వైసీపీ వ్యూహం నెరవేరబోతోందా.. చంద్రబాబుకి తిప్పలు తప్పవా?
posted on Oct 30, 2019 @ 12:22PM
పోలీసులపై చంద్రబాబు బెదిరింపుల ధోరణి తో మాట్లాడుతున్నారని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనీ.. గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో వైసిపి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఏమయిందో ఏమో అప్పటికప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు హడావిడిగా అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా సంతకాలతో ఫిర్యాదు చేసి పోలీసులకు ఇచ్చి వెళ్లి పోయారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఏం చేయాలి అనే అంశంపై అటు పోలీసులు ఇటు వైసిపి నేతలు తర్జన భర్జన అవుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి అందిన ఫిర్యాదు కావటంతో ఇదంతా రాష్ట్ర స్థాయి వ్యవహారమంటూ ఫిర్యాదు అందుకున్న అరండల్ పేట పోలీసులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కాపీని పంపి ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైసిపి నేతలు కూడా ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నారు.
పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు ముస్తఫా, శ్రీదేవి, విడదల రజినీ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారు అన్న అంశంపై వైసీపీ నేతలు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు అటు వైసిపి నేతలు కూడా ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి అనే విషయాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు తీసుకునే చర్యలు ఒకెత్తైతే రాజకీయంగా చంద్రబాబు పై ఇచ్చిన ఫిర్యాదు అంశం ఆ పార్టీ పెద్దల వద్ద చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని ముందుండి ఎలా నడిపించాలి అనే విషయాన్ని కూడా వైసీపీ నేతలు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫాకు పూర్తి బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు.మరో వైపున హోంమంత్రి కూడా జిల్లాకు చెందిన వారే కావడంతో పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాలను కూడా పోలీసులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. ఇందు కోసం పోలీసులు చట్ట పరంగా ఉన్న వ్యవహారాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.
చంద్రబాబు చేసిన కామెంట్స్ కు సంబంధించి రికార్డులను కూడా పూర్తి ఆధారాలతో సేకరించి వాటిని సాంకేతికంగా నిర్థారణ చేసిన తరువాతే ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. అటు రాజకీయంగా కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా తమదే పైచేయని చాటుకోవాలని చూస్తోంది అధికార పక్షం. మరోవైపు టిడిపి శ్రేణులు కూడా చంద్రబాబుపై పెట్టిన కేసు వ్యవహారంలో అధికార పక్షం కదలికలతో పాటుగా పోలీసుల చర్యలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. వైసీపీతో పాటు పోలీసు చర్యలను కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల మార్గాలను కూడా టిడిపి అన్వేషిస్తోంది. మొత్తం మీద చంద్రబాబుపై అధికార పక్షం చేసిన ఫిర్యాదు వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ రెండు పార్టీలతో పాటుగా పోలీసు శాఖలో కూడా కనపడుతోంది.ఇక ఈ అంశం ముందు ముందు ఎలాంటి చర్యలకు తావునిస్తుందో వేచి చూడాలి.