దిక్కులేని వైసీపీకి శాసనమండలే దిక్కు!
posted on Sep 23, 2025 @ 2:30PM
ఏ మొగుడు లేని వారికి అక్క మొగుడే దిక్కు అని ఉత్తరాంధ్రలో ఓ పాతకాలపు సామెత ఉంది. ఇప్పుడు వైసీపీని చూసి అదే మాట అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేస్తామన్న శాసనమండలే ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి దిక్కుగా మారిందంటున్నారు. ఈ పరిస్థితి జగన్ ముందు చూపులేని నిర్ణయాలకు నిలువెత్తు నిదర్శనంగా వైసీపీ నేతలే అంటున్నారు.
ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఉద్యమకారులను అన్ని రకాలుగా అణచివేశారు. వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కానీ 2024 లో జరిగిన ఎన్నికల్లో మూడు ప్రాంతాల ప్రజలు కూడా ఫ్యాన్ పార్టీకి మొట్టికాయ వేశారు. రాష్ట్రం అంతా కలిసి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల ఆమోదానికి మండలిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ అవరోధంగా మారడంతో అప్పట్లో శాసనమండలని రద్దు చేయాలని జగన్ భావించారు. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువచ్చారు. కానీ శాసనమండలి రద్దు ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
ఈ దశలో 11 మంది సభ్యులతో అసెంబ్లీకి వెళ్లడం అవమానంగా భావించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గైరాజరవుతున్నారు. దీనిపై స్పీకర్ అయిన పాత్రుడు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పలుమార్లు విమర్శలు చేసినప్పటికీ ఫ్యాన్ పార్టీ తన వైఖరిని మార్చుకోలేదు. అయితే ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళక అధికారంలో లేక తమ వాదన వినిపించే పరిస్థితి ఉండక ఫ్యాన్ పార్టీ ఇబ్బంది పడుతున్నది. ఈ దశలో ప్రతిపక్ష నాయకుని హోదా తో శాసనమండలిలో ఫ్యాన్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రం తన గళాన్ని వినిపిస్తున్నారు . దీన్ని కూటమి నాయకులు బలంగా తిప్పి కొట్టినప్పటికీ ఎంతో కొంత బొత్స తన గొంతును వైసీపీ పక్షాన వినిపిస్తున్నారు. దీన్ని చూసిన ఉత్తరాంధ్రవాసులు జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా శాసనమండలిని రద్దు చేయాలని భావించినా ఇప్పుడు అదే ఆ పార్టీకి దిక్కుగా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఫ్యాన్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక తరహాలో వ్యవహరిస్తే బొత్స సత్యనారాయణ మరోలా ప్రవర్తిస్తున్నారు . కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి బాయ్ కాట్ చేస్తే.. బొత్స సత్యనారాయణ మాత్రం విధిగా శాసనమండలికి హాజరవుతున్నారు. ఇది ఒకరకంగా ఆ పార్టీలో భిన్న ఆలోచనలకు తెర తీస్తోంది. అధినాయకుని తీరును లెక్కచేయకుండా బొత్స హాజరవుతున్నారా లేక ప్రజాపక్షంలో నాయకునిగా తన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అన్న అను మానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి దశ నుంచి ఏకపక్ష నిర్ణయాలతో.. రాచరికం మాదిరిగా తన నిర్ణయమే అమలు కావాలనే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి తాజాగా బొత్స ప్రవర్తన పై గుర్రు గా ఉన్నట్టు కూడా ఫ్యాన్ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి వై ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న బొత్స తొలి నుంచి వైసీపీలో ఉన్నా ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా బొత్స వైఖరి అదే తరహాలో ఉంటుంది. అయితే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు బొత్సకు జగన్... జగన్ కు బొత్స గత్యంతరం లేని దిక్కులుగా మారారు. ఇంకా రంగులు మారుతున్న రాజకీయ పరిణామాలతో ఈ నాయకుల తీరు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.