ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్: బ్యాలెట్ బాక్సుల కష్టాలు
posted on May 13, 2014 @ 10:21AM
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్లను బాక్సుల్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచారు. అయితే కొన్ని స్ట్రాంగ్ రూములు పేరుకే స్ట్రాంగ్ తప్ప బ్యాలెట్లకు భద్రత కల్పించలేకపోయాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈమధ్య కురిసిన వర్షాల కారణంగా స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన కొన్ని బాక్సుల్లోకి నీళ్ళు చేరాయి. చాలాచోట్ల బ్యాలెట్లు తడిచిపోయాయి. ప్రస్తుత అలా బ్యాలెట్లు తడిచిన కేంద్రాల్లో లెక్కింపు సిబ్బంది ఓట్లు లెక్కపెట్టే పనిని పక్కన పెట్టి తడిచిపోయిన బ్యాలెట్లను ఎండలో ఆరబెట్టే పనిలో వున్నారు. ఎండలో ఆరబెట్టిన బ్యాలెట్లు గాలిలోకి ఎగిరిపోతూ వుంటే వాటిని పట్టుకోవడానికి తంటాలు పడుతున్నారు. అలాగే కొన్నిచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయి. బూత్ బంగ్లాల్లా వుండే స్ట్రాంగ్ రూమ్స్ లో నెలల తరబడి బ్యాలెట్ పేపర్లు పెడితే చెదలు పట్టవా? తడిచిన బ్యాలెట్లు, చెదలు పట్టిన బ్యాలెట్లు పనికిరాకపోతే ఆయా కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.