పార్టీ కీలక నేతలతో జగన్ వరుస భేటీలు.. ఊహించని స్టెప్ పడనుందా?
posted on Jan 23, 2020 @ 10:55AM
మూడు రాజధానుల బిల్లుకు మండలిలో అడ్డుపుల్ల పడడంతో తర్వాత అడుగులు ఎలావేయాలన్న దానిపై వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరుస భేటీలతో దీని గురించి చర్చిస్తున్నారు. ఈ రోజు ఉదయం వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి.. సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశం వికేంద్రీకరణ బిల్లేనని తెలుస్తోంది. రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
ఏపీ మంత్రులు, తమ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో సీఎం జగన్ సమావేశమయ్యారు. బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబు, వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై వారు కీలక చర్చలు జరుపుతున్నారు. తమ తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై జగన్ చర్చించి.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.