మత్తు మహిమ ఇంతింత కాదయా..!
posted on Dec 15, 2022 @ 3:49PM
మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు.. ఏపీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా జేబు, ఒళ్లు కూడా గుల్ల అవుతున్నా.. గుర్తించలేని స్థితిలో మందు బాబులు ఉన్నారు. అధిక ధరలకు చౌక మద్యం విచ్చల విడిగా సరఫరా చేస్తున్న జగన్ సర్కార్ సంపూర్ణ మద్య నిషేధం బాటలో అడుగులు వేస్తున్నాం కనుకనే జనంలో మద్యం అలవాటుకు మాన్పించేందుకు ధరలు పెంచేస్తున్నాం అని చెబుతోంది.
మద్యం విషయంలో సమాజానికి ఏపీ సర్కార్ చేస్తున్న చేటు చాలదన్నట్లు డ్రగ్స్, గంజాయిలకు రాష్ట్రంలో గేట్లు తెరిచేసింది. దేశంలో ఏమూల డ్రగ్స్ పట్టుబడినా, గంజాయి దొరికినా ఆ రవాణా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటేనే పరిస్థితి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. ఇక విశాఖ వంటి నగరాలలో అయితే గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మగ్లింగ్ కు గేట్లు తెరిచేయడంతో గంజాయి ఇంటి ముంగిటికి కూడా వచ్చే చేరుతోంది.
దీంతో విశాఖలో ఆడా, మగా తేడా లేకుండా మద్యం, గంజాయి వాడకం పెరిగిపోయింది. దీనికి నిదర్శనంగా తాజాగా విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన ఒక సంఘటన నిలుస్తోంది. బీచ్ రోడ్డులో మద్యం తాగుతూ, గంజాయి సిగరెట్ పీలుస్తూ.. ఓ యువతి వీరంగం సృష్టించింది. ఇదేమిటని ప్రశ్నించిన ట్రాఫిక్ ఎస్ ఐ పై ఆ ఆమ్మాయి దాదాపు దాడి చేసినంత పని చేసింది.
అసభ్యంగా దూషిస్తూ తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పి శాల్తీ లేపేస్తా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. మద్యం మత్తులో ఒళ్లు మరచి వీరంగం చేస్తున్న ఆమెను నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు చివరికి అదుపులోనికి తీసుకుని తొలుత ఆసుపత్రికి ఆ తరువాత ఠాణాకు తరలించారు.