90 శాతం ఆన్ లైన్లొనే పంపారు... బీజేపీకి రూ.700 కోట్ల విరాళాలు 

  దేశంలో ఎదురులేని శక్తిగా ఎదుగుతోన్న బీజేపీ.. ఆర్థికంగానూ బలపడుతోంది. బిజెపికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 700 కోట్ల మేరకు విరాళాలు అందినట్లు సమాచారం. వివిధ సంస్థలు, ట్రస్టుల ఈ మొత్తం అందినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన రిపోర్టులో బిజెపి స్వయంగా వెల్లడించింది. ఈ మొత్తం వచ్చిన విరాళాల్లో సగం టాటా సంస్థల నుండి రావడమే గమనార్హంగా మారింది.  టాటా సన్స్ అనుబంధ సంస్థగా ఉన్న ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి దాదాపు రూ. 356 కోట్లు.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ. 54.25 కోట్లు విరాళంగా బిజెపికు లభించింది. ఇక కమలనాధులకు విరాళాలు ఇచ్చిన సంస్థల్లో భారతీ గ్రూప్, డీఎల్ఎఫ్ ,  ఓరియంట్ సిమెంట్స్, హీరో మోటార్ కార్ప్, జేకే టైర్స్ , జూబిలెంట్ ఫుడ్ వర్క్ తదితర సంస్థలూ ఉన్నాయి. రూ. 20 వేలను మించిన విరాళాలను ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరించామని బీజేపీ వెల్లడించింది. విరాళంగా వచ్చిన మొత్తంలో 90 శాతం పైగా ఆన్ లైన్ లొనే వచ్చాయి. అందులో బ్లాక్ మని ఉందనే ఆలోచన కూడా విపక్షాలు ప్రస్తావించకుండా బీజేపీ ఇలా చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

భార్య డబ్బు పంపలేదని పిల్లల్ని చిత్రహింసలకు గురిచేశాడు

  భార్య కష్టపడి డబ్బులు పంపిస్తుంటే తినమరిగిన ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లా సార్వ గ్రామంలో జరిగింది. గల్ఫ్ లో పని చేస్తున్న భార్య ఇంటికి డబ్బు పంపించడం లేదని తన కోపాన్ని పిల్లల మీద చూపిస్తున్నాడు ఎలిషా. పిల్లల్ని ఛార్జర్ తో.. బెల్ట్ తో.. కొడుతూ వీడియోలు రికార్డు చేసి వాటిని భార్య మహాలక్ష్మికి వాట్సాప్ చేశాడు. అది చూసి తట్టుకోలేని తల్లి.. తన వాళ్ళకి ఫోన్ చేసి వాపోవడంతో మహాలక్ష్మి బంధువులు హుటాహుటిన వెళ్లి పిల్లల్ని తెచ్చేసుకున్నారు. తల్లి లేక పోతే.. అన్నీ తానై ఉండాల్సిన నాన్న ఇంత వికృతంగా మారాడు. గల్ఫ్ నుంచి డబ్బు రావడం లేదని పిల్లల్ని దారుణంగా హింసించాడు. చివరికి ఆ పిల్లలు కూడా తండ్రిని చూస్తేనే వణికిపోతూ ఓ మూలకు వెళ్లి దాక్కున్న విషయం చూస్తుంటే హృదయాన్ని పిండేసినట్లు అనిపిస్తుందని బంధువులు అంటున్నారు. ఈ ఘటన 20 రోజుల క్రితం జరిగింది కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తరువాత ఎప్పుడైతే వీడియోలు కూడా బయటకు వచ్చాయో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ కిరాతక తండ్రి పరారీలో ఉన్నట్లు సమాచారం.చిన్నారులు కూడా మహాలక్ష్మీ బంధువుల ఇంటి వద్ద ఆశ్రయం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇలాంటి దయనీయమైనటువంటి ఘటన కేవలం డబ్బుల కోసం అది కూడా సొంత కన్నబిడ్డల్ని బెల్టుతో చిత్ర హింసలకు గురిచేయడమే కాక  భార్యను నెల నెల డబ్బులు పంపించాలని పిల్లల్ని కొట్టి.. మళ్లీ వాటిని వీడియో రూపంలో చిత్రీకరించి పంపిన ఈ ఘటన పై స్థానికులు,బంధువులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.పోలీసులు ఈ కిరాతకుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. పిల్లలకు రక్షణ కల్పించాలి కోరుతున్నారు. ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఎలీషా ను పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.

అక్రమ రవాణ చేస్తే 2 ఏళ్ళ జైలు శిక్ష.. ఇసుకపై జగన్ స్పెషల్ ఫోకస్

  ఇసుక ధరలు, అమ్మకాల, కొరతపై అధికారులతో ఏపీ ప్రభుత్వం సమీక్ష జరిపింది. ఇసుకను ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధమైంది ఆంధ్రా ప్రభుత్వం. ఇసుక అక్రమాలకు పాల్పడినా.. ఎక్కువ ధరకు ఇసుక అమ్మినా.. రెండేళ్లు జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ అక్రమాలకు పాల్పడితే ఆయా రీచ్ లు సీజ్ చేస్తామని తెలియజేసారు. అయితే ఈ నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారు.రెండు రోజుల్లో రేటు కార్డు డిసైడ్ చేసి.. ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో రేటు కార్డులపై ప్రచారం చేయాలని అధికారులను సూచించారు. ఏపీలో ఇసుక కొరతపై అధికార, ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ విధి విధానాల వల్లే రాష్ట్రంలో ఇంతటి ఇసుక కొరత వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందు కారణంగా రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగం  ఉపాధి లేక రోడ్డున పడిందని..ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జనసేన నేతలు మండి పడ్డారు. ఇసుక కొరతపై ఇప్పటికే జనసేనాని పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు.చంద్రబాబు దీక్షకు కూర్చోబోతున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియా చేస్తున్నారని.. ఇసుక పక్క రాష్ట్రాలకు పంపుతున్నారని టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. వరదల వల్ల ఇసుక సమస్య వస్తే అందుకు ప్రభుత్వం ఎలా కారణమవుతుంది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీటీడీ ఉద్యోగాల్లో చిత్తూరు జిల్లా వాసులకే ప్రాధాన్యత...

  టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది.  ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ కు ఆమోదం తెలిపింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఈ రిజర్వేషన్ వర్తించనుంది. టిటిడి పాలక మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతికి పంపారు. దీనికి సంబందించి ప్రతిపాదనను టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడైనటువంటి కరుణాకర్ రెడ్డి తీసుకున్నారు. గతంలో చేసిన తరహాలోనే టీటీడీ ఉద్యోగుల నియామక ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ 2007లో టీటీడీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి నిబందనలు రావడంతో రాష్ట్రమంతా ఒక యూనిట్ గా తీసుకుంటూ ఉద్యోగాల భర్తీ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో 2009 లో టీటీడీ దాదాపు 2,800 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. కానీ 2010లో 450 పోస్ట్లు మాత్రమే భర్తీ చేశారు.అప్పట్లో రిజర్వేషన్ ల పై వివాదం తలెత్తడంతో అటు తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. చిత్తూరు జిల్లా వాసులకు ఈ నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్ కిందున్నటువంటి ప్రక్రియను మాత్రం పక్కన పెట్టి  పోస్టులకు నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.దాదాపు 340 పోస్టులు భర్తీ కూడా పాలక మండలి ఆమోదించిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి ఆమోదం రాగానే  వీటికి సంబంధించినటువంటి తీర్మానం వెలువడే అవకాశం ఉంది.

అయోధ్య ట్రస్ట్ మెంబర్లుగా మోడీ, అమిత్ షా, ఆదిత్యనాథ్!!

  అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు నవమి రోజున మొదలు కానున్నాయి. ఏప్రిల్ 2న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని శ్రీ రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ తెలిపింది. అయోధ్య ట్రస్టులో మెంబర్లుగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ ఉండాలని కోరుతున్నారు న్యాస్ సభ్యులు.మూడు నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో ట్రస్టు ఏర్పాటు చేసిన వెంటనే ఈ నిర్ణయాలను అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన 70% రా మెటీరియల్ సిద్ధంగా ఉందని తెలిపింది. శిలాన్యాస్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ స్థంభాలు శిల్పాల పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు ట్రస్టు సభ్యులు.కొత్తగా ఏర్పాటు చేయబోయే అయోధ్య ట్రస్ట్ లో మెంబర్లుగా ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లుండాలని న్యాస్ సభ్యుల కోరుతున్నారు. వీరు ట్రస్టు లో ఉంటే ఆలయ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని తమ విశ్వాసాన్ని తెలిపారు. దీని పై అయోధ్యలో ఒక ప్రాంతంలో స్వామీజీలు ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం.అందరికీ ఆమోదయోగ్యంతో మనోభావాలు విశ్వాసాలకు తగ్గట్లుగా ఆలయ నిర్మాణం సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అవసరమైతే శ్రీరామ నవమికి ముందే ఆలయ నిర్మాణ పనులను చేపట్టాలని కొందరు అన్నట్లు తెలుస్తుంది. నిన్న టెంపుల్ సిటీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చాలా మార్గాల్లో ఆంక్షలను సడలించడంతో సంతోషం వ్యక్తం చేశారు భక్తులు. అయోధ్య రాముడి దర్శనానికి సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుప్రీం తీర్పు తరువాత మొదటి సారి సిటీ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వాహనాలను అనుమతించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. సరయూ నది ఒడ్డున పుణ్యస్నానాలాచరించి రామచంద్రుని దర్శించుకున్నారు.

మౌనమే మేలోయి... ఆర్టీసీ సమ్మెపై టీఆర్ ఎస్ నాయకుల వైఖరి

  ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. కానీ మంత్రి కేటీఆర్ తో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాత్రం మౌనమే మేలోయి అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది తెలంగాణలో మంత్రులు..అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు..నేతల.. పరిస్థితి. ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతున్నా.. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా.. చావుకేకలను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనికరం కలగడం లేదన్న అభిప్రాయాలు ఆయా వర్గాలలో వెల్లడవుతున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న నేతలు తమ సమ్మె పై మాట్లాడాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారితో కూడా ఇప్పటి వరకు నోరు విప్పలేదు. గతంలో టీఎంయూ గౌరవ అధ్యక్షులుగా పని చేసిన మంత్రి హరీశ్ రావు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తలదూర్చేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రతిదానికి ట్విట్టర్ లో స్పందించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మౌన మునిగా మారారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ కు సెలవిచ్చారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఢిల్లీలో మాట్లాడించేందుకు నేషనల్ మీడియా ప్రయత్నించినా కేటీఆర్ స్పందించకపోవడం గమనార్హం. మొత్తం మీద ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నోరు మెదపకపోవడమే మంచిదనే అభిప్రాయం అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పైగా హై కోర్టు కూడా ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఉండటంతో దీని పై మాట్లాడకపోవడమే ఉత్తమమని వారు భావిస్తున్నారు.  

పెళ్లికానుకను చూసి ఓ జంట విస్తుపోయింది... ప్యాకింగ్ విప్పి చూస్తే డబ్బా నిండా ఏముందంటే..!

