ఎయిడ్స్ వస్తే జీవితం అంతే.. కాదు.. బ్రతకడానికి ఇంకా ఎంతో ఉంటుంది..!
posted on Dec 1, 2024 @ 4:06PM
హెచ్ఐవీ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదకరమైన జబ్బు. ఈ జబ్బు నయం కావడానికి మందు లేకపోవడం దీన్ని మరింత ప్రమాదకరమైన జబ్బుల జాబితాలో చేర్చింది. 1990, 2000, 2010 వరకు ఎయిడ్స్ పేరు వెంటే ప్రజలు చాలా గందరగోళానికి గురయ్యేవారు. కానీ కాలక్రమేణా ప్రమాదకరమైన జబ్బులతో సావాసం చేయడం ప్రజలకు అలవాటైపోయింది. ఎయిడ్స్ గురించి చాలా విస్తృతంగా అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు యుద్ద ప్రాతిపదికన పనిచేస్తూ వచ్చాయి. ఫలితంగా ఎయిడ్స్ జబ్బుల గురించి, ఆ జబ్బు కేసుల గురించి చాలా తగ్గుదల కనిపిస్తోంది. కానీ ఇంతకాలం గడిచినా ఎయిడ్స్ జబ్బుకు ఎలాంటి మందు కనిపెట్టలేకపోవడం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఎయిడ్స్ అనేది లైంగిక సంబంధాల వల్ల వచ్చే జబ్బు కావడంతో.. నేటి కాలంలో ప్రజలు లైంగిక సంబంధాలు విస్తృతంగా కొనసాగిస్తుండటంతో ఎయిడ్స్ గురించి చాలా అవగాహన, జాగ్రత్త పెరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి ఏడూ డిసెంబర్ 1 వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యాలు, ప్రజలు చేయవలసిన పనులు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థల లక్ష్యాలు వంటివి తెలుసుకుంటే..
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 న జరుగుతుంది. మొదటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 1988 లో జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ ఏర్పాటు చేస్తారు. దీనికి తగినట్టు కార్యక్రమాలు చేపడతారు. 2024 థీమ్.. "సంఘటిత చర్య: హెచ్ఐవీ ప్రగతిని నిలుపుకోవడం మరియు వేగవంతం చేయడం." 2007 నుండి వైట్ హౌస్ నార్త్ పోర్టికో మీద 28 అడుగుల ఎయిడ్స్ రిబ్బన్ ప్రదర్శించబడుతోంది. 1993 నుండి అమెరికా అధ్యక్షులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై అధికార ప్రకటనలు విడుదల చేయడం జరుగుతోంది.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చేసే కార్యకలాపాలు:
హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు. ప్రజలను చైతన్య పరచడం, ప్రజలలో అవగాహన పెంపొందించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎయిడ్స్ జబ్బు కారణంగా మరణించిన వారిని గౌరవించాలి. ఇది లైంగిక సంబంధాల వల్ల, ఎయిడ్స్ ఉన్న వ్యక్తులకు వేసిన ఇంజెక్షన్లు ఆరోగ్యవంతమైన వ్యక్తికి వేయడం వల్ల, వివిధ రకాల పరీక్షల వల్ల ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి. అంతే కానీ ఎయిడ్స్ జబ్బు ఉన్న వారి పక్కన కూర్చొన్న, వారితో మాట్లాడినా వచ్చే జబ్బు కాదు. కాబట్టి ఈ విషయం తెలుసుకుని ఎయిడ్స్ రోగులను అంటరాని వారుగా చూడటం మానేయాలి. వారిని సామాజికంగా బహిష్కరణ చేయడం చాలా తప్పని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన పరిసరాలలో వారిని ఉంచి సరైన వైద్యం తీసుకుంటూ వారి జీవితం వారు సంతోషంగా గడపడంలో సహాయం చెయ్యాలి.
ఎయిడ్స్ జబ్బు వచ్చిన వ్యక్తులు చాలా తొందరగా మరణించడానికి కారణం వారికి సరైన వైద్యం అందకపోవడం. వారికి సరైన ఆహారం, మందులు అందకపోవడం, ముఖ్యంగా వారు నివసించే పరిసరాలు, వారికి సామాజిక తోడ్పాటు లేకపోవడం. వైద్యం తీసుకోవడంలో ఆర్థిక స్థోమత లేకపోవడం. ఇవన్నీ ఎయిడ్స్ సోకిన వ్యక్తులు తొందరగా మరణించడానికి కారణం అవుతాయి. అలా కాకుండా ఇవన్నీ వారికి సరైన విధంగా అందితే వారు కూడా ఎక్కువ కాలం సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది.
కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లను నివారించేందుకు, హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సేవలను అందించేందుకు సగటు పౌరుడిగా తమ వంతు బాధ్యత, చేయూత అందించాలి. కేవలం ఎయిడ్స్ దినోత్సవం రోజునే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఇలాంటి జబ్బులున్న వారికి సగటు మనుషులుగా సహాయం చేయాలి. ఎయిడ్స్ జబ్బు గురించి తెలియని వారికి అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ సోకిన వారిని అంటరానివారుగా చూసే లక్షణం మార్చుకునే దిశగా వారికి హిత బోధ చేయాలి.
ప్రాణాలు చాలా విలువైనవి. ప్రాణంతో ఉంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 38 మిలియన్ మంది హెచ్ఐవీ వైరస్‌తో జీవిస్తున్నారు. గత 40 ఏళ్లలో హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ సంబంధిత వ్యాధుల వల్ల 35 మిలియన్ల మందికి పైగా మరణించారు. తాజా వైద్య పరిజ్ఞానం వల్ల హెచ్ఐవీ ఉన్న వ్యక్తులు దీర్ఘకాల ఆరోగ్య జీవితం గడపవచ్చనే విషయాన్ని వైద్యులు వెల్లడిస్తున్నారు. హెచ్ఐవీ ఉన్నా సరే.. అందరిలాగే బ్రతకవచ్చని భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి ఈ హెచ్ఐవీ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ మీద అవగాహన, మానసికంగా దృఢత్వాన్ని పెంచడం, సమాజంగా వివక్ష లేకుండా చేయడం వంటి కార్యకలాపాలు ప్రోత్సహిస్తే.. ఎయిడ్స్ రోగులు కూడా సమాజంలో బలంగా వారి జీవితాన్ని వారు ఆత్మవిశ్వాసంతో కొనసాగించగలుగుతారు. ఇప్పటికే ఇలా సమస్యతో పోరాడుతూ జీవితాన్ని ఆశాభావంగా గడుపుతున్న వ్యక్తుల గురించి కూడా ఎయిడ్స్ రోగులకు వివరించి చెప్పాలి. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం మీద కొత్త ఆశ చిగురిస్తుంది. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి.
*రూపశ్రీ.