జగన్ తాడేపల్లి నుంచి బిచాణా ఎత్తేసినట్లేనా?
posted on Jul 16, 2024 @ 12:19PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బిచాణా ఎత్తేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల అరాచకపాలనతో ప్రజాగ్రహానికిగురై, ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయంపాలై అధికారానికి దూరమైన జగన్ రెడ్డి.. ఇప్పట్లో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు లేవా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కళ్లు మూసుకుంటే ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయనీ, మళ్లీ అధికారంలోకి వస్తాననీ చెప్పిన జగన్.. ఈ ఐదేళ్లూ కళ్లు మూసుకోవడానికే రెడీ అయిపోయారని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్ధమౌతోంది. ఆ పరిణామాలు ఏమిటంటే.. మరో వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి హాజరౌతారా? లేదా అన్న విషయంపై వైసీపీ నుంచి కానీ, స్వయంగా జగన్ నుంచి కానీ స్పష్టత లేదు. అసలు ఆ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు ఎవరైనా హాజరయ్యే అవకాశాలున్నాయా అన్న విషయంలోనూ క్లారిటీ లేదు.
అసలు వైసీపీ శాసనసభాపక్ష నేతగా జగన్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంత వరకూ ఎన్నుకోలేదు. ఇక మళ్లీ జనంలోకి వెడతాను, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తానంటూ ముహూర్తాలు కూడా ప్రకటించేశారు. దీంతో ఆయన ప్రజా జీవితంలో కొనసాగుతారు. అధికారం కోల్పోయిన తరువాత కళ్లకు కమ్మిన అధికార పొరలు తొలిగి.. మళ్లీ జనంతో మమేకమై పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆశించాయి. అయితే హఠాత్తుగా ఆయన తాడేపల్లి ప్యాలస్ నుంచి ప్రత్యేక విమానంలో బేంగళూరుకు వెళ్లిపోయారు. ప్రజాదర్బార్ రద్దు అయిపోయింది. ఇక ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎప్పటి నుంచీ వస్తారన్నదానిపై కూడా క్లారిటీ లేదు. అసలు బెంగళూరు ప్యాలస్ వదిలి బయటకు వస్తారా? మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న విషయంపై వైసీపీ వర్గాలలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.