.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు రాజ్యసభ మాజీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు లాంటి వారితో పాటు కొందరి పేర్లు వినపడుతున్నాయ్. కానీ.. అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే సంకేతాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో చేరే ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి సిగ్నల్స్ అందుతు న్నాయట. 2014-19 మధ్యలో.. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు.. కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు,  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది.  వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపే చాన్స్ ఉందట. అన్నామలైని పెద్దల సభకు పంపి.. కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అన్నాడీఎంకే కూటమి బలం పెరుగు తుందనేది బీజేపీ నేతల అంచనా. అధ్యక్ష పదవి పూర్తయ్యాక అన్నామలైకి ఎంపీగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ కూడా ఇచ్చిందంట.  2024 లోక్‌సభ ఎన్నికల్లో, నారా లోకేశ్ కూడా కోయంబత్తూరులో అన్నామలై తరఫున ప్రచారం చేశారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో.. ఆంధ్రా నుంచి అన్నామలై రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటు న్నారు.  మరోవైపు, బీజేపీలో సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపి స్తోందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమె.. అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడి పోయారు. స్మృతీ ఇరానీ లాంటి మహిళా నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే.. పార్లమెంట్‌లో బీజేపీకి బలమైన వాయిస్ ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తోందట. దాంతో.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు.. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళతారని.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

బీఆర్ఎస్ గ్రేట్ ఎస్కేప్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లైన్ క్లియర్!

మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు. పార్టీల వారీగా చూసుకుంటే.. ఎంఐఎంకి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారితో పాటు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో.. ఎంఐఎం బలం 49కి చేరింది. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బరిలో దిగిన బీజేపీకి.. నలుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే.. బీజేపీలో గెలిచి పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లని మినహాయిస్తే.. మరో 19 మంది కార్పొరేటర్లతో కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు దక్కించుకోవాలి. కాబట్టి.. ఎంఐఎం అయినా, బీజేపీ అయినా.. ఇతర పార్టీల ఓటర్లపై ఆధారపడటం తప్ప మరో అవకాశం లేదు. ఎంఐఎంకు మిత్రపక్షంగా కొనసాగుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి.. ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు, మరో ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి.. మొత్తం 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో లేని బీఆర్ఎస్ దగ్గర పార్టీ ఫిరాయించిన వారు మినహా 9 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి  24 మంది ఓటర్లు ఉన్నారు. అందువల్ల.. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఓటర్లను కలిసి వారి ఓట్లను దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది  బీజేపీ. అయితే అక్కడే బీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనొద్దని.. తమ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులను ఆదేశిస్తూ విప్ జారీ చేసింది. బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోఉన్న కార్పొరేటర్లను ఏదో రకంగా తమవైపు తిప్పుకోవాలనుకున్న బీజేపీ లెక్కలకు.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బేననే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఎందుకంటే గులాబీపార్టీకి ఇప్పుడు ఎంఐఎంతో మిత్రుత్వం లేదు. బీజేపీతో తమకు అసలే పడదని బీఆర్ఎస్ నేతలు చెబుతుం టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్ఎస్ నేతలు పోలింగ్‌లో పాల్గొంటే అటు ఎంఐఎం గెలిచినా, ఇటు బీజేపీ గెలిచినా బద్నాం అయ్యేది మాత్రం బీఆర్ఎస్సే. మజ్లిస్ పార్టీ గెలిస్తే.. ఇంకా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. అదే బీజేపీ గెలిస్తే కారు, కమలం ఒకటేనని కాంగ్రెస్ వాయించేస్తుంది.   అందుకే పోలింగ్‌కు దూరంగా ఉంటే.. రాజకీయంగా ఎలాంటి బాధ ఉండదనే ఆలోచ నతోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఎంఐఎంని సునాయాసంగా గట్టెక్కేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పీఎస్సార్ ఆంజనేయులుకు మే 7వరకూ రిమాండ్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ   బేగంపేటలోని ఆయన నివాసంలో  అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.   ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు. ఆ సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి   ముంబైకు చెందిన నటి కాదంబరి జత్వానీపై కేసు బనాయించి, అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకు వచ్చి నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణాతాతా, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.   ఇప్పుడు ఆ కేసులోనే పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో పీఎస్సార్ ఆంజనేయులును దాదాపు ఏడుగంటల పాటు విచారించిన అనంతరం ఆయనకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు మే 7 వరకూ రిమాండ్ విధించింది. 

పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగువారు మృతి

జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు  జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు. వీరిలో మధుసూదన్ బెంటళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు.  ఆయన తల్లిదండ్రులు కావలిలో నివసిస్తున్నారు. మధుసూదన్ కుటుంబంతో సహా జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాంలో పర్యటిస్తున్న సమయంలో జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్ మరణించారు. ఆయన శరీరంలోకి 42 తూటాలు దూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఇక ఈ ఉగ్రదాడిలో  మరణించిన రెండో తెలుగు వ్యక్తి విశాఖ వాసి చంద్రమౌళి  రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి.. ఈయన కుటుంబంతో సహా పర్యటనకు వెళ్లారు. ఉగ్రమూకలు ఈయనను వెంటాడి వెంటాడి హతమార్చినట్లు చెబుతున్నారు. చంపవద్దంటూ బతిమాలినా క్రూరంగా కాల్చి చంపేశారని చెబుతున్నారు. 

టీఆర్ఎఫ్ ఐఎస్ఐ సృష్టే.. భారత్ లో హింసే లక్ష్యం!

జమ్మూ కాశ్మీర్ లోని  అనంతనాగ్ జిల్లా పహల్గాంలో  ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్   (టీఆర్ఎఫ్)  ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం  ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ఈ దారుణానికి పాల్పడినది తానేనని ప్రకటించుకోవండంలో  టీఆర్ఎఫ్ మరో సారి చర్చలోకి వచ్చింది. ఈ టీఆర్ఎఫ్ ఏమిటి? దీని వెనుక ఉన్నదెవరు ? అన్న ప్రశ్నలు వినిపి స్తున్నాయి.  కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాక్ ప్రోద్బలం, ప్రోత్సాహంతో ఈ సంస్థ ఏర్పడింది.  ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఏల్ఈటీ)కు అనుబంధంగా టీఆర్ఎఫ్ పని చేస్తున్నది. టీఆర్ఎఫ్ ఆవిర్భావం తరువాత అతి తక్కువ సమయంలోనే తన ఉనికిని బలంగా చాటుకుంది.  హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారిని కలుపుకుని టీఆర్ఎస్ భారత్ లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసింది.  టీఆర్ఎఫ్ ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద 2023 జనవరిలో కేందం నిషేధించింది.  షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ దార్ ఆపరేషనల్ చీఫ్‌గా టీఆర్ఎఫ్ సామాజిక మాధ్యమం వేదికగా  భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. కాశ్మీరీ పండిట్లు, స్థానిక పోలీసులు, కార్మికులు, పర్యాటకులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఇప్పుడు పహల్గామ్‌లో జరిగిన దాడి కూడా అలాంటిదేనని చెప్పాలి.  లష్కరే తోయిబా తరఫున పాక్ గూఢచార సంస్థే  టీఆర్ఎఫ్‌ను సృష్టించిందని అంటారు.

టీసీఎస్ కు భూములపై వైసీపీ గగ్గోలేంటి?

