వైసీపీ నిండా బిల్డప్ బాబాయ్ లే.. తాజాగా ఫొటో షూట్ తో హల్ చల్ చేసిన గుడివాడ అమర్నాథ్
posted on Aug 24, 2022 @ 11:27AM
వైసీపీ నాయకులు మంత్రుల వ్యవహార శైలి ఏదో టీవీ షోలో బిల్డప్ బాబాయ్ చేసే పెచ్చులను మించి పోతోందని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. రోజా తిరుమల స్వామి వారి దేవాలయంలో అనుచరులతో చేసిన హల్ చల్ మరువక ముందే రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫోటో షూట్ పేరిట చేసిన హంగామా ఇప్పుడు సమాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురౌతోంది. ఇటీవల ఆయన ఫొటో షూట్ పేరిట చేసిన హడావుడి నవ్వుల పాలు కావడమే కాకుండా విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ఏదో ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తెరకెక్కుతోందా అన్నట్లుగా ఆ హంగామా సాగింది. ఇంతకీ ఆ హడావుడి అంతా మంత్రిగారు వివిధ పోజుల్లో ఫొటోలు దిగేందుకేనని ఆ తరువాత తేలింది. ఈ సందర్భంగా ఆయన పొటోలకు ఇచ్చిన పోజులు నేల విడిచి సాము చేసిన చందంగా ఉన్నాయని సెటైర్లు పేలుతున్నాయి. మంత్రి గుడివాడ గుర్నాథ్ కు బిల్డప్ బాబాయ్ అన్న ట్యాగ్ కూడా తగిలించేశారు నెటిజన్లు. మరో వైపు మంత్రిగారు పోజులు పెడుతూ దిగిన పొటోలు విపక్షాలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి షేర్లు చేస్తున్నారు.
గుడివాడ అమర్‌నాథ్ మంత్రిగా రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు కానీ.. పెట్టుబడులు కానీ తీసుకు వచ్చారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించేందుకు మాత్రం అపరాత్రి, అర్దరాత్రి అన్న తేడాలేకుండా ఎవర్ రెడీగా ఉంటారని మాత్రం పరిశీలకులు అంటుంటారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో గుడివాడ అమర్నాథ్ కు పేరుకు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా పదవి ఇచ్చారు కానీ ఆయనకు అప్పగించిన పని మాత్రం జనసేనానిపై విమర్శలు గుప్పించడానికేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకు పేరుకు జల వనరుల శాఖ ఇచ్చినా.. ఆయనకు అప్పగించిన పని మాత్రం తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికేనని అంటున్నారు. జగన్ తొలి కేబినెట్ లో ఇలా తిట్ల శాఖల మంత్రులుగా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు ఉండేవారనీ, ఇప్పుడు వారి స్థానాలను గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులు బర్తీ చేశారని అంటున్నారు.
అలాగే నాటి మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు.. ఫోన్ కాల్ వ్యవహారం సైతం సోషల్ మీడియాలో గంట... అరగంట.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టి రచ్చ రచ్చ చేసి పారేశారు. ఇక థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ, నటుడు పృద్దీరాజ్ సైతం ఎస్వీబీసీ చానల్ చైర్మన్‌గా బాద్యతలు చేపట్టి.. పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాకుండానే.. మహిళతో అసభ్యంగా పోన్ కాల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి... ఉద్వాసనకు గురయ్యారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధుల తీరుతెన్నులపై సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ఎండగడుతున్నా.. వారు మాత్రం... తమ స్టైల్ ఇదే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ సంగతి అందరికి తెలిసిందే. దీంతో యాధా అధినేత.. తధా నాయకుడు అన్నట్లుగా ఉందని నెటిజన్లు(సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.)