కరోనా వేళ స్ధానిక ఎన్నికల ప్రయత్నాలా? జగన్ సర్కారుపై జనాగ్రహం...
posted on Apr 20, 2020 @ 2:53PM
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక్కరోజే 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 700 దాటిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం లక్ష కొరియా కిట్లు తెప్పించి, భారీగా పరీక్షలు నిర్వహించినట్లు చూపించి లాక్ డౌన్ ఎత్తేయగానే స్ధానిక ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు వైఖరిపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఆరంభమైన కొత్తలోనే ఒకట్రెండు కేసులు మాత్రమ నమోదయ్యాయని, దీనిపై స్ధానిక ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ ప్రశ్నించిన సీఎం జగన్... తాజాగా స్ధానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారన్న వార్తలు జనంలో ఆందోళన నింపుతున్నాయి.
ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్నారు. పోలీసులు లాక్ డౌన్ అమల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు వారాల్లో లాక్ డౌన్ ఎత్తేయగానే స్ధానిక ఎన్నికల వ్యూహాలకు తెరదీయాలని ప్రభుత్వం భావించడం వెనుక మర్మమేంటో కూడా అర్ధం కాని పరిస్ధితి. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగిపోయే వరకూ విద్యాసంస్దలు, మాల్స్, దేవాలయాలను సైతం తెరిచి పరిస్ధితి కనిపించడం లేదు. అలాంటిది ఎన్నికల నిర్వహణకు ఎలా సిద్దమవుతారని మేథావులు, సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రజల పరిస్ధితి ఏమైనా పర్వాలేదు కానీ నాకు మాత్రం ఎన్నికల నిర్వహణే ముఖ్యమన్న సంకేతాలను సీఎం జగన్ పంపుతున్నారా అన్న వాదన వినిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చూసినా మే 3 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా సడలించే పరిస్దితి లేదు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఏపీతో పాటు స్ధానిక ఎన్నికలు వాయిదా పడిన రాష్ట్రాలు సైతం ఎన్నికల గురించి ఆలోచించే పరిస్ధితే లేదు. అలాంటిది ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులను ఎలా అనుకూలంగా మార్చుకుందామా అని ఆలోచించడం దారుణమనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ఒక వేళ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే వైరస్ వ్యాప్తి పెరిగి ఒక్కసారిగా రాష్ట్ర్రమంతా పాకితే అప్పుడు పరిస్ధితిని అదుపు చేయడం ఎవరికీ వీలు కాదు. ఓసారి పరిస్ధితి చేదాటి పోయే అప్పుడు కేంద్రం కూడా చెసేదీమీ లేదు.