విడాకుల బాటలో ప్రపంచ సుందరి యుక్తాముఖి
posted on May 8, 2014 @ 4:23PM
ఎంత కళ్ళు తిరిగేంత అందగత్తె అయినా, సాక్షాత్తూ ప్రపంచ సుందరి అయినా, పెళ్ళయ్యాక కాపురం దగ్గరకి వచ్చేసరికి ఆమె మహిళలందరి లాంటిదే. భర్తతో సఖ్యత కుదరకపోతే అంతా సర్వనాశనమే. ఇప్పుడీ పరిస్థితి మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి ఎదుర్కొంటోంది. ప్రపంచ సుందరిగా ఎన్నికైన తర్వాత సినిమాల్లో రాణించాలని కలలు కన్న యుక్తాకి గొప్ప ఛాన్సులేవీ రాలేదు. దాంతో కొంతకాలం వెయిట్ చేసిన ఆమె చివరికి పెళ్ళి చేసుకుని సెటిలవ్వాలని అనుకుంది. రకరకాలుగా అన్వేషించి ప్రిన్స్ తులి అనే యువకుడిని పెళ్ళి చేసుకుంది. అయితే పెళ్ళాయ్యాక వాళ్ళిద్దరికీ పొసగలేదు. మొన్నీమధ్య ప్రిన్స్ తులి మీద, అతని తల్లిదండ్రులు, తమ్ముడి మీద యుక్తాముఖి గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. అలాగే తనను అసహజ లైంగిక పద్ధతులతో వేధిస్తున్నాడని కూడా కేసు పెట్టింది. అతని నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరింది. అలాగే ప్రిన్స్ తులీ కూడా యుక్తా ముఖి మీద రకరకాల కేసులు పెట్టాడు. యుక్తాముఖి తనను మానసికంగా వేధిస్తోందని కేసులు పెట్టాడు. న్యాయస్థానం ఈ రెండు కేసులను విచారణకు తీసుకుని, మీరిద్దరూ చర్చల ద్వారా మీ సమస్యలను కోర్టు బయటే పరిష్కరించుకుంటే మంచిదని తాజాగా సూచించింది. దాంతో ఇద్దరికీ చెందిన పెద్దలు రాయబారాలు మొదలుపెట్టారు. మరి ఈ రాయబారాలు ఫలిస్తాయో లేదో అర్థంకాని పరిస్థితి ఇద్దరి మధ్య వుంది. ఈ ఇద్దరికీ నాలుగేళ్ళ కొడుకు కూడా వున్నాడు. వీరిద్దరి మధ్య ఆ పిల్లాడు నలిగిపోతున్నాడు.