Read more!

ఉత్తరాల విందు మొదలుపెడధామా?

అప్పుడెప్పుడో వచ్చిన రాజశేఖర్ అల్లరి ప్రియుడు సినిమాలో ఉత్తరాల ఊర్వశి అంటూ సాగే పాట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉత్తరాల రాయబారం ఎంత బాగుంటుందో చెప్పకనే చెబుతుంది. అంతేనా అందంగా రాసిన అక్షరాల పొందికలో దాగిన అందం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దానికి భావుకత, రసాత్మకత తోడైతే ఆ ఉత్తరమొక తీయని జ్ఞాపకంగా మారిపోతుంది. ఇవన్నీ చాటింగ్స్, ఫోన్ కాల్స్ లో జరిగినా అన్నీ మెరుపు మెరిసి మాయమైనట్టు ఉంటాయి. కానీ ఉత్తరాలు మాత్రం దాచిపెడితే ఏళ్లకేళ్ళు పదిలంగా ఉంటాయి. 

అసలు ఈ ఉత్తరాల సౌకర్యం అందరికీ అందుబాటులో తెచ్చిన తపాలా ఏనాటిది?? ఈ తపాలా వ్యవస్థ ఎక్కడ మొదలయ్యింది?? టెలిగ్రామ్, పోస్ట్, కొరియర్, స్పీడ్ పోస్ట్, లెటర్స్, కార్డ్ పోస్ట్ ఇలా బోలెడు రకాల సౌకర్యాలు కలిగిన తపాలా గురించి తెలుసుకోవాలి. ఫోన్ లు ఎవ్వరికీ అందుబాటులో లేని కాలంలో అందరినీ తన మయాజాలంతో మంత్రముగ్ధుల్ని చేసిన తపాలా వ్యవస్థ గురించి చరిత్రలోకి వెళ్ళాలి.

వరల్డ్ పోస్ట్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 న నిర్వహిస్తారు. ఇది అంతర్జాతీయంగా జరిగే దినోత్సవం. ఇది మొట్టమొదటిసారి 1874 సంవత్సరంలో స్విట్జర్లాండ్ లో ప్రారంభమైంది. 1969 సంవత్సరం నుండి ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజు నుండి తపాలా సేవల ప్రాముఖ్యం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ తపాలా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. 

ఒకప్పుడు!!

ఒకప్పటి కాలంలో అంటే బ్రిటీషు వారు భారతదేశానికి రాకముందు రాజులు దేశాన్ని పాలిస్తున్నప్పుడు పావురాల ద్వారా రహస్య సమాచారాలు పంపబడేవి, సాధారణ విషయాలను ఉత్తరాలలో రాసి రాయబారుల ద్వారా ఉత్తరాలు పంపుకునేవారు. ఈ ఉత్తారాలలోనే ఎంతో విషయ సారాంశం నడిచేది. బ్రిటీషువారు వచ్చాక నూతన పద్ధతులు అందుబాటులోకి తెచ్చారు. టెలిగ్రామ్ వ్యవస్థ మెల్లగా మొదలయ్యింది. 

ఎప్పుడు ఎక్కడ  ప్రకటించారంటే!!

ప్రపంచ తపాలా వ్యవస్థ స్విట్జర్లాండ్ లో మొదలైతే తపాలా దినోత్సవం మాత్రం జపాన్ దేశంలో టోక్యోలో మొదలయ్యింది. మొదటిసారిగా అక్టోబర్ 9 వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకోవాలని అక్కడే నిర్ణయిస్తూ ప్రకటించారు. తపాలా దినోత్సవం గురించి భారతదేశ బృంద సభ్యుడు అయిన శ్రీ ఆనంద్ మోహన్ నరుల ప్రతిపాదనను అందించారు. అది ఆమోదించబడటంతో అప్పటి నుండి తపాలా ప్రాముఖ్యత అక్టోబర్ 9 న అందరికీ తెలిసేలా నిర్వహించబడుతుంది.

మనమేం చేయచ్చు??

నేటి కాలంలో ఆధునిక టెక్నాలజీ వ్యాప్తమైపోయి తపాలా వ్యవస్థ బలహీనమైన మాట కాదనలేని వాస్తవం. కానీ ఏదైనా ఎక్కువగా వాడితే బోర్ కొట్టేస్తుంది అంటారు కదా అలాగే ఈ టెక్నాలజీ కూడా కాస్త బోర్ గానే అనిపిస్తుంది. ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ వీడియో కాల్స్ టెక్నాలజీ వచ్చి పడినా అదేది అంత కిక్కు ఇచ్చినట్టు అనిపించదు. ఒకప్పుడు అయితే రవాణా వ్యవస్థ సరైన విధంగా ఉండేది కాదు కాబట్టి తపాలా వ్యవస్థ కాస్త నెమ్మదిగానే నడిచేది. రోజులు తరబడి ఉత్తారాల కోసం, టెలిగ్రామ్ ల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. చాలా తొందరగా సేవలు అందిస్తోంది. పైగా ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే తక్కువ ధరతో, వేగవంతమైన సేవలు ఇప్పుడు తపాలా వ్యవస్థ సొంతం. అందుకే వ్యక్తులను మరింత దగ్గర చేసే ఉత్తారాల కబుర్లను ఎంచక్కా మీదైన స్టయిల్ లో అందంగా, చమత్కారంగా, అదనపు హంగులు, రంగులు జోడించి తోకలేని పిట్టగా తుర్రుమని వదలండి. 

మీ ఉత్తరం అందుకున్నవారు మిమ్మల్ని మెచ్చుకోకపోతే చూడండి. అంతేకాదు మిగతా రవాణా వ్యవస్థ, కొరియర్, పార్సిల్ వంటివి కూడా పోస్టల్ లో ఎంతో బాగున్నాయి నేటి కాలంలో. వాటిని అందరూ వినియోగించుకుంటే తపాలా వ్యవస్థ మరింత ఉత్సాహంగా మారుతుంది.

                                      ◆ నిశ్శబ్ద.