వైసీపీ దుకాణం బంద్!
posted on Apr 4, 2021 8:50AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పురుడు పోసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో మాత్రం దుకాణం ఎత్తేసేలా ఉంది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు. తాను త్వరలో జాతీయ పార్టీలో చేరబోతున్నానని చెప్పారు. తెలంగాణ వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొండా రాఘవరెడ్డి. పిట్టల రాంరెడ్డి ఇప్పటికే వైఎస్ షర్మిల పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న వైసీపీ నేతలు కూడా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ముఖ్య నేతలంతా వెళ్లిపోవడంతో వైసీపీ తెలంగాణలో జెండా పీకేసేలా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు బీ టీమ్‌గా మారిపోయింది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే తెలంగాణలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. 2019లో ఏపీలో జగన్ అధికారంలోకొచ్చాక... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఏమైనా పార్టీ తరుపున కార్యక్రమాలు చేసినా అది గులాబీ బాస్‌కు అడ్డుగా ఉంటుందన్న సాకుతో జగన్, పార్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి.
తెలంగాణలో పార్టీ యాక్టివ్‌గా ఉండదని, పార్టీ పేరుతో కార్యక్రమాలు చేయడం వృథా అని... ఎక్కడైనా అవకాశాలు ఉంటే చూసుకొండంటూ గత ఏడాదిగా తెలంగాణ వైసీపీ క్యాడర్‌కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి, జగన్ చెప్పినట్లు సమాచారం. తెలంగాణ నుంచి జగన్‌ను కలిసేందుకు ఏపీకి వెళ్లిన ప్రతి సారి తెలంగాణ నేతలకు జగన్ అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక లాభం లేదనుకున్న వైసీపీ నేతలు తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లిపోయారు. తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాత్రం జగన్‌వైపే చూస్తూ ఉండిపోయారు. ఇంతకాలం వేచిచూసిన ఆయన చివరకు వైసీపీకి రాజీనామా చేశారు. బరువెక్కిన గుండెతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.