విశాఖ ఐటీ హిల్స్ లో  టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే రైటా- రాంగా...? బ్లూ ఇన్ ఫ్లూయెన్ష‌ర్లు చేస్తోన్న‌ ఈ దుష్ప్ర‌చారంలో నిజ‌మెంత, అబ‌ద్ధ‌మెంత‌?  విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే ఇవ్వ‌డం క‌రెక్టేన‌ని.. క‌ళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొంద‌రూ వైపీపీయులు దీన్నో భూత‌ద్దంలో పెట్టి చూపెడుతూ.. త‌ప్పు ప‌డుతున్నారు. ఇదే గ‌త ప్ర‌భుత్వాలు స్వామీజీల‌కు ఎక‌రా రూపాయ‌కు ఇస్తుంటే లేని త‌ప్పు.. ఇప్పుడు ఉద్యోగ‌దాయిని అయిన‌ ఐటీ రంగానికి సంబంధించి 99 పైస‌లకే భూమి ఇవ్వ‌డం ఎందుకు త‌ప్పు? టీసీఎస్ ఏమైనా స‌మాన్య‌మైన సంస్థా.. ఇండియ‌న్ ఐటీ ఇండ‌స్ట్రీలోనే టాప్ త్రీలో ఒక‌టి. అలాంటి సంస్థ‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డంలో భాగంగా వారికిలాంటి అవ‌కాశం ఇవ్వ‌డం సంజ‌స‌మే. ఇలాంటి సంస్థ‌లు  రాష్ట్రానికి రావాలంటే ఆ మాత్రం త్యాగం అవ‌స‌ర‌మే అన్న‌ది నిరుద్యోగుల వాద‌న‌. ఇలాంటి ఎన్నో నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికేగా ప్ర‌భుత్వాన్ని ఎంపిక చేసుకుంటున్న‌ది? ఇదే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇక్క‌డ ఉన్న అమ‌రా రాజా వంటి సంస్థ‌ల‌కు తెలంగాణాకు వెళ్లి పోయాయ్. అదే ఇప్పుడు ఆయా సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయ్.  ఇప్ప‌టికే ఏఐ హ‌బ్ గా ఏపీని ఎంపిక చేసుకునే దిశ‌గా.. బిల్ గేట్స్ తో బాబు చేస్తున్న చ‌ర్చ‌లు ఒక కొలిక్కి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. ఇలాంటి ఆక‌ర్ష‌ణీయ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడితేనే క‌దా.. రాష్ట్రం మున్ముందుకు వెళ్లేది? అన్న మాట వినిపిస్తోంది.  బేసిగ్గా ఏపీ పెద్ద పెద్ద డాటా సెంట‌ర్లు పెట్ట‌డానికి త‌గిన వెస‌లు బాటు లేద‌న్న మాట ఐటీ రంగంలో వినిపిస్తూ ఉంటుంది. అది త‌ప్ప‌ని నిరూపించాలంటే టీసీఎస్ వంటి సంస్థ‌లు ఒక అడుగు ముందుకు వేయాల్సి  ఉంటుంది. అందులో భాగంగా వారికిలాంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.   సినిమా రంగానికి ఆనాడు హైద‌రాబాద్ లో భారీ ఎత్తున ఉచిత భూముల‌ను ఇవ్వ‌డం వ‌ల్లే క‌దా సినీ ప‌రిశ్ర‌మ‌ అక్కడ నుంచి వ‌దిలి ఇక్క‌డికి రానంటోంది. వారు రావాలంటే ఇక్క‌డ కూడా త‌గిన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తేనే క‌దా.. అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది.  ఇదే వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో కోలీవుడ్ కి ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన త‌డ వంటి చోట్ల భూములు ఇవ్వాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. మ‌రి అప్పుడు లేవని నోరు ఇప్పుడే ఎందుకు లేస్తోంది. మ‌ద‌న‌ప‌ల్లెలోనూ ఎక‌రాల కొద్దీ స్టూడియోల నిర్మాణాల‌కు ఇచ్చేందుకు నాటి ప్ర‌భుత్వం పావులు క‌దిపింది.  ఇద‌లా ఉంచండి.. భీమిలి స‌ముద్ర తీర ప్రాంతాన్ని విజ‌య‌సాయిరెడ్డి భారీ ఎత్తున విస్త‌రించి సామ్రాజ్య స్థాప‌న చేసే య‌త్నం చేశారు. ఏకంగా సెవెన్ స్టార్ హోట‌ల్ నిర్మాణం చేయ‌డానికి పెద్ద ఎత్తున పునాదులు వేశారు. ఆనాడు అధికారం త‌మ చేతుల్లో ఉంద‌న్న కోణంలో ఆర్మీ త‌ర‌హా బంక‌ర్ల నిర్మాణం సైతం చేప‌ట్టారు. జ‌న‌సేన కార్పొరేట‌ర్ మూర్తి ఇది గుర్తించ‌డం వ‌ల్ల.. కేసులు వేయ‌డం వ‌ల్ల.. ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు వాటిని, కూట‌మి ప్ర‌భుత్వం కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లిస్తోంది. మ‌రి  ఇదే బ్లూ ఇన్ ఫ్లూయెన్ష‌ర్లు.. ఈ విష‌యాల‌ను ఎందుకు గుర్తించ‌రు. మ‌రో ఉదాహ‌ర‌ణ తీసుకుందాం.. గ‌త ప్ర‌భుత్వ కాలంలో ఇటు తిరుమ‌ల‌లో కావ‌చ్చు అటు బ‌య‌ట కావ‌చ్చు కొంద‌రు స్వామీజీల‌కు అప్ప‌నంగా స్థ‌లాలు, పొలాలు.. త‌మ‌ సొంత ఆస్తిలా  రాసిచ్చేశారు. మ‌రి అప్పుడు ఇదే బ్లూ ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల వాద‌న‌ ఏమై పోయింది? వారిక‌పుడు క‌ళ్లు క‌నిపించ‌లేదా? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది.  ఏది ఏమైనా ఇదంతా ప్రాజెక్టుల‌కు గండి కొట్టే ఎత్తుగ‌డ‌..  బ్రాహ్మ‌డి  చేతిలో మేక పిల్ల‌ను కుక్క పిల్ల‌ను చేసేలాంటి కుట్ర‌. వీటిని భ‌గ్నం చేసి.. ఇలాంటి వారిప‌ట్ల‌ వెంట‌నే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి.   ప్ర‌భుత్వం అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగానే ఐటీ సంస్థ‌ల‌ను ఏదో ఒక ఆక‌ర్షణీయ  మంత్రం వేసి ఆక‌ట్టుకోవ‌ల్సిందే. లేకుంటే త‌మ బ‌తుకులు శాశ్వ‌తంగా పొరుగురాష్ట్రాల పాలే అంటోంది నిరుద్యోగ యువ‌త‌.

