ప్రభుత్వ వైఖరితో ఖంగు తిన్న వైకాపా నేతలు
posted on Apr 6, 2013 @ 4:30PM
వైకాపా నేతలు నిరవదిక నిరాహార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికి 5వ రోజు. కానీ, ఇంతవరకు పోలీసులు వారి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించలేదు. నిన్నసాయంత్రం పోలీసులు రావడంతో ఇక మరో గంటో గడియలోనో తమ దీక్షను భగ్నంచేసి ఆసుపత్రికి తరలిస్తారని అందరూ ఊహించారు. కానీ వచ్చిన పోలీసులు, దీక్షా శిబిరం దగ్గర కుర్చీలలో కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ప్రభుత్వ ఆదేశాల కోసం ఇంతవరకు కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ లోగా శిభిరంలో నిరాహార దీక్ష చేస్తున్న చాలా మందికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ఆరోగ్యాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టాయి. నిన్న సాయంత్రం శాసన సభ్యురాలు వనిత షుగర్ లెవెల్ 40 కంటే తక్కువ స్థాయికి పడిపోవడంతో ఆమెను అక్కడున్న వైద్యులు అంబులెన్స్ లో నీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థిని దృష్టిలో ఉంచుకొని వైకాపా నేతలు సైతం ఆమెను తరలించడానికి అంగీకరించక తప్పలేదు.
ప్రస్తుతం మళ్ళీ శాసన సభ్యులు శోభానాగి రెడ్డి, సుజయ్ రంగ రావుల షుగర్ లెవెల్స్ పడిపోగా, జోగి రమేష్, సుచరిత, గురునాథ రెడ్డిల బీపీ లెవెల్స్ క్రమంగా పడిపోతున్నాయని సమాచారం. అదే విధంగా పార్టీ గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఆరోగ్యం కూడా నిన్న రాత్రి నుండి క్షీణించ సాగింది. అయినప్పటికీ, ప్రభుత్వం మాత్రం పోలీసులకు ఎటువంటి ఆదేశాలు ఇంత వరకు జారీ చేయలేదని సమాచారం. వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం కంటే, వారంతట వారే తమని ఆసుపత్రికి తరలించామని అడిగినప్పుడే తరలించాలని ప్రభుత్వ ఆలోచన కావచ్చును.
ఊహించని ఈ పరిణామానికి వైకాపా నేతలు కంగుతిన్నారు. అందరు చేసినట్లే తాము ఓ మూడు నాలుగు రోజులు దీక్షలు చేసి పోలీసుల చేత భగ్నం చేయించుకొని వీర త్రాళ్ళు వేసుకొని బయట పడదామని అనుకొంటే కిరణ్ కుమార్ ప్రభుత్వం చల్లగా కూర్చొని చూస్తుండటంతో వైకాపా నేతలకు ఇప్పుడ ఏమి చేయాలో పాలు పోవడం లేదు. దీక్ష మద్యలో లేచిపోతే నవ్వులపాలవుతారు గనుక దీక్ష కొనసాగించక తప్పట్లేదు. బహుశః ప్రభుత్వమే వారి ఆరోగ్య పరిస్థితి చూసి జాలిపడి దీక్ష భగ్నం చేయమని ఆదేశించవచ్చును, లేదా ఒకరొకరిగా అందరినీ ఆసుపత్రికి తరలించవచ్చును. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం తమ డిమాండ్ల గురించి హామీ ఈయకపోయినా పరువలేదు కానీ, దయతలచి ముందు తమ దీక్షను భగ్నం చేసి తమ పరువు, ప్రాణాలు కాపాడితే అదే పదివేలని కోరుకొంటున్నట్లుంది.