సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మహిళల నిరసన
posted on Oct 3, 2018 @ 11:26AM
సుప్రీంకోర్టు ఈ మధ్య పలు సంచలన తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'స్వలింగ సంపర్కం నేరం కాదు, సెక్షన్ 497 ని రద్దు చేస్తూ వివాహేతర సంబంధం నేరం కాదు' లాంటి సంచలన తీర్పులు వెల్లడించింది. అయితే వీటితో పాటు మరో సంచలన తీర్పు కూడా వెల్లడించింది. అదే 'శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలకు ప్రవేశం'. అయితే ఈ తీర్పుపై కొందరు హర్షం వ్యక్తం చేయగా అనేకమంది వ్యతిరేకించారు.
తాజాగా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో మహిళలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. సుప్రీంకోర్టు కొద్దిరోజుల కిందట ఇచ్చిన తీర్పు వెనక్కి తీసుకోవాలని.. దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. ఆలయ సంప్రదాయాలను నిర్దేశించేది భక్తులే.. రాజ్యాంగం కంటే శతాబ్దాల ముందే ఆలయ ఆచారాలు ఏర్పడ్డాయి.. సంస్కృతిని ధ్వంసం చేయొద్దు.. సదాచారాలను కాలరాయొద్దు అంటూ నినాదాలు చేసారు. మేం 50 ఏళ్లు వచ్చే వరకు ఆలయంలోకి వెళ్లకుండా ఉండేందుకు సిద్ధమేనంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయ్యప్పస్వామి కంటే సుప్రీం తీర్పు గొప్పది కాదంటూ నినదించారు. 10-50 మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
'మేం ఆలయానికి వెళ్లాలనుకోవడం లేదు. అందుకు ప్రతిజ్ఞ కూడా చేశాం. తీర్పు మమ్మల్ని నిరాశకు గురి చేసింది. మానసికంగానూ ఒత్తిడికి గురయ్యాం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మేం కోరుకోవడం లేదు. హిందువులంతా మాకు మద్దతు ఇవ్వాలి’ అని మహిళలు స్పష్టం చేశారు. మరోవైపు తిరువనంతపురంలో ఇడుక్కికి చెందిన అంబిలి అనే మహిళ.. తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా ఢిల్లీలోనూ కేరళకు చెందిన పలు సంఘాలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టాయి.