  ప్రజల ఆలోచనా ధోరణి మారుతోంది. పరిస్థితులకు అనుగుణంగా క్రియేటివిటీ పెరుగుతోంది. సోషల్ మీడియా రాకతో తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తున్న జనం... ప్రజా సమస్యలపైనా... ప్రభుత్వ విధానాలపైనా... అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, కొందరు క్రియేటివిటీని ఉపయోగిస్తూ వెరైటీగా స్పందిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఒకే ఒక్క చిన్న పనితో సమస్య తీవ్రతను అందరికీ తెలిసేలా చేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా పెళ్లికెళ్తే ఏం చేస్తారు... నవ దంపతుల కోసం నగలో... నగదో... బట్టలో... లేక ఏదైనా మంచి బహుమతో తీసుకెళ్తాం... కానీ ఏపీలో ఓ యువకుడు వెరైటీ బహుమతి ఇచ్చాడు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్త తలారివానిపాలెంలో ... దంపతులకు ఇసుకను బహుమానంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్య తీవ్రతను తెలియచెబుతూ... ఇసుకను డబ్బాలో ప్యాక్ చేసి గిఫ్ట్ గా ఇఛ్చాడు. మార్కెట్లో ఇసుక తప్ప అన్నీ దొరుకుతున్నాయని... ఏపీలో ఇప్పుడు ఇసుక ...బంగారం కన్నా విలువైనది అంటూ సరదాగా కొత్త జంటకు డబ్బాడు ఇసుకను ప్రెజంట్ చేశారు. పెళ్లికొచ్చిన అతిథులంతా ఈ శాండ్ గిప్ట్ ను చూసి విస్తుపోయారు. అయితే, ఇసుక కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇదొక్కటే కాదు... ఇటీవల ఓ తాపీమేస్తీ... తన బంధువులను, స్నేహితులను భోజనానికి ఇంటికి పిలిచి... ప్లేట్లలో ఇసుకను వడ్డించి... తమ సమస్యను తెలియజెప్పాడు. ఇసుక కొరతతో తమకు పని లేకుండా పోయిందని, కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్నామని తమ బంధువులకు, స్నేహితులకు తెలిసేలా చేశాడు. మొత్తానికి, ప్రజాసమస్యలను, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చిన్న చిన్న పనులతో క్రియేటివిటీ ఉపయోగిస్తూ... సమస్య తీవ్రతను అటు ప్రభుత్వం దృష్టికి... ఇటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు.

మానవ తప్పిదమా? టెక్నికల్ సమస్యా? ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి?

  కాచిగూడలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ పై రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకే ట్రాక్‌పైకి ప్యాసింజర్ రైలు... ఎంఎంటీఎస్ ట్రైన్ రావడంపై విచారణ మొదలుపెట్టారు. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నప్పటికీ, మానవ తప్పిదమే కారణంగా తెలుస్తోంది. కర్నూలు-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు సిగ్నల్ ఉండగా, ఆ ట్రాక్ పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎలా వచ్చిందనే దానిపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ ఇంజిన్‌ పూర్తిగా ధ్వంసం కావడం... లోకో పైలట్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడం... దాదాపు 8గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత... అతికష్టంమీద బయటికి తీసి ఆస్పత్రికి తరలించడంతో... లోకో పైలట్ కోలుకుంటేనే అసలేం జరిగిందనేది క్లారిటీ వస్తుందని రైల్వే అధికారులు అంటున్నారు. టెక్నికల్ సమస్యో... లేక మానవ తప్పిదమో తెలియదు గానీ... రెండు రైళ్ల స్పీడు తక్కువగా ఉండటంతో... ప్రాణనష్టం తప్పింది. అయితే, సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు... భయంతో వణికిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పరుగెత్తారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో మొత్తం బోగీలన్నీ పట్టాలు తప్పగా... మూడు కోచ్ లు మాత్రం అమాంతం గాల్లో పైకి లేచి కిందపడటంతో... అసలేం జరిగిందో తెలియక హడలిపోయారు. తలో దిక్కుకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఎదురుగా వస్తోన్న కర్నూలు ఎక్స్ ప్రెస్ వేగం చాలా నెమ్మదిగా ఉండటం.... అలాగే ఎంఎంటీఎస్ ట్రైన్ వేగం కూడా ఒక మోస్తరుగా ఉండటంతో... పెను ప్రమాదం తప్పింది. లేదంటే, ప్రాణనష్టం ఊహించనిస్థాయిలో ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఇక, ఎంఎంటీఎస్ కేబిన్ లో ఇరుక్కుపోయిన లోకో పైలట్‌ ను బయటికి తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గ్యాస్ కట్టర్ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించి లోకో పైలట్‌ను సురక్షితంగా బయటికి తీశారు. అయితే, కేబిన్‌లో ఇరుక్కుపోయిన లోకో పైలట్‌ ... నరకయాతన అనుభవించాడు. ఎటూ-కదల్లేక, ఊపిరాడక, అల్లాడిపోయాడు. దాంతో, ఒకపక్క ఆక్సిజన్ అందిస్తూ... మరోవైపు డీహైడ్రేట్ కాకుండా సెలైన్ ఎక్కిస్తూ, 8గంటల భారీ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత క్షేమంగా బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 30మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మసీదు కూల్చి ఉండకపోతే ఈ తీర్పు వచ్చేదే కాదు... తీర్పుపై అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి 

  అయోధ్య తీర్పు పై అసంతృప్తితో పాటు ఘాటైన విమర్శలు చేసిన అసదుద్దీన్ పై మధ్యప్రదేశ్ లో కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం పై పవన్ అనే వ్యక్తి జహంగీర్ బాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖలను పరిశీలించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. నాడు మసీదు కూల్చి ఉండకపోతే ఇవాళ ఈ తీర్పు వచ్చి ఉండేదే కాదంటూ విమర్శించాడు అసద్. అప్పటి రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు విఫలమయ్యారని తీవ్ర వ్యాఖలను చేసాడు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామంటూనే అదేమీ సర్వోన్నతమైన తీర్పు కాదని ద్వంద్వ నాలుకను ప్రదర్శించాడు. అయోధ్యలో మసీదు కోసం ఐదు ఎకరాల కేటాయించాలన్న తీర్పుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోరాటం మసీదు కోసమే కానీ భూమి కోసం కాదు అన్నారు. తమకు ఎవ్వరి సానుభూతి, దానం అవసరం లేదన్నారు అసద్. అసద్ చేసిన కామెంట్స్ పై మధ్యప్రదేశ్ కు చెందిన న్యాయవాది పవన్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశమంతా స్వాగతించిన తీర్పును ఆయన వ్యతిరేఖించటం సబబు కాదని అభిప్రాయపడుతూ జహంగీర్ బాద్ లో కేసు పెట్టారు. ముస్లిం నేతలు ఇది వరకే అసద్ చూసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. నువ్వేమైనా ముస్లింల ప్రతినిధివా అంటూ ప్రశ్నలు సంధించారు. అయినా తన బాట తనదే అనే విధంగా అసద్ అసలు ఎవ్వరిని పట్టిచుకోకుండా మాటలు అంటూనే ఉన్నాడు. అసద్ తమ్ముడు అక్బరుద్దీన్ అప్పటిలో చేసిన వ్యాఖ్యలు వివాస్పదంగా మారిన విషయం అందరికి తెలిసిందే.   

