ఏపీలో బాలింతలకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లు

  ఏపీలో కూటమి సర్కార్ మరో మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎన్టీఆర్‌ బేబీ కిట్లు అందించాలని నిర్ణయంచింది. 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఈ స్కీమ్ మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నాళ్లు అమలు చేసిన తర్వాత నిలిపివేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 'ఎన్టీఆర్‌ బేబీ కిట్లు' పేరుతో మళ్లీ మొదలు పెడతోంది.  ఈ కిట్‌లో దోమతెరతో ఉన్న వాటర్‌ ప్రూఫ్ షీటు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ, బట్టలు, తువ్వాలు, పరుపు, నాప్కిన్లు లాంటి 11 వస్తువులు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రెండేళ్ల పాటు DMHOలు, DCHSలు, GGHలకు 'రేట్ కాంట్రాక్ట్' పద్ధతిలో కిట్లు సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. ఈ కిట్లను పంపిణీ చేసే బాధ్యతను ఏపీఎంఎస్‌ఐడీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే 11 రకాల వస్తువులతో కలిపి.. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1410గా ఉంటుందని చెబుతున్నారు

నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్

  వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద, అలాగే నేరపూరిత కుట్ర ఆరోపణల కింద నెహాల్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు యూఎస్ ప్రాసిక్యూషన్ పేర్కొన్నాది.  ఈ కేసులో తదుపరి విచారణ జూలై 17న జరగనుంది. ఆ సమయంలో నెహాల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, దానిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని యూఎస్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ. 14 వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరమ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదర్కొంటున్నారు.

ఎరువుల కోసం రైతుల తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు

తెలంగాణలో రైతాంగం అవస్థలు వ్యవసాయ అధికారులకు పట్టడం లేదు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులకు ముందు చూపు కొరవడటంతో అన్నదాతలు అవస్థలు పడున్నారు.  ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట అదును దాటుతున్నా.. సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైన అధికారుల తీరును దుయ్యబడుతున్నారు.  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల్లపెల్లి లోని రైతులు గంటల తరబడి ఎరువుల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా నిలబడే ఓపిక లేక తమ చెప్పులను క్యూలైన్ లో వదిలేసి పక్కకు వెళ్లి కూర్చుంటున్న దుస్థితి కళ్లకు కడుతోంది. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఇటీవల సాగుచేసిన మక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయం ఆసన్నమైనా యూరియా కొరత పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. దీంతో రైతాంగం. యూరియా కోసం   సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్‌లో పెట్టి పొద్దంతా పనులు మానుకుని వేచి ఉంటున్నారు. అయినా వారికి ఒకటి, రెండు సంచులకు మించి యూరియా దొరకడం లేదు. ఆ అరకొర సరఫరా వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  సహకార శాఖ అధికారుల మాయాజాలానికి తోడు వ్యవసాయశాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందంటున్నారు. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతుంటే, మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం విడ్డూరంగా ఉంది.

బీబీకా ఆలంను సందర్శించిన మంత్రులు

  మొహర్రం సందర్బంగా హైదరాబాద్‌లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వందల సంవత్సరాల అనావాయితీగా వస్తున్న ఊరేగింపు కోసం ఏనుగును ఇప్పటికే తీసుకురావడం జరిగింది. కాగా, మొహర్రం పర్వదినం పురస్కరించుకొని గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు కొనసాగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎఫండీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్ల హుస్సేనీ ఇతర మైనార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పాల్గోన్నారు. దీంతో అధికారులు  మొహర్రం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు

కవిత కారు దిగిపోవడం ఖాయమేనా?

కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా ఫైర్ బ్రాండ్ లీడర్ గా ముద్రపడిన కవిత.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కూడా. తండ్రి చాటు బిడ్డగానే రాజకీయాలలో తొలి అడుగులు వేసినా.. ఆ తరువాత ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బతుకమ్మ, బోనాల పండుగలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. లోక్ సభ సభ్యురాలిగా తన ప్రతిభనూ చాటారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.  అటువంటి కల్వకుంట్ల కవిత ఇటీవల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నాయకత్వం పైన కవిత చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు కవితను బీఆర్ఎస్ కే కాకుండా.. కేసీఆర్ కుటుంబానికి కూడా దూరం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. దీంతో కవిత పొలిటికల్ జర్నీపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తన దేవుడంటూనే కవిత బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా కవితను దూరంపెడుతున్నారు. ఇందుకు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరౌతున్న తరుణంలో తండ్రిని కలవడానికి వచ్చిన కవితవైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదు. చిన్న సైగతో ఆమె తన సమీపానికి కూడా రాకుండా నిలువరించారు. ఇక తాజాగా కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సందర్భంగా సొంత కుమార్తె అయి ఉండి కూడా ఎవరో పరాయి వ్యక్తిలా, అతిథిలా కవిత యశోదా ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి వచ్చేయాల్సి వచ్చింది. వీటన్నిటికీ మించి ఇటీవల కవిత ఒక ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె కారు దిగిపోవడానికే నిర్ణయించుకున్నారని తేటతెల్లం అయ్యింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆమె ఎంచుకున్న ఛానెల్.. అలాగే ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయంగా బీఆర్ఎస్ తో కలిసి నడిచే పరిస్థితి ఎంత మాత్రం లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. భవిష్యత్ లో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని అని కుండబద్దలు కొట్టడమే కాకుండా.. తన సోదరుడు కేటీఆర్ తో తనకు విభేదాలున్నాయని కూడా స్పష్టంగా చెప్పారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకు వేసి ఆ ఇంటర్వ్యూలో తన తండ్రిపైనే విమర్శలను గురిపెట్టి వదిలారు. తన నియోజకవర్గ అభివృద్ధికి స్వయంగా తాను కోరినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.  ఇక బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిర చేస్తున్న.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కవిత పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేశారు.  వీటన్నిటినీ బట్టి చూస్తుంటే కవిత కారు దిగి సొంత దారి చూసుకునే రోజులు ఎంతో దూరంలో లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌‌కు కేటీఆర్ సవాల్

  రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.  72 గంటలు సమయం ఇస్తున్నా.. ప్రిపేర్‌ అయ్యి చర్చకు రండి ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లెలోనైనా చర్చకు సిద్దమని తేల్చి చెప్పారు. ప్లేస్, టైం, డేట్ అన్నీ రేవంత్ ఇష్ట్రమన్నారు. బేసిన్‌కు తేడా తెలియని రేవంత్..కేసీఆర్‌ను చర్చకు పిలుస్తారా అని ప్రశ్నించారు. ఆయన స్థాయికి తాము చాలని సెటైర్ల వేశారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్‌. రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్‌ఎస్‌. నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్ అన్నారు.  ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో చర్చకు సిద్ధమని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి పంపుతున్నారు. తన అనుచరులకు నియామకాలు ఇచ్చారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదు. 70 లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేశాం. రైతులకు  Free electricity ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌కే చెందుంతన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్‌లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ చేశారు. నాలుగు వేల పెన్షన్, రూ. 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.‘వందనా.. వాళ్ళ‌ బొందనా? వంద సీట్లు కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది. వంద గెలవాలంటే.. ముందు ప్రజలు ఓట్లు వేయాలి కదా. రేవంత్ రెడ్డి దండుపాళ్యం గ్యాంగ్ మాత్రమే తెలంగాణలో జోరు మీదుంది. గుడ్డులు ఊడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటుని కేటీఆర్ అన్నారు.

గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి.. చివరకు ఏమైందంటే?

  గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఈ క్రమంలో వడ్డకొండ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో నలుగురి స్వల్పగాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ ని చాలా మంది వాడుతుంటారు. అయితే కొంతమంది గూగుల్ మ్యాప్స్ పైనే గుడ్డిగా ఆధారపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఈ యాప్‌ ఇచ్చే డైరెక్షన్స్ నమ్మి ఎంతోమంది ప్రమాదాల్లో పడ్డారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

రేవంత్ సర్కార్ కు ఖర్గే కితాబు!

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. ఒక విధంగా ఉరమని ఉరుముల రాష్ట్రంలో కాలుపెట్టిన ఖర్గే, ఆయన వెంట వచ్చిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చిన పనితో పాటుగా పక్కపనులను చక్కపెట్టుకు వెళ్ళారని, పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.  సరే.. పక్కపనుల సంగతి కాసేపు పక్కనపెట్టి అసలు విషయానికి వస్తే..  మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ప్రధానంగా సామాజిక న్యాయ సదస్సు పేరిట తెలంగాణ కాంగ్రెస్ కమిటీ  శుక్రవారం (జులై 4) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రనికి వచ్చారు.అయితే సదస్సు సదస్సులా కాకుండా..  బహిరంగ సభలా జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలప్రదర్శన సభలా జరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  విశ్లేషకులు పేర్కొనడమే కాదు.. పార్టీ నాయకులు అదే చెప్పుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు. నిజంగా కూడా  ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సెంట్రిక్ గానే జరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో పెరిగిన దురాన్ని తగ్గించుకునే ప్రయత్నంగానూ.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి,తన కుర్చీని సుస్థిరం చేసుకునే ప్రయత్నంగా  ఎల్బీస్టేడియం సభను పేర్కొనవచ్చని పరిశీలకులతో పాటుగా, పార్టీ నాయకులు కూడా పేర్కొంటున్నారు.  అందుకే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అదనంగా ఏడవ గ్యారెంటీగా.. పార్టీ అధిష్టానానికి వంద అసెంబ్లీ, 15 లోక్ సభ సీట్లను గ్యారెంటీ ఇచ్చారని అంటున్నారు. ఎల్బీ స్టేడియం సభలో ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, కాదంటే, ఖర్గే ద్వారా పార్టీ అధినేత రాహుల్ గాంధీకీ.. మూడేళ్ల ముందే హామీ ఇస్తున్నా.. రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తాం. ఇక్కడ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వంద సీట్లలో ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత. తెలంగాణ నుంచి 15 మంది ఎంపీలను ఢిల్లీకి పంపుతాం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మావంతు సహకారం అందిస్తాం  అంటూ ఇచ్చిన హామీ..  మూడేళ్ళు తనను ముఖ్యమంత్రి పదవిలో కొంసగించాలని చేసిన అభ్యర్ధనగానే  భావించవలసి ఉంటుదని పరిశీలకులు భావిన్తున్నారు. అయితే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుర్చీని కాపాడుకునెందుక చేసిన ప్రయత్నం సక్సెస్’ అయినట్లేనా అంటే..  తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కితాబు ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఖర్గే సంతృప్తి  చెందినట్లే ఉందని అంటు న్నారు. అంతే కాకుండా.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణలో తొలిసారిగా కులగణన చేయించిందని, కులగణనతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేసిన వ్యాఖ్యాలు రేవంత్ రెడ్డి సర్కార్  కు అధ్యక్షులవారు ఇచ్చిన సర్టిఫికేట్ గానే భావించవలసి ఉంటుందంటున్నారు. అలాగే..  ఖర్గే తన ప్రసంగంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం కూడా  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన కితాబుగానే  ముఖ్యమంత్రి అనుచరగణం పేర్కొంటున్నారు. అయితే.. ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమత్రి కుర్చీకి గ్యారెంటీ  ఇస్తుందా? అంటే అలా అనుకునే అవకాశం లేదని అంటున్నారు. ఖర్గే సంతృప్తి చెందితే సరిపోదనీ, హై కమాండ్ సంతృప్తి చెందితేనే.. ఏ ముఖ్యమంత్రి కుర్చీయినా నిలబడుతుందనీ లేదంటే ఏమి జరగాలో అదే జరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల కర్ణాటకలో ముఖ్యమత్రి మార్పు విషయంగా ఖర్గే  అది పార్టీ హై కమాండ్ పరిధిలోని అంశమనీ,  హై కమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో ఎవరూ చెప్పలేరంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి మార్పు తన చేతిలో లేదని ఖర్గే చేతులెత్తేసిన నేపథ్యంలో.. కర్ణాటకలో అయినా, తెలంగాణాలో అయినా  హై కమాండ్ ముఖ్యమంత్రిని మార్చాలని అనుకుంటే ఖర్గే ఇచ్చిన సర్టిఫికేట్ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడలేక పోవచ్చని అంటున్నారు.

ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ య‌శోద ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయ‌న‌ అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.   వైద్య పరీక్షలలో కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు తెలియడంతో అవి సాధారణ స్థాయికి వచ్చే వరకూ ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.  జ్వరం అదుపులోనికి రావడం, సుగర్, సోడియం లెవెల్స్ సాధారణ స్థితికి రావడంతో ఆయన ఈ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు శుక్రవారం ఆయన ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చేరిన తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలతో ఆక్కడే ఆయన ఇష్ఠాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రైతుల కష్టాలు, యూరియా లభ్యత, సాగునీరు, వ్యవసాయం, ఇతర ప్రజా సమస్యలపై ఆయన వారితో ముచ్చటించారు.   అదే సమయంలో వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు.  బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే కేసీఆర్ త్వరలో మీడియా ముందుకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నిక నేపధ్యంలో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

అంతా అయిపోయాకా ఇప్పుడెందుకీ యాత్ర?

జూలై 9న జ‌గ‌న్ మామిడి టూర్ సీజన్ అయ్యాకా వచ్చి ప్రయోజనమేంటంటున్న రైతులు చిత్తూరు జిల్లా మామిడి వ్య‌వ‌హారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై  9న జ‌గ‌న్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వ‌చ్చి ఇక్క‌డి రైతుల‌ను ప‌ర‌మార్శించ‌నున్నారు. కార‌ణం ఈ రైతుల‌కు త‌గిన ధ‌ర లేక అవ‌స్థ  ప‌డుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా  వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్ర అంటే తెలియందేముంది. వైసీపీ శ్రేణులు, నేతలు రెచ్చిపోయి ప్రకటనలు గుప్పించేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా వంటి వారు జగన్ వస్తున్నాడనే సరికి తెలుగుదేశం కూటమి నేతలు వణికి పోతున్నారంటూ మాట్లాడేస్తున్నారు. అయితే రైతులు మాత్రం జగన్ ఓదార్పు అంటూ చేయనున్న యాత్రపై పెదవి విరుస్తున్నారు.  సీజన్ అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్ర‌యోజ‌న‌మేంట‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మా హ‌యాంలో మేం రూ. 4 వేలు స‌బ్సిడీ ఇచ్చాం.  మీ హ‌యాంలో  మీరేం ఇచ్చార‌ని నిల‌దీస్తున్నారు స్థానిక తెలుగుదేశం లీడ‌ర్లు.  ఈ రాజకీయ‌ పోరాటాల‌ను అటుంచితే.. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు ఇంత క‌ష్టం ఎలా వ‌చ్చిందో చూస్తే.. ఇక్క‌డ టేబుల్ ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. తోతాపురి ర‌కాల‌ను ఎక్కువ‌గా పండించారు. కార‌ణం ఈ ప్రాంతంలో ఏకంగా 60 వ‌ర‌కూ గుజ్జు ప‌రిశ్ర‌మ‌లున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మామిడి రైతులు అధిక శాతం ఈ ర‌కాల‌నే పండించారు. దానికి తోడు ఈ ఏడాది వ‌ర్షాలు  కూడా స‌కాలంలో ప‌డడంతో మామిడి దిగుబ‌డి భారీగా పెరిగింది. దీంతో డిమాండ్ త‌గ్గింది. ఇదంతా అలా ఉంచితే.. ఇప్ప‌టికే ల‌క్ష క్వింటాళ్ల మామిడి గుజ్జు అలాగే నిల్వ ఉండి పోయింది. అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం దృష్ట్యా ఈ గుజ్జును ఎగుమ‌తి చేయ‌లేక పోతున్నారు. స్థానికంగా అమ్మ‌గ‌లిగే ర‌కాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌లు కొంటాయ‌న్న భావనతో పండించిన తోతాపురిని ఎవ‌రూ కొన‌డం లేదు. ఆల్రెడీ ఉన్న నిల్వ‌ల‌ను అమ్ముకోలేక పోవ‌డంతో.. గుజ్జు ప‌రిశ్ర‌మ‌లు మామిడిని కొన‌డం ఆపేశాయి. దానికి తోడు ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ సిండికేట్ గా ఏర్ప‌డి.. మేలో తెర‌వాల్సిన ఫ్యాక్ట‌రీలు ఇంకా తెర‌వ‌కుండా నానుస్తున్నారు. దీంతో దిక్కు తోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోయాడు మామిడి రైతు.  వీట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మామిడి రైతును ఆదుకోవ‌డంలో భాగంగా ఏకంగా 250 కోట్ల రూపాయ‌ల‌ను  కేటాయించింది. ఇదే అద‌నుగా భావించిన మాజీ సీఎం జ‌గ‌న్ ఇక్క‌డా రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఆరాట‌ప‌డుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కార‌ణం ఏమిటంటే జగన్ రావడం వల్ల అనవసర అలజడి తప్ప మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులు, మార్కెట్ యార్డు ప్రతినిథులు తెగేసి చెప్పడమే.  అది ఆయ‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం పోరాటమైతే..  ఇక్క‌డ రైతులది జీవ‌న పోరాటం. వారి క‌డ‌గండ్ల‌ను కూడా జ‌గ‌న్ క్యాష్ చేసుకోడానికి రావ‌డం తమకు సుతరామూ ఇష్టం లేదంటున్నారు స్థానిక మామిడి రైతులు.

దిగి రానున్న టోల్ చార్జీలు!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.    ఎప్పుడో  2008లో టోల్‌ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్‌ ఛార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. ఈ సవరింపుల కారణంగా  సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ రహదారుల మార్గాల్లో టోల్‌ ఫీజు లెక్కింపు పద్ధతి మారుతుంది. ఈ మార్పు కారణంగా టోల్ చార్జీలు దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య వాహన యజమానులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది.   వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల విభాగాలకు టోల్ రేటు తాజా సవరింపులతో 50 శాతం వరకూ తగ్గుతుంది.  

క‌మ‌లం ద‌క్షిణాది జపం?

ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, ద‌గ్గుబాటి  పురంధ‌రేశ్వ‌రి, వ‌న‌తీ శ్రీనివాస‌న్.. ఈ ముగ్గురికీ కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌నున్న‌ట్టు స‌మాచారం. నిర్మ‌లా సీతారామ‌న్ ఆల్రెడీ ఆర్ధిక మంత్రిగా సుప్ర‌సిద్ధం. ఆమెను జాతీయ అధ్య‌క్షురాలిని చేస్తే.. అత్యంత కీల‌క‌మైన‌ ఆర్ధిక శాఖ నిర్వ‌హ‌ణ ఎవరికి అప్పగించాలన్నదొక చర్చ?  ఎందుకంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తరువాత అత్యంత కీలకమైన శాఖ ఆర్థిక శాఖే.  అంతే కాకుండా   మోడీ పాల‌సీలో ఫైనాన్స్ మినిస్ట్రీ అత్యంత ప్రధానమైన.. మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ. ఇక్క‌డ   పీక‌లోతు ప‌ని ఉంటుంది. అందులోంచి ఆమె ఇటు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని మోయాల్సి రావ‌డం అంటే అది సాధ్య‌మేనా? అన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఒక వేళ పార్టీ పగ్గాలు నిర్మలా సీతారామన్ కు అప్పగిస్తే.. రాష్ట్రపతిగా ఒక మహిళకు పట్టం గట్టడమే కాకుండా పార్టీ పగ్గాలు మరో మహిళకు అప్పగించిన ఘనత బీజేపీకి దక్కుతుంది.  అందు కోసం  ఆర్ధిక శాఖ‌ను మరొకరికి ఇచ్చి నిర్మలా సీతారామన్ కు పార్టీ పగ్గాలు అప్పగించే యోచన హైకమాండ్ చేస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.  మోడీ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా ప‌ని చేస్తూ అధ్య‌క్షులు ఉన్నవారు ఎవరు అంటే..  అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ  న‌డ్డా ఉన్నారు.  వారు ఇటు మంత్రి పదవి  నిర్వ‌హిస్తూనే అటు అధ్య‌క్ష బాధ్య‌త‌లూ  చేప‌ట్టారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌డ్డా కేంద్ర ఆరోగ్య మ‌రియు ర‌సాయ‌న  శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాబట్టి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్షురాలైతే ఆమె జోడు గుర్రాల సవారీ చేయాల్సి ఉంటుంది. ఇక ద‌గ్గుబాటి  పురందేశ్వ‌రిని జాతీయ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిని చేయాల‌న్న ఆలోచ‌న‌తో అధిష్టానం ఉందంటున్నారు. ఇప్ప‌టికే ఆమె ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క భూమిక పోషించారు. దీంతో కేంద్ర అధిష్టానం ముందు ఆమె ర్యాంకింగ్ బాగా పెరిగిన‌ట్టు తెలుస్తోంది. ఇచ్చిన టాస్క్ ఇచ్చిన‌ట్టు నెర‌వేర్చ‌డంలో మోడీ షాల ద‌గ్గ‌ర‌ పురందేశ్వ‌రికి గుడ్ మెరిట్సే ఉన్నాయి. కాబ‌ట్టి ఆమెకు  పార్టీలో కీలక ప‌ద‌వి ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇక వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఎవ‌ర‌ని చూస్తే అంత డీఎంకే  హ‌వాలోనూ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కోయంబ‌త్తూర్ సౌత్ లో అది కూడా ఒక పార్టీ అధ్య‌క్షుడైన క‌మ‌ల్ హాస‌న్ పై గెలిచారామె. ప్ర‌స్తుతం త‌మిళ శాస‌న స‌భ‌లో ఉన్న ఏకైక బీజేపీ మ‌హిళా నేత‌.  ఒక ర‌కంగా చెబితే ముగ్గురూ ముగ్గురే. ఇప్ప‌టికే నిర్మ‌లా సీతారామ‌న్ జీఎస్టీ  ద్వారా  దేశ ఆర్ధిక స్థితిగ‌తుల‌ను మెరుగు పరిచిన ఆర్ధిక మంత్రిగా ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో బ‌ల‌మైన పొజిష‌న్లోనే ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షుడు జేపీ  న‌డ్డా, ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ తో  ఆమె భేటీ అయ్యారు. బేసిగ్గా  జేపీ  న‌డ్డా అధ్య‌క్ష ప‌ద‌వీ కాలం 2023 జ‌న‌వ‌రితోనే ముగిసింది. అయితే  2024 లో ఎన్నిక‌ల కార‌ణంగా జూన్ వ‌ర‌కూ పొడిగించారు. అప్ప‌టికీ ఏడాది గ‌డ‌చిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.  