వైసీపీ నేతలకు కృష్ణా జలాల టెన్షన్ ఎప్పటికీ తీరుతుందో
posted on Oct 30, 2019 @ 11:55AM
రాష్ట్రంలో వానలు సరిగా లేకపోయినా ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఒక వైపు ఎగువన కృష్ణా నదిపై శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి ఇప్పటివరకు ఏడుసార్లు గేట్లు తెరిచి నీరు విడుదల చేస్తున్నా.. ఆ ప్రాజెక్టు ఆధారంగా చేపట్టిన హంద్రీ నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఈ విషయం జిల్లా అధికార పార్టీ నేతల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే ఏడు సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తి భారీగా నీరు సముద్రం పాలవుతున్న నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉందా అనిపిస్తోంది. అక్టోబరు రెండో తేదీ నాటికి పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు ఇవ్వాలని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వద్ద జరిగిన సమీక్ష సందర్భంగా నిర్ణయించారు. అయినా అది ఇప్పటివరకు అమలు కాకపోవటంతో చిత్తూరు జిల్లా రైతాంగంలో ఆందోళన మొదలైంది. దానిపై ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రి అమరనాథరెడ్డి సైతం అధికార పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నీళ్లు లేని సమయంలో నీళ్లు అందించామని నీళ్లు పుష్కలంగా ఉన్న ఇవ్వటానికి చేతకాలేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి పక్ష పార్టీ విమర్శలు పక్కనబెడితే జిల్లాలోని పడమటి మండలాల రైతులు నీళ్లు విడుదలలో జాప్యం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల్లోన్ని రైతులు స్థానిక ఎమ్మెల్యే నేతల వద్దకు వెళ్లి పలుమార్లు నీటి విడుదల అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
ఆ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలపై కృష్ణా జలాల ఎఫెక్ట్ బాగానే ఉన్నట్టుగా చెబుతున్నారు స్ధానికులు. ఎక్కడ కనిపించినా ఉన్న సమస్యలతో పాటు హంద్రీ నీవా నీటి విషయాన్ని ప్రస్తావనకు తీసుకురావటాన్ని ఎమ్మెల్యేలు ఇబ్బందికరంగా ఫీలవుతున్నారనే టాక్ నడుస్తోంది. దాంతో కొందరు నేతలు నీటి విషయాన్ని జిల్లా మంత్రి పెద్దిరెడ్డి వద్దకు తీసుకువెళ్ళారు. ఈ నేపధ్యంలో దాదాపు వారం క్రితం జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ సమక్షంలో అనంతపురం చిత్తూరు జిల్లాల ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రెండు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ భరత్ గుప్తా పాల్గొని చిత్తూరుకు నవంబర్ పదిహేనున అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచి కాలువకు నీటిని వదలాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో నవంబరు పదిహేను నుంచి హంద్రీ నీవా జలాలు విడుదలకు రంగం సిద్ధం చేస్తామని చెబుతున్నా ఇప్పటికే పలుమార్లు నీటి విడుదల తేదీని మార్చడంతో ఈ సారైనా నీళ్లు వస్తాయా లేదా అన్న సందేహాలు జిల్లా రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇదే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఎలాగైనా ఈ సారి చిత్తూరు జిల్లాకు అందాల్సిన పన్నెండు టీఎంసీల వాటాను విడుదల చేస్తామని ధీమాగా ఉన్నారు అధికార పార్టీ నేతలు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం టైం దొరికినప్పుడల్లా హంద్రీ నీవా నీటి ఆలస్యంపై విమర్శల వర్షం కురిపిస్తోంది.