వైసీపీలో తిరుగుబాట్లు అందుకేనా? ముందస్తు ముందర పోరాడితే పోయేదేంలే...
posted on Jan 3, 2022 @ 11:56AM
రెండున్నరేళ్లు వైసీపీ ప్రశాంతంగా ఉంది. పెద్దగా గొడవలేమీ లేకుండా ఉంది. అధికారాన్ని అంతా ఎంజాయ్ చేశారు. అక్కడక్కడ.. ఏ నగరిలోనో, ఒంగోలులోనో మినహా పార్టీలో అంతర్గత విభేదాలు ఇన్నాళ్లూ తక్కువే అని చెప్పాలి. కానీ, ఆశ్చర్యంగా గత నెల రోజులుగా వైసీపీలో కోల్డ్‌వార్ బాగా పెరిగిపోయింది. అదికాస్తా బహిరంగంగానే భగ్గుమంటోంది. ఈ జిల్లా.. ఆ జిల్లా అనే తేడా లేకుండా.. ఏపీలోని 13 జిల్లాల్లో పార్టీలో కుమ్ములాటలతో కల్లోలం చెలరేగింది. సడెన్‌గా ఇప్పుడే ఇలా వర్గభేదాలు బయటపడటానికి కారణమేంటి? ఇదే సరైన సమయమని.. పోరాడితే పోయేదేమీ లేదని వైసీపీ శ్రేణులు డిసైడ్ అయిపోయారా? ఆ లక్ష్యం కోసమేనా ఇలా లెక్కలేసుకొని మరీ చిచ్చు పెడుతున్నారా?
సీఎం జగన్‌రెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి. జగన్ తర్వాత జగన్ అంతటి స్థాయి ఉన్న నాయకుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఫండింగ్ చేసిందంతా పెద్దిరెడ్డినే అంటారు. అందుకే అధికారంలోకి వచ్చాక గనుల శాఖ అప్పగించి.. కావాల్సినంత తవ్వేసుకోమని పర్మిషన్ ఇచ్చారని చెబుతారు. ఆ పెద్దిరెడ్డికి.. నగరి ఎమ్మెల్యే రోజాకి ఎప్పటినుంచో కోల్డ్‌వార్. వాళ్ల సంగతి అందరికీ తెలిసిందే. ఇక... మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు అయిన.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిపై తాజాగా వైసీపీ జెడ్పీటీసీ భర్త కొండ్రెడ్డి తిరుగుబాటు చేయడం మామూలు విషయం కానేకాదు. వైసీపీ రాజకీయాల్లో ఇది అత్యంత సంచలనం. రోజా ఏదో అన్నారంటే అది వేరే సంగతి.. కానీ ద్వారకానాథ్‌రెడ్డి.. అవినీతి, అరాచకాలు, ఆధిపత్యంపై కొండ్రెడ్డి నిలదీయడం చిత్తూరు జిల్లాలో సంచలనమే. ద్వారకానాథ్‌రెడ్డిని ప్రశ్నించారంటే.. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డిని చొక్కాపట్టుకొని అడిగినట్టే. కట్ చేస్తే.. ఆ ప్రశ్నించిన గొంతును.. పోలీసులు అరెస్ట్ చేయడం మరింత కలకలం. సొంతపార్టీ నాయకుడినే అరెస్ట్ చేయించిన ఘనులు ఈ పెద్దారెడ్డి బ్రదర్స్ అంటున్నారు.
ఒక చిత్తూరు జిల్లాలో వైసీపీలోనే పెద్దిరెడ్డి.. రోజారెడ్డి.. నారాయణస్వామి, తాజాగా కొండ్రెడ్డి.. ఇలా నాలుగు ముక్కలాట కొనసాగుతోంది. అన్ని జిల్లాలు.. అన్ని నియోజక వర్గాల్లోనూ వర్గ పోరు ముదిరి రోడ్డున పడుతోంది. వైసీపీ ప్రజా ప్రతినిధులపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు తిరగబడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీలో కల్లోలం కనిపిస్తోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, కరణం బలరాం, ఆమంచి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కాకాని గోవర్థన్‌రెడ్డి, విడదల రజినీ, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్, దేవినేని అవినాష్, వల్లభనేని అవినాశ్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి.. విజయసాయిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, తమ్మినేని.. ఇలా ప్రాంతాలు, జిల్లాలనే తేడా లేకుండా.. దాదాపు వైసీపీ నేతలందరి మధ్యా వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా, ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలోనే కాకుండా ద్వితియ శ్రేణి నాయకులు సైతం నేరుగా ప్రజా ప్రతినిధులపై తిరుగుబాటు చేయడం కీలక పరిణామం.
ఈ ధిక్కార స్వరానికి కారణాలూ లేకపోలేదంటున్నారు. అవినీతి సంపాదన కోసం పోటీ పడుతూ.. నేతలంతా ఇలా కుమ్ములాడుకుంటున్నారనేది ఒక రీజన్. ఇక రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కోసం కొందరు ఇలా ఫైర్‌బ్రాండ్‌గా మారారని అన్నారు. ఇప్పుడు కేబినెట్ విస్తరణ లేదుగానీ.. ఏకంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే లీకులతో.. ఈసారి ద్వితీయ శ్రేణి నాయకగణమూ రంగంలోకి దిగింది. ఎప్పుడూ మిమ్మల్నే గెలిపించాలా? మీ కోసమే పని చేయాలా? మాకూ అవకాశం ఇవ్వరా? అనే రెబెల్ ఎజెండాతో.. సెకండ్ గ్రేడ్ లీడర్లు సైతం వాయిస్ పెంచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని చెబుతున్నారు. జగన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ప్రచారంతోనే.. వైసీపీలో ఎలక్షన్ ఫీవర్ పట్టుకుందని.. అందుకే గ్రూప్ తగాదాలు, ఎత్తులకు పైఎత్తులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ఏకంగా వైసీపీ నేతలపైనే కేసులు పెట్టి.. అరెస్టులు చేయించేదాకా.. ఆ అధికార పార్టీ రాజకీయం ముదురుతోంది..అంటున్నారు.