సరిగ్గా ఇక్కడే పార్టీ పగ్గాలను మహిళా నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.  అది కూడా ద‌క్షిణాది మ‌హిళకు అప్పగించాలని అనుకుంటోంది. ఎందుకంటే ఇటు చూస్తే ఉత్త‌రాదిలో బీజేపీ  సీట్లు బాగా త‌గ్గ‌డం ప్రారంభించాయి. గ‌త ఎన్నిక‌ల్లో చావు ద‌ప్పి  క‌న్నులొట్ట‌బోయిన ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో ద‌క్షిణాది నుంచి గట్టి మద్దతు అవసరం ఉందని బీజేపీకి ఉంది.   అప్ప‌టికీ ద‌క్షిణాదిని క‌వ‌ర్ చేయ‌డానికి ఎన్నెన్నో ప్ర‌యోగాలు ప్ర‌య‌త్నాలు అవార్డులు- రివార్డులు- రాజ్య స‌భ్య‌త్వాలు ఇచ్చి చూస్తున్న బీజేపీకి త‌గిన గురి కుద‌డం లేదు. ద‌క్షిణాదిలో కేంద్ర మంత్రి ప‌ద‌వులు పొందిన  వారెవ‌ర‌ని చూస్తే తెలంగాణ  నుంచి ఇద్ద‌రు ఎంపీలు కిష‌న్, బండి సంజ‌య్. ఇక కేర‌ళ నుంచి సురేష్ గోపీ మాత్ర‌మే బీజేపీ  నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ కావ‌ల్సింది ఒక సౌత్ ఐకానిక్ ఫేస్. ఒక ప‌క్క స‌నాత‌న  వార‌ధిగా సార‌ధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎంక‌రేజ్ చేస్తూ సైడ్ వ‌ర్క్ ప్రారంభించింది  బీజేపీ అధినాయ‌క‌త్వం. అయితే సౌత్ కి ఒక బ‌ల‌మైన బీజేపీ ముఖ‌చిత్రం లేదు. గ‌తంలో ఎలా  చూసినా కూడా క‌నిపించిన ఒకే ఒక్క ఫేస్. య‌డ్యూర‌ప్ప‌. ఆయ‌న ఎరా ముగియ‌టంతో.. ఇప్పుడు కొత్త ముఖ‌చిత్రం అందునా మ‌హిళ అయితే బాగుండున‌ని చూస్తున్నారు. అలాగ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ని అధ్య‌క్షురాలిగా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం మ‌హిళా కేట‌గిరికి మాత్ర‌మే స‌రిపోతుంది. బేసిగ్గా బీజేపీని గెలిపించిన మ‌హిళా ఓట‌ర్లు అధికశాతం గ‌ల రాష్ట్రాలేవ‌ని చూస్తే అవి మ‌హారాష్ట్ర‌, హ‌రియాణా, ఢిల్లీ.  అలా చూసినా కూడా సౌత్ లో ఏ స్టేట్ కూడా ఈ కేట‌గిరీ కింద‌కు రాదు. దానికి తోడు నిర్మ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల ప‌రిధిలోకి రాని  లేడీ లీడ‌ర్. ఆమె ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చెన్నై లోని ఒక నియోజ‌క‌వ‌ర్గం  నుంచి బీజేపీ  త‌ర‌ఫున బ‌రిలోకి దిగుదామ‌నుకున్నారు కానీ, ఎందుకో అది వ‌ర్క‌ట్ కాలేదు.  దానికి తోడు స్వ‌యంగా ఆమె.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో నిల‌బ‌డి ఖ‌ర్చు చేసేంత స్థోమత త‌న‌కు లేద‌ని తెగేసి చెప్పారు. సరిగ్గా అదే స‌మ‌యంలో ద‌క్షిణాదిలో గెల‌వాలంటే కులం గానీ, మ‌తం గానీ ఎక్కువ చూస్తార‌ని తెగేసి చెప్పిన స్వ‌భావం గ‌ల‌వారామె. ఈ క్ర‌మంలో నిర్మ‌ల కేవ‌లం ఒక ముఖ‌చిత్రంగా మాత్ర‌మే ఉంటారు త‌ప్పించి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలను ప్ర‌భావం చేసే ప‌రిస్థితి పెద్ద‌గా  క‌నిపించ‌డం లేదు. ఇక పురందేశ్వ‌రి, వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఈ ఇద్ద‌రూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అనుభ‌వ‌జ్ఞులుగానే చెప్పాలి. పురందేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీ  నుంచి రాజ‌మండ్రి ఎంపీగా గెలిచారు కూడా. ఈ లెక్క‌న పురందేశ్వ‌రికి మంచి ఛాన్సులు ఉన్నాయి. ఇటు ఎన్టీఆర్ త‌న‌య‌గా మాత్ర‌మే కాదు అటు బ‌హుభాషా కోవిదురాలిగానూ పేరు. గ‌తంలో  కేంద్ర మంత్రిగా  ప‌ని చేసిన అనుభ‌వం ఉండ‌టం వ‌ల్ల‌.. ఆమెకు  నేష‌న‌ల్ లెవ‌ల్ ఎక్స్ పోజ‌ర్ కూడా ఉంది. అంతేనా ఇటీవ‌లి కాలంలో ఆమె ఆప‌రేష‌న్ సిందూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ టూర్ లో ఒసభ్యురాలు కూడా. అంటే అంత‌ర్జాతీయంగానూ ఆమె త‌న స‌త్తా చాటారు. కాబ‌ట్టి.. అధ్య‌క్ష ప‌ద‌వికి ఈమె స‌రిగ్గా స‌రిపోతారు. కానీ అధిష్టానం ఆలోచ‌న ఎలా ఉందో తెలీదు. ప్ర‌స్తుతానికైతే పురందేశ్వ‌రికి బీజేపీ మ‌హిళా మోర్చా ప‌ద‌వి అయితే ఇచ్చేలా తెలుస్తోంది.  వ‌న‌తీ శ్రీనివాస‌న్ ఇప్పుడిప్పుడే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు కాబ‌ట్టి ఎంతైనా ఆమె జూనియ‌ర్ కిందే లెక్క‌. పార్టీ ప‌ద‌వులు ఎన్ని చేసినా.. వాటిని నేష‌న‌ల్ ఎలెక్ష‌నీరింగ్ స్థాయికి కి విస్త‌రించాలంటే అందుకు  త‌గిన అనుభ‌వం కూడా అవ‌స‌రం. కాబ‌ట్టి ఈ ముగ్గురిలో బెస్ట్ సౌత్ ఫిమేల్ ఫ్యాక్ట‌ర్ ఆప్ష‌న్ గా ఎవ‌రిని ఎంపిక చేస్తారో తేలాల్సి ఉంది.

