కృష్ణపట్నం ఆనందయ్యను బెదిరిస్తున్నారు!
posted on May 22, 2021 @ 3:06PM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కొవిడ్ ఆయుర్వేద మందు పంపిణికి బ్రేక్ పడింది. కరొనా మందుపై పూర్తిస్థాయి నివేదిక వచ్చే వరకు పంపిణి ఆపేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో .. ఆనందయ్య ఇంటి దగ్గర అంతా క్లియర్ చేశారు పోలీసులు. కొవిడ్ మందు తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రహస్య ప్రదేశంలో ఆయుష్ ఉన్నతాధికారుల ముందు ఆనందయ్య కొవిడ్ మందు తయారు చేస్తున్నారని తెలుస్తోంది. సరఫరా ఆగిపోయినా వందలాది మంది కృష్ణపట్నం వస్తున్నారు. మందు కోసం ఆనందయ్య ఇంటి దగ్గర పడిగాపులు పడుతున్నారు. పోలీసులు వెళ్లిపోవాలని చెబుతున్నా అక్కడే ఉంటున్నారు జనాలు.
ఆయుర్వేద మందు పంపిణి, ఆనందయ్యను పోలీసులు తీసుకెళ్లిన ఘటనలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించారు. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం అధ్యయనం చేయాలని కానీ.. తక్షణమే ఆయుర్వేద మందును నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిలుపుతో కృష్ణపట్నంలో ప్రజలు గుమిగూడారన్నారు. ఎమ్మెల్యే పిలుపు వల్లే వేలాది మంది కృష్ణపట్నం వచ్చారని, పోలీసుల లాఠీచార్జీకి కారణమైందని చంద్రబాబు మండిపడ్డారు. మందు సరఫరా చేస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే.. అందుకు సరిపడా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ను కాదని ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోందన్నారు చంద్రబాబు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన సీఎం జగన్ కక్షసాధింపులకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు.కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే ఎదురు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయని చంద్రబాబు అన్నారు.