నేనే రాజు... నువ్వే మంత్రి.. ప్రతి చోటా జగన్ ఇదే కథ!
posted on Sep 6, 2022 @ 1:20PM
మళ్లీ అధికారం అందుకోవాలంటే... ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎంత చేయాలో ఫ్యాన్ పార్టీ శాశ్వత అధినేత, ముఖ్యమంత్రి జగన్ బాగా వంట పట్టించుకొన్నారు. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే పదే పదే చెబుతున్నారు. ఎక్కడికెళ్లినా జగన్ ది ఒక పాట, ఒకే రాగం. ఒకే పాట. ఆయన ఆవు కథ లెక్కడ పదే పదే చెబుతున్న 175కి 175 స్థానాలు అన్న మాట వినలేక, విని జీర్ణించుకోలేక వైసీపీ లీడర్ల నుంచి క్యాడర్ వరకూ తలలు గోడకేసి చేతులను నోటి కేసి తెగ కొట్టేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ వీక్‌గా ఉంటే..ఆ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై.. గెలిస్తే నువ్వే మంత్రి అని సదరు పార్టీ ఇన్ చార్జీతో.. గెలిపిస్తే మీ నాయకుడికి కేబినెట్ లో చోటు అంటూ వారి వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేందుకు వైయస్ జగన్ ఏ మాత్రం వెనకాడడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే.. ఆయనకు మంత్రిగిరి ఇచ్చేస్తానంటూ ఇటీవల ప్రకటించేశారు జగన్. అలాగే ఉత్తరాంధ్రలోని రాజాంలో కంబాల జోగులును గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ అంటూ ఆ నియోజకవర్గంలోని పార్టీ వారిని ఊరించేశారు. ఇలా అయితే జగన్ 175 నియోజక వర్గాలలోనూ ఇదే మాట చెప్పాల్సి ఉంటుందనీ, ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ ఆఖరికి పులివెందులతో సహా పార్టీ వీక్ గానే ఉందని విపక్షాలు జగన్ తీరును ఎద్దేవా చేస్తున్నారు. ఎక్కడికెడితే అక్కడ మీ నాయకుడికి కేబినెట్ లో సీట్ గ్యారంటీ అంటూ జగన్ చెబుతుండటంతో పార్టీ క్యాడర్ కూడా సీఎం మాటలను సీరియస్ గా తీసుకోని పరిస్థితి ఉంది.
2019 ఎన్నికలకు ముందుకు వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో అయితేనేమీ.. ఎన్నికల ప్రచారంలో అయితేనేమీ.. హామీలు వాగ్దానాలతో ఉదరగొట్టి పడేశారు. ఆ క్రమంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేశ్‌పై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డిని గెలిపిస్తే.. తన ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అంటూ మంగళగిరి ప్రజల సాక్షిగానే కాదు.. అక్కేడ స్థానికంగా కొలువైన పానకాల స్వామి వారి సాక్షిగా కూడా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలిసిందే. పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీనియర్ అయినా.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. అదీ టీడీపీ నుంచి జంప్ కొట్టి.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన విడదల రజినీకి... జగన్ తన మలి కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్థానం కల్పించారు.
ఈ అంశంపై అప్పడే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి.. తన అనుచరుల వద్ద సీఎం జగన్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన అనుచరులే చెబుతున్నారు. ఆ కారణంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారని కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు. అలాగే గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం నుంచి జంప్ చేసి వైసీపీ గూటికి చేరిన విడదల రజనిని చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానంటూ నాడు ఆ సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌కు జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆ తరువాత జగన్ విస్మరించిన విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.
ఏదీ ఏమైనా... ఎన్నికల ప్రచారం వరకు ఫ్యాన్ పార్టీ అధినేతగా.. నేనే రాజు.. మీరు గెలిపిస్తే.. మీ నాయకుడే మంత్రి అంటూ.. ఉరించి ఆ తర్వాత కన్వీనియెంట్ గా విస్మరించడం జగన్ కు అలవాటేనని వైసీపీ శ్రేణులు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. అంతెందుకు తాను 2019 ఎన్నికలలో సీఎం కావడం కోసం నిర్విరామంగా కృషి చేసిన చెల్లి,తల్లిని పూర్తిగా పక్కన పెట్టి వారు విసిగి పక్కరాష్ట్రానికి వలస వెళ్లిపోయేలా చేసిన జగన్ ఇప్పుడు గెలిపిస్తే మంత్రి పదవి అంటూ చెప్పిన మాటలను ఎంత సేపు గుర్తుంచుకుంటారులే అని లైట్ గా తీసుకుంటున్నారు. ఏదీ ఏమైనా.. అధికారమనే అందలం ఎక్క వరకే .. తల్లి అయినా.. చెల్లి అయినా.. ఆ తర్వాత.. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని ఫ్యాన్ పార్టీలోని వర్గాలే ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ వ్యవహార శైలిపై ముచ్చటగా ముచ్చటించుకోవడం మహా విశేషం.