నాకో లవర్ ను సెట్ చెయండి.. ఎమ్మెల్యేకు యువకుడి లేఖ వైరల్
posted on Sep 14, 2021 @ 10:03AM
ప్రస్తుత సమాజంలో లవ్ అనేది కామన్ గా మారిపోయింది. ఎక్కువ మంది ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరితో ప్రేమలో పడిపోతున్నారు. ప్రస్తుతం ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. యూత్ లో దాదాపుగా అందరికి ప్రేమలు ఉన్నాయని అంటారు. కాని ఓ యువకుడికి మాత్రం ఎంతగా ప్రయత్నించినా లవర్ దొరకడం లేదట. దీంతో విసిగిపోయిన ఓ యువకుడు ఏకంగా స్థానిక ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. తమకో లవర్ ను చూసి పెట్టమని ఆ లేఖలో కోరాడు.
ఓ యువకుడు మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు లేఖ రాశాడు. అల్లరిచిల్లరగా, జులాయిగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనను మాత్రం ఎవరూ ఇష్టపడడం లేదంటూ ఆ లేఖలో యువకుడు వాపోయాడు. ఇది తనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, తనకో గాళ్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని కోరాడు. భూషణ్ జామువంత్ అనే యువకుడు మరాఠీలో రాసిన ఆ లేఖ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాను ఉంటున్న ప్రాంతంలో బోల్డంతమంది చక్కని అమ్మాయిలు ఉన్నారని, అయినప్పటికీ తనను ఎవరూ ఇష్టపడడం లేదని భూషణ్ లేఖలో వాపోయాడు. అమ్మాయిలు తనను ఇష్టపడకపోవడంతో తనలో ఆందోళన పెరిగి ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. మద్యం తాగేవారికి, అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారని, కానీ తనకు మాత్రం ఎవరూ లేరని అన్నాడు. వారిని చూస్తున్నప్పుడల్లా తన బాధ మరింత ఎక్కువ అవుతోందన్నాడు. కాబట్టి తనకో గాళ్ ఫ్రెండ్‌ను చూసిపెట్టాలని లేఖలో వేడుకున్నాడు భూషణ్ జామువంత్.
యువకుడి లేఖపై చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ స్పందించారు. గతంలో తనకెప్పుడూ ఇలాంటి లేఖలు రాలేదని చెప్పారు. భూషణ్ ఎక్కడ ఉంటాడో తనకు తెలియదని, అతడి సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించినట్టు చెప్పారు. అయినా ఇలాంటి ఉత్తరాలు రాయడం సరికాదని, అతడి ఆచూకీ తెలిస్తే పట్టుకుని కౌన్సెలింగ్ ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపాడు.