జగన్ పార్టీలో ఆ ‘రెడ్డి’గారికి ఎందుకంత ఇంపార్టెన్స్?
posted on Jun 27, 2017 @ 1:05PM
జగన్ తన రాజకీయ చదరంగంలో ఎవ్వర్నీ నమ్మడని ఒక వాదన వుంది! పార్టీలో ప్రతీ నిర్ణయం తనే స్వయంగా తీసుకుంటాడు. ఎంతటి దగ్గరి బంధువులైనా, సీనియర్ నేతలైనా జగన్ కు సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరు. అంతిమ నిర్ణయం ఆయనే తీసుకుంటాడు. ఎవ్వర్నీ అంత తేలిగ్గా నమ్మడు. ఇది ఒట్టి మాట కాదు… చాలా వరకూ నిజమే!
జగన్ తన వైసీపీలో ఇప్పటి వరకూ నెంబర్ టూ అంటూ ఎవరూ లేకుండా చూసుకున్నాడు. బోలెడు మంది సీనియర్లు వున్నా, ఇంట్లోంచి తల్లి విజయమ్మా, చెల్లెలు షర్మిలా కూడా పార్టీలో వున్నా… ఎవ్వర్నీ తనంత స్థాయిలో వుంచలేదు. కాని, తాజాగా జగన్ ఒక వ్యక్తికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ, అతడికి ఎక్కడలేని పవర్ ఇచ్చేస్తున్నాడని వైసీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆయనే వైసీపీ లో నెంబర్ టూగా కూడా మారిపోయారని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? జగన్ ఆర్దిక రహస్యాలన్నీ తెలిసిన ఆడిటర్ విజయసాయి రెడ్డి!
విజయసాయి రెడ్డి అంటే కొన్నాళ్ల కిందటి వరకూ జగన్ ఆర్దిక వ్యవహారాలు చూసే సీఏ అనుకునేవారు. కాని, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఆయన జగన్ రాజకీయ వ్యవహారాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు. వైసీపీ ఎంపీగా వున్న విజయసాయి రెడ్డి దిల్లీలో జగన్ కోసం బాగానే కష్టపడుతున్నారు. తెర వెనుక రాచకార్యలు చక్కబెడుతూ మోదీతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయించారు ఆ మధ్య! తరువాతే , జగన్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు పలికారు.
జగన్ తరుఫున దిల్లీలో పరిస్థితులు చక్కబెడుతున్న విజయసాయి రెడ్డి ఏపీలో కూడా ఖాళీగా వుండటం లేదు. జగన్ కు ఈ మధ్య కాలంలో సర్వం తానే అయిపోయాడంటున్నారు. ఒకప్పుడు వైసీపీలో యాక్టివ్ గా వున్న రాజశేఖర్ రెడ్డి భార్యా, జగన్ తల్లి విజయమ్మ ఇప్పుడు ఇళ్లు దాటి బయటకి రావటం లేదు. జగనన్న వదిలిన బాణాన్ని అన్న షర్మిల కూడా యుద్ధ రంగం నుంచి తప్పుకుంది. ఇక జగన్ బంధువులుగా ఫ్యాను పార్టీలో కీలకంగా మెలిగిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తమ జిల్లా వదిలి రావటం లేదు.
జగన్ దీక్షలు, ధర్నాలు దగ్గరుండి చూసుకున్న సజ్జల రామకృష్ణా రెడ్డి, మైసూరా రెడ్డి, సోమయాజులు లాంటి సీనియర్లు కూడా ఈ మధ్య జగన్ పరిసరాల్లో కనిపించటం లేదు. అంతా విజయసాయి రెడ్డే హ్యాండిల్ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం! మరి సడన్ గా విజయసాయి రెడ్డి హవా మొదలవటానికి కారణం ఏంటి? ఆయనకు ఆర్దిక వ్యవహారాల్లో వున్న జ్ఞానం, రాజకీయాలపై వున్న అవగాహన, ఇవి కాకుండా దిల్లీ పెద్దల్ని సైతం హ్యాండిల్ చేసే నేర్పు ఇప్పుడు బాగా పనికి వస్తున్నాయని అంటున్నారు. కేవలం విజయ సాయి రెడ్డి మాత్రమే తనకు విజయం చేకూర్చి పెట్టగలరని జగన్ భావిస్తున్నాడట! ఇది ఎంత వరకూ నిజమో మనకు తెలియదు కాని… గతంలో కంటే విజయసాయి రెడ్డి హంగామా మాత్రం వైసీపీలో ఖచ్చితంగా పెరిగింది!