కేడర్ విభజన చేయకుండా భర్తీ ఎలా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఉత్తమాటేనా?
posted on Jul 12, 2021 @ 9:34PM
తెలంగాణలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. గత ఏడేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. ఉద్యోగాలు రావడం లేదనే మనస్తాపంతో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నా కనికరించలేదు. కాని సడెన్ గా ఉద్యోగ కల్పన అంటూ హడావుడి చేస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. తొలి దశలో 50 వేల ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారనే ప్రకటన వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ సోమేష్ కుమార్ శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి,మంత్రుల ప్రకటనలు.. ఉన్నతాధికారుల హడావుడి చూస్తే రేపోమాపో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయనే సీన్ కనిపిస్తోంది.
ప్రభుత్వం ఇంత షో చేస్తున్నా ఉద్యోగ భర్తీలపై మాత్రం నిరుద్యోగులకు నమ్మకం కుదరడం లేదు. ఉద్యోగ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంజది. అందుకు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ లో .. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని ప్రభుత్లం ప్రకటించింది. ఇప్పటికీ ఏడు నెలలు అవుతున్నా.. ఒక్క నోటిఫికేషన్ రాలేదు. కానీ 50 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని సీఎం చెప్పారంటూ మరో నోట్ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం. నోటిఫికేషన్లు ఇచ్చినా సవాలక్ష అడ్డంకులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీకి చాలా సాంకేతిక సమస్యలున్నాయంటున్నారు. కొత్త జోన్లకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేడర్ ను విభజన చేయలేదు. పోస్టులను కేటగిరీల వారీగా విభజించలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఏది జిల్లా పోస్ట్ అనే విషయంపైనా క్లారిటీ లేకుండా పోయింది. లోకల్ , జోనల్, మల్టీ జోనల్ పోస్టేదో క్లారిటీ లేదు.
2017లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉద్యోగులను సర్దుబాటు పద్దతిలో వివిధ జిల్లాలకు పంపించింది. నాలుగేండ్లు అవుతున్నా వారికి పర్మినెంట్ పోస్టులు ఇవ్వలేదు. పోస్టుల కేడర్ పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. సర్కార్ తీరుతో ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖలోని ప్రతి ఉద్యోగికి కేడర్ చాలా ముఖ్యం. శాఖల వారీగా ఖాళీలను గుర్తించి.. వాటిని కేడర్ వారిగీ విభజన చేసి పూర్తి స్పష్టత వచ్చాకా... పోస్టుల కేడర్, జోన్ లపై ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాందేమి లేకుండానే నోటిఫికేషన్లు ఎలా ఇస్తారన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కేడర్ గుర్తించకుండా నోటిఫికేషన్లు ఇచ్చినా.. ఎవరైనా కోర్టుకు వెళితే ఆగిపోతుందని చెబుతున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి ఇలాంటి సమస్యలు వచ్చాయంటున్నారు. అయినా ప్రభుత్వం అదే తప్పు చేస్తే మరోసారి నిరుద్యోగులతో ఆడుకోవడమేనన్న విమర్శలు వస్తున్నాయి. సర్కారుకు నిజంగానే ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆసక్తి ఉంటే ముందు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోస్టుల కేడర్ ను గుర్తిస్తూ ముందు జీవో జారీ చేయాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉద్యోగ కల్పనకు ఏ మాత్రం కసరత్తు చేయకుండానే ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో లబ్ది పొందడన కోసమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. పలుమార్లు మాట మార్చింది. 2018 ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని ఊరించింది. ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్లో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎన్నికలయ్యాక సర్కారు మరిచిన విషయాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తుండటం, ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత భారీగా కనిపిస్తుండటంతో .. ఇలా ఉద్యోగాలు ఇస్తున్నామంటూ హడావుడి చేస్తున్నారనే ఆరోపణలే మెజార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి.