ఎస్సైని కొట్టి చంపి, ఆ తర్వాత ఉరి తీశారు
posted on Sep 18, 2015 @ 4:19PM
రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ అనుమానాస్పద మృతి... తెలంగాణలో సంచలనం సష్టిస్తోంది. ఎస్సై మృతి వెనుక మంత్రి మహేందర్ రెడ్డి, ఇసుక మాఫియా, ఇద్దరు సీఐల హస్తముందంటూ ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలోనూ ఎస్సై రమేష్ మృతదేహంపై అనేకచోట్ల గాయాలున్నాయని తేలడంతో, కొట్టిచంపి ఆ తర్వాత ఉరి వేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎస్సై భార్య గీత, అతని కుటుంబ సభ్యులు మొదట్నుంచీ అవే అనుమానాలు వ్యక్తంచేస్తుండగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా అలాంటి సందేహాలే వ్యక్తంచేశారు. ఎస్సై రమేష్ ను కొట్టిచంపి ఉరేశారని, ఈ కేసును కేసీఆర్ సీరియస్ గా తీసుకుని సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్సై రమేష్ అంత్యక్రియల సందర్భంగా నల్గొండ జిల్లా దేవరకొండలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని పట్టుబట్టిన బంధువులు... ఎస్పీని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.