జగన్ హెలికాప్టర్ ఘటన కేసు...ముగిసిన తోపుదుర్తి విచారణ
posted on May 12, 2025 @ 4:56PM
వైసీపీ అధినేత జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిన ఘటనపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విచారణ ముగిసింది. పోలీసులు తోపుదుర్తికి 102 ప్రశ్నలు అడిగారని అన్నింటికీ సమాధానం ఇచ్చానని ఆయన తెలిపారు. విచారణ అనంతరం వెలుపలికి వచ్చి మీడియాపై తోపుదుర్తి అక్కసు వెళ్లబోసుకున్నారు. హెలిప్యాడ్ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమని, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై కేసులు పెట్టారని అన్నారు. హత్య కేసు విచారణ నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.
ప్రకాశ్ రెడ్డిని విచారించామని అవసరమైతే మరోసారి పిలుస్తామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 70 మందిని నిందితులుగా చేర్చామని మిగతా వారిని కూడా విచారించాల్సి ఉందని, మరో నెల రోజుల్లో ఛార్జ్‌షీట్ వేస్తామని సీఐ చెప్పారు. కాగా జగన్ పర్యటనలో హెలికాప్టర్ కేసులో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.జగన్ పర్యటనలో హెలికాప్టర్ వద్ద కార్యకర్తల తోపులాటలో గాయపడిన కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు.
జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఆయన హెలికాప్టర్ దిగకముందే వైసీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ ఘటనలో కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. జగన్ భద్రతపై పోలీసులు చేసిన సూచనలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పాటించలేదు. హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్లు.. భద్రతా వైఫల్యంగా చూపేందుకు యత్నించినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.