జీవోలతో కేసుల నుంచి విముక్తి... ఏపీ సర్కార్‌పై కోర్టుకెళ్లిన వైసీపీ
posted on Aug 2, 2017 @ 3:47PM
ఏపీలో అధికార పార్టీ నేతలపై నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన జీవోలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమపై నమోదైన కేసుల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టి వేయించుకోవటం షరామామూలే. అది ఏ ప్రభుత్వమైనా జరిగే తంతుమాత్రం ఇదే. ఈ కోవలోనే ప్రస్తుత అధికార టీడీపీ నేతలపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. పార్టీలపరంగా వైరమున్న ఘటనల్లో కేసులు నమోదవటం, ఎన్నికల సమయాల్లో మరికొన్ని, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఇంకొన్ని కేసులు నమోదవటంతో సదరు నేతలంతా వాయిదాలకు కోర్టులు, పోలీస్ స్టేషన్లకు తిరుగుతున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా నేతలపై నమోదైన కేసుల్ని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం 132 జీవోలిచ్చింది. తద్వారా సుమారు 278 మంది నేతలు కేసుల నుంచి విముక్తులయ్యారు.
ఇలా కేసుల నుంచి జీవోల ద్వారా బయటపడిన వారిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు ఉన్నారు. వీళ్లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇదంతా చట్టవిరుద్ధమంటూ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కోర్టుమెట్లెక్కింది. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలపై వరుస కేసులతో ముప్పతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే ఆర్కే... ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జీవోల ద్వారా కేసుల్ని ఉపసంహరించటం చట్టవ్యతిరేకమైన చర్యని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. దీనిపై వచ్చే మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోన్న ఏపీ ప్రభుత్వం, చట్టాన్ని కూడా తనకు అవసరమైనట్లు మార్చుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటోన్న టీడీపీ నేతలకు వెసులుబాటు కలిగేలా జీవోల ద్వారా కేసుల్ని ఉపసంహరించుకోవటం సరైంది కాదంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ఇచ్చిన జీవోలపై హైకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
అయితే అధికార పార్టీ నేతలు మాత్రం వైసీపీ వాదనను కొట్టిపారేస్తున్నారు. తాము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమయంలో నాటి కాంగ్రెస్ నేతలు ఉద్ధేశ్యపూర్వకంగా పెట్టిన కేసుల్ని మాత్రమే ఉపసంహరించినట్లు నేతలు చెబుతున్నారు. రాజకీయంగా వేధింపులకు గురిచేసేందుకు తమపై పెట్టిన కేసుల్ని చాలా వరకూ కోర్టులు కూడా కొట్టివేశాయనీ, మిగతా వాటిలో ఆధారాలు లేని కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవటంలో తప్పులేదని అంటున్నారు. అయితే కేసుల్ని కొట్టివేస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోలపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకెళ్లడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.