పాత ముఖాలు వద్దు.. కొత్త ముఖాలకే టికెట్లు.. జగన్ వర్క్ షాపు లక్ష్యం అదేనా?
posted on Nov 8, 2022 @ 2:54PM
వచ్చే ఏన్నికలు వైసీపీకి చావో రేవో అని ఫిక్సైపోయిన ముఖ్యమంత్రి జగన్.. పార్టీని గెలుపు బాటలో నడిపించేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గడప గడపకూ అంటూ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ పరుగులు పెట్టిస్లున్నారు. 24x7 సర్వేలు, నిఘాలు అంటూ చెమటలు పట్టిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వ గ్రాఫ్ ఇసుమంతైనా పెరగడంలేదన్న నిఘా నివేదికలతో జగన్ ఖంగారెత్తిపోతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలంటే వచ్చే ఎన్నికలలో సాధ్యమైనంత మంది కొత్త వారికి పార్టీ టికెట్లు ఇచ్చి పోటీలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ మూడున్నరేళ్లలో పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను కలవడానికి పెద్దగా ఆసక్తి కనబరచని జగన్ ఇప్పుడు ఎ విజయం కోసం తాను నమ్ముకున్న గడపగడపకూపై వరుస సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. తాజాగా మరో సారి గడపగడపకూ పై వర్క్ షాపు పెట్టాలని నిర్ణయంచుకున్నారు. ఇందుకు వచ్చే నెల 4 ముహూర్తం ఖరారు చేశారు.
వైనాట్ 175 అవుటాఫ్ 175 అంటున్న జగన్ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇప్పటికే జరిగిన రెండు వర్క్ షాపులతో.. వారిలో జగన్ తో బేటీ అంటేనే ఇదెక్కడి గోలరా భగవంతుడా అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గడపగడపకూ మన ప్రబుత్వం కార్యక్రమంపై ఫీల్డ్ నుంచి నేరుగా అందిన ఫీడ్ బ్యాక్ ప్రాతిపదికగా ఎమ్మెల్యేల పనితీరును జగన్ బేరీజు వేస్తున్నారు. ప్రజలలో ఎమ్మెల్యేల పట్ల ఉన్న సానుకూలత, ప్రతికూలతలను అంచనా వేస్తున్నారు.
అసలు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమమే.. ప్రజలలో ఎమ్మెల్యేల పట్ల సానుకూలత, వ్యతిరేతకలను బేరీజు వేసి వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి తిరస్కరించాలి అన్న విషయాన్ని జగన్ నిర్ణయిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పాలన, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే గడపగడపకు అని చెబుతున్నప్పటికీ ఈ కార్యక్రమ వాస్తవ లక్ష్యం మాత్రం ఎమ్మెల్యేల పనితీరు బేరీజు వేయడానికేనని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందన్న సమాచారం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనంత మంది కొత్త వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా..ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 4న జగన్ మరో సారి వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులకు ఈ మేరకు వారికి ఇప్పటికే సమాచారం పంపారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏ మేరకు చొరవ చూపుతున్నారు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత, సానుకూలత తదితర అంశాలపై ఇప్పటికే జగన్ వద్ద నివేదిక ఉందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
ఐప్యాక్ టీమ్‌లు జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించినట్లు సమాచారం. గతంలో జరిగిన రెండు వర్క్‌షాప్ లలో కొందరు ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అలా జగన్ వార్నింగ్ ఇచ్చిన వారిలో మంత్రులు కూడా ఉణ్నారు. తాజాగా వచ్చే నెల 4న జరిగే వర్క్ షాపులో అప్పుడు వార్నింగ్ ఇచ్చిన వారి పని తీరును మరోసారి సమీక్షిస్తారనీ, ఏ మాత్రం మెరుగుపడకపోయినా.. ఇక వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ హేళక్కేననీ అంటున్నారు. అదే విషయాన్ని ఈ వర్క్ షాపులో జగన్ విస్పష్టంగా తేటతెల్లం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు అదే విషయంపై ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో వార్నింగ్ ఇచ్చిన వారే కాకుండా.. తాజాగా తన వద్ద నివేదికలో పనితీరు మెరుగ్గా లేదని తేలిన ఎమ్మెల్యేల పట్ల కూడా జగన్ కఠిన వైఖరినే అవలంబించనున్నారన్న పార్టీ పెద్దల సంకేతాలతో పలువురు ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
175 కు 175 స్థానాల్లో విజయం అన్న అసాధ్యమైన లక్ష్యన్ని పెట్టుకుని జగన్ తమను ఇరుకున పెట్టి వేధిస్తున్నారన్న అభిప్రాయమే మెజారిటీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. ముందు స్వయంగా జగన్ తన పనితీరుపై నివేదిక తెప్పించుకుని ఉంటే.. ఆయన మీద ఆయనే వేటు వేసుకోవలసిన పరిస్థితి ఉండేదని పలువురు ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. మొత్తం మీద వచ్చే నెల 4న జరగనున్న వర్క్ షాప్ విషయంలో ఎమ్మెల్యేలలో ఆందోళనే తప్ప ఆసక్తి లేదని పరిశీలకులు చెబుతున్నారు.