ఉగ్రదాడికి నిరసనగా జమ్మకాశ్మీర్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు

 జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 27 మంది ఉసురు తీసిన సంఘటనకు నిరసనగా ఉవ్వెత్తున ఆందోళనలు చెలరేగాయి. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూకలు జరిపిన దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 27 మంది మరణించిన ఘటనను నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.   పహల్గాంలో  స్థానికులు, పౌర సంఘాలు ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధించారు. సంపూర్ణ బంద్ కు పిలుపునిచ్చారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే తరహా ఆందోళనలు జమ్మూ కార్మీర్ వ్యాప్తంగా జరుగుతున్నాయి.  జమ్ము సహా రాష్ట్ర మంతటా ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అన్ని రాజకీయ పార్టలూ కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి.  

మరో మారు ఉగ్రదాడి

జమ్మూ కశ్మీర్ పై ఉగ్రవాదం మరో మారు పంజా విసిరింది. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్ర మూకలు మరో మారు తెగబడ్డాయి.అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో  ఇద్దరు విదేశీయులు సహా మొత్తం  27 మంది టూరిస్టులు మరణించారు.  పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిని హెలికాప్టర్ ద్వారా పహల్గాం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి స్థావరంగా మారిన జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది.  2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370 ని నిర్వీర్యం చేసిన నేపథ్యంలో  క్రమక్రమంగా  ప్రశాంత వాతావరణం  నెలకొంది. మరోవంక పరిపాలనా పరమైన మార్పులలో భాగంగా  జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.ఆ తర్వాత కశ్మీరీ పండిట్లు క్రమంగా తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తై.. మళ్లీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటై, ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడితో మరోమారు కలకలం రేగుతోంది. కాగా  పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత  రాహుల్‌ గాంధీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహా పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తీవ్రంగా ఖంచారు. అమెరికా, రష్యా సహా పలు దేశాలు పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండిచారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో భారత దేశానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.  పహల్గాం ఉగ్రదాడి దిగ్ర్భాంతికరం. ఇదొక క్రూరమైన, అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామనీ, వారిని వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రమూకల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని, ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం మరింతగా బలపడుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనకు సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని.. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పర్యటనను కుదించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు.  అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మచ్చ అనీ, ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ఇక నైనా ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ డొల్ల ప్రకటనలను కట్టిపెట్టి..  బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచించారు. ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పహల్గాం ఉగ్రదాడి వార్త కలచివేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్‌, అర్జెంటినా దేశాలు కూడా తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి దొంగదెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడి పాశవిక చర్య అని, దోషులను వదలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, దాడికి పాల్పడినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపడం అమానవీయ చర్య అని మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, కె.లక్ష్మణ్‌, బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు ఉగ్రదాడిని ఖండించారు.

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి

టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి వార్త నన్ను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు. లిక్కర్ బిజినేస్‌లో కూడా వీరయ్య చౌదరి ఉన్నారు. జిల్లాలో పలు చోట్ల మద్యం దుకాణాలు నిర్వహణలో సిండికేట్‌గా ఈయన వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.ఈ మద్యం సిండికేట్‌ వ్యవహారాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారల ఆర్ధికంగా వివాదాలు కారణంగా ఆయనపై హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఎస్పీ దామోదర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అపార్టుమెంట్​లో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ హటాహుటిన వెళ్లి వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి, శ్రధ్ధాంజలి ఘటించారు. ఒంగోలు నగరం నడిబొడ్డులో హత్య సంఘటన పట్టణవాసులకు దిగ్భ్రాంతిని కలిగించింది.  