అన్నా...అన్నా...అంటుంటే సంబరపడ్డారు... ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయట...!

  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అన్నా... అన్నా.... అంటూ పిలుస్తుంటే మొదట్లో మురిసిపోయిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారట. సీఎం జగన్ యువకుడు కావడంతో తమ సూచనలు సలహాలు వింటాడని, తమ మాటను గౌరవిస్తాడని భావించిన ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు ఇఫ్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట. ఎల్వీ సుబ్రమణ్యం ఎపిసోడ్ తో బ్యూరోక్రాట్లంతా నోటిని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారట. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్న సీఎస్ నే ఆకస్మికంగా పీకిపడేసి... ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఆర్డీవో స్థాయి పోస్టులోకి బదిలీ చేయడంతో కంగుతిన్న ఐఏఎస్ లు... జగన్ కు ఏదైనా సలహా ఇవ్వడానికే భయపడుతున్నారట. నచ్చినా నచ్చకపోయినా, ఎస్ బాస్ అనడం మినహా ఎదురుచెప్పలేని పరిస్థితి నెలకొందట. ఐఏఎస్ ల పరిస్థితి ఇలాగుంటే, ఐపీఎస్ ల ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయట. రాజధాని భూములు, ఇతర అంశాల్లో చంద్రబాబు అండ్ లోకేష్... అలాగే ఇతర టీడీపీ ముఖ్యనేతలను ఇరికించాలంటూ సీఎం జగన్ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని భూముల విషయంలో బాబుని ఇరికించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదంటూ విజిలెన్స్ అండ్ సీఐడీ అధికారులు చెప్పడంతో... జగన్మోహన్ రెడ్డి వాళ్లపై ఫైరైనట్లు చెబుతున్నారు. ఇద్దరు ఐపీఎస్ లను ఇదే పని మీద నియమించినా ఏం చేస్తున్నారంటూ సీఎం మండిపడ్డారట. సీఆర్డీఏ అధికారులు చేతులు ఎత్తేయడంతో విజిలెన్స్ అండ్ సీఐడీ అధికారులను రంగంలోకి దించారు. అయితే వాళ్లు కూడా చేతులెత్తేయడంతో జగన్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారట. మొదట్లో అన్నా... అన్నా... అంటూ పిలుస్తుంటే... జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రీగా ఉంటారనుకుని సంబరపడ్డ అధికారులు... ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట. జగన్ చెప్పింది చేయాల్సిందేనని... ఎదురు చెబితే ఇక అంతేనని మాట్లాడుకుంటున్నారు. ఇక, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు సైతం ఇఫ్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

ఇంత కుట్రనా ? :- తెలుగు అంటే తూచ్.. ఇంగ్లీష్ అంటే భేష్.. అని జగన్ అందుకే అంటున్నాడు 

