టార్గెట్ లోకేష్.. ఫినిష్ టీడీపీ.. బీజేపీ, వైసీపీ కలిసి కొత్త ప్లాన్
posted on Aug 24, 2020 @ 8:40PM
టీడీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో లోకేష్ కీలక మంత్రిగా పని చేస్తున్నప్పుడే ప్రతిపక్ష వైసిపి టీడీపీని ఫినిష్ చేసే దిశగా అడుగులు వేసింది. దాని కోసం ఆ పార్టీ ఎంచుకున్న పద్దతి లోకేష్ ను టార్గెట్ చేయడం. ఆ సమయంలో లోకేష్ కీలకమైన పంచాయతీ రాజ్, ఐటి శాఖా మంత్రిగా ఉండగా రాష్ట్రం పలు అవార్డులు అందుకున్న సంగతి తెల్సిందే. అంతేకాకుండా పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పారు. అయితే ఈ విజయాలు ఏవి ప్రజల దృష్టిలో పడకుండా చేయడం కోసం అప్పట్లో వైసిపి కీలక నేతలు రోజా, విజయసాయిరెడ్డి.. లోకేష్ ను టార్గెట్ చేస్తూ పప్పు అని, మందలగిరి మాలోకం అంటూ ప్రజల ముందు ఒక ఏమి చేతకాని వాడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. అయితే అప్పట్లో దీనిని టీడీపీ తిప్పికొట్టే ప్రయత్నం గట్టిగా చేయలేదు. దీనికి తోడు లోకేష్ తెలుగు ప్రసంగాలలో కొన్ని పొరపాట్లు, తప్పులు దొర్లడంతో దానిని పట్టుకుని సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఆయనను ఏమీ తెలియని అమాయకపు నేత గా ముద్ర వేసే ప్రయత్నం కూడా చేసారు. అయితే రాజధాని కూడా లేని రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాం దీనిని ప్రజలు గుర్తించి మనకు వచ్చే ఎన్నికలలో మళ్ళీ పట్టం కడతారని భావించిన తండ్రి కొడుకులైన చంద్రబాబు, లోకేష్ లు వైసిపి చేస్తున్న ఈ దాడిని పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. దీంతో టీడీపీ భవిష్యత్తు నేతగా ఎదిగి కీలక బాధ్యతలు చేపట్టాల్సిన లోకేష్ ను ప్రజలలో చులకన చేసే ప్రయత్నంలో అప్పటి ప్రతిపక్ష వైసిపి తన సోషల్ మీడియా ద్వారా పూర్తిగా సక్సెస్ అయింది. ఇది ఒకరకంగా టీడీపీ భవిష్యత్తు నే దెబ్బ తీసింది.
అయితే ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేసిన తమ ఓటమికి కారణం తెలియడంలేదని బాబు వాపోయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజల తరువాత టీడీపీ భారీ ఓటమి నుండి కోలుకునే ప్రయత్నంలో అటు అధికార వైసీపి తప్పిదాల పై ప్రజల పక్షాన ఉంటూ మళ్ళీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఒక పక్క ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కొంతమంది టీడీపీని వీడగా, మరో పక్క ఆర్ధిక మూలాలపై పడుతున్న దెబ్బలకు మరికొంతమంది పార్టీని వీడారు. అయితే ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు తప్పుడు పోస్టులు పెడుతూన్నారంటూ వైసిపి ప్రభుత్వం వరుస పెట్టి టీడీపీ కేడర్ ను అరెస్ట్ లు చేసుకుంటూ పోతుండటంతో రంగంలోకి దిగిన లోకేష్ వారికీ అండగా నిలిచి మీకు మేమున్నాము అని కొండంత ధైర్యాన్నిఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీడీపీని వీక్ చేసేందుకు వైసిపి చేసే ప్రయత్నాలు సఫలం కాకుండా పోతున్నాయి.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టీడీపీ ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, జేసీ వంటి వారి అరెస్టులతో మొదలుపెట్టి ఇక నెక్స్ట్ అరెస్ట్ లోకేష్ దేనని టీడీపీ బెంబేలెత్తిపోయేలా మళ్ళీ వైసిపి వ్యూహ రచన మొదలెట్టింది. అయితే లోకేష్ మాత్రం కరోనా సమయంలో కూడా అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబ సభ్యులను కలిసి వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసాడు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాడు లోకేష్.. దీంతో ఇక లాభం లేదని చెప్పి తాజాగా లోకేష్ ని ఇప్పుడు మరింతగా కట్టడి చేసే దిశగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ముందుకు తెచ్చింది వైసీపీ. కొద్దిరోజుల క్రితం తమిళనాడులో పట్టుబడ్డ సొమ్ము విషయంలో.. ఆ డబ్బు బాలినేనికి చెందిందని లోకేష్ పోస్టు పెట్టాడు. దీనిపై లోకేష్ తో సహా మరికొంతమందికి నోటీసులు అందాయి. తమ మీద అసత్య ప్రచారాలను చేస్తే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ క్లియర్ ఇండికేషన్ పంపిస్తోంది. తాజాగా బీజేపీ కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ పై సీరియస్ అయింది. జీవీఎల్ నరసింహ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసారని కొంత మంది టీడీపీ నేతల పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.
ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న పార్టీలు నాలుగు. వాటిలో జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. మరో పక్క వైసిపికి బీజేపీ రహస్య మిత్రుడు అనేలా ఢిల్లీ నుండి వ్యవహారం నడిపే కొంత మంది బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది టీడీపీ మాత్రమే. దీంతో లోకేష్ ను టార్గెట్ చేస్తే టీడీపీ కథ ఫినిష్ అన్నట్లుగా వైసిపి, బీజేపీ అడుగులు వేస్తున్నాయి. అయితే బీజేపీ, వైసిపి పార్టీల ఆ టార్గెట్ ప్రోగ్రాం ను.. లోకేష్ ఎంతవరకు ఎదుర్కొని నిలబడతాడో.. ఆ రెండు పార్టీలు లోకేష్ ని టార్గెట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.