అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి మర్డర్? కుటుంబాన్ని బలిగొన్న ఆన్ లైన్ బెట్టింగ్
posted on Nov 30, 2020 @ 11:00AM
క్రికెట్ అన్ లైన్ బెట్టింగ్ ఓ నిండు కుటుంబాన్ని బలిగొంది. మేడ్చల్ జిల్లా రావల్ కోల్ లో ఈ దారుణం జరిగింది. రావల్ కోల్ లో ఇటీవల తల్లికూతుళ్ల అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. ఈ నెల 23న అస్వస్థతకు గురై హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న తల్లికూతుళ్లు.. ఈ నెల 26,27న మృతి చెందారు. ఇద్దరి మృతికి కొడుకే కారణమనే కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసులు కేసును దర్యాప్తు చేయగా... సంచలన విషయాలు బయటపడ్డాయి. విషం కలిపిన భోజనం తినడం వల్లనే తల్లీకూతుళ్లు చనిపోయినట్టు పోలీసులు నిర్దారించారు. క్రికెట్ బెట్టింగ్స్ కు బానిసై అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లిని విషం పెట్టి చంపినట్టు తేలింది. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రావల్‌కోల్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి, సునీతరెడ్డి దంపతులకు కొడుకు సాయిరెడ్డి, కూతురు అనూష ఉన్నారు. కూతురు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చెడు వ్యసనాలకు బానిసైన సాయిరెడ్డి చదువు మానేశాడు. ప్రభాకర్ రెడ్డి రెండేండ్ల క్రితం ప్రమాదంలో చనిపోవడంతో సునీతరెడ్డికి రూ.20 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యింది. సాయిరెడ్డి క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై, ఐపీఎల్‌లో బెట్టింగ్స్ పెట్టి అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు ఇన్సూరెన్స్ డబ్బివ్వాలని తల్లి, చెల్లితో గొడవ పడేవాడని తెలిసింది. తల్లికి తెలియకుండా బ్యాంకు నుంచి డబ్బు తీసి, ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను సైతం తీసుకెళ్లి, వాటిని అమ్మి బెట్టింగ్‌లకు పాల్పడే ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కుమారుడిని మందలించింది.
తనకు అప్పుడు పెరిగిపోవడంతో డబ్బులు కావాలని తల్లిని తీవ్రంగా వేధించసాగాడు సాయిరెడ్డి. అందుకు తల్లి నిరాకరించింది. దీంతో తల్లిని, చెల్లిని చంపడానికి కుట్ర పన్నాడు. ఈ నెల 23న ఇంట్లో రాత్రి భోజనంలో విషం కలిపి డ్యూటీకి వెళ్లాడు సాయిరెడ్డి. ఈ నేపథ్యంలో అన్న తిన్నం తల్లి,చెల్లి అపస్మారక స్థితికి వెళ్లారు. అనంతరం ఇంటికి చేరుకున్న సాయినాథ్‌రెడ్డి వారిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 27న చెల్లెలు అనూష, 28న తల్లి సునీత మరణించారు. అయితే విషం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి, చెల్లిని హాస్పిటల్ కు తరలించడంలో సాయి రెడ్డి జాప్యం చేయడం బంధువుల్లో అనుమానం కల్గించింది. దీంతో బంధువులు సాయినాథ్‌ను గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. కేసు నమోదు చేసిన మేడ్చల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.