  తెలుగు మీడియంను ఎత్తేయాలన్న ఏపి ప్రభుత్వ నిర్ణయం ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఓ భారీ సంస్కరణ చేసే ముందు కనీస కసరత్తు కూడా చేయకపోవడం వినాశనానికి దారి తీస్తుందని మేధావులు ఆందోళన చెందుతున్నారు. మాతృభాష అంతర్థానం అయిపోతుందని..అది తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అంతం అని పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంగ్లీష్ ప్రోత్సాహం వెనుక మత ఎజెండా ఉంది అని బీజేపీ అంటుంటే.. వీరందరిదీ రాజకీయ దురుద్దేశమేనని జగన్ తేల్చేస్తున్నారు. వచ్చే వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండనుంది. తెలుగు మీడియం ఉండదు. ఐదవ తరగతి వరకు తెలుగు మీడియం చదివినా కూడా ఆరో తరగతికి ఇంగ్లిష్ మీడియంకు తప్పక వెళ్లిపోవాలి. ఇక ఒకటో తరగతిలో చేరే వారి ఇంట్లో అప్పటి వరకూ తల్లిదండ్రులు నేర్పిన అ, ఆ లు కాకుండా ఏ, బీ,సీ,డీ లతో ప్రారంభించాలి. అంటే ప్రభుత్వ బడుల్లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈట్ ఇంగ్లీష్.. డ్రింక్ ఇంగ్లిష్.. స్లీప్ ఇంగ్లిష్.. అయిపోతుంది. జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పై ఒక్క సారిగా కలకలం రేగింది. దీనికి కారణం గత ప్రభుత్వం నగర పాలక పాఠశాల్లో ఇష్టపూర్వకంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాన్ని జగన్మోహనరెడ్డి మరియూ అతని మీడియా వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. అదే సమయంలో భాషావేత్తలు, పెద్దలు, ఉపాధ్యాయ సంఘాలు తమ వ్యతిరేకతను సూటిగా స్పష్టంగా వ్యతిరేకించారు. తెలుగు అంటే భాష మాత్రమే కాదని సంస్కృతి సంప్రదాయాలని అలాంటి దాన్ని లేకుండా చేస్తే తెలుగు జాతి గుర్తింపు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా జగన్ నిర్ణయాన్ని ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలుగు మాతృ భాష అని, తెలుగును కాపాడుకోవాలని, తెలుగును పరిరక్షించుకోవాలని, మన ఉనికిని కాపాడుకోవాలని, ఇంగ్లిష్ నేర్చుకోవాలని, ఇది మన జీవనోపాధి అని, మన కెరియర్ కి సంబంధించిన విషయం అని చంద్రబాబు తెలిపారు. భాషను కాపాడుకోలేకపోతే తెలుగు జాతి ఉనికి కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యతిరేఖతలన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ దురుద్దేశాలుగా తేల్చేశారు. పేదపిల్లల ఇంగ్లిష్ చదువులు చదువుకోకూడదా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారి పిల్లలూ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని సూటిగా అడిగేశారు. తెలుగు మీడియం లేకుండా చేయటాన్ని దాదాపుగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అదే కర్ణాటకలో..తమిళనాడులో.. మలయాళంలో ఆయా భాషల మీడియంను తొలగిస్తామని అక్కడి ప్రభుత్వాలు ప్రకటన చేస్తే ఏం జరుగుతుందో ఊహించలేమని.. అలాంటి ఆలోచనలు కూడా అక్కడి ప్రభుత్వాలూ చేయవని అంటున్నారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో భాషల్లోనే సంస్కృతి సంప్రదాయాలు ఇమిడి ఉంటాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా వారు తమ మాతృభాషను మరచిపోరు. తమ ఎదుగుదలకు ఇంగ్లీష్ అవసరమని నేర్చుకుంటారు కానీ తెలుగును మర్చిపోయేలా చేయాలనుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకంగా తెలుగు మీడియంను ఉంచాలని డిమాండ్ చేయటం రాజకీయ దురుద్దేశంగా పాలకులకు కనిపిస్తుంది. నిజానికి ఇలా తెలుగును చంపేసి ఇంగ్లిష్ ను మాత్రమే హైలేట్ చేయాలనుకోవడం వెనుక మతపరమైన కుట్ర ఉందన్న అభిప్రాయం వినిపిస్తున్నారు విపక్ష నేతలు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను గత ఐదు నెలలుగా చూస్తుంటే అందరికి అదే అనిపిస్తుందని.. అదే విషయాన్ని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బహిరంగంగా చెప్పారని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.ఇంగ్లిష్ అనేది ఒక భాష మాత్రమే నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ వస్తే అవకాశాలు ఎక్కువగా వస్తాయి నిజమే..అలాగని ఇంగ్లిష్ మీడియంలో  మాత్రమే చదివితే రావు. ప్రభుత్వ బడుల్లో మాతృభాషలో చదువుకున్న వారే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అనేక రంగాల్లో లీడర్ లుగా ఉన్నారు. వారికేమి మాతృభాషలో చదువుకోవడం అడ్డంకి కాలేదు. పైగా మాతృభాషలో చదువు ప్రారంభించటం వల్ల చదువుకు పునాది బలంగా పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న వారు వెనుకబడి పోవడానికి ప్రధాన కారణం ఇంగ్లిష్ కాదు ఆయా స్కూళ్లలో విద్యా ప్రమాణాలు నాసిరకంగా ఉండడమే కారణం. ఆ విషయం ఎవరైనా చెబుతారు. ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా అన్ని తరగతుల్లోనూ ఉంది. అలాంటప్పుడు విద్యార్థులకు ఇంగ్లిష్ విషయంలో ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యా ప్రమాణాలు పెంచితే తెలుగు మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ పై పట్టు సాధించవచ్చని విద్యా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి అది తెలియక కాదు కానీ ఓ ప్రత్యేకమైన ఎజెండా ప్రకారమే తెలుగు మీడియంను రద్దు చేస్తున్నారన్న అనుమానాలు అక్కడే వస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం ఎలా అవుతుంది? ఎస్మా కిందకి రాదంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  ఆర్టీసీ కార్మికుల సమ్మెను చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం పరిధిలోకి ఆర్టీసీ రాదని స్పష్టంచేసింది. ఆర్టీసీ ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోకి వస్తుందని, ఒకవేళ ఎస్మా కింద చర్యలు తీసుకోవాలంటే... ఆర్టీసీని అత్యవసర సేవల విభాగంలోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ పిటిషనర్ కోరడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని కోరింది. ఆర్టీసీని పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌ గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని వాదించగా.. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే, పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్‌ 24 కింద సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించవచ్చని, అలాగే ఆర్టీసీ యాజమాన్యం కోరితే కన్సీలియేషన్‌ అధికారి చట్ట నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. కన్సీలియేషన్(రాజీ) విఫలమైనప్పుడు సంబంధిత అధికారి ప్రభుత్వానికి నివేదించవచ్చని, అయితే, ఆ నివేదికను లేబర్ కోర్టుకు పంపాలా? వద్దా? అనేది ప్రభుత్వమే తేల్చుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే కన్సీలియేషన్ నివేదికను హైకోర్టు ద్వారా లేబర్ కోర్టుకు పంపవచ్చని, కానీ ఆర్టీసీ యాజమాన్యం అలా చేయనందున ఇప్పుడు సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అయినా యంత్రాలు వెళ్లలేని చోటుకి మూర్ఖులే వెళ్తారన్న హైకోర్టు.... అలాగే తాము వెళ్లదలుచుకోలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక, సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని పలుమార్లు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలను కోరామని, కానీ ఏ ఒక్కరూ మెట్టు దిగడం లేదని, అలాంటప్పుడు తాము చేయగలిగిందేమీ లేదని హైకోర్టు నిర్వేదాన్ని వ్యక్తంచేసింది. ఇకపై చర్చలు జరపాలంటూ తాము ఎవరినీ కోరబోమని, ఈ వ్యవహారాన్ని చట్ట పరిధిలోనే తెలుస్తామని తేల్చిచెప్పింది. అలాగే, ఉద్వేగాలు, సానుభూతి ఆధారంగా కేసులను తేల్చడం సాధ్యంకాదని స్పష్టంచేసింది. అయితే, మాటలతో సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో లీగల్‌గా ప్రొసీడ్ అవుతామన్న హైకోర్టు... ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందో చూడాలి.

రోజుకో మలుపు... శివసేనకు కాంగ్రెస్ షాక్‌... చివరికి ఏం జరుగుతుందో?

  మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తగినంత సంఖ్యాబలం లేదంటూ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో... తర్వాత శివసేనకు అవకాశమిచ్చిన గవర్నర్‌.... అంతలోనే షాకిచ్చారు. శివసేనకు ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. దాంతో, ఎలాగైనాసరే మహారాష్ట్ర పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడిన శివసేన ఆశలకు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఎన్సీపీ, కాంగ్రెస్‌‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన తీవ్రంగా ప్రయత్నించింది. అటు ఎన్సీపీ... ఇటు కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. ఎన్సీపీ కండీషన్ మేరకు కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా తప్పుకుంది. అయితే, చివరి నిమిషంలో సోనియా నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో....శివసేన ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది. ఇక, మహారాష్ట్ర పరిణామాలపై సోనియా సుదీర్ఘంగా చర్చించారు. శివసేనకు మద్దతిచ్చే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు. అదే సమయంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే... సోనియాకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని స్వయంగా కోరడంతో... పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపారు. అనంతరం ప్రకటన విడుదల చేసిన సీడబ్ల్యూసీ... మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతోను, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చించి... త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.  గవర్నర్ ఇచ్చిన గడువు ముగియడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు మరో 48గంటలు సమయం ఇవ్వాలని శివసేన కోరింది. అయితే, శివసేన వినతిని తిరస్కరించిన గవర్నర్‌.... ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్సీపీకి ఆహ్వానం పలికారు. దాంతో, మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, గవర్నర్‌ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో... మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రపతి పాలన వచ్చినా, మళ్లీ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

కాచిగూడలో మరమ్మతులు పూర్తి :- మధ్యాహ్నం నుండి యథావిధిగా నడవనున్న రైళ్లు 

  నిన్నటి ( నవంబర్ 11న ) జరిగిన ప్రమాదం తర్వాత కాచిగూడ రైల్వేస్టేషన్ లో మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ రూట్ లో వెళ్లే అనేక రైళ్లు రద్దయ్యాయి. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. మధ్యాహ్నమైతే తప్ప ఏమీ చెప్ప లేని పరిస్థితి లేదు అంటున్నారు రైల్వే అధికారులు. ప్రస్తుతం అక్కడ 300 మంది పనిచేస్తున్నారు. దాదాపు 20 గంటలుగా అక్కడి రైల్వే లైన్ ను పునరుద్ధరించేందుకు అధికారులు పనిచేస్తున్నారు. మొత్తం రెండు వందల మంది సిబ్బంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ మరమ్మత్తుల పనిచేస్తుంది. ఇప్పటికే రైల్వే ట్రాక్ పనులు కొలిక్కి వచ్చినా.. సిగ్నలింగ్ మరియు ఎలట్రిక్ కేబుల్స్ కి సంబంధించి పనులు ఇంకా చేస్తున్నారు.ఈ రోజు ( నవంబర్ 12న ) మధ్యాహ్నం లోగా తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని రైల్వే శాఖాధికారులు వెల్లడిస్తుతున్నారు. కాచిగూడకు వచ్చేటువంటి దాదాపు 17 రైళ్లను ఇప్పటికే అధికారులు దారి మళ్లించారు. ఈ పనులన్నీ కూడా ట్రాక్ మీద ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ అలాగే ఎంఎంటీఎస్ రెండింటినీ  పట్టాలపై నుండి తొలగించిన తర్వాత ప్రస్తుతం ట్రాక్ కి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు.ఈ ట్రాక్ పనులన్నిటికి కూడా దాదాపు కొలిక్కి వచ్చాయనేది కూడా అధికారులు చెప్తున్నారు.కానీ పైన ఓజీ కేబుల్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఓజీ లైన్ సమక్షంలో ఆడిషన్లో ప్రస్తుతం సిగ్నలింగ్ మరియూ టెలికమ్యూ నికేషన్ కి సంబంధించినటువంటి  అధికారులు వాటిని సరి చేసే పనిలో ఉన్నారు.ఈ రోజు మధ్యాహ్నంలోగా పరిస్థితి అంతా యధావిధిగా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. రైల్వే విభాగానికి సంబంధించి దాదాపు ఎనిమిది మంది  అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రస్తుతం పనులను కొనసాగిస్తున్నారు.దాదాపు అరకిలోమీటర్ వరకు ఈ లైన్ పూర్తిగా దెబ్బతిన్న నేపధ్యంలో ప్రస్తుతం ఆ పనులను అధికారులు కొనసాగిస్తూ ట్రాక్ పునరుద్ధరణ పనులు కొలిక్కి తెచ్చే క్రమంలో అధికారులు మునిగిపోయారు.

మహా రాజకీయంలో మహానీయ మార్పులు :- రాష్ట్రపతే రాజు కానున్నాడా ?

  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ప్రతిష్టంభన దేనికి సంకేతం. శివసేన సాధించలేకపోయిన మద్ధతు ఇప్పుడు ఎన్సిపి సాధించగలుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికల ఫలితాల వచ్చినప్పట్నుంచి మహారాష్ట్ర రాజకీయలు మొత్తం అనూహ్య మలుపులు తిరుగుతుంది. శివసేనకు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు బంతి పవార్ కొర్ట్ లోకి వచ్చి పడింది. కాంగ్రెస్ అంగీకరిస్తే శివసేనకు మద్దతిచ్చేందుకు ఎన్ సిపి సిద్ధంగానే ఉంది. అయితే స్వయంగా ఉద్ధవ్ థాక్రే ఫోన్ చేసినా సోనియా ఎలాంటి హామీ ఇవ్వలేదు. శివసేనకు మద్దతివ్వడంపై కాంగ్రెస్ పట్ల భిన్నవాదనలు వినిపించాయి. దీంతో నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టారు సోనియా గాంధీ. మూడో అతిపెద్ద పార్టీగా ఎన్ సిపి ని గవర్నర్ ఆహ్వానించడంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యా అధ్యాలపై లెక్కలేసుకుంటున్నారు శరద్ పవార్.మొత్తంగా మహరాష్ట్ర ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సంక్లిష్టంగా మారింది. ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన మ్యాజిక్ నెంబర్ కు చేరుకొనే ఎన్సీపీకి 54 మంది కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. సభలో రెండు పార్టీల బలం 98 మంది మాత్రమే ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే శివసేన మద్దతు తప్పనిసరిగా మారింది. ముఖ్య మంత్రి పీఠం కోసం బిజెపితో తెగతెంపులు చేసుకున్నా.. శివసేన ఇప్పుడు ఎన్సిపికి మద్దతిచ్చి ఆ పార్టీ నేతలను సీఎంగా చేస్తుందా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ఎన్సీపీకి మద్దతు ఇవ్వాలంటే సీఎం పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకున్నామని శివసేన షరతులు విధించే అవకాశము లేకపోలేదు. ఇటు శివసేన మద్దతు ఖచ్చితంగా తీసుకోవాలి.. శివసేన సీఎం పదవి కోసం బీజేపీతో పొత్తు వదులుకున్న నేపథ్యంలో శివసేన ఇరకాటంలో పడిందనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పి ఎన్డీయే నుంచి ఏకంగా బయటకొచ్చేసింది శివసేన. కేంద్ర మంత్రి పదవిని శివసేన నేత రాజీనామా చేసి బయటకొచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తమకిచ్చిన గడువు తీరిపోగా గవర్నర్ ఎన్సీపీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు. ఇవాళ ( నవంబర్ 12న )  రాత్రి ఎనిమిదిన్నర లోపు ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని ఎన్సిపికి డెడ్ లైన్ పెట్టారు గవర్నర్. ఆలోపు ఎన్ సిపికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రపతి పాలన విధించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు రెండు రోజుల గడువు ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ ఎన్సిపికి కూడ డెడ్ లైన్ పొడిగించే అవకాశం లేదు.ఇవాళ ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన మధ్య జరిగే చర్చలే మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీ నేతలు ఢిల్లీ ముంబయిలో చర్చలు జరపనున్నారు.కాంగ్రెస్ సీనియర్ నేతలు ముంబయి వెళ్లి శరద్ పవార్ ను కలవనున్నారు. ఎన్సిపికి కాంగ్రెస్ కు శివసేన మద్దతిస్తుందా.. ఒకవేళ ఇస్తే ఎలాంటి కండీషన్స్ పెడుతుందన్నది ఆసక్తిగా మారింది.

