Read more!

అభ్యర్థులకు కొత్త టెన్షన్

 

 

 

అసంతృప్తులు, అలకలు, బెదిరింపుల పరిస్థితులను అధిగమించి టికెట్లు సంపాదించి ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఏప్రిల్ 6, 11వ తేదీల్లో ఎన్నికలు జరుపుకోమని చెప్పిన సుప్రీం కోర్టు మే 7వ తేదీ తర్వాతే ఫలితాలు ప్రకటించాలని గురువారం ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలే ఆపుతారా? లేక లెక్కింపు కూడా అప్పటి దాకా నిలుపుదల చేస్తారా? అనే ఆందోళన ప్రారంభమైంది. ఈ గందరగోళంపై రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఏ విధమైన స్పష్టత ఇస్తుందోనని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నారు.


ఈ తీర్పు తమకు అనుకూలమా? ప్రతి కూలమా? అనేది అర్థం కాక పోటీలోని అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కంగారు పడుతున్నారు. కోర్టు తీర్పును అనుసరించి మే 7వ తేదీ దాకా ఓట్ల లెక్కింపు ఆపేస్తే తమ నెత్తిన పాలు పోసినట్లు అవుతుందని ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఆశపడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం ఎన్నికలు జరిగాక కూడా నెల రోజులు ఓట్ల లెక్కింపు జరపకపోతే తమ టెన్షన్ మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నిలిపి వేయాలని హైకోర్టులో దాఖలైన కేసులపైన కూడా శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందా? ఉండదా? అనే టెన్షన్ అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.