Read more!

పీకే ఎక్కడ ?

ప్రశాంత్ కిశోర్.. పీకే పేరు విని చాలరోజులు, కాదు నెలలు అయింది కదూ.. అవును, ఒకప్పడు దేశ రాజకేయాల్లో ప్రముఖంగా వినిపించిన ఎన్నికల వ్యూహకర్త పీకే అని పిలవబడే ప్రశాంత్ కిశోర్, ఇప్పడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వినిపించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, అధికార పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా సేవలు అందిస్తున్న పీకే ఊసే లేదు. ఒకప్పుడు పీకే ను భుజానికి ఎత్తుకుని, ఆయనతో తనకు ఎనిమిదేళ్ళకు పైగా చాలా ‘క్లోజ్ రిలేషన్స్’ ఉన్నాయని చెప్పుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆయన్నే నమ్ముకుని రెండవసారి అధికారంపై ఆశలు పెంచుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు పీకే పేరే తలచుకోవడం లేదు. 

అదలా ఉంటే, తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఒక్క ఆయన స్వరాష్ట్రం బీహార్ లో మినహా మరెక్కడా ఆయన పేరు అంతగా ప్రస్తావనకు రావడం లేదు. అయితే, ఈ సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలలో, తృణమూల్  కాంగ్రెస్ విజయం తర్వాత పీకే ప్రతిష్ట పతాక స్థాయికి చేరింది. అయితే, అదే సమయంలో పీకే రాజకీయ వ్యూహకర్త వేషం చాలిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రత్యక్ష రాజకీయాల విషయంలోనూ అంతగా ఆసక్తి లేదని, చెప్పుకొచ్చారు. కానీ, ఆ తర్వాత, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి నడుం బిగించారు. ‘వ్యూహ’ రచన చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కుడా పీకే   సిద్ధమయ్యారు. అయితే, కారాణాలు ఏవైనా, ఆ రెండు ప్రయత్నాలు విఫల మయ్యాయి. ఆ తర్వాతనే, పీకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపారు. తెలంగాణలో తెరాసను మూడవసారి గెలిపించడంతో పాటుగా, జాతీయ స్థాయిలో కేసీఆర్ కు పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే, ఎందుకనో గానీ,కొద్ది నెలలుగా పీకే పేరు తెలంగాణలో వినిపించడం వినిపించడం లేదు. అలాగే, ఎపీలోనూ పీకే .ఐ ప్యాక్ టీం పనిచేస్తున్నా పీకే మాత్రం దూరంగానే ఉంటున్నారు.

 ప్రస్తుతం పీకే, బీహార్ రాజకీయాలలో ప్రత్యక్ష భూమిక కోసం పావులు కదుపుతున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని పాత మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీతో జట్టు కట్టిన, ముఖ్యమంత్రి, జేడీ(యు) లీడర్ నితీష్ కుమార్ ఓడించడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే, పీకే భూమి గుండ్రంగా ఉంటుందని మరోమారు నిరూపించారు. ఆయన ఎక్కడి నుంచి రాజకీయంగా తొలి అడుగు వేశారో, మళ్ళీ అక్కడికే వచ్చినట్లు తెలుస్తోంది. బీహారులో లాలూ – నితీష్ జోడీని ఓడించేందుకు బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమైనట్లు బీహార్ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అందుకే.. వైసీపీ, టీఆర్ఎస్ లను వదిలేశారని అనుమానిస్తున్నారు. 

అదొకటి అలాఉంటే, ప్రశాంత్ కిశోర్ ను మంచి ఎన్నికల వ్యూహకర్త అనాలా, మంచి పొలిటికల్  బిజినెస్ మాన్ అనాలా? అంటే, రాజకీయ విశ్లేషకులు పీకే, ఓ మంచి బిజినెస్ మాన్ అనే అంటున్నారు. రాజకీయ పార్టీల బలహీనతలను సొమ్ము చేసుకున్నారని, అంటున్నారు. అలాగే, పీకే ఖాతాలో చేరిన ఎన్నికల విజయాలు నిజంగా ఆయన వ్యూహబలంతో సాధించిన విజయాలేనా,అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ తొలిసారిగా గెలిచే పార్టీలతో అయన డీల్ కుదుర్చుకున్నారే గానీ, ఆయన వ్యూహాల కారణంగానే  ఏ పార్టీ గెలిచింది లేదనీ కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ తొలి సారిగా, 2012లో గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేద్ర మోడీ గెలుపు కోసం పని చేశారు. నిజానికి అప్పటికి, ఆయన పూర్తి స్థాయి ఎన్నికల వ్యూహకర్తగా స్థిరపడలేదు.అలాగే,అప్పటికే రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా   దేశంలోనే కాదు,  అంతర్జాతీయంగానూ నరేంద్ర మోడీకి ప్రత్యేక గుర్తింపు వుంది. మేథావి వర్గాల్లో గుజరాత్ మోడల్’ పరిపాలన గురించి చర్చ అప్పటికే మొదలైంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నఎన్నారైలు, అనేక మంది 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ గెలుపుకోసం వచ్చిన అనేక మంది ఎన్నారైలలో ప్రశాంత్ కిశోర్ ఒకరు. 

గుజరాత్,  హెల్త్ మోడల్ ను విశ్లేషిస్తూ ఒక ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం,ఆయన్ని మోడీ దగ్గరకు చేర్చింది. ఆ ఎన్నికలో పీకే, మోడీ గెలుపు కోసం పనిచేశారు. అయితే, 2012 ఎన్నికలలో మోడీ సాధించిన హట్రిక్ విజయం పూర్తిగా పీకే ఖాతాలో వేసుకున్నా, అది నిజం కాదు. మోడీతో పరిచయం ఏర్పడిన తర్వాతనే,2012లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) అనే ఎన్నికల ప్రచార బృందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో సిఎజి బీజేపీ పక్షాన పనిచేసింది.ఆ విధంగా పీకే 2013 మేలో, కిషోర్ సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) ను స్థాపించారు. కిషోర్ మోడీతో విడిపోయాక, (సిఎజి) ను స్పెషలిస్ట్ పాలసీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పిఎసి) గా మార్చారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది తెలిసిందే.