కాచిగూడ రైల్ యాక్సిడెంట్ ఫుల్ రిపోర్ట్ :- ఇదెలా జరిగిందంటే...

నిన్న ( నవంబర్ 11న ) కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో మరమ్మతులు వేగవంతం చేశారు రైల్వే అధికారులు. పూర్తిగా దెబ్బతిన్న రైలు కోచ్ లను భారీ యంత్రాల సాయంతో తొలగించేందుకు 500 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. రైలు ప్రమాదంపై ఇంజినీరింగ్, సిగ్నలింగ్, టెక్నికల్ డిపార్ట్ మెంట్ లకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ ఏజీఎం బిబి సింగ్ తెలిపారు. ఎంఎంటీఎస్ కు సిగ్నల్ ఇవ్వలేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఎక్స్ ప్రెస్ లెవెల్ క్రాసింగ్ వద్దకు వచ్చింది. రెండో నెంబరు ప్లాట్ ఫామ్ కు వెళ్ళే ట్రాక్ లో సిగ్నల్ కోసం ఆగింది. ఐదు నిమిషాల తర్వాత నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ కు వెళ్లాలంటూ సిగ్నల్ వచ్చింది. అదే సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్ నామాకు వెళ్లే ఎంఎంటీఎస్ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రెండో నెంబరు ప్లాట్ ఫాంకు చేరుకుంది. ప్రయాణికులు ఎక్కిన తరువాత సిగ్నల్ రావడంతో 10 నిమిషాల 35 గంటలకు బయలుదేరింది. అటు రెండో నెంబరు ట్రాక్ నుంచి నాలుగో నెంబర్ ట్రాక్ లోకి 20 కిలోమీటర్ల వేగంతో హంద్రీ ఎక్స్ ప్రెస్ వస్తుంది. రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి బయలుదేరిన ఎంఎంటీఎస్ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. సరిగ్గా ట్రాక్ చేంజ్ క్రాసింగ్ వద్ద రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీ కొట్టిన తరువాత మూడు సెకన్లలోనే ఎంఎంటీఎస్ కు చివర ఉన్న బోగీలు ఎగిరి పక్కకు పడ్డాయి. ఈ ఘటన కాచిగూడ స్టేషన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎంటీఎస్ లో 360 మంది వరకు ప్రయాణిస్తూండగా.. హంద్రీలో 1000 నుంచి 1300 ల మంది వరకు ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.ప్రమాదంలో ఎంఎంటీఎస్ బోగీలు నుజ్జు నుజ్జయ్యాయ. మొత్తం 9 బోగీలతో రైలు బయలుదేరగా లోకోపైలట్ శేఖర్ ఉన్న బోగి ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్ భాగంలో లోకో పైలెట్ కూరుకుపోయాడు. ఎంఎంటీఎస్ బోగీలు రెండు నుంచి మూడు అడుగుల వరకు ఎగిరిపడ్డాయి. మూడు బోగీలు పట్టాలపై నుంచి ఎగిరి పక్కకు పడ్డాయి. ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఇక డీజిల్ ఇంజన్ తో వస్తున్న హంద్రీ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ తో సహా 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఎంఎంటీఎస్ 50 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి ఢీకొనడంతో ఐదు నుంచి ఏడు ఇంచుల వరకూ హంద్రీ ఎక్స్ ప్రెస్ లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాచిగూడ రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే రైళ్లను దారి మళ్లించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి పై గవర్నర్ తమిళ శాయి ఆరా తీశారు. ఉస్మానియా సూపర్ అటెండెంట్ నాగేందర్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎంటీఎస్ బోగీలు కొత్తవి కావడం.. వాటికి యాంటీ క్లయింబింగ్ సిస్టం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఢీ కొనగానే ఎంఎంటీఎస్ రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. కొత్త బోగీలకు ఉన్న యాంటీ క్లయింబింగ్ సిస్టమ్ వల్ల భూగీలు గాల్లోకి ఎగిరినా కింద పడలేదని అధికారులు చెబుతున్నారు. అదే పాత బోగీలతో కూడిన రైలింజన్ ఢీకొని ఉంటే ఎదుటి రైలుపై బోగీలు ఎక్కి ఉండేవని వివరించారు. ప్రమాదంపై హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ బాలకృష్ణయ్య స్పందించారు. సిగ్నల్ వద్ద తమ రైలును నిలుపుతూ ఉండగా ఎంఎంటీఎస్ వేగంగా వచ్చి ఢీకొట్టింది అని ఎమర్జెన్సీ బటన్ నొక్కినా కూడా చూసుకోకుండా వేగంగా వచ్చి ఢీకొట్టింది అని తెలిపారు. ఎంఎంటీఎస్ మరింత వేగంగా ఉండి ఉంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేదని ఆయన తెలిపారు. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన లోకోపైలట్ శేఖర్ ను బయటకు తీయడానికి ఏడున్నర గంటలు పట్టింది. క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జవడంతో దానిలో ఇరుక్కుపోయిన శేఖర్ కనీసం కాళ్లు చేతులు కదిపే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయనకు శ్వాసకు ఇబ్బంది రాకుండా ఆక్సిజన్ అందించారు. రెండు సెలైన్ బాటిల్ ను ఎక్కించారు. ఎలక్ట్రికల్ కట్టర్లూ రంపాలతో బోగీని కట్ చేసి ఏడున్నర గంటల రిస్క్ ఆపరేషన్ తర్వాత పైలెట్ ను బయటకు తీశారు. అనంతరం నాంపల్లి లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. మృత్యుంజయుడిగా బయట పడిన శేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసి. ఆయనకు ముఖం, దవడ వద్ద ఎముకలు విరిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయని.. సాంకేతిక లోపాల వల్లే ఈ తప్పిదాలు జరుగుతూ ఉంటాయని.. రానున్న రోజుల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

