ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది!
posted on May 27, 2024 @ 5:43PM
వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు. రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.
తెలుగుదేశం కూటమిలో ఉత్సాహం ఉరకలేస్తుంటే... వైసీపీ శిబిరంలో నైరాశ్యం తాండవిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి గెలుపు ధీమా ఒలక పోస్తున్నా వారి ముఖాల్లో మాత్రం ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పెనమలూరు, మైలవరంలలో అభ్యర్థుల గెలుపు ఓటములపై సాగుతున్న బెట్టింగుల తీరు ను బట్టి వైసీపీ అభ్యర్థుల దయనీయ స్థితి ఇట్టే అర్ధమైపోతుంది. ఈ నియోజకవర్గాలలో వైసీపీ విజయంపై బెట్టింగులకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది.
అదే సమయంలో కూటమి అభ్యర్థుల గెలుపు మీద కంటే వారి మెజారిటీల మీద పెద్ద ఎత్తున బెట్టింగులు కాయడానికి పందెం రాయుళ్లు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా గన్నవరంలో అయితే వల్లభనేని వంశీపై తెలుగుదేశం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు పది వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని లక్షల రూపాయలు బెట్టింగులు కడుతున్నారు. అదే సమయంలో యార్లగడ్డకు అంత మెజారిటీ రాదని వైసీపీ వారు బెట్టింగులకు దిగుతున్నారంటే ఓటమి అంగీకరించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా గుడివాడలో కొడాలి నాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధిస్తారంటూ పెద్ద ఎత్తున పందేలు ఒడ్డుతున్నారు. వెనిగండ్ల రాము విజయంపై నూజివీడుకు చెందిన కొందరు 20 లక్షల రూపాయలు పందెం ఒడ్డినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాని విజయంపై పందెం కాయడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ నేతలు ఈ రెండు నియోజకవర్గాలలోనూ పరాజయాన్ని అంగీకరిచేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.