తప్పులు కప్పి పుచ్చుకోనేందుకే మరిన్ని తప్పులు చేస్తుంటే...
posted on Dec 23, 2015 @ 9:42AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగియడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది. స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైకాపా ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసుని ఈరోజు శాసనసభ కార్యదర్శికి అందజేయబోతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ నిన్న ప్రకటించారు. ఈ తీర్మానానికి రోజా సస్పెన్షన్ కి సంబంధం లేదని తెలిపారు. సభలో కేవలం 57మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే కలిగి ఉన్న వైకాపా తను ప్రతిపాదిస్తున్న ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకోలేదని అందరికీ తెలుసు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిశ్చయించుకొందదంటే కేవలం రాజకీయ ప్రయోజనం ఆశించేనని స్పష్టం అవుతోంది.
ఈసారి శాసనసభ సమావేశాలకు సరిగ్గా కొన్ని రోజుల ముందే కాల్ మనీ, కల్తీ మద్యం కేసులు బయటపడటంతో శాసనసభలో అదికార పార్టీని కడిగిపడేయాలని జగన్మోహన్ రెడ్డి తహతహలాడారు. కానీ ఆయన అనుకొన్నది ఒకటి. సభలో జరిగింది మరొకటి. వైకాపా ఎమ్మెల్యే రోజా సభలో ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడటంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. అంతవరకు కాల్ మనీ వ్యవహారంలో వైకాపా విమర్శలను తిప్పికొట్టడానికే పరిమితమయిన తెదేపా సభ్యులు రోజా అందించిన ఆ అవకాశం అందిపుచ్చుకొని ఎదురుదాడి చేయడంతో వైకాపా ఆత్మరక్షణలో పడింది. కనీసం అప్పుడయినా జగన్మోహన్ రెడ్డి ఆమె చేత క్షమాపణలు చెప్పించి ఆమెపై సస్పెన్షన్ వేటు పడకుండా జాగ్రత్తపడి ఉండాలి. కానీ ఆమెను వెనకేసుకువచ్చి గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకువచ్చేరు. ఒకవేళ రోజా చేత క్షమాపణలు చెప్పించి ఉంటే, అప్పుడు తెదేపా సభ్యులు కూడా ఇక ఆ వ్యవహరంపై మాట్లాడలేకపోయేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆమెను వెనకేసుకొని రావడమే కాకుండా, ఆమె కోసం సభను బహిష్కరించి వెళ్లిపోయారు.
ఒక పొరపాటుని వెంటనే సరిదిద్దుకొనే బదులు వరుసగా మరిన్ని పొరపాట్లు చేయడంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ మరో పెద్ద పొరపాటు చేస్తున్నట్లున్నారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గించుకోలేమని ఖచ్చితంగా తెలిసి ఉన్నా నోటీసు ఇవ్వడం ఒక పొరపాటు అనుకొంటే “రోజాని సస్పెండ్ చేసినందుకు మేము స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు” అని ప్రకటించుకోవడం మరో పెద్ద పొరపాటనే చెప్పాలి. ఆవిధంగా చెప్పుకోవడం వలన సరయిన, బలమయిన కారణం ఏదీ లేకపోయినా కేవలం తమ తప్పులను కప్పి పుచ్చుకొని స్పీకర్ ని, అధికార పార్టీని అప్రదిష్టపాలు జేసేందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తునట్లు స్వయంగా చాటుకొన్నట్లయింది. ఆ తీర్మానం కూడా సమావేశాలు జరుగుతున్నపుడు పెట్టకుండా, సభ నిరవధికంగా వాయిదా పడేవరకు ఆగి ఇవ్వాళ్ళ నోటీస్ ఇవ్వడం చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.
ఈ అంశంపై నేటి నుండి మళ్ళీ సమావేశాలు జరిగేవరకు తమ స్వంత మీడియాలో చర్చిస్తూ, అధికార పార్టీయే తప్పులు చేసిందనే భావన ప్రజలకు కల్పించవచ్చునని వైకాపా ఉద్దేశ్యం కావచ్చును. ఇటువంటి విపరీత ఆలోచనలు, ధోరణి కారణంగానే వైకాపా తరచూ ఎదురు దెబ్బలు తింటోంది. కానీ అందుకు వైకాపా నేతలను తప్పు పట్టలేము. వారికి శల్యసారధ్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డినే అందుకు తప్పు పట్టవలసి ఉంటుందేమో? పార్టీలో ఉన్న సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకోకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చాలా తొందరపాటుతో తీసుకొంటున్న నిర్ణయాల వలననే ఆ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతోందని చెప్పక తప్పదు.