ఘోషా మహల్ కూ ఉప ఎన్నిక?!

తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీలలో ఆశావహులు తమతమ ప్రయత్నాలు షురూ చేసేశారు. అయితే జూబ్లీహిల్స్ కు మాత్రమే కాదు.. రాష్ట్రంలో మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమన్న పరిస్థితులు నెలకొన్నాయి.  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినప్పటికీ.. ఉప ఎన్నిక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం రాజసింగ్ తీరు పట్ల బీజేపీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉందని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని నేడో, రేపో బీజేపీ అసెంబ్లీ స్పీకర్ ను కోరే అవకాశాలున్నాయనీ అంటున్నారు. తెలంగాణ బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖరాయాలన్న నిర్ణయం జరిగిపోయింది.  మొదటి నుంచీ రాజాసింగ్ వ్యవహార శైలిపై బీజేపీ అధినాయకత్వం ఆగ్రహంగానే ఉందంటున్నారు. పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడం, ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో పార్టీ హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నది. పార్టీ చర్యలు తీసుకునేలోగానే ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేసేసి.. కావాలంటే తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసుకోండి అని సవాల్ కూడా చేశారు. దీంతో ఇంకెంత మాత్రం ఉపేక్షించకుండా రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరుతూ లేఖ రాయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసిందంటున్నారు.     అందుకే ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ వెంటనే ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని కోరిన వెంటనే అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావించలేం. ఒక వేళ స్పీకర్ బీజేపీ కోరిన మేరకు రాజాసింగ్ పై అనర్హత వేటు వేస్తే కనుక జూబ్లీహిల్స్ తో పాటే.. గోషామహల్ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. ఇది జరగాలంటే.. జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూల్ విడుదలయ్యే లోగా బీజేపీ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించి, స్పీకర్ ను అనర్హత వేటు వేయాలంటూ లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ లేఖకు స్పీకర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఆమోదం తెలపాల్సి ఉంటుంది.  

కొనసాగుతున్న అమరనాథ్ యాత్ర.. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై)   ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సరిగ్గా 38 రోజుల తరువాత అంటే ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది.   ఈ యాత్రలో భక్తులు హిమాలయాల్లోని అమరనాథ్ గుహలో  మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు.   బాల్తాల్, పహల్గామ్ మార్గాల గుండా ఈ యాత్ర సాగుతుందిజ అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తుఅల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 581 కంపెనీల కేంద్ర సాయుధ  బలగాలు, డ్రోన్లు,   జామర్లతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.  

పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు

చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. శుక్రవారం (జులై 4) తిరుమల ఘాట్ రోడ్డులో తిష్టవేసిన ఏనుగుల గుంపు.. అటవీ అధికారులు వాటిని అడవులలోకి మళ్లించాయి. అయితే శనివారం (జులై 5)న జిల్లాలోని పులిచర్ల మండలం పాత పేట అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామానికి అతి సమీపంలో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు మామిడి, అరటి, టమాటా తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో పంటలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పొలాలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు. అటవీ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగుల గుంపును దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

సమ్మక్క, సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు

మేడారం సమ్మక్క సారలమ్మ   గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయాలకు భిన్నంగా ఏకపక్షంగా సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పునకు నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అమ్మవారి గద్దల వద్ద ఆదివాసి గిరిజన సంప్రదాయం మాత్రమే ఉండాలని పట్టుబడుతున్నారు.   ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన గద్దెల డిజైన్‌ను మార్చనున్నారు. మేడారంలోని ఐటీడీఏ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన మహాజాతర సమీక్ష సమావేశంలో దేవాదాయ ఆర్కిటెక్ట్‌ రాజశేఖర్‌ ప్రొజెక్టర్‌ ద్వారా స్క్రీన్  పై గద్దెల డిజైన్‌ను ప్రదర్శించారు.  2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు కొత్త గద్దెలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గద్దెల కొత్త డిజైన్ ను ఆదివాసీ సంఘాలు మేడారం పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

