రాజ్యసభలో వైసీపీ పక్షం మాయం?
posted on Jul 16, 2024 @ 11:17AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులు పెను వేగంతో జరుగుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభావం, కేంద్రంలోని ఎన్డీయే కూటమిపై కూడా పడుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తన రాజకీయ నిర్ణయాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో చర్చించి, ఆయన ఆమోదంతోనే ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది.
ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్ ఫలితాల తరువాత తన పార్టీ రాజ్యసభ సభ్యులతో భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీకి మన అవసరం ఉంది. గట్టిగా నిలబడండి. బీజేపీయే కాళ్ల బేరానికి వస్తుంది అన్నట్లుగా ఉద్బోధ చేశారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఉందని ఆయన భ్రమ పడ్డారు. అయితే వాస్తవానికి వచ్చే సరికి ఆయన కళ్లు బైర్లు కమ్మాయి. ఫలితాలు ఎలా అయితే తన చేతుల్లో లేవని అంగీకరించేశారో.. అలాగే ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ బలం కూడా తనది కాదని ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఏపీ మండలిలో కూడా ముందు ముందు అదే జరిగే అవకాశం ఉంది. అది వేరే సంగతి.
ఇప్పుడు రాజ్యసభలో వైసీపీ సభ్యలు వద్దకు వస్తే గంపగుత్తగా వారంతా బీజేపీ గూటికి వెళ్లి వైసీపీ రాజ్యసభ పక్షాన్ని కమలం పార్టీలో విలీనం చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేదు. ఎందుకంటే జగన్ కు తమ సభ్యులు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా గొంతెత్తమని ఆదేశించే ధైర్యం లేదు. అక్రమాస్తుల కేసుల కత్తి మెడమీద వేళాడుతుండటంతో ఆయన కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా గట్టిగా నోరెత్తలేని పరిస్థితి. సో.. వైసీపీ సభ్యులు రాజ్యసభలో ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేసే అవకాశం లేదు. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావడంతో తెలుగుదేశంపైనా విమర్శలు చేసే సాహసం చేయలేని పరిస్థితి వైసీపీది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులు బీజేపీవైపు చూస్తున్నారు.
అయితే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం అంగీకారం లేకుండా వైసీపీ రాజ్యసభ సభ్యులకు బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించే అవకాశం లేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అవసరాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకోకుండా ఉండరు. అందుకే బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు. వారి ఆహ్వానం మేరకే చంద్రబాబు హస్తినకు వెడుతున్నారు. కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రోజుల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హస్తిన పర్యటన అంటే అందరూ రాష్ట్రానికి అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చించడానికి అని భావిస్తారు. అది సహజం. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపుల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదన్న స్పష్టమైన హామీ వచ్చేసిందని అంటున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటన అజెండా రాజకీయ అంశమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎన్డీయే కూటమికి రాజ్యసభలో అవసరమైన బలం లేదు. ఒడిశాలో ఓటమి తరువాత బీజేడీ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవు. దీంతో బీజేపీ చూపు వైసీపీ రాజ్యసభ సభ్యులపై పడింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి తహతహలాడుతున్నారు. ఆ సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకునే విషయంపై చంద్రబాబుతో చర్చలకు బీజేపీ అగ్రనేతలు ముందుకు వచ్చారు. బహుశా ఆ విషయంపై చర్చించేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అని అంటున్నారు.
ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోచవ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి, ఎన్డీఏకు మెజారిటీ కావాలంటే వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులను చేర్చుకోవాల్సిన పరిస్థితి. ఆ విషయం తెలిసిన చంద్రబాబు ఇందుకు అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేడో రేపో వైసీపీ రాజ్యసభ సభ్యులు కమలం తీర్థం పుచ్చుకుని వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఈ తంతు చంద్రబాబు సమక్షంలో జరిగినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రం పుంజుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకాయం కేంద్రం నుంచి వస్తే చాలు అన్నఉద్దేశంతో ఉన్న చంద్రబాబు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరికకు అభ్యంతరం పెట్టే అవకాశాలు తక్కువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.