భవిష్యత్తులో కరోనా కంటే పెద్ద గండాలు!
posted on Dec 29, 2020 @ 1:58PM
కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతోంది. ఏడాది క్రితం వెలుగుచూసిన ఈ వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. అన్ని రంగాలను ఈ మహమ్మారి కుదేలు చేసింది. కరోనా దెబ్బకు కొన్ని చిన్న దేశాలు పూర్తి చితికిపోయాయి. కరోనా ఇప్పుడు కొత్త రూపులో మరింత ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కోవిడ్ వ్యాక్సిన్ కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చినా.. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా మహమ్మారి అంత పెద్దదేం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ సెల్ చీఫ్ మైకేల్ ర్యాన్ సూచించారు. కరోనా చాలా వేగంగా వ్యాపించి అనేక మందిని బలిగొందని ర్యాన్ గుర్తుచేశారు. అయితే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరింత తీవ్రమైన అంటువ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
కరోనా సమయంలో అనేక నూతన ఆవిష్కరణలు, వేగవంతమైన శాస్త్రవిజ్ఞాన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ సలహాదారు బ్రూస్ ఇల్‌వర్డ్ గుర్తుచేశారు. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అందుకోవడంలో ఇంకా చాలా దూరం ఉన్నామని తెలిపారు. కరోనా రోజురోజుకీ రూపాంతరం చెందుతూ రెండు, మూడో దశలోకి ప్రవేశిస్తోందని గుర్తుచేశారు. వీటిని సమర్థంగా ఎదుర్కోవడానికి కూడా ఇంకా మనం పూర్తి సన్నద్ధంగా లేమని తెలిపారు. భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు కరోనా మనల్ని సంసిద్ధుల్ని చేసిందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానామ్ తెలిపారు. అంటువ్యాధులపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. యూకే, దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా రకాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు నిర్ధారణ పరీక్షల్ని చేస్తేనే కొత్త రకాల్ని గుర్తించగలమన్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానామ్.