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..కమలం పార్టీ కన్ను ఆ రాష్ట్రంపైనే..!

  ఏపీ రాజ్య సభ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్రమంత్రి అమిత్‌షాతో  సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బిజెపికి ఇచ్చేందుకు... టిడిపి అలాగే జనసేన రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బిజెపికి కేటాయించారు.ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.. రాజ్యసభ అభ్యర్థి పై చర్చ జరిగింది. అమిత్ షా... నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కిషన్ రెడ్డి కూడా కలిశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు అన్నామలైను అభ్యర్థిగా నిలపబోతున్నట్టు అమిత్‌షా, చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది. కొత్తగా ఈ రాజ్యసభ రేసులో మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.  వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ పాగా వేయాలని కమలం పార్టీ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తన పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో అన్నామలైకి మంచి గుర్తింపు ఇస్తామని.. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఏప్రిల్ 15వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 29 గా నిర్ణయించారు అధికారులు. ఇక 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మే రెండవ తేదీ నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. వైసిపి పార్టీ సీట్ల ప్రకారం వాళ్లకు అవకాశం లేదని తెలుస్తోంది. అంటే ఈ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతోనే పోటీ

  కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతు పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. స్ధానిక ఎమ్మెల్యే సంజయ్‌కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా? అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ హస్తం పార్టీలో చేరడంతో కనీసం తన సంప్రదించకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  రాష్ట్రంలో సీఎం రేవంత్ పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని తరుచుగా ఆయన వాపోతున్నారు.  వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీని వీడనని ఆయన తెలిపారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు కాబట్టి అసంతృప్తితోనే ఉన్నానని, 2014లో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేనొక్కడినే ఎమ్మెల్యేగా అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ అంటే నేను.. నేను అంటే కాంగ్రెస్ గా పార్టీ ని బలోపేతం చేశా అని ఆయన వెల్లడించారు. గతంలో జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి మరింత మనస్తాపం చెందారు. గంగారెడ్డి హత్య చేసిన నిందితుడిని పట్టుకోవాలని రోడ్డు పై బైఠాయించారు. జీవన్‌రెడ్డి వైఖరితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు గొయ్యి వెనుక లాగా మారింది.

ప్రధాని మోదీకి సౌదీ అరేబియాలో అపూర్వ స్వాగతం

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా ప్రభుత్వం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్‌గా వచ్చిన ఎఫ్‌-15 ఫైటర్ జెట్‌లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని  సౌదీ అరేబియా చేరుకున్నారు.  ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇటీవల మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. . దీనిపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ రోజు, రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు. మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇది మూడోసారి  

సెంటిమెంట్ పండుతుందా?.. సభ సక్సెస్ అవుతుందా?

ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు  ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా  ఉదాహరణ  తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్.     ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ  చేసిన వ్యాఖ్య  రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరో వంక పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బతీసిందని  బీఆర్ఎస్  నాయకులు ఒకరి వెంట ఒకరు కత్తులు దూస్తున్నారు.  అయితే..  నిజంగా అయన చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు బీఆర్ఎస్ కు మాత్రం పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు  చక్కగా అంది వచ్చాయని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే  పీసీసీ అధ్యక్షుడు  బీఆర్ఎస్ కు, స్నేహ హస్తం అందించారని అంటున్నారు.   ఈ నెల  27 న వరంగల్ లో జరప తలపెట్టిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి  టీఆర్ఎస్/బీఆర్ఎస్  సభల సక్సెస్ కు ఇంధనంలా పనిచేసిన  సెంటిమెంట్ ఏదీ లేని ప్రస్తుత పరిస్థితిలో సభ సక్సెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే..  పార్టీ మనుగడకు  అత్యంత కీలకంగా భావిస్తున్న  రజతోత్సవ సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని  బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్  జిల్లాల వారీగా పార్టీ నాయకులకు ప్రతి రోజు పాఠాలు నూరిపోస్తున్నారు.  కాసులు కుమ్మరించి అయినా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని  నాయకులను కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  ఇలాంటి సమయంలో పీసీపీ చీఫ్  ఒక సెంటిమెంటల్ ఇష్యూ ని బంగారు పళ్ళెంలో పెట్టి  బీఆర్ఎస్ కు అందించారని అంటున్నారు. నిజానికి  గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి  ఇతర కారణాలతో పాటుగా సెంటిమెంట్ ఇష్యూ లేక పోవడం  కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. అలాగే  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంతో  పార్టీకి ఉన్న తెలంగాణ పేగుబంధం తెగిపోయిందని దాంతో  కారు  పార్టీని  సెంటిమెంట్ రివర్స్ లో దెబ్బ తీసిందని గులాబీ పార్టీ గుర్తించిందని అంటారు.  అదెలా ఉన్నా ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణా ప్రభుత్వం సోమవారం ( ఏప్రిల్ 21)న  నిజామాబాద్‌లో నిర్వహించిన  ‘రైతు మహోత్సవ’ సభలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా  ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ వ్యాఖ్యానించారని బీఆర్ఎస్ నాయకులూ మండి పడుతున్నారు. నిజానికి  మహేష్ కుమార్ గౌడ్, చెప్పింది సంపూర్ణ సత్యం కాదు, అలాగని  సంపూర్ణ అసత్యమూ  కాదు.  అవును  1923లో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వారంతా వ్యవసాయం చేయడమే కాకుండా మాక్కూడా వ్యవసాయం నేర్పించారు  అంటూ చేసిన వ్యాఖ్య పూర్తి సత్యం కాకపోయినా పూర్తి అసత్యం కూడా కాదు.అక్కడి నుంచి ఇక్కడకు రైతులు వచ్చింది నిజం. కలిసి మెలసి వ్యవసాయం చేసింది నిజం. పరస్పరం అనుభవాలను పంచుకున్నది నిజం. పరస్పరం లాభదాయక వ్యవసాయ పద్దతులను నేర్చుకున్నది నిజం. ఇది చరిత్ర. కాదనలేని చరిత్ర. నిజానికి  మహేష్ కుమార్ గౌడ్  తమ ఉపన్యాసంలో చెప్పింది కూడా అదే. అందులో పెద్దగా తప్పు పట్టవలసింది లేదు.  అయినా అయన చేసిన  వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని వ్యవసాయ శాఖ మాజీ  మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ అపరిపక్వత, అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.ఆంధ్రా పాలకుల మెప్పుకోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్‌ఎస్  శ్రీరామరక్ష అని కేసీఆర్‌ పదే పదే చెప్పిన విషయం పీసీసీ చీఫ్‌ మాటలతో తేటతెల్లమైందని అన్నారు.  అలాగే..  మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా మహేశ్‌కుమార్‌ గౌడ్ వైఖరి యావత్‌ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు ఉన్నదని అన్నారు. భావదారిద్య్రంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నామనే సోయి మరిచి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలవి బానిస బతుకులని, వారికి బొత్తిగా తెలంగాణ సోయి లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే.. పీసీసే చీఫ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్/బీఆరేస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు ఎంతవరకు ఉపకరిస్తాయి. ఏ మేరకు సభ సక్సెస్ అవుతుంది అనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత దినదినాభి వృద్ధి కాదు, క్షణక్షణాభి వృద్ది చెందుతోంది. అందులో అనుమానం లేదు. కానీ..  కుటుంబ చట్రం నుంచి బయట పడక పోవడం ఇప్పటికీ బీఆర్ఎస్  కు శాపంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో. సభ సక్సెస్  అవుతుందా, చప్పగా ముగుస్తుందా? అంటే.. ప్రస్తుతానికి  ‘నో కామెంట్’ అనేదే సరైన సమాధానం అవుతుందని అంటున్నారు.

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సీఐడీ కేసు

  వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్‌ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై  పౌరసత్వంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్‌ నెలలో చెన్నమనేని రమేష్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది  చెన్నమనేని రమేష్‌ మొదలు చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొనసాగుతోంది. పౌరసత్వ వివాదంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలను సోమవారం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టు ద్వారా అందజేశారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో సవాల్‌ చేయగా.. ఆయన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి కొట్టివేసింది. అంతేగాకుండా పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి రూ.5 లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతమంతా  తిరిగి ఇచ్చేయాలని సీపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన న్యాయ వ్యవస్థలను,కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శించారు. ఇండియన్ సిటిజన్ కాకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతం తీసుకున్నాడని..అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని అనేక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందాడన్నారు. అందుకే ఆయన తీసుకున్న ఎమ్మెల్యే పదవికాలంలో తీసుకున్న మొత్తం  జీతం అంతా తిరిగి ఇచ్చేయాలని..దీనిపై అవసరమైతే తాను కోర్టును కూడా ఆశ్రయిస్తామని  నారాయణ స్పష్టంచేశారు.