నందిగం సురేష్ అరెస్ట్.. పరారీలో జోగి రమేష్, దేవినేని అవినాష్
posted on Sep 5, 2024 @ 12:21PM
వైసీపీ నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అరాచకాలు, పాల్పడిన అక్రమాలు, దౌర్జన్యాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో అరెస్టు అనివార్యం అని గ్రహించి అజ్ణాతంలోకి వెళ్లిపోవాలని నందిగం సురేష్ చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేసి మంగళగిరికి తీసుకువచ్చారు.
అంతకు ముందు నందిగం సురేష్ కోసం ఆయనే నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన పరారైపోయారని అర్ధమైంది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి మరీ నందిగం సురేష్ పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. నందిగం సురేష్ హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆయనను అరెస్టు చేసి విచారణ నిమిత్తం మంగళగిరికి తీసుకువచ్చారు.
కాగా తెలుగుదేశం కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులకు సంబంధించి ఇతర వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిన రఘురామ్ లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి , చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో నిందితులైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వారి బెయిలు పిటిషన్ ను కొట్టేసింది. కనీసం సుప్రీం కోర్టును ఆశ్రయించేవరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న వారి వినతిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వీరి అరెస్టు అనివార్యం అయిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌లు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడు.
కాగా తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇదే కేసులో విజయవాడ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నందిగం అరెస్టుతో తమ అరెస్టు కూడా తథ్యమన్న భయంతో జోగి రమేష్, దేవినేని అవినాష్ లు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వారి కసం కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.