వైసీపీ పిల్ల కాలువ!.. గమ్యం కాంగ్రెసేనా?
posted on Jun 20, 2024 @ 12:18PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఒక పిల్ల కాలువలా మారిపోయింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలూ, జగన్ తో సహా ఎవరూ కూడా తమ పార్టీ ఓటమిపై సమీక్షలు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ మాటే ఎత్తడం లేదు. ఎంత సేపూ పాచిపోయిన ఈవీఎంల టాంపరింగ్, జనం తమ పార్టీకి ఓటు వేయకుండా తప్పు చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు ఐదేళ్లూ గడిచిపోతాయి. అంటూ తమను తాము మభ్యపెట్టుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారు.
అయితే వారు అంతో ఇంతో మాత్రంగా మిగిలిన పార్టీ క్యాడర్, నేతలూ జారిపోయే ప్రమాదం కళ్లముందే ఉన్నా గుర్తించడం లేదు. ఔను వైసీపీ ఉనికిమాత్రంగా కూడా మిగలని పరిస్థితి త్వరలోనే ఏర్పడబోతున్నది. వైసీపీ ఉనికిని కబళించేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో కొన్ని నెలల ముందు వరకూ కాంగ్రెస్ గురించి మాట్లాడేవారు లేరు. అసలా పార్టీ ఒకటి రాష్ట్ర రాజకీయాలలో ఉందని గుర్తించిన వారు కూడా లేరు. కానీ ఎప్పుడైతే ఇటీవలి ఎన్నికలకు నెలల ముందు కాంగ్రెస్ ఏపీ బాధ్యతలు షర్మిల చేపట్టారో అప్పటి నుంచీ సీన్ మారిపోయింది. సమయాభావం వల్ల ఆమె ప్రచార శైలి, జగన్ పై దూకుడుగా చేసిన విమర్శల ప్రభావం ఎన్నికలపై పెద్దగా కనబడలేదు కానీ, ఆమె ఇదే దూకుడు ప్రదర్శిస్తే వైసీపీ కనుమరుగు కావడం ఖాయం. ఈ ఎన్నికల ఫలితాలలోనే కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయన్న విషయం లీలా మాత్రంగానైనా కనిపించింది. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ ఘెర పరాజయం వెనుక ఉన్నది కాంగ్రెస్సేనని వైసీపీ వర్గీయులు కూడా అంగీకరిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ వైసీపీ ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చింది. షర్మిలకు కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు ఇంకా ముందుగానే అప్పగించి ఉన్నట్లైతే.. వైసీపీకి ఆ పదకొండు స్థానాలూ కూడా దక్కి ఉండేవి కాదన్న విశ్లేషణలు వైసీపీనుంచే వస్తున్నాయి.
సరే ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కొన్ని రోజులు మౌనంగా ఉన్న షర్మిల.. మళ్లీ జగన్ పైనా, వైసీపీపైనా విమర్శలతో విరుచుకుపడ్డారు. ఫలితాల అనంతరం ఆమె తొలిసారిగా బుధవారం (జూన్ 19) మీడియా ముందుకు వచ్చారు. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే నంటూ వైసీపీని తుడిచిపెట్టేయడమే తన లక్ష్యమని చెప్పకనే చెప్పారు. పరిశీలకులు గత కొన్ని రోజులుగా చేస్తున్న విశ్లేషణలు కూడా ఇలాగే ఉన్నాయి. జగన్ పార్టీ నుంచి వలసలు జోరందుకోవడం ఖాయమని అంటున్నారు. సాదారణంగా ఓడిపోయిన పార్టీ నుంచి జంప్ కొట్టే వారెవరైనా అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఐదేళ్లుగా జగన్ విధ్వంస పాలనకు వంత పాడుతూ, జగన్ భజన చేసి ఊరుకోకుండా విపక్ష నేతలపై ఇష్టారీతిన నోరు పారేసుకోవడంతో అధికార కూటమిలోని పార్టీలలో చేరే అవకాశం లేకుండా పోయిన వైసీపీ నేతలకు తమకు రాజకీయ భవిష్యత్ ఉండాలంటూ జగన్ కు దూరం జరగడమే కాకుండా మరో పార్టీ అండ కూడా కావాలని భావిస్తున్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ పార్టీయే డెస్టినేషన్ గా మారింది. జాతీయ పార్టీ కావడం, తాజా సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి బలంగా పుంజుకోవడంతో వైసీపీ నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ బ్రాండ్ కూడా బలంగా పడింది. రోజుల వ్యవధిలోనే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యే అవకాశాలున్నయని పరిశీలకులు చెబుతున్నారు. పిల్లకాలువలన్నీ సముద్రంలోనే కలుస్తాయన్న షర్మిల వ్యాఖ్యలు కూడా దానినే సూచిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీని తుడిచి పెట్టేయడమే లక్ష్యంగా షర్మిల మాటలు, చేతలు అడుగులు ఉన్నాయి. ప్రస్తుతం ఓటమి షాక్ లో ఉన్న జగన్ దాని నంచి తేరుకునే లోగానే వైసీపీ ఖాళీ అయిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.