గుంటూరులో ప్రభుత్వ వ్యతిరేకత ఘాటు.. జగన్ ఉక్కిరిబిక్కిరి!
posted on Feb 28, 2024 @ 10:04AM
ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉండగా.. పన్నెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన కూటమి మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడం పట్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. దీంతో ఈ జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమికి అమరావతి రాజధాని అంశం కారణంగా మారబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశంకు బలమైన క్యాడర్ ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిచండం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాలలో ఏ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే..
మంగళగిరి ..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలిచే నియోజకవర్గం మంగళగిరి అని టీడీపీ ఢంకా బజాయించి మరీ చెబుతోంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పరాజయం పాలయ్యారు. అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి లోకేశ్ కృషి చేస్తున్నారు. మరోవైపు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే ప్రధాన అంశంగా చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లను వైసీపీ అధిష్టానం తొలగించి గంజి చిరంజీవి ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే, చిరంజీవిని సైతం తప్పించి మరొకరికి ఇంచార్జి బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా మంగళగిరిలో నారా లోకేశ్ భారీ విజయం సాధించడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి.
పొన్నూరు..
పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోశయ్యను మరోసారి వైసీపీ అధిష్టానం బరిలోకి దించుతోంది. తెలుగుదేశం నుంచి మరోసారి దూళిపాళ్ల నరేంద్ర పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన మొదటి జాబితాలో దూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ప్రకటించారు. దూళిపాళ్ల నరేంద్ర 2019లో మినహా గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో దూళిపాళ్ల విజయం ఖాయంగా కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వంపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలపై ఈ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఈసారి దూళిపాళ్ల నరేంద్ర విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు సైతం చెబుతున్నారు.
వేమూరు..
వేమూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేరుగు నాగార్జున బరిలో నిలిచి విజయం సాధించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ కొనసాగారు. ఈసారి వైసీపీ అధిష్టానం ఆయనను ఈ నియోజకవర్గం నుంచి తప్పించి వరికూటి అశోక్ బాబును పార్టీ అభ్యర్థిగా తీసుకువచ్చింది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నక్కా ఆనందబాబు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆనంద బాబు విజయం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వైసీపీ అభ్యర్థి అశోక్ బాబుకు వర్గ పోరు ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు నియోజకవర్గంలోని ప్రజలు నాలుగున్నరేళ్ల జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ వ్యవహరించిన తీరు కూడా ఈ నియోజకవర్గంలో వైసీపీపై ప్రతి కూల ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలన్నీ కలిసి వేమూరు నుంచి నక్కా ఆనందబాబు విజయం ఖాయమని అంటున్నారు.
రేపల్లె..
రేపల్లె నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. మరోసారి తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనే పోటీ చేయనున్నారు. వైసీపీ తరఫున ఈవూరి గణేశ్ ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న ఇద్దరూ కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల అధికశాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో మరోసారి అనగాని సత్యప్రసాద్ విజయం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
బాపట్ల..
బాపట్ల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోన రఘుపతి ఉన్నారు. మరోసారి వైసీపీ అధిష్టానం కోన రఘుపతినే బరిలో నిలిపే అవకాశం ఉంది. తెలుగుదేశం అభ్యర్థిగా వేగ్వేశ నరేంద్ర వర్మ బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయం ఖాయమన్న భావన స్థానికంగా బలంగా వ్యక్తం అవుతోంది.
ప్రతిప్తాడు..
ప్రతిపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకతోట సుచరిత విజయం సాధించారు. వైసీపీ అధిష్టానం ఆమెను పక్కకు తప్పించి బాలసాని కిరణ్ కుమార్ ను ఈ సారి బరిలోకి దింపుతోంది. తెలుగుదేశం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి బి. రామాంజనేయులు బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని సునాయాసం చేస్తుందని అంటున్నారు.
చిలకలూరి పేట..
చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విడదల రజనీ విజయం సాధించారు. ప్రస్తుతం ఆమెను వైసీపీ అధిష్టానం ఈ నియోజకవర్గం నుంచి తప్పించి మల్లెల రాజేశ్ నాయుడును రంగంలోకి దించింది. తెలుగుదేశం ఈ నియోజకవర్గంలో సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుకు మరోసారి అవకాశం కల్పించింది. ఈ నియోజకవర్గ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేకత పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు టీడీపీ,జనసేన పొత్తు ప్రత్తిపాటి పుల్లారావు విజయాన్ని లాంఛనం చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సత్తెనపల్లి..
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు విజయం సాధించారు. జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ కొనసాగుతున్నారు. మరోసారి వైసీపీ అధిష్టానం సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును బరిలోకి దింపుతున్నది. తెలుగుదేశం అభ్యర్థిగా ఈసారి మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థి విజయం ఖాయమని పలు సర్వేలు పేర్కొన్నాయి. లక్ష్మీనారాయణ విజయానికి దోహదపడే అంశాలను పరిశీలిస్తే.. నియోజకవర్గ ప్రజల్లో అంబటి రాంబాబుపై వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం, జనసేన అధినేతలపై అంబటి రాంబాబు అభ్యంతరకర భాషను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అంబటి భాషతీరుపై నియోజకవర్గం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన తీరుపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమరావతి రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, అంబటి రాంబాబు వ్యాఖ్యల పట్ల నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ పట్ల ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం, తెలుగుదేశం, జనసేన పొత్తు కలిసి కన్నా విజయం సునాయసమేనన్న భావన నియోజకవర్గంలో బలంగా వ్యక్తమౌతోంది.
వినుకొండ..
వినుకొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. మరోసారి ఆయన్నే వైసీపీ అధిష్టానం బరిలోకి దింపనుంది. తెలుగుదేశం అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజల్లో బ్రహ్మానాయుడుపై వ్యతిరేకత ఉంది. వైసీపీలో వర్గపోరు చాపకిందనీరులా విస్తరిస్తోంది. దీనికితోడు ఈసారి తెలుగుదేశం, జనసేన పొత్తు ఉండటంతో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు విజయం ఖాయమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
మాచర్ల..
మాచర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. మరోసారి ఆయన్నే వైసీపీ అధిష్టానం బరిలోకి దింపనుంది. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పిన్నెల్లిపై నియోజకవర్గంలో మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు జగన్ పాలనపైనా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తుండటం జూలకంటి విజయానికి దోహదం చేస్తుందని అంటున్నారు.
తెనాలి..
తెనాలి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అన్నాబత్తుల శివకుమార్ బరిలో నిలిచి విజయం సాధించారు. మరోసారి ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశంఅభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీచేశారు. ఈసారి తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా చంద్రబాబుతో భేటీ తరువాత నాదెండ్ల మనోహర్ అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తున్నారు. నాదెండ్ల విజయానికి తాను, తన అనుచరులు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు. ఈ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ పై నియోజకవర్గం ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శివకుమార్‌పై ఇసుక మాఫియా ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నిస్తున్న వారిని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. దీనికితోడు వైసీపీలోని ఓ వర్గం శివకుమార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీటన్నింటికితోడు టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తుండటంతో శివకుమార్ ఓటమి ఖాయమన్నభావన స్థానికంగా వ్యక్తం అవుతోంది. నాదెండ్ల మనోహర్ విజయం ఈ నియోజకవర్గంలో దాదాపు ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు పేర్కొన్నాయి.
తాటికొండ..
తాటికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా 2009లో ఓడిపోగా.. 2014లో విజయం సాధించారు. అయితే 2019లో ఓటమి పాలయ్యారు. మరోసారి తెలుగుదేశం అభ్యర్థిగా శ్రావణ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశంలో చేరిన సంగతి విదితమే. దీంతో ఈసారి తాటికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ కేబినెట్ లో హోమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు వైసీపీలో వర్గ విబేధాలు, తెలుగుదేశం, జనసేన పొత్తు శ్రావణ్ కుమార్ విజయానికి కలిసొచ్చే అంశాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.