మందుబాబులకు గుడ్‌న్యూస్.. మిడ్‌నైట్ 12pm వరకు బంపర్ ఆఫర్..
posted on Dec 28, 2021 @ 6:18PM
మందుపార్టీ ముందు ఒక్క పెగ్గుతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పెగ్గు మీద పెగ్గు. పార్టీ రేంజ్‌ను బట్టి.. ఒక్కొక్కరూ వచ్చి చేరుతుంటారు. అలా అలా మందు బాటిళ్లు ఖాళీ అవుతుంటాయి. తాగిందెంతో.. టైమ్ ఎంత అయిందో తెలీనే తెలీదు. మత్తులో.. మజాలో మునిగిపోతుంటారు మందుబాబులంతా. అదేంటో గానీ.. ఉన్న మందంతా అయిపోయాక.. ఇంకో పెగ్గు తాగాలనిపిస్తుంది. కానీ, అప్పటికే టైమ్ అయిపోతే..? షాపులు క్లోజ్ అయితే..? ఆ టార్చర్ మామూలుగా ఉండదు.. అప్పటివరకూ తాగిందంతా దిగిపోతుంది.. ఎలాగైనా ఇంకో బాటిల్ సంపాదించాలని ఎంత ట్రై చేసినా.. మందు దొరకడం కాస్త కష్టమే. అక్కడక్కడా, అప్పుడప్పుడూ బ్లాక్‌లో సరుకు దొరికినా.. ఆ అదృష్టం కొందరికే. ఇక, ఆ రోజు డిసెంబర్ 31 అయితే.. మిడ్‌నైట్.. మాంచి జోష్ మీదున్నప్పుడు వైన్స్ మూసేస్తే..? అబ్బో ఊహించుకోవడమే చానా కష్టం. ఆ బాధ ఎలా ఉంటుందో.. మందుబాబులకే తెలుసు. అందుకే, మందుబాబుల మనసెరిగి నడుచుకునే తెలంగాణ సర్కారు వారికో బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.....
తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల వేళలు పొడిగించింది. డిసెంబరు 31న.. అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చేసింది. అర్థరాత్రి అందరికీ హ్యాపీ న్యూఇయర్ చెప్పేవరకూ.. ఫుల్‌గా తాగొచ్చు. తాగినోళ్లకి తాగినంత మందు అందుబాటులో ఉంచడమే కేసీఆర్ సర్కారు లక్ష్యం. అందుకే, మా మంచి సీఎం అంటున్నారు మందుబాబులంతా. తాగుబోతుల కష్టాలు కేసీఆర్‌కే కరెక్ట్‌గా తెలుసంటూ జేజేలు పలుకుతున్నారు.
31వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు న్యూఇయర్ ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్‌శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది. అయితే, ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్‌ఫీజు రూ.50వేల నుంచి 2.5లక్షలుగా ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది. అంటే, డిసెంబర్ 31 నైట్ ఇటు గ్లాసుల గలగల.. అటు సర్కారు ఖజానాకు కాసుల గలగల.