Read more!

కాంగ్రెస్సే నయమా.. గిడుగు గొడుగుతో ఏపీలో పుంజుకుంటుందా?

ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న ధీమాను పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా నష్టపోయిన మాట వాస్తవమే కానీ.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనను చూసిన తరువాత జనం కాంగ్రెస్సే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారన్నారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లిన గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా వంటి పెద్దలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకునేందుకు హస్తిన వచ్చినట్లు చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న గిడుగు రుద్రరాజు పార్టీకి పునర్వైభవం తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పార్టీని మళ్లీ గాడిలో  పెడతానంటున్న గిడుగు రుద్రరాజు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలే పార్టీ బలం అంటున్నారు. అయితే విభజన తరువాత కాంగ్రెస్ కు కార్యకర్తల బలం కూడా కరవైంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతమౌతున్న సూచనలు లేశ మాత్రంగానైనా కనిపిస్తున్నా.. ఏపీలో మాత్రం ఆ పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించే నాథుడే కరవైన పరిస్థితి నెలకొని ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారంలో లేకపోయినా..ఆ పార్టీకి నేతలు, కార్యకర్తలు చెక్కు చెదరకుండా నిలబడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ సంగతి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ   కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి ప్రయాణం సాగిస్తోంది.​ రాష్ట్ర విభజన ముందు వరకూ ఏపీలో కాంగ్రెస్ బలమైన పార్టీ. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచీ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం బోట్లు అన్నట్లుగా తయారైంది.

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి ఉంది. దేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. అయినా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ సమీప భవిష్యత్ లో  పుంజుకోగలద అన్న ఆశలూ ఆ పార్టీ నాయకులలో, శ్రేణుల్లో పుష్కలంగా ఉన్నాయి. రాహుల్ జోడో యాత్రతో పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కూడా కనిపిస్తోంది.  ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అది ఎక్కడా చెక్కు చెదరలేదు. అందుకే రాహుల్ జోడో యాత్రతో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుందన్న భావన రాజకీయ వర్గాలలో సైతం వ్యక్తమౌతోంది.

అయితే ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర విభజనను అప్పట్లోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యతిరేకించింది. అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ లో బలమైన నేతలుగా పేరొందిన వారంతా విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అధిష్ఠానాన్ని ధిక్కరించారు. ఫలితం లేకపోవడంతో వారిలో కొందరు రాజకీయాలకు దూరమయ్యారు. ఇంకొందరు తమ దారి తాము వెతుక్కున్నారు. మిగిలిన వారు క్రియాశీలంగా వ్యవహరించడం మానేశారు. అందుకే ఎనిమిదేళ్ల తరువాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా అంటే ఉందనుకోవాలి అంతే అన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రఘువీరా రెడ్డి ఎప్పుడెప్పుడు ఆ పగ్గాలు వదిలేద్దామా అన్నట్లుగానే ఆ పదవిలో కొనసాగారు.

ఎప్పుడైతే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారో.. వెంటనే రాహుల్ కు మద్దతుగా రఘువీరారెడ్డి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత నుంచి ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారా అంటే కొనసాగుతున్నారు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా మెలుగుతున్నారు. ఆ తరువాత సాకే శైలజానాథ్ పార్టీ పగ్గాలు చేపట్టినా పెద్దగా ఫలితం లేకపోయింది. అప్పుడప్పుడు టీవీ టాక్ షోలలోనూ, పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చిన సందర్భాలలో నామ్ కే వాస్తే నిరసనల్లోనే తప్ప సాకే బయట పెద్దగా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే పాదయాత్ర చేస్తానంటే సాకే కొంత యాక్టివ్ అవుతున్నట్లు కనిపించినా.. అంతలోనే ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కాంగ్రెస్ అనే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానంటున్నారాయన. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశ పార్టీ అధిష్ఠానంలోనే లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు   నాయకులే కాదు , క్యాడరూ కూడా లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు.. రాష్ట్రంలో పార్టీ ఒంటరి పోరు గురించి మాట్లాడుతున్నారు. కలుద్దామన్న దగ్గరకు రానిచ్చే పార్టీలు ఏపీలో లేవు.

అన్నిటికీ మించి 175 స్థానాల్లోనూ నిలబెట్టడానికి అభ్యర్థులనే వెతుక్కోవలసిన పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ది. అంతెందుకు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు కూడా ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికలలో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికైనా అదేమీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాల ద్వారా చేపట్టిన పదవి కాదు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ను మళ్లీ ప్రజలకు చేరువ చేయడానికి ఆయన ఏం చేస్తారో చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.