Read more!

టీడీపీ లోకి సీనియర్ నేతలు..  జగన్ రెడ్డికి ముందుంది  క్రొకోడైల్ ఫెస్టివలేనా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుర్చీకి వచ్చిన ప్రమాదమూ లేదు. అయితే ముందుంది ‘క్రొకోడైల్ ఫెస్టివల్’ ముసళ్ళ పండగే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
దేశ, రాష్ట్ర రాజకీయాలను అనేక  కోణాల్లో విశ్లేషించే, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  ఇంతవరకు, వైఎస్ పట్ల ఉన్న కృతజ్ఞతాభావం చేతనో,  ఇంకెందుకో కానీ, జగన్ రెడ్డి తప్పుల విషయంలో ఇంకకాలం కొంత మౌనంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు ఒకటి రెండు విషయాలు ప్రస్తావించినా,లోతైన అధ్యయనం, ఘాటైన విమర్శలు చేసియన్ సందర్భాలు అంతగా లేవు. అలాంటి వైఎస్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండవల్లి జగన్ సర్కార్’పై దండయాత్ర మొదలు పెట్టారు. 

రాష్ట్రం అప్పుల చిట్టా విప్పి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీయడమే కాదు, జగన్ రెడ్డి దివాలా దరిద్రం రాష్ట్రాన్ని, దశాబ్దాల తరబడి వెంటాడుతూనే ఉంటుందని సవివరంగా వివరించారు. భవిష్యత్’లో ఈయన పోయి ఇంకెవరు అధికారంలోకి వచ్చినా కూడా, అప్పుల ఊబిలోంచి రాష్ట్రం ఇప్పట్లో బయటకు రాలేదని గణాంకాలతో సహా వివరించారు.నిజానికి ఉండవల్లి చెప్పిన విషయాలు ఇప్పుడే వింటున్న మాటలు కాదు, మీడియాలో ఇతరత్రా ఎప్పటినుంచో వినవస్తున్న నిజాలే. తెలుగు దేశం పార్టీ ఎప్పటి నుంచో అప్పుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. సంక్షేమం గీతదాటితే సంక్షోభం తప్పదని హెచ్చరిస్తూనే వచ్చింది. అయినా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ఇతర నాయకులు అనుభవంతో చేసిన సూచనలను జగన్ రెడ్డి ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.

ఉండవల్లి ఏ ఉద్దేశంతో, ఎందుకోసం జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపినా, అదిప్పుడు శంఖంలో పోసిన తీర్థంలాగా పనిచేస్తోంది. సామాన్య ప్రజల్లో కూడా, ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామనే భావన బయటకు వస్తోంది. దీనికి తోడు అమ్మ ఒడి’తో మొదలు పెట్టి ఒక్కొక్క సంక్షేమ పథకానికి ప్రభుత్వం గండి పెడుతోంది, దీంతో ప్రజలు ఆలోచనలో పడ్డారు, సంక్షేమ పథకాలకు ఆశ పడితే, చివరకు, చిప్పే గతవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, ‘బాబే రావాలి.. (చంద్ర)బాబే కావాలి’ అనే ఆకాంక్ష జనంలో బలంగా వినిపిస్తోంది.  రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారి పోతున్నాయి. ఉండవల్లి షాక్ తర్వాత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  రవీంద్రా రెడ్డి బాంబు పేల్చారు.

ఒకప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్’తోనే ఢీ అంటే ఢీ అన్నడీఎల్, జిల్లా రాజకీయాల్లో ఇటు నాయకులూ అటు, అటు నాయకులు ఇటు కావడంతో, వేరే దరి లేక (కావచ్చు) వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన జగన్ రెడ్డి మీద యుద్ధానికి సిద్దమవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయని డీఎల్,వచ్చే 2024 ఎన్నికల్లో తప్పక పోటీ చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీ తరుపున పోటీ చేసేది చెప్పక పోయినా ఆయన వైసీపీ ప్రభుత్వాని, జగన్ రెడ్డి పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి  పాలనలో ఆరాచకం విలయతాండవం చేస్తోందనే అర్థమొచ్చేలా ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వ పెద్దలు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు  ఏపీలో రెడ్ల రాజ్యం రావాలని కోరుకుని ఓట్లేసిన అందరికి తగిన శాస్త్రే జరిగిందంటూ సంచలన కామెంట్స్ చేశారు. డీఎల్ నైజం,ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆయన ప్రతిపక్ష శిబిరంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంతే కాదు, జగన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎల్ ... టీడీపీలో చేరేఅవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు. గతంలోనూ ఆయన చంద్రబాబును కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్దత వ్యక్త పరిచారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నా   ఇప్పటికే రాజకీయ గాలి ఎటు వీస్తోందో గుర్తించిన నాయకులు టీడీపీ వైపు చూస్తున్నారు. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలో కీల‌క నేత‌లు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంది. మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భూపేశ్‌రెడ్డి ఈ నెల 20న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగులో బ‌ల‌మైన నాయ‌కుడైన నారాయ‌ణ‌రెడ్డి చేరిక‌తో టీడీపీకి మ‌ళ్లీ పూర్వవైభవం ఖాయ‌మంటున్నారు. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంఛి వక్తగా, సమర్ధ నాయకునిగా పేరున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఈ నెల 21న టీడీపీలో చేరుతున్నారు. ఇలా ఇటు కాంగ్రెస్ నుంచి అటు వైసీపీ నుంచే కాకుండా, బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నాయకుకు కూడా,  టీడీపీ వైపు క్యూ కట్టేందుకు సిద్దమవుతున్నారు. సో... గత ఎన్నికల్ సందర్భంగా ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అంటూ వెంటబడిన జగన్ రెడ్డి కి ఇంకో ఛాన్స్ లేదని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటున్నారు విశ్లేషకులు.