నెల్లూరు వైకాపాలో ముసలం
posted on Apr 23, 2013 6:47AM
ఫ్లెక్సీ బ్యానర్లతో ఎదుట పార్టీలో చిచ్చుపెట్టి చంకలు కొట్టుకొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ కన్వీనర్ పదవులను భర్తీ చేసేప్రయత్నంలో ఇప్పుడు స్వంత పార్టీలోనే చిచ్చు రగులుతోంది. ఒక జిల్లాలో మొదలయిన ఈ చిచ్చు మరో జిల్లాకు దావానంలా వ్యాపిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీలో మంటలు రగులుకొన్నాయి.
జిల్లాలో పార్టీకి బలమయిన పునాది వేసిన యం.పీ.మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభీష్టానికి వ్యతిరేఖంగా కాకాని గోవర్దన్‌రెడ్డిని జిల్లా కన్వీనర్ నియమించడంతో మొదలయిన ఈ యుద్ధం చివరకు కాకాని రాజీనామా వరకు చేరింది. రాబోయే ఎన్నికలలో జిల్లాలో పార్టీని గెలిపించుకోవాలంటే తన బంధువు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి, నెల్లూరు అర్బన్ నియోజకవర్గానికి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన తన అనుచరుడు మురళికి పార్టీ టిక్కెట్టు ఇవ్వాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డి గట్టిగా కోరుతున్నారు.
అయితే, కాకాని పార్టీ అధిష్టానంతో మాట్లాడి నెల్లూరు రూరల్‌కు పార్టీ అభ్యర్ధిగా కాటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, నెల్లూరు అర్బన్‌కు బీసిసామాజిక వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌యాదవ్‌లకి పార్టీ అభ్యర్దులుగా ఖరారు చేయించినట్లు వార్తలు రావడంతో మేకపాటి భగ్గుమన్నారు.
ఈ సమస్యకు మూల కారణమయిన కాకానినే పదవిలోంచి తప్పించడం మంచిదని భావించిన మేకపాటి తన అనుచరుల ద్వారా ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, కన్వీనర్ గా మురళిని నియమించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, రెడ్లప్రాబల్యం అధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో పార్టీ కన్వీనర్ గా అదే వర్గానికి చెందిన తాను ఉండటమే పార్టీకి మేలని కాకాని గోవర్ధన్‌రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించగలిగిన్నపటికీ, అలకబూనిన ఎంపి మేకపాటిని శాంతపరిచేoదుకు, కాకానిని జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పించి, ఆయన సూచించిన మరళినే పార్టీ కన్వినర్‌గా ఎంపికచేయాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలియడంతో, వెంటనే కాకాని కూడా మేకపాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డికి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకూ లేఖలు వ్రాసారు.
మేకపాటి జిల్లాలో పార్టీ పదవులను, జిల్లాలో పలునియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికలలో పార్టీ టిక్కెట్లు ఇప్పటి నుండే అమ్ముకొని ఆశావహులనుండి డబ్బులు భారీగా డబ్బు దండుకొంటున్నారని ఆరోపిస్తూ లేఖలు వ్రాయడమే కాకుండా, తనను అప్రదిష్టపాలు చేస్తునందున కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా పార్టీ అధిష్టానానికి ఆయన లేఖ వ్రాశారు.
ఇక, తమకు అనుకూలంగా పార్టీ నిర్ణయం ప్రకటించకపోతే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో తెలియ జేసేందుకు, మేకపాటి సోదరుడు-ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో సహా కలిసి వెళ్లి, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి సభలకు హాజరయ్యారు. జగన్ మోహన్ రెడ్డి ని ఉరి తీయాలని, వైయస్సార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు వెలివేయాలన్నమంత్రి ఆనం సభకే వారు వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. అయితే, తమ ఉద్దేశ్యం కేవలం పార్టీకి హెచ్చరికలు జారీ చేయడమే కనుక, సభలోమంత్రి అనం వైఎస్ పేరును ప్రస్తావించలేదన్నసాకుతో వారు సభనుంచి అర్ధంతరంగా బయటకొచ్చేసారు. దీనితో కంగు తిన్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమిచేయాలో, ఎవరిని వదులుకోవాలోతెలియక జైల్లో తలపట్టుకొని కూర్చొన్నారు.