తెలంగాణలో సివిల్ వార్..! రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితులు సివిల్ వార్ కి దారి తీసేలా ఉన్నాయంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కోరుకున్న... ఊహించిన తెలంగాణ ప్రస్తుతం లేదని... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... సివిల్ వార్ కు పరిణామాలు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతోనే ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. నిజంగానే కేసీఆర్ పాలన బాగుంటే... నిజామాబాద్ లో కవిత ఓడిపోవడమేంటని.... తాను మల్కాజ్ గిరిలో గెలవమేంటని ప్రశ్నించారు. సమాజంలో అరాచకం పెరిగిపోయినప్పుడు... పాలకుల్లో నియంతృత్వం పెచ్చుమీరినప్పుడు ప్రకృతే రంగప్రవేశం చేస్తుందనడానికి ఇదే రుజువు అన్నారు.  అసలు తాను కొడంగల్ లో ఓడిపోతానని గానీ... అలాగే మల్కాజ్ గిరిలో గెలుస్తానని గానీ అనుకోలేదన్నారు. గతంలో అభివృద్ధికి నక్సలైట్లు అడ్డని... సమాజంలో వాళ్లుండకూడదని రైటిస్టులు భావించేవారని, కానీ... నక్సలైట్లు ఉండుంటే... ఇప్పుడు ప్రభుత్వ చర్యలను నియంత్రించేవారని సమాజం అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తాము చెప్పలేదంటున్న కేసీఆర్.... మరి 50శాతం ప్రైవేటీకరిస్తామని చెప్పారా అంటూ నిలదీశారు.  

తమిళ సీఎం రేసులోకి విజయ్...! ప్రశాంత్ కిషోర్ సర్వేలో తలైవాకి ఊహించని ప్రజామద్దతు

  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయమున్నా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం ఇప్నట్నుంచే కలలు కంటున్నారు. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన అధికారాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు పెట్టుకోగా, ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు రజనీకాంత్ సిద్ధమవుతున్నారు. మరోవైపు కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక, ప్రస్తుత అధికార పార్టీ అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పట్నుంచే పావులు కదుపుతోంది. అయితే, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సర్వేలో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయట. ప్రశాంత్ కిశోర్ ను కమల్ హాసన్.... వ్యూహకర్తగా నియమించుకోవడంతో... తమిళనాట తన టీమ్ తో సర్వే చేయించాడు. ఈ సర్వేలో తలైవా విజయ్ పేరును కూడా చేర్చారట. అయితే, సర్వే వివరాలు చూసి ప్రశాంత్ కిశోర్ షాక్ అయ్యాడట. తమిళ ప్రజల్లో 28శాతం విజయ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారట. సర్వేలో 28శాతం తమిళ ప్రజలు మద్దతు ఉన్నట్లు తేలడంతో ప్రశాంత్ కిశోర్... విజయ్ ని కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. సర్వే వివరాలను విజయ్ కి అందజేసి ఎన్నికల బరిలోకి దిగాలని సూచించాడట. అంతేకాదు, రాజకీయాల్లోకి వస్తే, మిమ్మల్ని గెలిపించడానికి తాను వ్యూహ రచన చేస్తాని ప్రశాంత్ కిశోర్ తెలియజేశాడట. అందుకు ఏడాది యాక్షన్ ప్లాన్ ను విజయ్ చేతిలో పెట్టాడట.  తాను చెప్పినట్లు వింటే... తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి మీరేనంటూ విజయ్ కి ప్రశాంత్ కిశోర్ ఆశలు రేకెత్తించినట్లు సమాచారం. తమిళ ప్రజలు ప్రస్తుతం విజయ్ కి అనుకూలంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో యువకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లే.... తమిళనాడులో విజయ్ కూడా సీఎం అవుతారని అంచనా వేస్తున్నారట. అయితే, ప్రశాంత్ కిశోర్ చెప్పినవన్నీ ప్రశాంతంగా విన్న విజయ్... ఎలాంటి నిర్ణయాన్ని చెప్పకుండా పంపేశారట. ఎందుకంటే, మరో ఐదేళ్ల వరకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం విజయ్ కి లేదని అంటున్నారు.

సీనియర్ నటుడు విజయ్ చందర్ కి కీలక పదవి

  ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా సీనియర్ సినీనటుడు విజయ్ చందర్ ను నియామిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి సంబంధించి మోహన్ బాబు, పోసాని, ఆలీ, జయసుధ, భాను చందర్ వంటి పేర్లు ప్రచారం జరిగినా.. చివరకు మాత్రం ఆ పదవి విజయ్ చందర్‌కి దక్కింది. మొదటి నుండి తనకు అండగా ఉన్న కారణంగానే సీఎం జగన్ ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. కరుణామయుడుగా, సాయిబాబాగా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ చందర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తులు. తరువాత జగన్ కు కూడా అండగా ఉన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలోనూ, షర్మిళ పాదయాత్ర వేళ ,ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీకి మద్దతుగా పని చేసారు. జగన్ ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలా హాజరై.. జగన్ పట్ల తన విధేయత చాటుకున్నారు.