పవన్ సినిమాలే కాపీ..పొలిటికల్‌గా కాదంటోన్న విజయ్

  డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ 'సీఎం కేండెట్ నేనే'నంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఆయన ఎవరితోనూ పొత్తులుండవ్. అంతా ఓన్ గా పవర్ లోకి రావడమే అంటూ కుండ బద్ధలు కొట్టేశారు. నా పార్టీ సీఎం అభ్యర్ధిగా నేనే ఉంటానంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, కఠినమైన తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంత వరకూ రాణించగలరు? అన్నదొక డిబేట్. కారణం ఇక్కడ జయ తర్వాత ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. దానికి తోడు ఆమె నెచ్చెలి శశికళ సైతం రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. ఇక్కడొక వ్యాక్యూమ్ ఉన్న మాట నిజమే. అయితే స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ మాస్ ఇమేజీని సొంతం చేసుకుని విజయ్ సీఎం పీఠం ఎక్కగలరా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. బేసిగ్గా దళిత సామాజిక వర్గానికి చెందిన 'విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్'(పూర్తి పేరు) ని ఇక్కడి ఓటర్లు ఎంత వరకూ ఆదరిస్తారు? అన్న క్వశ్చన్లు కూడా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్ కులాలైన పన్నియార్లు, గౌండర్లు డీఎంకే, అన్నాడీఎంకేలుగా చీలిపోయాయి. ఇవిలా ఉంటే తమిళనాట గల కులాల వారీ శాతాలను పరిశీలిస్తే విజయ్ ప్రాతినిథ్యం వహించే దళిత ఓటు బ్యాంకు సుమారు ఇరవై శాతం మాత్రమే ఉంది. మిగిలిన 80లో అరవై శాతం బీసీలు, ఇంకో ఇరవై శాతం మరకూ ఇతర కులాలు ఉన్నాయి. కొంత కాలంగా దళిత పాంతర్స్ పార్టీ తమిళనాడు లో కూడా ఉంది. కానీ అది ఇప్పటి వరకూ ఏమంత ప్రభావం చూపించలేదు.ఇక వాటీజ్ విజయ్ ఆయన కెపాసిటీ ఏంటి? పూర్వాపరాలు ఎలాంటివని చూస్తే.. తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కాగా, తల్లి కర్ణాటక సంగీత కళాకారిణి. విజయ్ కి ఒక చెల్లెలు కూడా ఉండేది. పేరు దివ్య. అయితే ఆమె తన రెండో ఏటనే చనిపోయింది. ఆమె పేరిట దివ్య విజయ్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించడం మాత్రమే కాకుండా శుక్రన్ సినిమాలో ఆమె బొమ్మ కూడా చూపించాడు విజయ్.  తండ్రి తీసిన వెట్రి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఈ పదమే తన పార్టీ పేరులోనూ పెట్టుకున్నారాయన. విజయ్ పార్టీ పేరు 'తమిళిగ వెట్రి కళగం'. ఇక కమ్యూనికేషన్ లో పట్టా తీసుకుందాం అనుకున్న విజయ్ కి ఎలాగైనా సరే హీరో కావాలని ఉండేది. దీంతో డిగ్రీ మధ్యలోనే డిస్ కంటిన్యూ చేసి వచ్చేశాడు. 18 ఏళ్ల వయసులో తండ్రి చంద్రశేఖర్ తీసిన 'నాలై తీర్పు' అనే చిత్రంలో తాను హీరోగా, కీర్తన హీరోయిన్ గా నటించారు. విచిత్రమేంటంటే తన తండ్రి చిత్రమే అయినా.. ఆడిషన్స్ లో పాల్గొని మరీ సెలెక్ట్ అయ్యాడు విజయ్. ఆ టైంలో విజయ్ కొట్టిన డైలాగ్ అన్నామలైలో రజనీకాంత్ డైలాగ్. అందుకే విజయ్ 'రజనీకాంత్ లేకుంటే తాను లేనని' అంటారాయన. ఇదిలా ఉంటే, తమిళనాట విజయ్ హవా.. 'రసిగన్' మూవీతో ఒక్కసారిగా పెరిగింది. విజయ్ కీ మన తెలుగు వారికీ ఉన్న అనుబంధం ఎలాంటిదంటే.. ఆయన గల్లి, పోకిరి, బద్రీ వంటి తెలుగు చిత్రాలు రీమేక్ చేసి మరీ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. వీటిల్లో పవన్ కళ్యాణ్‌ సినిమా బద్రి కూడా ఒకటి. ఇదిలా ఉంటే.. "పవన్ కళ్యాణ్‌ ని తాను తెరపై కాపీ కొట్టానేమోగానీ తెరబయట- రాజకీయంగా కాదని" అంటున్నారాయన. తాను సొంత కాళ్లపై రాజకీయాల్లో నిలబడతానని అంటారు. 2017లో హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో 2వ స్థానంలో ఉన్న విజయ్ ప్రస్తుతం నెంబర్ వన్- తనే. మెర్సల్, తరీ, సర్కార్, మాస్టర్ వంటి సినిమాలు వంద, నూట యాభై, రెండు వందల కోట్ల వరకూ వసూల్ చేశాయి. బీస్ట్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్సన్ల పరంగా విజయ్ కింగే అని నిరూపించింది. విదేశాల్లో రజనీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్ విజయ్. బేసిగ్గా విజయ్ స్థానంలో అజిత్ ఇలాంటి పొలిటికల్ డయాస్ పైకి రావల్సింది. జయలతిత ఎంతో ముందు చూపుకొద్దీ.. 'తల' అజిత్ ని ఎంకరేజ్ చేయాలని చూశారు. కానీ ఆయనేమంత రియాక్ట్ కాలేదు. తానేంటో తన రేసింగ్ ఏంటో.. మూవీస్ ఏంటో.. అన్నట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతానికి కూడా అజిత్ నుంచి పెద్దగా పొలిటికల్ రియాక్షన్ లేదు.  కానీ తన తండ్రి ప్రేరణో లేక, మరొకటో తెలీదు కానీ.. విజయ్ మాత్రం అనూహ్యంగా పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకూ దళిత్ కమ్యూనిటీ ఇక్కడ సిఎం పోస్టు వరకూ ఎదగలేదు. ఈ కొరత తీర్చడం కోసమైనా ఆయన ఈ పార్టీ, దాని నిర్వహణ చేయాలని భావించినట్టుగా కనిపిస్తోంది.అయితే తమిళ రాజకీయాల్లో కులాల ప్రస్తావన అధికంగా ఉంటుంది.  ఈ ప్రకారం చూస్తే ఆయన భారీ ఎత్తున అక్కడి లీడింగ్ క్యాస్ట్ లీడర్స్ ని తన పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. మొన్నటికి మొన్న రోజా సైతం టీవీకేలోకి రావడానికి ఉత్సాహం చూపించగా.. అవినీతి మరక గల వారు మాకొద్దని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం. అయితే భర్త ఆర్కే సెల్వమణి దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కావడంతో.. ఆమెకు తలుపులు ఇంకా మూసుకుపోలేదని కూడా అంటారు. ఇదంతా ఇలాగుంటే అవినీతి మరక అంటని రాజకీయ నేతల్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించనలవి కాదు. అయితే విజయ్ తన తొలినాళ్లలో అభిమానులకే అధిక ప్రాధాన్యతనిచ్చేలా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు చూసుకున్న తర్వాత.. ఆయన రాజకీయ ధోరణిలో ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. అప్పటి వరకూ విజయ్ ఎన్ని కామెంట్లు చేసినా.. వాటికి పెద్దగా విలువనిచ్చేలా కనిపించడం లేదు. గతంలో అంటే, 2005లో తమిళ సినిమా ఫీల్డు నుంచి విజయ్ కాంత్ రూపంలో 'డీఎండీకే' అనే పార్టీ పెట్టడం.. ఆయన పెద్దగా ప్రభావం చూపలేక పోవడం అన్నది విజయ్ కి సవాల్ విసురుతోంది. దీన్నిబట్టీ చూస్తే తమిళనాట సినిమా వారి ప్రాధాన్యత.. ఒక ముగిసిన అధ్యాయం అనేవారున్నారు. అయితే అది అప్పుడు- ఇప్పుడు కాదంటారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. దానికి తోడు ఎక్కడో 'ఆంధ్ర సినీ పొలిటీషియన్ పవన్' మన వరకూ వచ్చేస్తున్నాడు. కాబట్టి మనం అలెర్ట్ కావాలి. ఇక్కడున్న లోకల్ పొలిటికల్ టాలెంట్ ని పబ్లిక్ ఎంకరేజ్ చేయాలన్న కోణంలో విజయ్ తమిళ రాజకీయ తెరపైకి దూసుకొస్తున్నారు. మరి చూడాలి.. ఈ కామెంట్లలోని దమ్ము తన రాజకీయాల్లో ఆయన ఏ విధంగా కొనసాగిస్తారో లేదో తేలాల్సి ఉంది  

కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారం : మల్లికార్జున ఖర్గే

  గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్‌కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆయన అన్నారు.  దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని ముఖ్యమంత్రి అన్నారు